ఈమాట » కృష్ణరాయల కవిపోషణ

Expand to right
Expand to left

కృష్ణరాయల కవిపోషణ

ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానాన్నిస్తూ కృష్ణరాయలు ఆంధ్రభోజుడనీ, సాహితీసమరాంగణ సార్వభౌముడనీ, అతని కాలం తెలుగు కవిత్వానికి స్వర్ణయుగమనీ మౌఖికంగా ప్రచారంలో వున్న భావాలు వట్టి పుకార్లేమో నన్న సందేహం వెలిబుచ్చారు.

అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న ఇలాటి భావాల్ని గురించి నాకు అందుబాటులో వున్న ఆధారాల సహాయంతో మరొక్కసారి పరిశీలించాలనిపించింది. ఇందుకోసం మూడు ఆధారాలను ఉపయోగిస్తున్నాను - పెద్దన మనుచరిత్ర, తిమ్మన పారిజాతాపహరణం, “A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India by Robert Sewell”. ఈ విషయం మీద రాతిశాసనాల్లో ఇంకా కొన్ని ఆధారాలున్నాయని విన్న గుర్తు. అలాగే కన్నడ సాహిత్యంలో బహుశ కొన్ని ఆధారాలు ఉండి వుండవచ్చు. కాని అవి అందుబాటులో లేవు కనుక వీటితోనే ప్రస్తుతానికి సరిపెట్టుకోవాల్సొస్తోంది.

ఇవేవీ లేకుండా కృష్ణరాయల కవిపోషణ గురించి వ్యాసం ఏమిటి అన్న ప్రశ్న సహజం. అందుకు నాకనిపించేదేమంటే - పాశ్చాత్య పరిశోధకుల దృష్టిలో మన కవుల పొగడ్తలు కేవల కల్పితాలు. వాటిలో ఏమాత్రం నిజం వుండదు. అందువల్ల అవి చరిత్రకు ఉపయోగపడే విషయాలు ఏమీ చెప్పవు. భారతీయ పరిశోధకులు కూడ చాలావరకు వారినే అనుసరించారు. (సాహిత్య గ్రంథాలలోని చారిత్రక విషయాల ప్రాధాన్యత గురించి ఈ మధ్యనే కొంత లోతుగా పరిశీలన జరిగింది. (Textures of Time : Writing History in South India 1600-1800/Velcheru Narayana Rao, David Shulman and Sanjay Subrahmanyam)). అంచేత మన కావ్యాలలోని సాక్ష్యాలను పరిశీలించటం మరీ ప్రాధమికం, నేలబారు “ఉపరిశోధన” కాకపోవచ్చునని ఆశ.

ఇకపోతే, పైన చెప్పిన ఆధారాలు కృష్ణరాయల సమకాలీనులు, ఆయనతో కాస్తో కూస్తో సాంగత్యం వున్నవాళ్లు రాసినవి కనుక వీటినుంచి హేతుబద్ధంగా చెయ్యగలిగిన సిద్ధాంతాలను ఇతర ఆధారాలు ఖండించే అవకాశం తక్కువ; ఐతే ఇతర ఆధారాలు వీటి నుంచి నిర్ణయించలేని విషయాల మీద కొత్త వెలుగు ప్రసరించి నిర్ణయించటానికి పనికిరావొచ్చు. వాటిని వాడనందువల్ల అలాటి నిర్ణయాల్ని చెయ్యలేం. ఎలాగూ అన్ని ఆధారాల్నీ కూలంకషంగా పరిశీలించటానికి అదే పనిగా పెట్టుకున్న అనేకమంది పరిశోధకులు వున్నారు. వారు ఇంతకంటే లోతుగానే చూసివుంటారు. వాటితో పరిచయం వున్నవారు ఈ వ్యాసానికి స్పందించి ఆ పరిశోధనల పర్యవసానాల్ని వివరించమని ఆహ్వానిస్తున్నాను.

నాకున్న సందేహాలు ఇవి - కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా? అతను స్వయంగా కవి అన్న విషయం ఆ కాలపు ప్రసిద్ధ కవులు గుర్తించారా? అష్టదిగ్గజ కవుల ప్రసక్తి ఎలా వచ్చి వుంటుంది? ఆ అష్టదిగ్గజాలు ఎవరో ఎందుకు స్పష్టంగా లేదు? కృష్ణరాయలు కవిపోషకుడా - అంటే వాళ్ల కవితాశక్తికి ముగ్ధుడై వాళ్లకు దానాలు చేశాడా? వీటికి సమాధానాల కోసం చిన్న ప్రయత్నం ఇది.

పెద్దన, తిమ్మన - ఈ ఇద్దరిలోనూ (బహుశా అంతఃపురకవి కావటం వల్లనేమో?) కృష్ణరాయల ఆంతరంగిక విషయాలు పెద్దన కన్నా తిమ్మనకే ఎక్కువగా తెలిసినట్లు కనిపిస్తుంది. తిమ్మన రాయల కవిత్వాసక్తి గురించి చెప్పిన ఒక పద్యం -

ప్రతివర్ష వసంతోత్సవ
కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ ప్రసాదన రసికా! (ప్రథమాశ్వాసాంత పద్యం)

ఏటేటా జరిగే వసంతోత్సవాల్లో సుకవులు కావ్యగానాలు గుప్పిస్తారట. అవి విని పులకించిన రాయల రోమాంచాల్ని చూసి అంతఃపుర వనితలు అపార్థాలు చేసుకుని హడావుడిపడతారట. ఇది నిజమా? చెప్పలేం. నిజమైతే తిమ్మనకి ఎలా తెలిసి వుంటుంది? రాయలే తన ఆంతరంగికులతో అనుండొచ్చు. లేదా, అరణపుకవిగా అంతఃపుర స్త్రీలతో అనుకూల సంబంధాలున్న తిమ్మన వాళ్ల దగ్గర్నుంచి విని వుండొచ్చు. (ఐతే, నిజానికి అతను అరణపు కవి అనటానికి కూడ లిఖితాధారాలు లేవు, ఇదీ కేవలం అనుశృతంగా వస్తున్న కథే.) ఇవేవీ కాకపోతే, ఇది అతని ఊహ కావొచ్చు.

వసంతోత్సవాల మాట నిజం (కింద చూడండి). అక్కడ కవులు కావ్యగానాలు చేశారా? అందుకు అవకాశం బాగా వుంది. కృష్ణరాయలు అవి విన్నాడా? తిమ్మన ఒక్కడే మనకు ఆధారం. “కనీసం ఇద్దరు చెప్తే కాని ఏ విషయమూ నిజం కింద లెక్క కాదు” అనే ప్రమాణం పాటిస్తే ఇది నిజమయేందుకు అవకాశం వుంది కాని ఖచ్చితంగా నిజం అని చెప్పలేం. ఇక అంతఃపుర సన్నివేశం నిజమైనా కాకపోయినా మనముందున్న ప్రశ్నకు అంత ముఖ్యం కాదు.

ఈ వసంతోత్సవాలు కనీసం మూడు రోజుల పాటు జరిగేవని నమ్మొచ్చు. 1443 ఏప్రిల్‌ నెలలో (అంటే కృష్ణరాయలు రాజు కావటానికి అరవై ఐదేళ్ల ముందు) విజయనగరాన్ని పాలిస్తున్న రెండవ దేవరాయల ఆస్థానాన్ని దర్శించిన Abdur Razzak అప్పడు జరిగిన వసంతోత్సవాన్ని చూసి దిగ్భ్రాంతుడయాడు. Forgotten Empire నుంచి ఆ భాగం ఇది -

“In pursuance of orders issued by the king of Bidjanagar, the generals and principal personages from all parts of his empire … presented themselves at the palace. They brought with them a thousand elephants … which were covered with brilliant armour and with castles magnificently adorned…. During three consecutive days in the month of Redjeb the vast space of land magnificently decorated, in which the enormous elephants were congregated together, presented the appearance of the waves of the sea, or of that compact mass which will be assembled together at the day of the resurrection. Over this magnificent space were erected numerous pavilions, to the height of three, four, or even five storeys, covered from top to bottom with figures in relief…. Some of these pavilions were arranged in such a manner that they could turn rapidly round and present a new face: at each moment a new chamber or a new hall presented itself to the view.

“In the front of this place rose a palace with nine pavilions magnificently ornamented. In the ninth the king’s throne was set up. In the seventh was allotted a place to the humble author of this narrative…. Between the palace and the pavilions … were musicians and storytellers.” Girls were there in magnificent dresses, dancing “behind a pretty curtain opposite the king.”

There were numberless performances given by jugglers, who displayed elephants marvellously trained. During three consecutive days, from sunrise to sunset, the royal festival was prolonged in a style of the greatest magnificence. Fireworks, games, and amusements went on. On the third day the writer was presented to the king.

“The throne, which was of extraordinary size, was made of gold, and enriched with precious stones of extreme value…. Before the throne was a square cushion, on the edges of which were sown three rows of pearls. During the three days the king remained seated on this cushion. When the fete of Mahanawi was ended, at the hour of evening prayer, I was introduced into the middle of four ESTRADES, which were about ten ghez both in length and breadth.[147] The roof and the walls were entirely formed of plates of gold enriched with precious stones. Each of these plates was as thick as the blade of a sword, and was fastened with golden nails. Upon the ESTRADE, in the front, is placed the throne of the king, and the throne itself is of very great size.”

కృష్ణరాయల కాలంలో రాజ్యంలో ఉన్న సంపదల దృష్ట్యా ఈ ఉత్సవం ఇంకా వైభవోపేతంగా జరిగి వుంటుందని ఊహించటం సత్యదూరం కాకపోవచ్చు.

మరో ప్రశ్న - కృష్ణరాయలు కవుల్ని పోషించాడా లేదా? తిమ్మన పారిజాతాపహరణాంతంలో తన గురించి చెప్పుకుంటూ ఇలా అంటాడు -

కౌశికగోత్ర విఖ్యాతు డాపస్తంబ
సూత్రు డార్వేల పవిత్రకులుడు
నందిసింగామాత్యునకును తిమ్మాంబకు
తనయుండు సకలవిద్యావివేక
చతురుడు మలయమారుత కవీంద్రునకు మే
నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణా సమాలబ్ధ ఘన చతురంతయా
న మహాగ్రహార సన్మానయుతుడు
తిమ్మయార్యుండు శివపరాధీనమతి య
ఘోరశివ గురు శిష్యుండు పారిజాత
హరణ మను కావ్య మొనరించె నంధ్రభాష
నాదివాకర తారా సుధాకరముగ

మిగిలిన వాళ్ల విషయం ఎలా వున్నా కనీసం తిమ్మనకు “ఘన చతురంత యానాలు”, “మహాగ్రహారాలు”, “సన్మానాలు” దొరికాయన్నమాట. పెద్దనకు కూడ ఘన సన్మానాలు జరిగినట్టు, అగ్రహారాలు వచ్చినట్టు మౌఖికాధారాలు (చాటు పద్యాల ద్వారా) ఉన్నాయి కాని అవెంత నమ్మదగినవో చెప్పలేము. పెద్దన తనే దేవాలయాలకు దానాలు చేసిన శాసనాలు ఉన్నాయని విన్న గుర్తు. అలా ఐతే రాయలు కవులకు దానాలు చేశాడనటానికి మనకు రెండు ఆధారాలు దొరుకుతాయి.

పెద్దన, తిమ్మన ఇద్దరూ రాయల దాతృత్వాన్ని విపరీతంగా పొగిడారు. ఇది కేవలం ఆచారానికి కొనసాగింపా లేకపోతే నిజంగానే ఆయన దానాలు చేశాడా అనేది వీటినుంచి చెప్పలేం. ఒకవేళ దానాలు చేసినా, వాళ్లలో కవులు ఎంతమందో కూడ మనకు తెలియదు. దేవాలయాలకు దానాలు చేసినట్టు మాత్రం శాసనాలున్నాయి.

మరో ప్రశ్న అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా అనేది.

మనం చూస్తున్న మూడు ఆధారాల్లోను అష్టదిగ్గజాల ప్రసక్తి ఎక్కడా లేదు. ఐతే తిమ్మన పద్యం ఒకటి కొంత ఆలోచింప జేస్తుంది -

భువనవిజయాఖ్య సంస
న్నవరత్న విభా ప్రభాతనలినాప్త రమా
ధవ చరణకమల సేవా
ప్రవణమతీ వీరరుద్ర పర్వత వజ్రీ (పంచమాశ్వాసాంతం)

దీన్లో మొదటిభాగం భువనవిజయ సభ గురించి చెప్తుంది. ఒకవిధంగా చూస్తే “భువనవిజయసభ అనే కొత్త రత్నానికి వెలుగునిచ్చే ప్రభాత సూర్యుడ”ని రాయల్ని సంబోధిస్తున్నాడని అనిపిస్తుంది. మరోవిధంగా “భువనవిజయ సభలో ఉన్న నవరత్నాలకు వెలుగునిచ్చే ప్రభాత సూర్యుడ”ని కూడ అనుకోవచ్చు. ఇలా అనుకుంటే, అష్టదిగ్గజాలు కాదుగాని నవరత్నాలనే కవిపండితులు ఉన్నారేమోనన్న సందేహం కలుగుతుంది. దీనికి ఒక ఆధారం ఏమిటంటే పెద్దన, తిమ్మన ఇద్దరూ కృష్ణరాయల్ని భోజుడితో పోల్చారు. ఉదాహరణకు ఈ పద్యం చూడంది -

శ్రీఖండశీతనగ మ
ధ్యాఖండ క్షోణిమండ లాఖండల! వి
ద్యాఖేలన భోజ! సుధీ
లే ఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా! (మనుచరిత్ర ద్వితీయాశ్వాసం, తొలిపద్యం)

భోజుడి ఆస్థానంలో నవరత్నాలున్నారని ప్రతీతి. కనుక, నవరత్నాలని గాని, అష్టదిగ్గజాలని కాని, మరోటి కాని పేరున్నా లేకపోయినా కనీసం భోజుడితో పోలిక కారణంగా భువనవిజయంతో సంబంధం వున్న కొందరు ప్రముఖ కళాకారులు ఉన్నారని అనుకోవటం మరీ అతార్కికం కాకపోవచ్చు. కనీసం తిమ్మన దృష్టిలో అలాటి వాళ్లున్నారనుకోవచ్చు.

భువనవిజయ ప్రసక్తి పెద్దన కూడ చేశాడు. నిజానికి రాయలు పెద్దనను మనుచరిత్ర చెప్పమని అడిగింది అక్కడే అని పెద్దన ప్రకటన.

భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞుల గోష్టిన్
కవితామధురిమ డెందము
దవులన్‌ గొలువుండి సదయతన్‌ నను బల్కెన్‌ (కృత్యాది పద్యాల్లో)

మొత్తం మీద, అష్టదిగ్గజాలనే ప్రసిద్ధమైన పేరున్న కవులు కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నారా అంటే చాలా అనుమానమే. కాని కొందరు ప్రముఖ కవిపండితులు, ఇతర కళాకారులు కృష్ణరాయలతో గోష్టి సలిపే వారని, బయటివారు వాళ్లలో కొందరిని అష్టదిగ్గజాలనో నవరత్నాలనో మరోపేరుతోనో సరదాగానో, గౌరవం కొద్దో పిలుచుకుని ఉండేవారని నమ్మటానికి ఆస్కారం వుంది. భోజుడితో పోలిక వల్ల నవరత్నాలను కొందరు గుర్తించి వుండవచ్చు కూడ. అలాగని అలాటి వారందరి దృష్టిలోను ఒకే ఒక నవరత్నాల సమూహం ఉందని కాదు; ఎవరి దృష్టిలో వారికి వేరే వారు ఆ నవరత్నాలో అష్టదిగ్గజాలో అయుండవచ్చు. ఇప్పుడు మనకు కనిపించే అష్టదిగ్గజాల జాబితాలు రెండు మూడు ఉండటాన్ని ఈ ప్రతిపాదన వివరిస్తుంది కూడ.

చివరగా మరో సందేహం - కృష్ణరాయలు కూడ కవే అనే విషయం అప్పటి ప్రసిద్ధ ఆంధ్రకవులెవరైనా గుర్తించారా?

పెద్దన రాయల జైత్రయాత్రల్ని, పౌరుషప్రతాపాల్ని వీరావేశంతో వర్ణించాడు. మనుచరిత్రలో ఆయన చేసిన వేట వర్ణనల నుంచి, చాటు పద్యాల నుంచి, వేటల్లో, యుద్ధాల్లో రాయలతో పాటు పెద్దన కూడ వెళ్లివుండవచ్చునని అనిపిస్తున్నది. పెద్దనకు రాజకీయాల్లో కూడ పాత్ర వుండి వుండొచ్చు (పెద్దనామాత్యుడనే పదం అనుశృతంగా వినిపిస్తుంది). అంత ఆప్తుడిగా వున్న పెద్దన రాయల కవితాస్వాదనా గుణాన్ని గురించి చెప్పాడు తప్ప కావ్యకర్తృత్వం గురించి కాదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే తిమ్మనకు రాయల ఈ పార్శ్వం గురించి కూడ తెలిసినట్టుంది.

శ్రీవేంకటగిరి వల్లభ
సేవా పరతంత్ర! చిన్నమదేవీ
జీవితనాయక! కవితా
ప్రావీణ్య ఫణీశ! కృష్ణరాయ మహీశా! (చతుర్థాశ్వాసం తొలిపద్యం)

ఐతే ఒకమాట చెప్పుకోవాలి. ఆముక్తమాల్యదా కర్తకి, ఈ కవులు వర్ణించిన రాయలుకి (ముఖ్యంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథల్లో కనిపించే రాయలుకి) చాలా తారతమ్యం వుంది. ఆముక్తమాల్యద రాయలు వీరవైష్ణవుడు. పరమతవిముఖుడు. అహంభావి. మనుషులెవర్నీ లక్ష్యపెట్టని వాడు. శ్రీకాకుళ విష్ణువుకీ తనకీ ఒక విధంగా సమానత్వాన్ని ఆపాదించుకున్నవాడు. “సెంటిమెంట్స్‌” జోలికి వెళ్లనివాడు. కవిపండితులు, బ్రాహ్మణులు, మంత్రులు, వేదవిదులు - వీళ్లందర్నీ కేవలం భృత్యులుగా, గౌరవార్హులు కానివారిగా భావించినవాడు.

రాయల ఈ రెండు పార్శ్వాలకు సమన్వయం సాధ్యమా?

రాయలు చాలా లౌకికుడని, ఆవేశాతీతుడని ఆముక్తమాల్యద స్పష్టంగా చూపిస్తుంది. కనుక, ఆయన కవిపండిత పోషకుడై వుంటే, దానికీ లౌకిక కారణాలు ఉండివుండవచ్చు. లేదా, తనూ కవి కనుక కవుల మీద పక్షపాతమన్నా వుండి వుండాలి. ఈ సందర్భంలో, నారాయణ రావు గారు ఉదహరించిన పద్యాన్ని ఒక్కసారి చూద్దాం.

అక్షరపక్షపాతమున నర్థము నూళ్లనొసంగ నుబ్బునన్
భిక్షు జటాధరాధికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్ష రుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియె చాలు; దాన త
త్ప్రక్షుభితత్వ మేయఘము దార్పదు; శంక దలంగు మయ్యెడన్

‌నారాయణరావు గారు కృష్ణరాయలు కవిపోషకుడు కాకపోవచ్చుననటానికి ఈ పద్యాన్ని ఉదాహరణగా చూపారు. దీనికి మరో విధమైన వివరణ కూడ ఇవ్వొచ్చు. అదిప్పుడు చూద్దాం.

కృష్ణరాయల చాలా పద్యాల్లాగే ఇదీ అర్థం చెప్పటానికి తేలిగ్గా కొరుకుడు పడేది కాదు. ముందుగా ఈ పద్యానికి అన్వయం చూద్దాం - భిక్షు జటాధరాధికులకు, అక్షర పక్షపాతమున, అర్థమును, ఊళ్లను ఒసంగ, ఉబ్బునన్‌, (వారు) భిన్న నిజవ్రతు లౌదురు; (అలా) ఐన, దుర్భిక్ష రుజా శిశుచ్యుతులు పెక్కగు; (కాబట్టి వారి పట్ల) భక్తియె చాలు; దాన, తత్‌ ప్రక్షుభితత్వము; ఏ అఘమును తార్పదు; అయ్యెడన్‌, శంక తలంగు(ము).

దీన్నుంచి తార్కికమైన అర్థాన్ని సాధించాలంటే అనేక ప్రశ్నలు కలుగుతాయి. భిక్షువులు, జటాధరాధికులకు అర్థమూ ఊళ్లూ ఇవ్వాలనిపించే అక్షరాలు ఏమిటి? దీనికి సమాధానం కోసం మనం పద్యం రెండోభాగాన్ని ఉపయోగించాలి. వాళ్లకు డబ్బూ ఊళ్లూ ఇస్తే జరుగుతాయని చెప్పిన అనర్థాలు అలా ఇవ్వకపోతే జరగవనే కదా! అంటే వాళ్లని భిక్షువులుగా జటాధారులుగానే వదిలేస్తే వాళ్లు క్షామాలు, జబ్బులు, శిశుచ్యుతులు జరగకుండా అడ్డుపడతారన్నమాట. అదీ వాళ్ల “అక్షరాల” ద్వారా చేస్తారు. అవి ఎలాటి అక్షరాలై వుండాలి? ధర్మాన్ని నిలబెట్టేవి కావాలి. ధర్మగ్లాని జరిగితే కదా ఈ పద్యంలో చెప్పిన అనర్థాలు సంభవించేది! అంటే ఈ పద్యంలో చెప్పిన అక్షరాలు కావ్యాలు కావు; వేదాంతమూ, మతబోధ, జీవన ధర్మ నిర్దేశమూ లాటివి. అదీగాక సామాన్యంగా భిక్షువులు, జటాధారులు వైష్ణవేతరులు - బౌద్ధులు, శైవులు, జైనులు. “ఆముక్తమాల్యదా” కారుడు వీరవైష్ణవుడని వేరే చెప్పనక్కర్లేదు కనుక వైష్ణవేతర మతప్రచారకులకు డబ్బూ ఊళ్లూ ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పటం సహజం కూడ.

ఏతావాతా నా ఉద్దేశ్యం ఈ పద్యం మాట్లాడుతున్నది కవుల గురించి కాదని. అలా ఐతే, ఆయన కవిపోషణని గురించి ఈ పద్యం పెద్దగా ఏమీ చెప్పదు. కనుక, ఆయన కవులకు దానాలు చేస్తే, అది లౌకిక కారణాల కోసమా లేక కవిపక్షపాతం వల్లనా అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది.

 

(14 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. విప్లవ్ అభిప్రాయం:

    May 2, 2006 10:45 am

    రాయలు కవి పోషకుడా కాదా అన్నది academic. అది తేల్చినందు వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు. కానీ, రాయల కాలంలో రాసిన కావ్యాలు, రచనలు, అవి చేసినవాళ్ళతో సహా, ఇప్పటి దాకా తెలిసినవి ఒక లిస్టు ఉంటే ఇవ్వండి. ఒక వేళ సాహిత్యం ఆయన కాలంలో (మిగతా సమయాలతో పోల్చుకుంటే) disproportionate గా వచ్చి ఉంటే దానికర్ధం, ఏదో ఒక incentive ఆ కాలంలో సాధ్యమైందనే నేననుకుంటాను.

    చరిత్రలో మిగిలిన గ్రంథాలను, వాటి ఈ విషయం తేల్చి చెప్పగల వాళ్ళు ఒక “సమయ” నిర్ధారణ సాధ్యమైనంతలో చేయగలిగితే అది చాలు మొదటి మెట్టుగా.

    ఈ వ్యాసం చాలా శ్రమ తీసుకుని రాసింది, కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది. నా.రా. గారి (తెలుగునాడి) వ్యాసం కూడా మరో లింకుతో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.

  2. kAmESwara rAvu అభిప్రాయం:

    May 3, 2006 9:00 am

    1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?
    ఈ ప్రశ్నకి “ప్రదర్శించాడు” అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. “అక్షరం” అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.
    2. కృష్ణరాయలు స్వయంగా కవా?
    ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా… ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, “ప్రపంచదర్పణమ్” అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
    3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
    దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.

    విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.

  3. K.V.S. Ramarao అభిప్రాయం:

    May 3, 2006 9:51 am

    విప్లవ్, కామేశ్వరరావు గార్ల అభిప్రాయాల పై ఒకటి రెండు మాటలు - 1. రాయవాచకం కాబోయే మంత్రుల కోసం రాసిన ఓ పాఠ్యగ్రంథం. దానికీ వాస్తవ సంఘటనలకీ సంబంధమే లేదు; అలాగే కృష్ణరాయ విజయం పేరు చెప్పినట్లు ఆయన యుద్ధవిజయాల గురించిన కావ్యం; కొన్ని వాస్తవాలున్నా అప్పటికే కృష్ణరాయల mytholozation చాలా దూరం వెళ్లింది. కనుక నిజాల్ని తెలుసుకోవటానికి ఇవి ఆధారాలు కావు. 2. ఆముక్తమాల్యద నిష్పక్షపాతంగా చదివితే అది రాసిన వ్యక్తి ఎలాటివాడో అతని జీవితానుభవాలు ఎలాటివో స్పష్టంగానే తెలుస్తాయి. అది రాయలు కాకుండా మరెవరో రాశారనటం మసి పూసి మారేడు కాయ చెయ్యటమే. చివరగా, ఆకాలాన్ని తెలుగు కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అనటం సమంజసమే - అప్పుడు వచ్చిన అద్భుతకవిత్వం చూడండి - తొలిప్రబంధం మనుచరిత్ర, ప్రబంధాల్లో శిఖరాగ్రస్థాయిని అందుకున్న వసుచరిత్ర; పింగళి సూరన లేఖిని నుంచి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తొలి ద్వ్యర్థికావ్యం రాఘవపాండవీయం; అక్షరశ్లేషకి ప్రాధాన్యత నిచ్చిన రాఘవపాండవీయానికి ప్రతిగా అర్థశ్లేషకు పెద్దపీట వేసిన హరిశ్చంద్రనలోపాఖ్యానం; తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం; రామకృష్ణుడి పాండురంగమాహాత్మ్యం; రాయల ఆముక్తమాల్యద. తెలుగు పంచకావ్యాలుగా గుర్తించేవాటిలో నాలుగింటిని contribute చేసిన కాలం అది. ఆ తర్వాత నాయక రాజుల కాలంలో ఇంతకన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు కావ్యాలు వచ్చినా అవి చాలావరకు ఈ “స్వర్ణయుగం” రచనలు వేసిన బాటలో నడిచినవే.

  4. విప్లవ్ అభిప్రాయం:

    May 3, 2006 11:39 am

    హిస్టరీ ఛానెల్ ఎక్కువగా చూడ్డంతోటో, గ్రీకు రోమన్ ఇంగ్లీషు వాళ్ళ నాగరికతలు అప్పుడో ఇప్పుడో చదవడంతోటో వచ్చిన చత్వారం వల్ల నాక్కొన్నింటిని (అక్కరలేనివైనా) పట్టుకోటం మరికొన్ని (ఎంత ముఖ్యమైనవైనా) సరే విడిచిపెట్టటం అలవాటైందనుకుంటాను.

    If such an important age with rich texts is descended on any people, I view it as a time when the soul of a civilization/tribe or country is found. I have no pretentious use to say: ‘we should explore it because it is a matter of a telugu jaati’ or whatever that is. If a cross understanding is possible from kannaDa texts of the time, it will enhance the understanding.

    ఒక ప్రాంతం లేక దేశం తనకు తాను నాగరికతను ఏర్పరుచుకోవడానికి లిటరేచర్ (గ్రంథాలు, కావ్యాలు, మిగతా Texts) ముఖ్య కారణం అనుకుంటాను. ఆ కాలంలో అంతగా వృద్ధి చెందడానికి ఒక్క రాయలే కాక కావలసినంత విమర్శ, అనువైన వాతావరణం (ఆర్ధికంగా, ముఖ్యంగా) ఉండి ఉండాలి. Art and literature flourish in times of leisure. ఒక రకమైన గ్రంథాలు రావడానికి కారణం వాటికున్న ఆదరణ కూడా కారణమై ఉండవచ్చు (ex. emergence of greek plays during the times when plays were popular among public/specific classes).

    These are various angles that should interest the literary historians. I have read very little about that period other than occassional articles about ‘raayalu’ & I guess my push at this time is to get this going into other areas.

    రాయలమీదనుండి, ఆయన భార్యల మీదనుండి, అతని ఒక్కడి కావ్యాదరణ నుండి దృష్ఠి మరల్చి ఒకసారి ఆ కాలపు పన్నుల మీద, పంటల మీద, వర్తకాల మీద, ముఖ్యంగా విద్యా వ్యాసంగాల (వాటిని ప్రభావితం చేసిన వాళ్ళ మీద, అంటే రాయలు, ఆయన దిగ్గజాల మీద కూడా) మీద ఏవైనా పరిశోధనలు చూప గలిగితే, then it becomes a base line understanding, is my humble opinion. I guess I am asking for a shift in primary focus, from ‘the importance of a “direct” connection to specific’ to ‘understanding of the whole’.

    Secondly, The understanding of Forgotten Empire is important to reflect on, before it becomes a Lost Empire, to some extent, I guess I am also trying to say:

    ఇతిహాసపు చీకటి కోణం
    అట్టడుగున పడి కాన్పించని
    కథలన్నీ కావాలిప్పుడు!
    (అవి కాస్త కథలు కాకపోతే మంచిది).

    విప్లవ్

  5. Kameswara Rao అభిప్రాయం:

    May 4, 2006 8:41 am

    రాయవాచకం, కృష్ణరాయల విజయం విషయమై రామారావుగారన్నదానితో ఏకీభవిస్తాను. అవి మాత్రమే ఆధారమైతే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. రాయలకాలంలో కూడా విదేశీయుడెవరోఅతన్ని దర్శించి, అతని గూర్చి రాసినట్టుఎక్కడోచదివాను. అందులో ఏమైనా ఆధారాలున్నాయేమో?
    ఆముక్తమాల్యద కర్త గురించి - రచయిత identityకి సంబంధించి కావ్యన్నుండి internal evidence తీసుకొనే పద్ధతి అంత శాస్త్రీయం కాదేమో! అలా ప్రయత్నించినా, నిజజీవితంలో కృష్ణరాయలు వీర వైష్ణవునిగా కనిపించడు కదా (శైవ దేవాలయాలకిచ్చిన దాన శాసనాల ద్వారా). మరి ఆముక్తమాల్యద కర్త వీరవైష్ణవిడిగా తోచడా? ఏదేమైనా, తక్కిన వాదనలని బొత్తిగా నిర్హేతుకమని కొట్టిపారేయడం అంత సమంజసంకాదని నా ఉద్డేశం. ఇంతకన్నా దీనిగురించి రాస్తే మళ్ళీ పాత రభసని తిరిగి తోడడమే అవుతుంది. దానివల్ల బహుశా పెద్ద ఉపయోగం లేదు.

  6. తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    May 4, 2006 11:22 pm

    (Part of this post is edited by eemaaTa editors due to its insensitive, unprofessional, loose, indecent and unwarranted tirades against an individual. Such behavior is inconsistent with the literary discourse this magazine is dedicated to encourage. Though our policy has been to allow free discussions on topics published here, this is a sad exception we do not wish to be a frequent occurrence.)

    …… రామారావు గారి వ్యాసం చక్కగా ఉంది.
    కానీ రాయల వైష్ణవం ఆయన పరమత అసహనం లాంటివి
    ఎక్కువ సాగదీసి నట్టు ఉన్నాయి.అప్పుడు బౌద్ధులు ,జైనులు
    దక్షిణాదిలో అంత ప్రబలంగా వున్నట్టు కనబడదు.భక్తియె
    చాలు అన్న మాటను మరువకూడదు..రాయలు భిక్షువులను అంతగా
    విడదీసి చూడలేదు.రాజనీతి తెలిసినవాడు ఆ మాత్రం ఔదార్యం
    ప్రదర్శించకుండా వుండడు.దీన్ని వదిలేస్తే మిగిలిన అన్ని విషయాలు
    నిర్దుష్టంగా వున్నాయి..ఎక్కడా వికల్పానికి లోను కాలేదు.
    —————————-
    Forgotten Empire- Dos Reis de Bisnaga అన్న పోర్చుగీసు
    ప్రచురణకు తొలి అనువాదం.ఇటీవల Dr.Vasundhara Filliozat,Paris
    University సంకలించిన Vijayanagar as seen by Dorningos Paes
    and Fernao Nunitz and others అన్నది ప్రశస్త రచన.పోర్చుగీసు వారివే
    కాక ఇటలీ యాత్రికుల కథనాలు ఉన్నాయి. Burton Stein రాసిన Vijayanagara
    కూడా ఎన్నదగిన గ్రంథమే. తెలుగులో రాళ్ళపల్లి, పుట్టపర్తి వారు విజయనగరచరిత్ర గూర్చి కంఠదఘ్నంగా వచించివున్నారు;వీరి బహుభాషా పాండిత్యం విశ్రుతపూర్వమే..

    తమ్మినేని యదుకుల భూషణ్.

  7. kari venkataratnam babu అభిప్రాయం:

    May 5, 2006 12:00 pm

    అల్ల సాని పెద్దన కు సంబంధిచిన inscriptions whatisindia.com లొ చదివితిని.అవి రాయలసీమ ప్రాంతానివి.పెద్దన కు దానమీయబడిన భూములు వివరాలు వున్నాయి.రిసెర్చి కి చాల అనుకూలమయిన వెబ్ .

  8. K.V.S. Ramarao అభిప్రాయం:

    May 6, 2006 1:47 pm

    ఒక రచననీ దాని రచయితనీ వేరుగా చూడగలగటం విమర్శకుడి తొలికర్తవ్యం. అలాకానప్పుడు అసలు విషయాన్ని కూడ అనవసర వ్యక్తిగత ప్రసక్తితో కలిపి అవతలపారెయ్యటం జరుగుతుంది.

    ఇకపోతే ఇక్కడ వున్న విషయం “నిర్ణయాలు (లేదా సిద్ధాంతాలు) శాస్త్రీయంగా (అంటే scientific గా) సాధారాలు, సహేతుకాలు ఐన మార్గాల ద్వారా సాధించారా లేక వట్టి ఊకదంపుడు ద్వారానా” అన్నది. మరో ముఖ్యమైన విషయం - ఒక నిర్ణయం సాధించటానికి ఇంతశ్రమ అవసరంఐతే ఒక సందేహం లేవనెత్తటానికి ఉన్న ప్రమాణం ఇంతకన్న చాలా తక్కువ అనేది. ఒక సిద్ధాంతాన్ని disprove చెయ్యటానికి ఒక counter-example సరిపోయినట్లు ఒక సందేహం లేవనెత్తటానికి ఒక ఆధారం చాలు.

    వెల్చేరు గారు చేసినది నా దృష్టిలో అలాటిపని. ఆయన పరిశోధకుడు. పరిశోధకుల పని ప్రశ్నలు వెయ్యటం, సందేహాలు రేపటం. అలాకాకుండా అదివరకు అందరూ నడుస్తున్న దారినే కళ్లుమూసుకుని వెళ్లేవారు పరిశోధకులు కారు; వారి వృత్తికే అన్యాయం చేసినవారు. ప్రచారంలో వున్న నమ్మకాల్ని ప్రశ్నించి అవి శాస్త్రీయంగా సమర్ధనీయాలే అని రుజువు చెయ్యటం పరిశోధకుల పని. అదివరకు చూడని కొత్తకోణాలున్నాయేమోనని వెదకటం వారి కర్తవ్యం. అలా చేసినప్పుడే చర్చలు, వాటిద్వారా కొత్తవిషయాలు వెలికిరావటమూ జరుగుతాయి. ఒకానొకచో కొత్తవిషయాలు రాకపోయినా పాతవాటినే కొత్తవిధంగా చూడటం ఐనా జరుగుతుంది . ఇదీ ఆధునిక పరిశోధనా మార్గం.

    నిజానికి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా - ఆయన ఆ సందేహం వెలిబుచ్చబట్టే ఇంత చర్చా సాధ్యమైంది.

  9. K.V.S. Ramarao అభిప్రాయం:

    May 6, 2006 4:59 pm

    వెంకటరత్నంబాబు గారు ఇచ్చిన reference చాలా ఉపయోగకరమైంది. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ వెబ్ సైట్ లో అల్లసాని పెద్దన దానాలను వివరించే శాసనాలు మూడున్నాయి. అవి 65, 66, 68 అంకెలవి. ఆ లింక్ ఇది - http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_16/stones_51_to_75.html

    ఐతే ఈ శాసనాలు చెప్పే సీమలు పెద్దనకు ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో ఇవి చెప్పవు. కృష్ణరాయల అధికారంలో వున్నాయని, పెద్దనకు వాటి మీద కొన్నిరకాల హక్కులున్నాయని చెప్తాయి గాని అంతమాత్రం చేత రాయలే అవి ఇచ్చి వుండనక్కర్లేదు. అంతకు ముందు పాలించిన వీరనరసింహుడో సాలువ నరసింహుడో ఐనా ఐవుండొచ్చు. ఏమైనా, ఈ సైట్ గురించి మనందరికీ చెప్పిన వెంకటరత్నంబాబు గారికి మళ్లీ కృతజ్ఞతలు.

  10. విప్లవ్ అభిప్రాయం:

    May 6, 2006 9:43 pm

    భూషణ్ గారు కోట్ చేసిన పేరా తరువాత అదే తెలుగు నాడిలో వెల్చేరు గారు ఒక వాక్యం రాసారు: “ఇదీ ఈ పద్యానికి పైకి కనిపించే అర్ధం.” అని.

    ఆ తరువాత ఎలా అర్ధం చేసుకోవాలో చెబుతూ, పండితులు కవులు రాజాశ్రయం కోసం వస్తారు … వాళ్ళకు అగ్రహారాలూ, అక్షర లక్షలూ ఇవ్వక్కరలేదు … అంటూ కనీసం రెండు రకాలుగా అర్ధాలు చెప్పారు (సంపాదకులు ఆ పూర్తి వ్యాసం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం వల్ల నష్టం లేదు అనుకుంటాను, ముఖ్యంగా ఆ శీర్షిక పేరు: “ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక” అన్న విషయంతో సహా).

    అయినా ఇంత చిన్న పరిచయానికే “కృష్ణరాయల కీర్తికే కళంకం” వచ్చేట్లయితే, ఆ కీర్తి ఆనుపానుల మీద నిజంగా డౌటు వచ్చి తీరాలి.

    నాదొక సందేహం:

    (అన్ని వ్యాఖ్యలనూ పక్కకు పెట్టి నాకు నేను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేసాను).
    ఇది ఒక ఉపమానం అయి ఉండవచ్చా: పండితులకూ, భిక్షులకూ ఊళ్ళు పంచి ఇస్తే — ముఖ్యంగా డబ్బు దస్కం, ఈ రెండు కులాల వారిని కులభ్రష్టులుగా మిగులుస్తుంది, అందుకే వాళ్ళ పట్ల భక్తి చాలు అని అన్వయించుకుంటే తప్పు ఎక్కడ?

    విప్లవ్

  11. Sreenivas Paruchuri అభిప్రాయం:

    May 7, 2006 5:12 am

    1. రామారావుగారు “రాయవాచకాన్ని మంత్రులకోసం రాసిన పాఠ్యపుస్తకంగాను, “కృష్ణరాయవిజయాన్ని” రాయల యుద్ధవిజయాల మీద కావ్యంగాను “క్లుప్తీకరించడం” ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి ఈ రెండు పుస్తకాల మీద విస్తృతమైన పరిశోధనా వ్యాసాలే వెలువడ్డాయి. ముఖ్యంగా శ్రీ సి. వి. రామచంద్రరావు రాసిన 2 పుస్తకాలు, “రాయవాచకం”పై P. Wagoner విస్తృతానువాదం/చర్చ: Tidings of the king ఈ సందర్భంలో చూడదగ్గవి.
    రామారావే గారే ఉదహరించిన Textures of time లో 30-40 పేజీల చర్చ వుంది. ఇంకా చాలా చెప్పవలసి వుంది కానీ, ఇది సరయిన జాగా కాదేమో!

    2. కామేశ్వరరావుగారు (2006లో కూడా) ఆముక్తమాల్యద కావ్యకర్త రాయలుకాదనే వాదనను కొట్టివేయలేం అనడం కూడా నాకాశ్చార్యాన్ని కలిగించింది.

    3. విప్లవ్ గారు కోరిన/అడిగిన (సాంఘిక, సామాజిక) స్థితిగతులపైన సమాచారం నిజానికి అందుబాటులోనే వుంది. గత 30-40 సంవత్సరాలలో అధిక సంఖ్యలో పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు (ఎక్కువభాగం పాశ్చాత్యులవి) వెలువడ్డాయి.
    ఆ మాటకొస్తే, నారాయాణరావుగారు సందేహించినట్లు, రాయలు కవి పక్షపాతి అని చూపించే ఆధారాలే ఈనాటికీ బయటపడలేదు.

    4. అష్టదిగ్గజాలు వున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆరుద్ర “సమగ్రాంధ్రసాహిత్యం”లో ఇవ్వబడిన Table ని చూడండి. ఇక్కడా కూడా చాలా వివరణ అవసరం వుంది. ఇది 17 శతాబ్దంలో వచ్చిన ఒక phenomena. భోజుడిగురించి, అక్బర్ గురించి … ఇలాంటి కథలే ఆ కాలంలో ప్రచారంలోకి వచ్చాయి.

    5. Burton Stein, Vasundhara Filliozat, రాళ్ళపల్లి చేసిన రచనలు ఆకాశానికి ఎత్తివేయబడ్డాయి. రాళ్ళపల్లి రాయల మీద రాసినవి నాకు తెలిసి మూడు వ్యాసాలు. ఆ మూడు వ్యాసాల్లో ఎక్కడ మన ప్రస్తుత చర్చకు ఉపయోగపడే విషయాలున్నాయో ఆ చరిత్రను “అవలోడనం” చేసిన విజ్ఞులు తెలుపగలరు. అలానే Stein, Filliozat రచనలు కూడా.

    ఏదేమయినా, తెలుగు వారి సౌకర్యార్థం గత 30 యేళ్ళలో “విజయనగరం” మీద English, French, Portugese, German లలో వచ్చిన పరిశోధనా విషయాలను క్రోడీకరించి రాయవలసిన అవసరం వుందని అనిపిస్తుంది.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  12. వాడపల్లి, శేష తల్ప శాయి అభిప్రాయం:

    May 10, 2006 12:17 am

    సుప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ నేలటూరి వేంకట రమణయ్యగారు
    “అష్టదిగ్గజ నిర్ణయము” అను పేర 2-12-57న
    చేసిన ఉపన్యాస పాఠమును క్రిందిచోట చదువ గలరు.
    http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html

    దీనిని “ఆష్టదిగ్గజములు” అను పుస్తకమున 1960లో ప్రచురించించారు.

    దీనిపై సమీక్షావ్యాసములు జనవరి, మార్చి 1962 “భారతి” పత్రికలలో ఉన్నాయి.
    వీటిలోనూ విలువైన సమాచారము ఉన్నది.

    మంచిచర్చకు దోహదపడుతాయని భావిస్తాను.

    నమస్సులతో,
    శాయి.

  13. kari venkataratnam babu అభిప్రాయం:

    May 11, 2006 5:34 am

    రామారావు గారు,

    వాడపల్లి వారు చెప్పిన వెబ సైట్ లో రాయలు అష్టదిగ్గజాల గురించి వెంకటరమణయ్య గారు విపులంగా తెలియజెప్పిరి.గత తరములో, శాసన సాహత్య వ్యాసంగములలో మహానుభావుడీయన. మన తరము లో అంతటి వారు ఎవరున్నారు? పరుచూరి వారు పాశ్చాత్యుల పుస్తకాలతో మాత్రమే మన చరిత్ర పరిశీలనా మార్గమనుట సమంజసమా? కాదు.పరిశీలంచని రాయలు కాలము నాటి రాళ్ళపైరాతలు చాలా వున్నవి, తాళ పత్రములున్నవి. ఈ మధ్యనే తాళ పత్రముల కంప్యుటీకరణ మొదలయినది. శాసనముల కంప్యుటీకరణ జరిగినట్లు సమాచారము అందలేదు. వాడపల్లివారో,మరొకరో, వెబ్ లో  ఎక్కడైనా దొరకు ఈ సమాచారము మనకందిచిన మీ పరిశీలనా వ్యాసంగము సులభతరమగును.

    ఈమాట మే సంచికలొ మీ వ్యాసమునకు లభించిన అభిప్రాయముల వరుసను పరిశీలించితే, ప్రవాసులలో సాహిత్యము చరిత్ర వ్యాసంగ వ్యసనమున్న వారు చాలమంది వున్నారు. కనుక రాబొవు ఈమాట లో మరొ వ్యాసాన్ని ఆశించుదాం.

    ఇక శెలవు

  14. Dr.Ismail Penukonda అభిప్రాయం:

    June 7, 2006 2:12 am

    మంచి వ్యాసం.ఇలాంటి విజ్ఞానదాయకమైన చర్చ ను ఆస్వాదించడం…నా అదృష్టం!

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a