పగటి వాన
ఆకాశం పురివిప్పుకుని
సూర్యుడిని దాచేసినప్పుడు..
ఓ ఆహ్లాదం
మేలిముసుగులా ప్రపంచాన్ని కప్పుతుంది.
ఎన్నో శిశిరాల విరహం తరువాత
ప్రియురాలిని చూసిన ప్రియుడిలా
చూపులు దాహంతో బయటికి పరుగెడతాయ్.
వాన చినుకు పెట్టిన ముద్దు లోంచి
మంచు ఆవిరులు..
నాలోకి…
బలవంతపు నిద్రలో ఉన్న మనసు
సంకెల తెగిన సైనికుడవుతుంది.
చినుకు చినుకూ పెట్టే ముద్దులకి
సిగ్గుతో తలొంచుకుంటూనే
సౌందర్యాన్ని ప్రసవిస్తూ
ప్రకృతి…
అప్పుడు…
మెదడునధిగమించి
మనసే శరీరాన్నేలుతుంది.
kskk అభిప్రాయం:
July 25, 2006 3:19 am
చాలా బాగున్నదండి
Prasad అభిప్రాయం:
July 31, 2006 9:00 am
“చినుకు చినుకూ పెట్టే ముద్దులకి
సిగ్గుతో తలొంచుకుంటూనే
సౌందర్యాన్ని ప్రసవిస్తూ
ప్రకృతి…”
ఇది భలే మంచి వర్ణన. నాకు భలే నచ్చింది. చినుకుతోనేగదా, ప్రకృతి ప్రసవించేది.
– ప్రసాద్
http://charasala.wordpress.com