ఈమాట » గేటెడ్ కమ్యూనిటీ

Expand to right
Expand to left

గేటెడ్ కమ్యూనిటీ

5

“ఏమండీ మంగ ఫోన్ చేసి ఏడుస్తోంది. ఏదో గొడవ జరుగుతోందట.” ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పింది సుధ.

“మళ్ళీ ఆ స్థలాల గొడవేనా… అబ్బా… సరే నే వస్తున్నానని చెప్పు” అర్థరాత్రి దాకా ఊపిరి సలప కుండా ఉన్న పనిరోజు మధ్యలో బయట పడితే జరగ బోయే పరిణామాల్ని అంచనా వేసుకుంటూ కారు తాళాలు తీసుకుని బయలు దేరాడు సతీష్..

పావు గంటలో అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరకు చేరాడు. మెయిన్ రోడ్డు మీదే కనపడ్డారు జనాలంతా. పోలీసులూ, జనాలూ అంతా గందర గోళంగా ఉంది. ఎక్కడని వెతకాలి అర్జున్ కోసం అనుకుంటూ కారు వేగం తగ్గించాడు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసు…. “నికాల్ నికాల్..” అంటూ హడావిడి పెట్టాడు. ఉన్న గొడవని చూడ్డానికి ట్రాఫిక్ అంతా నిలిచి పోతుందేమోనని అందర్నీ త్వర, త్వరగా పంపించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇలా కాదని కాస్త ముందుకు పోనిచ్చి పక్క సందులో కారు ఆపి మెయిన్ రోడ్దు వైపుకి నడిచాడు. ఇంతలో జనాలు ఆడా మగా మెయిన్ రోడ్డు మీదనించి పరిగెట్టుకుంటూ వస్తూ కనిపించారు. వాళ్ళ వెనక పోలీసులు లాఠీలు జుళిపిస్తూ వెంట పడుతున్నారు. ఇలాకాదని తాను కూడా వెనక్కి తిరిగి, మళ్ళీ కారు లో దూరి స్టార్ట్ చేసి, పరిగెట్టించడానికి సిద్ధంగా ఉంచి, సెల్ ఫోన్ తీసి అర్జున్ కి ఫోన్ చేశాడు. ముందే చేస్తే “నీ పని నువు చేసుకో, నాకేం పర్లేదు, ఇక్కడికేం రావక్కర్లేదు” అంటాడని తెలిసి అప్పటి దాక ఫోన్ చెయ్యలేదు.

“ఎక్కడ రా. నీకోసమే చూస్తున్నా… స్వప్న నర్సింగ్ హోమ్ ముందున్నా” అర్జున్ ఫోన్ ఎత్తగానే హల్లో కూడా అనకుండా అడిగాడు.

“వచ్చేశావా… అక్కడే ఉండు వచ్చేస్తున్నా” చాలా ప్రశాంతంగా జవాబు చెప్పాడు అర్జున్.

వీడింత ప్రశాంతంగా ఉంటే నేనెందుకు అఫీసు మానేసి వచ్చాను అనుకుంటూ రియర్ వ్యూ మిర్రర్ లో అర్జున్ కోసం చూడ సాగాడు.

ఓ మూడు నిమిషాల తర్వాత తీరిగ్గా వచ్చాడు అర్జున్. చేతిలో అప్పుడే కొన్న మంచినీళ్ళ బాటిల్. డోర్ ఒపెన్ చేసి పక్కనే కూర్చున్నాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా కారు పోనిచ్చాడు సతీష్. డ్రైవ్ చేస్తూనే అడిగాడు “ఏమిటి గొడవ” అని. “అవుటర్ రింగురోడ్డు. మా ఇళ్ళమీంచి వేస్తార్ట. ఆ గొడవ ఎప్పణ్ణించో రగుల్తోంది. ఇవ్వాళ ఎంపీ ప్రయివేట్ కాలేజీ ఓపెనింగ్ వస్తున్నాడంటే రోడ్డు మీద కాపు కాశాం… కాలేజీ మానేసి మరీ” చాలా మామూలుగా పూర్తి చేసి, బాటిల్లో నీళ్ళు రెండు గుక్కలు తాగి పూర్తి చేశాడు.

“రెండు నిమిషాల్లో ఎం.పీ వస్తాడనగా పోలీసులు లాఠీలుచ్చుకుని వెంట పడ్డారు. తలా ఓ దిక్కుకి పరిగెట్టారు…. నేను పక్కన ఫుడ్ వరల్డ్ లో దూరి ఈ నీళ్ళ బాటిల్ కొనుక్కుని బయటికి వచ్చా… నీ ఫోన్ వచ్చింది”

“ఏదో గొడవ జరిగి పోతోందని అంటే ఎవడితో పెట్టుకున్నావో నని భయ పడి ఆఫీసు నించి పరిగెట్టుకుని వచ్చా” కాస్త విసుగు ధ్వనిస్తూ అన్నాడు సతీష్.

“మంగ భయ పడి ఉంటుందిలే… మేము గొడవచేద్దామనే వెళ్ళాం. రోడ్డు మీద కూర్చ్జుని ట్రాఫిక్ ఆపేసి… ఎంపీ ఎక్కడికీ వెళ్ళకుండా చెయ్యాలను కున్నాం. అనుకున్న వాళ్ళలో సగం మంది కూడా రాలా… తెల్లారే సరికి ఎవడి ఉద్యోగం వాడికి ముఖ్యం… వెళ్ళి పోయారు. నాలాంటి వాళ్ళం కొందరం వెళ్ళాం. పోలీసోళ్ళు లాఠీ చూపించగానే అసలే పలచగా ఉన్న జనాలు… ఏం సాధిస్తాం చెప్పు.. పారి పోయి వచ్చాం. ” అనుకున్నది సాధించలేక పోయిన అసంతృప్తి ధ్వనిస్తూ చెప్పాడు అర్జున్.

“ఏమీ సాధించలేమని తెలిసినప్పుడు ఈ గొడవలెందుకు? ఆ ఎంపీ దగ్గరకే నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చుగా?” సతీష్.

మాటల్లో కారు అర్జున్ ఇంటి ముందు ఆగింది. సుధ అప్పటికే వచ్చి మంగ పక్కన కూర్చుని ఉంది. అంత వరకూ ప్రశాంతంగా ఉన్న అర్జున్ కి మంగ ని చూడాగానే చుర్రుమంది.

“ఊరంతా టాం టాం చేశావా? నేనెవణ్ణన్నా మర్డర్ చేయడానికి వెళ్ళానా… లేక పోతే ఏవన్నా టంగుటూరి ప్రకాశం లెవెలనుకున్నావా?” అంటూ వాళ్ళావిడ మీద విరుచుకు పడ్డాడు.

“లేదండీ. వాన్లకి వాన్లు పోలీసుకు దిగారు చౌరస్తాలో అని అందరూ అంటుంటే భయమేసింది. చుట్టు పక్కల ఫ్లాట్లలో ఎవరూ లేరు. నేను కదుల్దామంటే చిన్నాడు స్కూలు నించి వచ్చేసే టైం. సుధకి ఫోన్ చేసాను గానీ ఇద్దర్నీ వచ్చెయ్యమన్లా… ఏమన్నా ఫోన్ చేసి మీ కబురు కనుక్కుంటారేమో ననుకున్నా… నేను చేస్తే ఎలాగూ ఫోన్ ఎత్తరూ…” సంజాయిషీ ఇచ్చుకుంది మంగ.

“అయినా ఏమిటి గొడవ ” మళ్ళీ ముట్ట మొదటి ప్రశ్న వేశింది సుధ.

“మళ్ళీ మొదలు. ఈ ఫ్లాట్లు మాకమ్మిన బిల్డరు అన్ని పర్మిట్లూ సక్రమంగా ఉన్నాయని చూపిస్తే కొన్నాం. ఇప్పుడు అవుటర్ రింగు రోడ్డుకి అడ్డొచ్చిందని కూల్చేస్తార్ట. గొడవ మొదలు పెడితే, ఎవేవో పర్మిట్లు లేవని దబాయింపు. మేము ఇళ్ళు కొనుక్కుని రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఏమీ మాట్లాడని నా కొడుకులు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. ఆ పొలిటీషియన్లంతా… ఆ అవుటర్ రింగురోడ్డు పక్కలంతా స్థలాలు ముందే కొనేసుకుని ఉంచుకున్నాడు. ఏమడ్డ మొచ్చినా ఆ రోడ్డు ఇప్పుడు వేయాల్సిందే” బాధంతా వెళ్ళ పోసుకున్నాడు అర్జున్.

కొంత సేపు మవునంగా ఉన్న సుధ ఇంక ఉండలేక అంది. “రింగు రోడ్దు మీద గవర్నమెంటు కూడా గట్టిగానే ఉంది. కష్టమే… ఏ రోడ్డు వేసినా కొన్ని ఇళ్ళు పోక తప్పదుగా… అయినా… కంపెన్సేషన్ ఇవ్వరా?” భయం భయం గానే అడిగింది.

“అవునా… మరి ఒక్క గేటెడ్ కమ్యూనిటీ కూడా పోవట్లేదేం ఏ రోడ్డు కిందా?” వెటకారంగా అన్నాడు అర్జున్.

సుధకి ఆ వెటకారం ఏమాత్రం నచ్చలా “జుబ్లీహిల్స్ రోడ్డు చూశారా…. అందరూ డబ్బూ, పరపతీ ఉన్న వాళ్ళే… అయినా అన్నీ పడగొట్టే రోడ్దు వెడల్పు చేశారు” అంది.

హ హ హ… అంటూ విరగబడి నవ్వాడు అర్జున్…

“అమ్మాయీ నీకు చాలా సంగతులు తెలీవు. ఆ ఇచ్చే కంపెన్సేషన్ మాకెందుకు సరిపోదనుకుంటున్నావ్? మేము ఈ ఇంటిని ఎంతకి రిజిస్ట్రేషన్ చేసుంటాం? పన్నెండు లక్షల ఇంటిని అయిదు లక్షలని చెప్పి రిజిస్టర్ చేస్తాం. నన్ను తప్పు పట్టకు. అలా కాక పోతే బిల్డర్ నాకు అమ్మడు. వాడికిచ్చే బ్లాక్ మనీ వాడి కివ్వాల్సిందే. ఇప్పుడు గవర్నమెంటు అ లెక్కన… మరికొంచెం కలిపి ఏ ఆరు లక్షలో ఇస్తుంది. ఆ పోయిన బ్లాక్ మనీని ఎక్కణ్ణించి తేనూ? మేం ఎక్కువ గొడవ చేస్తే ఏదో పర్మిట్ లేదని చెప్పి అదికూడా ఎగ్గొడతామని బెదిరింపులు ”

అందరూ వింటున్నారో లేదోనని గమనించి మళ్ళీ మొదలు పెట్టాడు.

“ఇక జుబ్లీ హిల్స్ మారాజుల సంగతి. పాపం వాళ్ళ ఇళ్ళని కూడా కూల్చారు కదా! మీరు చదివారో లేదో… ఆ ఇళ్ళు పడగొట్టడానికి ముందు… ఆ ఏరియానంతా కమర్షియల్ జోన్ గా డిక్లేర్ చేసింది గవర్నమెంటు. ఒకే అంతస్తు ఉన్న ఇళ్ళు ఇప్పుడు మూడు నాలుగంతస్తులూ, కమర్షియల్ కాంప్లెక్సులూ కట్టుకోవచ్చు. అంటే, నాలుగు వందల గజాల స్థలంలో ఓ వంద గజాలు పోయినా, మిగిలిన మూడు వందల గజాలకీ కొత్త పర్మిట్ల కారణంగా పెరిగిన ధర అంతకంటే చాలా ఎక్కువన్న మాట. వాళ్ళ బ్లాక్ మనీ చూడు ఎంత భద్రంగా ఉందో. వాళ్ళుపోగొట్టుకునే బ్లాక్ మనీని మార్కెట్లోంచే వాళ్ళు సంపాదించుకుంటారు. మా పరిస్థితి అదికాదు. ”

ఓ రెండు నిమిషాలు అందరూ మవునంగా ఉన్నారు. నోరు తెరిచి సుధ అంది.

“మీరేమనుకోనంటే ఓ మాట చెపుతా… మీ కష్టాన్ని అర్థం చేసుకుంటా. అందుకే నేనూ, సతీష్ మీకోసం పరిగెట్టుకుంటూ వచ్చింది. కానీ మేమంటే… గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామంటే ఏదో పాపం చేసి, అన్యాయంగా దోచుకున్న డబ్బేదో తినేస్తున్నట్టుగా మాట్లాడుతుంటేనే బాధగా ఉంటోంది. మా మట్టుకు మేము నెల నెలా జీతాల్లోంచి ఖచ్చితంగా టాక్సులు కడుతున్నాం. మాకు తోచినంత చారిటీ పని చేస్తున్నాం. వ్యక్తులుగా మమ్మ్లల్ని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదు. ఎవరి మీద కోపమో మామీద చూపిస్తారేంటీ? ఏం… మీ చాకలి పని మానేసి మీరు ఇప్పుడు ఈ ఫ్లాట్ లోకి రాలేదా… మీ కజిన్ ఇంకా శ్రీనగర్ కాలనీ లో ఇస్త్రీ బండి పెట్టుకున్నాడని మీరే చెప్పారు… అతని దృష్టిలో మీరూ ఓ మాదిరి గేటెడ్ కమ్యూనిటీనే. రేప్పొద్దున మీ పిల్లలిద్దరూ చదూకుని మాయింటి పక్కనే చేరొచ్చు… అప్పుడు మీకేమీ తప్పనిపించదు కదా” ఎడా పెడా తన ఆవేశాన్ని దించేసుకున్న సుధ తన కళ్ళలో నీళ్ళు తిరగడాన్ని గమనించలా…

మంగ గబ గబా సుధ దగ్గరికి వెళ్ళి భుజంమీద చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసింది. ఇంత అకస్మాత్తుగా సుధ ఇలా విరుచుకు పడుతుందనీ, అర్జున్ మాటలు ఆమెని ఇంత బాధిస్తున్నాయనీ గమనించక పోవడంతో మవునంగా చూస్తుండి పోయాడు సతీష్.

“లేవండి ఇంటికి పోదాం. నన్ను దింపేసి మీరు ఆఫీసు కి పోదురు గాని” కర్చీఫ్ తో కళ్ళు తుడిచేసుకుని లేచింది సుధ.

అంత సేపు మవునంగా వింటున్న అర్జున్ మెల్లగా లేచాడు. సుధ దగ్గరగా వెళ్ళి చనువుగా ఆమె చేతులు పట్టుకుని అన్నాడు.

“అయామ్ సారీ సుధా! మీమీద నమ్మకం లేక కాదు. నువ్వన్నట్టుగా నన్ను దాటి నాపిల్లలు ముందుకెళ్ళాలనేగా తాపత్రయం. బాధేమిటంటే మనం ఏం వదిలేసుకుని ఏం సాధించుకుంటున్నామని. బయట పడలేని ఏదో వెర్రి లో పడి కొట్టుకు పోతున్నాం అందరం. ప్రతివాడి చుట్టూ గోడలే. మనందర్నీ కలిపి బాధించే విషయమేదీ కనపడదేం? ఎవరి మీద చూపించాలో తెలియని కోపాన్ని మూర్ఖంగా మీమీద చూపించాను. వీడు గాంధీ… ఏమన్నా నోరు మెదపడు… నా నోటి కొచ్చునట్టు వాగొచ్చనుకున్నా…. నిన్ను గమనించక పోవడం తప్పే… ప్లీజ్ డోంట్ లీవ్” ఆఖరి మాట అంటూ సుధ తల మీద చేయి వేసి బతిమాలుతున్నట్టుగా అన్నాడు అర్జున్.

“ఇంగ్లీషులో ప్లీజ్ అంటే అన్నీ సర్దుకు పోతాయా… నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య” మొదటి సారి అర్జున్ భాషలో అతణ్ణే అనుకరిస్తూ దాడి చేశాడు సతీష్… నవ్వుతూ…

***

ముందరి పేజీ(లు) 1 2 3 4 5


అక్కిరాజు భట్టిప్రోలు

రచయిత అక్కిరాజు భట్టిప్రోలు గురించి: జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదు లో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతారు. ...

 

(12 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. bandla madhava rao అభిప్రాయం:

    July 1, 2006 10:04 pm

    కధ చాలా బాగా వచ్చింది. కధ నిర్మాణం బాగుంది. సరికొత్త వర్గ విబేధాల్ని చూపించారు. కాకపొతె అర్జున్ పాత్ర టికెట్ కోసం చేసే గొడవ లో కారణం అంత బాగా అనిపించలేదు.
    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్ - 10
    ఫోన్ - 98661 82378

  2. shiva thadakamadla అభిప్రాయం:

    July 3, 2006 5:19 pm

    బాగున్నది

  3. Prasad Charasala అభిప్రాయం:

    July 5, 2006 10:38 am

    చాలా చక్కగా ఉంది. ఎవరికి వారు గిరి గీసుకొని బందెల్దొడ్డిలో బర్రెల్లా జీవిస్తూ ఎవరి స్తోమతుకు తగ్గట్లు వాల్లు గేట్లు, వాచ్ మన్ లూ …
    రెండు వర్గాల దృక్కోణాన్నీ రచయిత చాలా బాగా చూపించారు.
    __ ప్రసాద్

  4. Srikar అభిప్రాయం:

    July 20, 2006 9:10 pm

    మంచి కథ, బాగుంది.

  5. Sujatha Srinivas అభిప్రాయం:

    July 21, 2006 3:40 am

    కధ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాడినీ, మిక్కీమౌస్ వేషాల్లో తిరిగే వాళ్ళనీ పోల్చడం బాగుంది. మేమూ గేటెడ్ లగ్జరీ అపార్టుమెంటులో నివసించే లిమిటెడ్ మెంటాలిటీ జనాల్లో ఒకళ్ళం కావడం చేత కధ చదువుతున్నట్లు కాక చూస్తునట్లనిపించింది. నాకే కాదు…హైటెక్ సిటీ పరిసరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాస్టిక్ పలకరింపులతో, మొహమాటపు నవ్వులతో బతికే ….(గమనించండి…..జీవించడం కాదు…బతకడం) తెలుగువాళ్ళందరికీ నచ్చుతుంది.
    (వాళ్ళలో ఆత్మ జీవించి వుంటే).
    రచయితకు అభినందనలు.
    సుజాతా శ్రీనివాస్,
    కొండాపూర్, హైదరాబాద్

  6. lata అభిప్రాయం:

    July 21, 2006 9:12 am

    I like this story. The version of gated community is similar to condo complexes in America

  7. Reader అభిప్రాయం:

    July 22, 2006 11:30 pm

    http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=story

    ఎవరి తప్పు ? రచయిత దా? పత్రికా సంపాదకులదా?
    కథ పంపిన ఏడాది వరకూ రచయితలకి కబురు అందదు. కథ చెత్తబుట్ట కంచికెళ్ళిందో లేక ముద్రణ రంగులు పులుము కుందో పై వాడికి కూడా అందదు. ఇదీ నేటి పత్రికారంగంలో రచయితలకి లభించే పురస్కారం. ఈ దౌర్భాగ్య స్థితికి కొంతవరకూ రచయితలూ బాధ్యులే !

  8. సంపాదకులు అభిప్రాయం:

    July 24, 2006 12:36 am

    ఈ కథను ఆంధ్రజ్యోతి పునర్ముద్రించడంలో తప్పు ఎవ్వరిదీ లేదు. ఈమాట అనుమతితోనే రచయిత ఈ కథను ఆంధ్రజ్యోతికి పంపించారు. అముద్రిత రచనలని మాత్రమే ప్రచురించాలన్నది ఈమాట పాలసీ. ఆపైన ఆ రచన వేరెక్కడైనా పునర్ముద్రణ పొందడం మా పాలసీలకు వ్యతిరేకం కాదు. - సంపాదకులు.

  9. B.AJAY PRASAD అభిప్రాయం:

    July 24, 2006 1:03 am

    Good Story. I really appreciate for his selection of delicate theme & perfect narration.

  10. Murali Mohan అభిప్రాయం:

    July 25, 2006 3:19 am

    కథ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాళ్ళని డిస్ని స్టాంప్ ఉంటేనే లోపలికి రానిస్తారు అనడం, మన సంస్కృతి యెలా మాయం అవుతుందో, western సంస్కృతి భూతం యెలా మనలని ఆవహిస్తున్నదో చెపుతోంది. అలాగే జీవితంలో యెదగాలనే ప్రయత్నం లో యెదురయ్యే అవంతరాలకు యెలా సగటు మనిషి అసహనానికి, నిరాశ కు లోనవుతున్నాడో చక్కగా చెప్పారు. అలా అని అన్ని సౌకర్యాలూ ఉండే ఇల్లు సమకూర్చుకుని, హాయిగా బతకాలి అనుకునే వాళ్ళు, అలా ఉంటున్న వాళ్ళంతా యెమీ నేరం చెయ్యలేదని సుధ ద్వారా చెప్పించారు.

  11. Hari Prasad అభిప్రాయం:

    August 22, 2006 1:25 am

    కథ చాలా బావుంది. పెరిగిన జీవనప్రమాణాల వలన మనం ఏమి కోల్పోతున్నామో చెప్పే ప్రయత్నం చేసారు.

  12. రానారె అభిప్రాయం:

    April 6, 2007 11:27 am

    గేటెడ్ కమ్యూనిటీ మీద అర్జున్‌ వెళ్లగక్కే ఆక్రోశమే మనదేశంలో ఉన్నవారు ప్రవాసభారతీయుల పట్ల చూపడం నేను గమనించాను. ఈ కథ చివరలో సుధ మాట్లాడిన మాటలు ఆర్థిక అసమానతలతో జీవితపోరాటం చేస్తున్న సమాజాలన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయనిపిస్తుంది. దాన్ని అర్థంచేసుకొని పరస్పర సహనంతో మసలే సహృదయతే బహు అరుదు. మంచి ఇతివృత్తం. చదివించే లక్షణం పుష్కలంగా ఉన్న కథ.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a