వ్యథ - 2004
II.
ఈ కథాసాహితి సంపాదకుల్లో శ్రీ శివశంకర్ నాకు తెలీదు కానీ నవీన్‌గారితో కొంచెం పరిచయం ఉంది. వారు పరోక్షంగానే నాకు ఎక్కువ తెలుసు, వారి గురించి విన్నవన్నీ మంచిమాటలే. డెట్రాయిట్ తానా సభల్లో కలిసినప్పుడూ చాలా సంగతులు మాట్లాడినప్పుడూ, శ్రీ నవీన్ గురించి విన్న మాటల్లో అతిశయోక్తి లేదని అనుకున్నాను కూడా. ఇదెందుకు చెబుతున్నానంటే, వ్యక్తిగతంగా వారిమీదున్న నా అభిప్రాయాల దృష్య్టా ఈ కథలను ఎంచుకోవడంలో సంపాదకుల విచక్షణలో ఏ రకమైన ఇతరత్రా హెచ్చుతగ్గులూ ఉంటయ్యని నేను అనుకోటంలేదు కాబట్టి. వారి శక్తికి మించే శ్రమించి దొరికిన అన్ని కథల్లో తాము మంచివనుకున్న కథల్నే ఈ సంకలనాల్లో చేరుస్తారనీ, ఆ శ్రమా నిబద్ధతల వల్లనే ఈ సంకలనాలు ఆటుపోట్లకు ఎదురొడ్డి ఇన్నేళ్ళుగా వస్తున్నాయనీ అనడంలో నాకు సందేహం లేదు. ఇలా అవిచ్ఛిన్నంగా సంకలనాలు తేవడంలోనూ, కథల ఎంపిక విషయంలోనూ ఎన్ని ఒత్తిళ్ళు ఉంటయ్యో మనం ఊహించగలం. వాటిని సాధ్యమైనంత తట్టుకుంటూ ఇంతకాలం నిలబడగల్గడమూ, కథని కాపాడుకోడానికి ఇంత పాటు పడడమూ సామాన్యమైన విషయాలు కాదు. అందువల్ల, సంపాదకుడు కావటంవల్లే తమ సొంత కథ వేసుకున్నారనేలాంటి చవుకబారు ఆరోపణలని ప్రస్తావించడం గూడా అనవసరమే. తనా మనా తేడా చూపకుండా ‘డూ అన్‌టూ అదర్స్…’ ని వల్లించేవాళ్ళే కాక పాటించేవాళ్ళూ ఉండడంలో ఆశ్చర్యమేమీలేదు కదా. ఈ మాటలనడంలో నాకున్న ఉద్దేశమేమంటే ఇలాంటివి విడుదలైనప్పుడల్లా సంపాదకులకీ సహకరించే వారికీ ఏవో కాన్‌స్పిరసీలూ నెపోటిజపు థియరీలూ అల్లేసి వైయక్తిక దూషణలకి దిగిపోయి రాద్ధాంతం చేసేవారివల్ల (వీరు తక్కువ సంఖ్యలో ఏమీ లేరు) ఏ ప్రయోజనమూ ఉండదు కాబట్టి విమర్శను సాహిత్యపరంగా మళ్ళించడానికి ప్రయత్నించడం.
అలాగనేసి ఈ సంపాదకులు విమర్శకు అతీతులేమీ కారు. నాకు సుతరామూ నచ్చనివి వీరు కథలకిచ్చే ముఖపరిచయాలు, మొదటే రాసే ముందు మాటలూ. ఇవి చదవబోయే కథను సూక్ష్మంగా పరిచయం చేయడం పోయి, ఆ కథను ఏదో ఒక పెద్ద చట్రంలో చూపిస్తూ వారి ఎంపికకు సంజాయిషీ నిచ్చుకుంటున్నట్లుంటై. నాగరిక, గ్రామీణ, సాంఘిక, ఆర్ధిక, మతకల్లోలాల, గ్లోబలైజేషన్ కబళింపుల, తుపాకీ గొట్టాల, ఫ్యాక్టరీ చిమ్నీ పొగల, ఏదో ఒక, మరింకేదో ఒక నేపథ్యాలూ, వాటిల్లోనుంచి అసలింకేదో ఒక నేపథ్యంలో శ్రామిక, రైతు, దళిత, మైనారిటీ (ఒకటే రకము), స్త్రీ (పలు రకములు), తదితర జీవితాల చిత్రణలూ లేదూ నివాళులూ ఇవీ సర్వసాధారణంగా కనపడే పరిచయాలు. వీటిని ఎంత తరచుగా వాడతారంటే, పడికట్టు పదాలకంటే విలువ తగ్గిపోయేంత ఈ నేపథ్యాలకీ, చిత్రణలకీ, నివాళులకీ. అప్పుడప్పుడూ నాకొచ్చే అనుమానం ఈ ముందుమాటల వల్లే నాకు కథలు నచ్చట్లేదా? అని. ఇవి చదివేనేమో ఎంతో గొప్పగా ఊహించుకుంటాం ఆ కథల గురించి. అవి చివరికి ఊరిజనాల్ని నిరాశ పెట్టిన సర్కస్ ఏనుగుల్లా అఘోరిస్తుంటై. కొన్నిసార్లు ఓ మాములు కథక్కూడా ఇలా ఏదో ఒక నేపథ్యం అంటకట్టి మరేదో సామాజిక ప్రయోజనాన్ని ఆపాదించటం చూసినట్టే గుర్తు. ముందుమాటకు విలువ తగ్గడమూ అపహాస్యానికి గురి కావడమే కాక సంపాదకుల ఆలోచనావగాహనలు ఒక నియమిత పరిధికి కట్టుబడున్నయ్యనే అనుమానం కలగడమూ, ఇందువల్ల వచ్చే చిక్కులు. వీటిని సులభంగానే పరిష్కరించవచ్చుననే నా నమ్మకం.
సంపాదకులకున్న నిబద్ధత కేవలం సాహిత్యానికేననీ, కథాసాహిత్యానికి అంతర్గతమైన మౌలిక లక్షణాల ప్రాతిపదికగానే కథలను అంచనా వేయడమూ సంకలనంలో చేర్చడమూ జరుగుతుంది అని అనుకున్నాం. అంటే కథను ఏ రాజకీయ సాంస్కృతిక వాద నిర్వచనాల్లోనుంచో అంచనా వేయక పోవటం ద్వారా సాహిత్యాన్ని ఏ ఒక్క రకమైన వాదానికో ప్రయోజనానికో పరిమితం చేయకపోవడం. ఇలా కాని పక్షంలో ఏ సాహిత్య లేదా సాహిత్యేతర దృక్పథంతో కథల్ని బేరీజు వేస్తున్నారో విస్పష్టంగా చెప్పవల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉంది. అవి ఏవైనా కావచ్చు గాక, ఇలా వారి ప్రమాణాల్ని, ప్రామాణికాల్నీ నిర్వచించటంలో రెండు లాభాలున్నై. ఒకటి, బురద తట్టల పెద్దమనుషులకి అది చల్లే అవకాశం ఇవ్వకపోవటం (చేసే కష్టమంతా చేసి చెడతిట్లు తినడంలో ఏ తృప్తీ లేదు కదా). కానీ ఇది కాస్త చిన్న విషయం. ముఖ్యమైందీ, రెండవదీ ఈ కథలన్ని ఏ ప్రమాణాలకు బద్ధులై సంపాదకులు సంకలించారో, అవే ప్రమాణాల ఆధారంగా ఆయా సంకలనాల్ని చదివి విశ్లేషించటానికీ, విమర్శించటానికి ఖచ్చితమైన ప్రాతిపదిక నేర్పరచడం ద్వారా సాహిత్యానికి రెట్టింపు మేలు జరగడానికి దోహదపడటం. ఇదెలా అంటే, ఉదాహరణకి సంపాదకులు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాలూ నిర్వచనాల ఆధారంగా కథల్ని ఎంపిక చేశారనుకుందాం. అప్పుడు ఆ కథల్ని అవే పద్ధతుల్లో విశ్లేషించి విమర్శించడం ద్వారా మనం ఆ నిర్వచనాలనీ, వాటి ఆధారంగా ఎంపిక చేయబడిన కథల్నీ, సంపాదకుల నిర్ణయాలనీ తులనాత్మకంగా పరిశీలించవచ్చు. ఇటువంటి సిద్ధాంతబద్ధమైన విమర్శ వల్ల సాహిత్యానికి కలిగే మేలు వేరే చెప్పనక్కరలేదు. పరోక్షంగా జరిగే ఇంకొక మంచి ఏమిటంటే, ఇలాంటివే సంకలనాలు తెస్తున్న ఇతరులు వారి వారి ప్రమాణాలను నిర్వచించుకోవడం ద్వారా విభిన్నమైన సాహిత్యాన్ని వెలికితెచ్చే వారవుతారు. తెలుగులో ప్రస్తుతం వస్తున్న కొన్ని కథలు అన్ని వార్షిక సంకలనాల్లో చోటుచేసుకోవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా అద్దంలో చంద్రుణ్ణి చేత్తో పట్టుకొనే తపనే కావచ్చు, కానీ ప్రయత్నించడంలో తప్పు లేదనే నా విశ్వాసం.
ఇక కొంచెం ఇబ్బందిగానే చెప్దామనుకున్న మాటొకటుంది. కనీస ప్రచురణార్హత (లేదా సంకలనార్హత) లేని కథలు కొన్నున్నై ఈ పుస్తకంలో అన్న అభిప్రాయంలో నేను ఏకాకిని కాను. ఎవరి అభిప్రాయాల నిమిత్తమూ లేకుండా సంపాదకులు తమ ముందుమాటలనీ అసలు కథలనీ పోల్చి చూసుకొని నిజానిజాలు వారే నిర్ణయించుకోవచ్చు కూడా. ఇదే అభిప్రాయం పదిమందిదీ అయిన పక్షంలో (కాకపోయినా పర్లేదు) అటువంటి కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోడం వెనుక మనకు రెండు కారణాలు కనపడతై. ఒకటి, సంపాదకుల దృష్టిలో కనీసమాత్రపు కథలను ఖరాబైన కాగితాల్నుంచి వేరు చేసే గీత ఏ పాతాళరేఖ దిగువో ఉండడం, లేదా రెండు, ఏవోకొన్ని సామాజిక సాహిత్యేతర ఒత్తిళ్ళ బలవంతానికి తల క్షణికంగా ఐనా సరే ఒంచడం(లేకపోతే, ఈ సంకలనం ఖచ్చితంగా మరింత సన్నంగా ఉండాల్సింది). అయితే ఈ రెండో కారణం ఇతరుల బలవంతం వల్లే కానక్కరలేదు, సదరు కథలు ప్రచురించడం వల్ల ఒక గొప్ప సామాజిక ఉపయోగముంది, అట్లుండేదే సాహిత్యమనే నమ్మకంలో సంపాదకులు ఇష్టపూర్వకంగానే చేసుండొచ్చు. అలా చేస్తే ఆ సామాజిక ఉపయోగపు నైజాన్నీ లక్షణాల్నీ బట్టి సంపాదకులు ఏదో ఒక వాద నిర్వచనపు గిరిలో ఉన్నట్టౌతుంది. ఇది నిజం కాదేమో అని ముందు పేరా మొదట్లో అన్నాను కదా. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సంకలానాల్లో ప్రచురింపబడే కథలు నిజంగానే తెలుగులో వచ్చిన అన్ని కథల్లోనూ మంచివి అన్న అపోహను మనం పోగొట్టుకోవచ్చు. కానీ, ఇది నిజం కాదనే నా నమ్మకం, కాకూడదనే నా అభిలాష.
ఇందాకే ప్రస్తావించాను సంపాదకులు వాడే ముందుమాటల్లో తరచూ కనబడే పదాల గురించి. అయితే వారినే ఎందుకు తప్పు పట్టడం? వస్తున్నవన్నీ పడికట్టు కథలే అయితే వారు మాత్రం ఏం చేయగలరు, పడికట్టు ముందుమాటలు రాయడం తప్ప. సమస్య ఏ ఒక్క వార్షిక సంకలనానికో పరిమితం కాదు. ఇది రచయితల సాహిత్య దృక్పథానికి కూడా సంబంధించింది. సామాజిక సంక్లిష్టతల్ని ప్రదర్శించేదే కాక వైయక్తిక స్థాయిలో పరామర్శించే సాహిత్యం కూడా సాహిత్యమే, దాని కర్తవ్యాన్ని అది చక్కగా నెరవేర్చినంతవరకూ. ఏదో వాదాన్ని సమర్ధించేదో, ఏవో అసమానతల్ని ఎత్తిచూపేదో, ఏ సామాజిక సమస్యను గుర్తించేదో లేదా పరిష్కారం చూపేదో, ఏ వ్యథాభరిత జీవనచిత్రాన్ని ఆవిష్కరించేదో మాత్రమే గొప్ప రచన లేదా నిబద్ధసాహిత్యం (కమిటెడ్ లిటరేచర్) అనడం తప్పు. అటువంటి అభిప్రాయం ఉండటం వల్ల తాము మాత్రమే నిర్వచించిన సదరు సామాజిక ప్రయోజనాల పరిధిలోకి రాని ప్రతీదీ ఉబుసుపోక రచనే అని కొట్టివేయడానికి ఆస్కారం చాలా ఎక్కువ (ఏమి సమాజమో ఏమి ప్రయోజనమో, ప్రత్యేకించి సాహిత్యంలో ఎంత నైరూప్య పదార్ధమో ఇది!). పైన చెప్పినవన్నీ మంచి సాహిత్య సృష్టికి తోడ్పడే అంశాలే, కానీ వాటి చిత్రణ మాత్రమే గొప్ప సాహిత్యం కాదు. ఎక్కడిదాకో ఎందుకు, మన దగ్గరే మన చుట్టూనే ఉన్న జీవితాన్నీ, సంఘటనలు కూడగట్టుకుంటూ సాగుతున్న జీవనాన్నే చూడండి. ఎన్నో వేలవేల అనుభవాల అనుభూతుల కలగూర గంపలు, మన జీవితాలు. పల్లె నుంచి వచ్చినా పట్నం బిడ్డయినా, రైతుకూలీ గుమస్తా మంత్రీ మహారాజూ ఎవరి పిల్లలమైనా, బంగారు ఊయల నుంచి మురికికాలువ పక్కకు చేరినా, మురికి గుంటల్లో పుట్టి ముత్యాల పల్లకీ నెక్కినా, కోరికలూ బాధలూ, సుఖ దుఃఖాలూ, ఆవేశాలూ ఆనందాలూ అనుబంధాలూ ఎన్నో నిండివున్న జీవితాలు మనవి. ఏ సామీప్యం లేకపోయినా ఎంతో సారూప్యం ఉన్న జీవితాలు మనందరివీ. ఇంత విస్తారమై కూడా అనుక్షణమూ మరింతగా విస్తరిస్తూనే ఉంటై మన జీవనాలూ జీవితానుభవాలూ. వాటన్నిటినీ నిబద్ధసాహిత్యానికి పనికిరావని తోసిరాజనకండి. ఏ ఒక్క పక్కకొమ్మకో మాత్రమే ఆకులున్న వేయి కొమ్మల మర్రిచెట్టు పచ్చదనానికి సంకేతం కాదు. బోడికొమ్మల చెట్లకింద నీడ దొరకదు.
తమ కుల మత రాజకీయ వాద ప్రచారాల్నీ స్వప్రయోజనాలనీ వారి రచనలకి సాకుగా వాడుకుంటూ అదే నిజమైనదని చేసే నినాదాల దౌర్జన్యంతో వచ్చేది నిబద్ధత గల సాహిత్యం కాలేదు. అపరిపక్వమైన ఊహా సంపర్కపు ఆద్యంతపు తొందరలో ఫ్రాంకెన్‌స్టైన్ ప్రయోగాలు ప్రసవించే అష్టావక్ర కథాకళేబరాలు నియంత్రణ గల సాహిత్యం కాలేవు. దినపత్రికల వార్తల్నుంచి అరువు తెచ్చుకున్న అర్ధగంట అనుభవాల అనుభూతుల్లోంచి పుట్టేది నిజాయితీ గల సాహిత్యం కాలేదు. రచయిత లక్ష్యం తనలో మమేకమైన భావానికి నిర్దిష్టమైన రూపాన్నిచ్చి సంపూర్ణమైన రచనగా తీర్చి దిద్దటం. అదొక్కటే రచయితకు తన పట్లా తన రచన పట్లా సమాజం పట్లా ఉన్న బాధ్యత. ఆ ఏకైక బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించినప్పుడు పుట్టేది నిబద్ధసాహిత్యమే. అలా కానప్పుడు జరిగేది సాహిత్య విధ్వంసమూ, చేసేది సమాజ విద్రోహమూ. పడగెత్తి బుసకొట్టే నాగుపాము నెదుర్కోడానికి చెదలు పట్టి పొడి రాల్తున్న వెదురు బద్ద పనికిరాదు. జిలేబీలు తిన్న వేళ్ళు నాక్కుంటూ సద్గురుస్వాములవారు తీపి తినడం వల్ల కలిగే హాని గురించి చెప్పితే ఎవరూ వినరు. తమ స్వంత రచనల పట్లే నిబద్ధత, నిజాయితీ లేని రచయితలు చూపే సామాజిక చైతన్యమూ చేసే ఉద్బోధా ఇలాంటివే. అందుకే అంటున్నది, సాహిత్యపు మౌలిక లక్షణాలని గ్రహించాలనీ, ఎన్నుకున్న కథాంశాలకి పూర్తిగా న్యాయం చేయాలనీ, అదొక్కటే వారికున్న బాధ్యతనీ. అటువంటి నిజాయితీ రచన ఎలానూ సమాజంపై తన ప్రభావాన్ని తప్పక చూపిస్తుంది. కానీ, ఏరకమైన విమర్శనూ స్వీకరించడానికి ప్రస్తుతం రచయితలూ కవులుగా చలామణీ అవుతున్నవారు సిద్ధంగా ఉన్నారని నేననుకోను. వీరి ప్రజ్ఞా పాటవములపై వీరికి మిక్కిలి ఆత్మవిశ్వాసము, వీరి మేధోశక్తీ కీర్తీ ప్రతిష్ఠలపై నెనలేని గౌరవము. వీరి యాంతరంగమున జెలరేగు నూహల నర్ధము జేసికొనుట సామాన్య మానవుల కసాధ్యమని వీరి నమ్మకము. స్వకీయ కావ్యరచనాగ్రన్ధ ముద్రాంకితులైన వీరికి ఆత్మాభిమానము మెండు. ఏమియునూ ఎరుగకబోయిననూ వీరెరగని దేమియునూ లేదు. వీరికి సర్వంబొచ్చు. అయినా సరే, నా గోడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వినకపోరా అన్న నా ఆశలు మాత్రం అనంతం!
ఎటుచూసినా మనకు కనిపించేది ఈ సాహితీ కాలుష్యమే. ఇది ఈ ఒక్క సంకలనానికే సంబంధించిన విషయం కాదు, ఏ ఒక్క రచయితనో అంటున్న మాట కాదు. అడవి కాలిపోతుంటే అక్కడక్కడా మిగిలిపోయిన చిగురుకొమ్మల్ని చూపించి నాది భ్రాంతి అని దయతో నమ్మబలికే వారికి ప్రణామాలు. పడికట్టు పదాలతో వెతల ఎత్తిపోతల పద్దుచిట్టాలు సాహిత్యం కాదన్నందుకు, సాటి మనుషుల కష్టాలపై సానుభూతి లేదని నన్నధిక్షేపించే సహృదయులకు నమస్కారాలు. రోగమా ష్మోగమా, మన ప్రస్తుత సాహిత్యస్థితి హంకీడోరీగా ఉందనే జెంటిల్మెన్(అండ్ లేడీస్) ఇక్కడిదాకా ఎలానూ చదివుండరు, వారికి కథలన్నీ నచ్చేసేసి, నా మాటలు నచ్చేయకుండా ఉండుంటై కాబట్టీ, అయినాసరే వారికి నా జోహార్లు. ఇదంతా కొంతకాలమే, అనాదిగా జరుగుతున్నట్టే సాహిత్యం కూడా ఉత్కృష్ట నికృష్ట చక్రభ్రమణం చేస్తుంటుంది అనే సాహితీవేత్తలకు మాత్రం ఒక చిన్న ప్రశ్న. ఇలా సంకలించి అసాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించడం వల్ల సుసాహిత్యం ఎలా తిరిగి రాగలదో? మళ్ళీ మంచి సాహిత్యం రావాలంటే, సాహిత్యపు మౌలిక లక్షణాలూ, సామాజిక సాంస్కృతిక జనజీవన పరిణామాల్లో దాని స్థానమూ ఉపయోగాల గురించి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయాల్నీ, నిర్వచనాల్నీ సమూలంగా పెకలించి పునర్మూల్యాంకనం చేసుకొని పునఃస్థాపితం చేయక తప్పదు. ఏ సమాజంలో నైనా ఇటువంటి పునర్విశ్లేషణలు మామూలుగా జరగాల్సినవే.
కానీ, మార్పునడ్డుకునేది కేవలం సనాతనులూ ఛాందసవాదులే కాదు, తాము ఎపుడో నమ్మిన సిద్ధాంతాల్ని శిలాశాసనాలుగా భావించి, మెదడుకు మేకులు కొట్టేసుకున్న మేధావులూ అభ్యుదయవాదులూ విప్లవాత్మకులు కూడా. పూజిస్తున్న దేవుడు రాముడైనా మహమ్మదో మార్క్సో ఐనా, చదువుతున్న పవిత్రగ్రంథం కాపిటల్ ఐనా ఖురానో గీతో ఐనా మూఢభక్తులకు తేడా తెలీదు, వారి ప్రవర్తనలో మార్పు రాదు. వారి ఏకైక నైజం మార్పు అనివార్యమని గ్రహించకపోవడం, అది తామూహించినట్టే ఉండాలన్న నియమమేమీ లేదన్న నిజాన్ని గమనించకపోవడం, వారి ఏకైక లక్షం తమను కాదన్న వారిని దౌర్జన్యంతో అఘాయిత్యంతో అణగదొక్కడానికి ప్రయత్నించటం. ఇట్లాంటి వాతావరణంలో, ఇటువంటివారి శిక్షణలో పెరిగిన రచయితలు అలాగే ప్రవర్తించడంలో ఆశ్చర్యమేముంది? మరి వారిని మాత్రమే నిందించి ప్రయోజనం ఏముంది? ఔషధం అందించాల్సింది చెట్టు కూకటివేళ్ళకి, ఎండిపోయిన కొమ్మలకి కాదు. మార్చడానికి ప్రయత్నించాల్సింది ప్రస్తుతం చలామణీ అవుతున్న సాహిత్య స్వభావాల అభాసరూపాలని. ప్రయత్నించాల్సింది ఓ మంచి రచనను గుర్తించగల్గిన విజ్ఞత ఉన్న సంపాదకులూ, సంకలన కర్తలూ. ప్రయత్నించాల్సింది నిశితమైన సాహిత్య విమర్శ ద్వారా, సుసాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించడం ద్వారా. ప్రయత్నించాల్సింది ఖచ్చితమైన ప్రమాణాలతో ఉత్తమస్థాయి సాహిత్య సృష్టికి వెసలుబాటు చేయడం ద్వారా. మంచి కథనీ కవితనీ గుర్తించగలవారు మాత్రమే చేయగల్గిన సాహిత్యవిచికిత్స ఇది, వేయగల్గిన మొదటి అడుగు ఇది. మార్పు వ్యవస్థాత్మకమైనా అంకురించేది వైయక్తిక స్థాయిలోనే. ఈ వ్యాసాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయమూ, పరిచయంతో మొదలు పెట్టిన కారణమూ ఇదే.
చివరిగా, కథల స్థాయి అంచనా లోపం, సాహిత్యేతర ఒత్తిళ్ళ ప్రభావం అంటూ ఇప్పుడే నేను చెప్పిన ఈ రెండూ కారణాలు సంకలనకర్తలపై తీవ్రమైన ఆక్షేపణలే. ఇబ్బందిగానే అని ఎందుకన్నానో మీకిప్పుడు అర్థమయుండాలి. కారణాలేమైనా, ఉద్దేశాలు మంచివే ఐనా, ఇందువల్ల జరిగేది కేవలం నష్టమే. సాహిత్యేతర నిర్బంధాల్ని నిర్దాక్షిణ్యంగా ఖండించకపోవడం సాహిత్యానికి కర్ణ మితృత్వమే. సంకలన కర్తల దృష్టిలో కథకుండాల్సిన కనీస ప్రామాణికతను నిర్వచించి ప్రచురించి ఆచరించకపోవడం లోపమే. అధ్యయన లోపమూ అశ్రద్ధా కొట్టవచ్చినట్లు కనిపించే రచనలని ఇలా వెన్ను తట్టడంలో ఏ ప్రయోజనం ఉంది? హాల్‌టికెట్‌తో కలిపి గోల్డ్‌మెడల్ కూడా పంపిస్తే ఎంతమంది కష్టపడి చదివి పరీక్షలక్కూర్చుంటారో మనకు తెలీదా? ఇది ఆషాఢభూతులకు కథాసాహితి లక్ష్యాన్ని తమ స్వప్రయోజనాలకు అణుగుణంగా మార్చుకోడానికి అవకాశాన్నివ్వడమే. ముద్దాడి మురుగులు తొడిగినంత మాత్రాన మట్టిబొమ్మ ప్రాణంతో లేచి చిరునవ్వులు చిందించదు. సంకలనాలలో చేర్చినంతమాత్రాన ఏ కథకూ లేని గొప్పతనం రాదు సరిగదా అలా చేసినందువల్ల సంకలనపు విలువ పోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఎక్కువే. కథాసాహితి వార్షిక సంకలనాల్లో తమ కథ చోటు చేసుకోడం ఏ రచయితకైనా గౌరవమూ, గర్వకారణమూ. పైన చెప్పినట్లుగా అర్హత లేని కథలు ప్రచురించడం వారినీ పాఠకులనూ నిరాశ పరచడమూ, అవమాన పరచడమే. పాఠకులకూ రచయితలకూ ఈ సంస్థ ప్రచురిస్తున్న సంకలానలపై ఉన్న నమ్మకమూ గౌరవాలే ఆ రెండు ఆరోపణలకూ చోటులేకుండా చేయడానికి సంపాదకులకు కావల్సిన శక్తీ, స్ఫూర్తీనూ. అవి పోగొట్టుకోకుండా ఉండడానికి పడే శ్రమే కథను కాపాడుకుందాం రండని ఎలుగెత్తి పిలుస్తున్న సంపాదకుని నిజాయితీ పిలుపుకి నిజమైన సమాధానం కూడా.
కీలక పదాలు : కథా సాహితి, మాధవ్ మాచవరం, కథ-2004
అసమీక్ష్యసమీక్ష్యకారి అభిప్రాయం:
May 2, 2006 7:44 am
మోతాదుకు మించిన అపహాస్యం, మితిమీరిన పాంటిఫికేషనూ, ఆంగ్లాంధ్ర సంస్కృతాలు కలగాపులగమైన కృత్రిమ భాష, అనవసరమైన కక్కసపాటులతో ఏ ప్రయోజనం ఉంది? ఇంతటి అసమీక్ష్యకారిత్వమున్న ఈ రచనను సమీక్షగా ప్రచురించడానికి సంపాదకులెలా ఒప్పుకున్నారో?
Lakshmanna Vishnubhotla అభిప్రాయం:
May 2, 2006 6:45 pm
మాధవ్ గారికి:
మీ సమీక్ష ఒకటికి రెండు సార్లు చదివా! కథ - 2004 నేను చదవలా కాబట్టి ఈ సంకలనంలోని కథల గురించి నేను ఏమీ చెప్పలేను. కానీ, మీ సమీక్ష ద్వారా చాలా కథలు అంత ఉన్నత శ్రేణి కథలు కావు అన్నట్టు తెలిసింది.
మీ సమీక్ష మీద నా అభిప్రాయాలు:
1. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలను చదివి నేను సంతోషపడ్డా! ఈ మధ్య కాలంలో ఇంత నిష్కర్షగా కథా సంకలనాల మీద అభిప్రాయాలను వెలిబుచ్చిన వారు అరుదు.
2. మీరు వాడిన భాష, శైలి ఇంకొంచెం సులభంగా ఉండి ఉంటే, మీరు చెప్పదల్చుకొన్నది తేలికగా అర్ధమయ్యేది! మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒక సారి చదివితే పాఠకులకి అర్ధం అవుతుందని నేను అనుకోను.
3. తెలుగులో కథ, నవల వంటి సాహిత్య ప్రక్రియల మీద సరి అయిన విమర్శ లేదనే విమర్శ చాలా కాలంగా ఉంది. మంచి విమర్శ రచయితను మరింత మంచి రచనలు చేసే అవకాశం ఇస్తుంది కాబట్టి, రచయిత కన్న విమర్శకునికి ఎక్కు భాధ్యత ఉందని నేను అనుకుంటాను. ఈ రకంగా ఆలోచిస్తే, మీ సమీక్ష ఇంకా పదునుగా, సూటిగా ఉంటే బాగుండుననిపిస్తోంది.
4. కథలు - సంకలనాలు గురించి ప్రస్థావిస్తున్నాం కాబట్టి, దాదాపు పదేళ్ళ క్రిందటి నా పరోక్ష అనుభవం ఇక్కడ అప్రస్థుతం కాదని అనుకుంటాను.
అప్పాజోస్యుల - విష్ణుభొట్ల ఫౌండేషన్ (యు.ఎస్.ఎ.) వారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రభ సౌజన్యంతో కథల పోటీ నిర్వహించారు (1996). నాకు తెలిసి పోటీలో గెలిచిన కథకు 10,000 రూ. బహుమతి ఇవ్వటమే కాకుండా బహుమతులను ఐదు కథలకి (50,000 రూ.) ఇవ్వటం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. పరిశీలనకు వచ్చిన 730 (దాదాపు) కథల్లో ఐదు కథలని ఎన్నుకోటంలో న్యాయ నిర్ణేతలు (ఫౌండేషన్ స్థాపించిన వ్యక్తులు కాదని మనవి) చాలా కష్టపడ్డారని నాకు తరవాత తెలిసింది. ఎన్నుకున్న కథల నాణ్యత గురించి కూడా చాలా వాదాలు జరిగాయని తెలిసింది. న్యాయ నిర్ణేతలు కథా రచనలో నిష్ణాతులు అయినప్పటికి కూడా వివాదాలు లేకుండా పోటీ విజేతలను ఎన్నుకో లేకపోయారు. ఈ విషయం ఇక్కడ మనవి చెయ్యటానికి కారణం ఏమిటంటే, పోటీ అనగానే ఎన్నో అనూహ్యమైన విషయాలు న్యాయనిర్ణయంలో చోటు చేసుకుంటాయి.
సంకలనాల పరిస్థితి కూడా ఇదే అయి ఉంటుందని నేను ఊహిస్తున్నా!
విష్ణుభొట్ల లక్ష్మన్న
Madhav Machavram అభిప్రాయం:
May 4, 2006 5:18 am
లక్ష్మన్న గారూ, మీ అభిప్రాయాలకు కృతజ్ఞతలు. నా భాషను మరింత సరళంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాను. వ్యాసంలోనే ప్రస్తావించినట్లు ఈ విమర్శ ఈ ఒక్క సంకలానికే పరిమితం కాదు, ఏ ఒక్క రచయితనో అంటున్న మాట కాదు. ఈ సంకలనం కేవలం ఒక ఉత్ప్రేరకం మాత్రమే. ఇది ప్రస్తుత సాహిత్యస్థితి పైన, నా అభిప్రాయాలూ అనుభవాల ఆధారంగా, నా వ్యాఖ్య. ఈ కారణం వల్లనే నేను ఈ సంకలనంలో కథల్ని విశదంగా విస్తృతంగా విమర్శించలేదు. ఈ వ్యాసపు ఉద్దేశ్యం అది కాదు. అందువల్ల సూటిదనం లోపించినట్లు అనిపించి ఉండవచ్చు. ఈ వ్యాసం మొదటి భాగంలో వ్యంగ్యం వాడడానికి రెండవ భాగంలో వాడక పోవడానికీ నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి. వాడకంలో హెచ్చుతగ్గులూ వాటివల్ల కలిగే అపోహలూ నా రచనాలోపాలే కానీ ఎంచుకున్న ధోరణిది కాదు. ఇక శైలి అంటారూ, నా రాతలకు ఒక ప్రత్యేకమైన ధ్వని నివ్వడం కోసం నేను చేస్తున్న ప్రయత్నాలింకా శైశవ దశ లోనే ఉన్నాయి, అందువల్ల ఇప్పుడే పరిణతి కనిపించక పోవచ్చు. క్షంతవ్యుణ్ణి.
మీకు మరోసారి కృతజ్ఞతలతో…
మాధవ్ మాచవరం.