3
“నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకోంగానే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నావురా నీ అయ్య! ఒక్కటి పీకితే నియ్యబ్బ అర్నెల్లనాడు తిన్నది కక్కుతావ్ ” ఒక్క సారిగా విరుచుకు పడ్డాడు అర్జున్.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు వెనకే నిలబడ్డ సతీష్.
ర్రైలు టిక్కెట్ కొంటానికి లైనులో ఓ నలుగురి ముందు నుంచున్న ఓ కుర్రాడి మీద అర్జున్ కోపం. ఆదివారం పాత పుస్తకాల షాపులు చూడ్డానికి బయలు దేరారు మిత్రులిద్దరూ. దారిలో టిక్కెట్ కొనుక్కోవాలంటే కారు ఆపాడు సతీష్.
“అర్జున్ ఆగు” అర్జున్ ని కంట్రోల్ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేశాడు సతీష్.
“ఏమిటాగేది. ఈ నాకొడుకుని ఇందాకణ్ణుంచీ చూస్తున్నా. ఆ ముందాయన కాస్త మెతగ్గా ఉన్నాడని చూసి దూరి పోతున్నాడు. ఏవిటంటే, వాళ్ళ తాతకో అమ్మమ్మకో టిక్క్ట్ట్ట్ట్ కొంటున్నాట్ట, ముసలాళ్ళ టిక్క్టెట్ కొంటానికి లైనులో నుంచోనక్కర్లేదని ఇంగ్లీషు లో దబాయింపు”.
“మీ తాతకో వాడమ్మకో టిక్కెట్ కావాలంటే వాళ్ళనే రమ్మను… పక్కకి తప్పుకుని పోనిస్తాం. వాళ్ళ పేరు చెప్పి నువ్విక్కడ వేషాలేశావంటే మొహం పగులుద్ది” నిక్కచ్చిగా చెప్పాడు అర్జున్…. ఎంత నివారించాలని చూసినా సతీష్.
ఏదో అనబోయిన ఆ కుర్రాడు లైనులో ఉన్నా మిగతా వాళ్ళు కూడా నోరు పెంచడంతో ” I will come back and see you all – అని పొగరుగా బయటకు వెళ్ళాడు.
“ఏందిరా నువ్వుచూసేది. ఇప్పుడే రా చూసుకుందాం” అంటూ ఆ కుర్రాడి వెంటపడ బోయిన అర్జున్ ని అతికష్టం మీద ఆపాడు సతీష్.
ఇలాంటి గొడవల్లో తలదూర్చి చాలా కాలం అవటంతో కొంచెం ఎబ్బెట్టుగా ఉంది సతీష్ కి.
“ఆ టిక్కెట్ ఏదో నేనే కొనిచ్చే వాణ్ణిగా ఇంటర్నెట్ లో. ఈ పిచ్చి గొడవలన్నీ ఎందుకూ. అయినా ఆ భాషేంటి. ఇంగ్లీషు లెక్చరర్ వి. వాడు మాట్లాడిన పాటి ఇంగ్లీష్ నీకు రాదా. అక్కడున్న వాడెవ్వడన్నా నీకు ముక్క చదువురాదనుకుంటారు ఆ గొడవ చూసి” విసుగ్గా అన్నాడు సతీష్ కారు ఎక్కంగానే. కోపంగా ఓ చూపు చూశాడు అర్జున్.
“నువ్వు ఇంటర్‌నెట్‌లో కొనుక్కుంటావ్. అదో మాయా ప్రపంచం నీకు. నీకు అందులో సాగుతుంది. నాకు సాగదు. ఈ లైన్లో రేపయినా నాకీ గొడవ తప్పదు. నీలా గేటెడ్ కమ్యూనిటీ లో వాణ్ణి కానుగా… బయట ప్రపంచంతో నాకింకా సంబంధం ఉంది” ఆవేశం పూర్తిగా తగ్గక పోవటంతో అర్జున్ మాటలు ఆతని అదుపు దాటాయి.
“మధ్యలో నా జోలికి ఎందుకొస్తావ్. నీ సంగతి నాకు తెలియదు గానీ నాకందరి తోటీ సంబంధాలు అలానే ఉన్నాయి. నేనేమీ ఒదులుకోలా” సతీష్.
“ఏం ఒదులుకో లేదా…. బయట గంగిరెద్దులూ, పగటి వేషగాళ్ళూ మీ కమ్యూనిటీ వాళ్ళకి అడుక్కునే వాళ్ళు. బార్నీ, టిగ్గర్ మాత్రం ప్రొఫెషనల్స్. డిస్నీ వాడొచ్చి శ్టాంపు కొడితే తప్పా ఆ గంగిరెద్దూ, పిట్టల దొరా మీ ఇంటి గుమ్మం తొక్కలేరు. ”
సతీష్ మౌనంగా ఉండి పోయాడు. అనుకోని ఈ దాడికి ఎలా సమాధానం చెప్ప్లాలో తెలీక మౌనంగా ఉండి పోయాడు.
అర్జున్ వరద అక్కడితో ఆగలా.
“తెల్లాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఉండేవిట ఇలాంటి కాలనీలు. ఇప్పుడు కాలనీలు వేరు. అన్నిటికన్నా పెద్ద కమ్యూనిటీ ఉందిగా. ప్రపంచమంతా ఏమయినా నాకేం అనుకుంటూ, ….9/11 వచ్చి పెళ్ళున చెంప దెబ్బ తగిల్తే తప్పా తెలియలా… బయట ప్రపంచం ఏమనుకుంటోందో… ఇప్పుడు మాత్రం తెలిసిందా ఏమిటీ”
సతీష్ ఇంక భరించ లేక పోయాడు.
“నేను గొడవ ఎందుకు అన్నందుకు నన్ను తెల్లాణ్ణీ, అమెరికన్నీ చేశేశావ్. అది పోనీ… ఎంత అన్యాయ మయినా… నీలాంటి చదువుకున్న వాడు కూడా 9/11 తలుచుకుని మురిసి పోవటం బాధాకరం. వెర్రి ” కోపం కాకుండా నిజాయితీగా బాధ ధ్వనించేలా అన్నాడు.
అప్పటికి గానీ అర్జున్ కి తాను ఎంత దూరం వెళ్ళాడో అర్థం కాలా. తనని తాను అదుపులో తెచ్చుకోవడానికి కాసేపు మౌనంగా ఉండి పోయి తర్వాత అన్నాడు.
“సారీ రా. నోరు జారాను. నేను అంత చెడ్డవాణ్ణీ కాదు. నీ మీద నమ్మకం లేకా కాదు. ”
“పర్లేదులే రా… ఇదేం మొదటి సారి కాదుగా” నవ్వేశాడు సతీష్.
అంటూనే ఆలోచనలో పడ్డాడు సతీష్. అర్జున్ అన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదా అని. బయట కరంటు పోయినా తమకి జెనరేటర్ ఉంటుంది. నీళ్ళు రాక పోతే టాంకర్లు వస్తాయి. ఊరు బందు ఉన్నా ఇంటర్నెట్ లో టిక్కెట్ కొనుక్కోగలరు. నీళ్ళ కోసం, కరెంటు కోసం… ప్రతిదాని కోసం వీధిన పడాల్సిన అవసరం దాటి పోబట్టే అంత డిగ్నిఫైడ్ గా ఉండగలుగుతున్నారా?
ఆలోచనలోంచి బయట పడుతూ అన్నాడు సతీష్… “కాదులేరా, కోపంలో వాగినా, నువ్వు చెప్పింది కూడా ఓరకంగా నిజమే. ”
“పోనీ రా.. వదిలేయ్ ఆ టాపిక్. ” బలవంతంగా ఆ సంభాషణ తుంచేశాడు అర్జున్.