వానా పూలు ఇంద్రాణి కవిత్వం
వానచినుకు పడగానే
కవితలన్నీ తడిసిపోతాయి
నా మనస్సులోనే కరిగిపోతాయి
(వానచినుకు పడగానే)
అంటుంది తన మొదటి కవితలోనే ఇంద్రాణి.తడిసిపోయి మనసులోనే కరిగిపోయిన కవితల్ని కొట్టుకుపోకుండా ఎలా కాపాడుకుందోనని ఆత్రంగా చదివాను కవితలన్నింటినీ.
అంతా ఒక పూలవాన, పూల బాట, పూల స్పర్శ ఈ అమ్మాయి-
పూలలోనే పుట్టి పెరిగినట్టుంది
పున్నాగచెట్టు కిందే నిద్రపోయినట్టుంది
పిట్టలతోనే ఎప్పుడూ పాడినట్టుంది
పచ్చికమీదే ఎప్పుడూ నడిచినట్టుంది
పడవలోనే ఎప్పుడూ తిరిగినట్టుంది
పారే ఏరునే తన కళ్ళలో దాచినట్టుంది
(ఈ అమ్మాయి ఎంత బాగుంది)
ఎంత సున్నితమో అనిపిస్తుంది ఏ కవిత చదివినా.
పిల్లల గెంతులు
కాలువ నవ్వులు
పడవలని పడిపోనీకుండా
పట్టుకు నడుపుతున్నాయి… అంటుంది
(పిల్లలు-కాలువ లో)
పొద్దున్నయ్యింది అని చెప్పడానికి
మంచుతెరల పొరలు
ఊరుని విడిచి నడుస్తాయి… అంటుంది
అలాగే గ్రీష్మము గురించి చెప్పటానికి,
ఎండలో ఏమిచేయటం
తడిసిన వట్టివేళ్ళ వెనుక
తాటి ముంజెలు తినడం తప్ప… అంటుంది
శూన్యంలోంచి రాలిన పువ్వులా -వానకు తడిసిన పువ్వొకటి బావిలో రాలిపోయినా -
పాత కొమ్మని
కొత్త నీళ్ళని
చూస్తూ ఉందది
మార్చి మార్చి.. అంటుంది
పూల కొమ్మలా వంగి నడుస్తాను
పుప్పొడి అన్నివైపులా ఎగురుతుంది
పసి మొగ్గలా ముడుచుకు పోతాను
సుగంధం లోలోపలే బందీ అవుతుంది
పూలజడలా కదలక నిలబడతాను
తుమ్మెద ఒకటి వచ్చి వాలుతుంది
మల్లెదండలా ఒరిగి నిద్రపోతాను
దిండంతా సువాసన అద్దుకుంటుంది
(పూబాల లో అద్భుతంగా చెబుతుంది)
ఈ కవిత్వంలో అర్ధం కాని దేమీలేదు. పూలతోబాటు మనంకూడా తడుస్తున్న హాయి తప్ప. కవులకు ఒంటరితనం ఎంత ఇష్టమో. ఏదైనా కవిత పట్టుకు కుదుపుతున్నప్పుడు మరీనూ. అటువంటి సమయాల్లో -
ఎవరైనా ఎదురుతగలడం నాకిష్టం ఉండదు
ఎవరైనా వచ్చి పలకరించడం నాకిష్టం ఉండదు
ఎవరైనా దాక్కుని గమనించడం నాకిష్టం ఉండదు … అంటుంది నిక్కచ్చిగా (రాత్రి వీధిలో ఒంటరి).
కరెంటు పోయింది అని బాధెందుకు, ఎంచక్కా -
కళ్లు మూసుకిని కాసేపు
సమాధిలోకి వెళ్లిపోవచ్చు
కరిగిపోయిన జ్నాపకాల
సరిగమలలో సాంత్వన పొందొచ్చు… అంటుంది
పిల్లలు నిద్దరోతున్నారు కవితలో, పిల్లల నిద్రని చెడగొట్టొద్దని ప్రకృతిసైతం జాగ్రత్తపడుతుందని చాలా అందంగా చెబుతుంది. పూర్వీకులు కవితలో.
గాలిలోని గంధాలని
గతించిన స్వప్నాలని
గోడలమిద తగిలించి వెళ్లారు .. అని చాలా అద్భుతంగా చెబుతుంది.
పూర్తికాని కవిత లో
కదిలే ఆకుల్లో గలగల
కిటికీ దగ్గరే ఆగిపోయింది…అని వాపోతుంది
అటువేపు ఏ పువ్వూ రాలదు
ఆమె ఎన్నడూ లోనికి రాదు…అని నిరాశ చెందుతుంది
గమనించారోలేదో నేను చెప్పిందంతా ఇంద్రాణి కవిత్వ భాషలోనే.. ఇంత చక్కని కవిత్వాన్ని అందించిన ఇంద్రాణి ఏ నిరాశకీ గురికాకుండా, ఏ గొడవల గొడుగుల్లోనూ చేరిపోకుండా ఉండాలనే ఆశ, ఆకాంక్ష. తనే చెప్పినట్టు -
ఆ గొడవలో, దుమ్ము కింద కప్పడి
ఆత్మ కనిపించకుండా పోతుంది
(ఏదో ఒక ఇసుక రేణువు)
ఇది మొదటి పుస్తకం అంటే నమ్మబుద్ది కాదు ఎవరికైనా. బయటపడకుండా ఇన్నాళ్లూ దాగిఉన్న గుప్త నిధి ఇంద్రాణి కవిత్వం.మిత్రుడు భూషణ్ ముందుమాటతోను, ఇస్మాయిల్ పేర బహుమతితోనూ ఈమెని ప్రోత్సహించటం అన్ని విధాలా సముచితంగా ఉంది. కవిత్వాభిమానులే కాకుండా అందరూ కొని హాయిగా చదువుకుని ఆనందించ గలిగే కవిత్వం ఇది.
(దొరికే చోటు: విశాలాంద్ర, నవోదయ లో)
కీలక పదాలు : ముకుంద రామారావు, పాలపర్తి ఇంద్రాణి, తమ్మినేని యదుకుల భూషణ్, ఇస్మాయిల్
s. kanaka prasad అభిప్రాయం:
May 1, 2006 3:58 pm
ఇంద్రజాలం
ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను. జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు. నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను. గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట, ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం. ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను. ఇది చాల జటిలమైన ప్రశ్న; దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి, మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి. ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు. పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం, ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష, ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు. దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.
నిద్రపోతున్న పిల్లలు, సైకిలు మీద తమ్ముడితో వెళ్ళడం, నీళ్ళు తాగే పిట్ట, వానకు తడిసిన పువ్వూ ఇవి సర్వ సాధారణమైన దృశ్యాలూ, అనుభవాలూ కదా! వీటిని చూసి, రాస్తే అవి అంత చక్కదనాలుగా ఎలా, ఎందుకుంటాయో? ఈ ఒక్క ప్రశ్నDavid Wagoner అని నాకు చాల ఇష్టమైన కవి ఒకరిని అడిగేను. ఆయన ఇది చాల చిక్కు ప్రశ్న అని అంటూనే నాకు నచ్చిన జవాబు చెప్పేరు. నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది. (I have no good way to answer your very difficult question. But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.) ఇందుకే ఇంద్రాణి గారి కవితలలో ఏమేం ఉన్నాయి అని కాకుండా ఏమేం లేవు అని, వేటిని ఒదులుకోవటం వలన వాటికి ఆ శక్తి అనీ ఇంకా అడుగుతున్నాను నన్ను నేనే. తప్పకుండా రాసి తీరాలి అని గిలగిల్లాడుతున్నది రాసినందుకు ముకుంద రామారావు గారికి అభినందనలు.
తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
May 3, 2006 6:30 am
కనక ప్రసాద్ గారు ..
Wagoner చెప్పినది నిజం..గుడిలో కుక్క చెప్పులు వెదికినట్టు..బుద్ధి
తప్పులు వెదుకుతుంది ..కాబట్టి ప్రపంచం ముక్కలు ముక్కలైన అద్దంలో
కనిపించే ప్రతిబింబంలా దర్శనమిస్తుంది..ఏకత్వాన్ని కోల్పోయి..కళలకు
తలమానికమైన కవిత్వం..బుద్ధి బులపాటాలకు దూరంగా తీసుకుపోయి ..
మన హృదయంలో ఏకత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తుంది..తన ప్రేమైక దృష్టితో..
దానివల్ల ప్రపంచం..ఉన్నదున్నట్టు, బాల్యంలో మనం చూసినట్టు
అనుభూతమై ఎంతో హాయి గొలుపుతుంది.
కల్పవృక్షాన్ని బొగ్గులకోసం తగులబెట్టినట్టు,మన వాళ్ళు
విప్లవాలు ,వీరంగాలు..వాదాలు..సిద్ధాంతాలు ,భక్తీ వేదాంతం
అంటూ కవిత్వాన్ని అంతరించి పోయే స్థాయికి తీసుకువచ్చారు.
కవులే కాదు ..కవిత్వాన్ని నిర్మల హృదయంతో చదివే జాతి
కూడా కృష్ణజింకల్లా అంతరించిపోతున్న అరుదైన జీవుల పట్టికలో
చేరింది.
కవయిత్రిని ఒక పది కాపీలు పంపమని చెప్పాను..ప్రస్తుతానికి
మీకు నా దగ్గర ఉన్న ఏకైక కాపీని పంపుతాను.మీ చిరునామా
thammineni@lycos.com పంపించండి.
తమ్మినేని యదుకుల భూషణ్.