ఈమాట » వ్యథ - 2004

Expand to right
Expand to left

వ్యథ - 2004

I.

ఈసారికూడా ఎవరి చలువ వల్లనైతేనేం, మరీ ఆలస్యం కాకుండానే కథ 04 పుస్తకం చేతికందింది. పుస్తకం పంపిస్తూ కాస్తీవొక్కసారికీ నామాట విని మొదటి కథ మొదటే చదవకన్జెప్పన్నాడు, నా శ్రేయోభిలాషి మితృడు (శ్రేయోభిలాషులందరూ స్నేహితులు కారు, అండ్‌ వైసీ వెర్సా! కర్ణమితృత్వమ్‌, ఆషాఢభూతిత్వమ్‌ గురించి మరెప్పుడైనా!). నేనూ సరేనంటూ అలాగే చదవలేదు కూడానూ. కాకపోతే, ఆ సలహా పెడచెవినెట్టినా లాభమే తప్ప నష్టమేమీ జరిగుండేది కాదని నా చదివిన్తర్వాతభిప్రాయం, కాస్త గఠ్ఠిగానే. పుర్రెలో ఏ పురుగు కదిలిందో తెలీదు కానీ, ఇలా రాయడం మొదలెట్టాను. ఇంత పొడుగ్గానా, అంటారా? మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపికా కోరికా లేవు, అందుకని. చెప్పేదేదో ఒకేసారి చాతనైనంత చెప్పేద్దామని, ఎవరో ఒకరు చదవకపోతారా, ఆలోచించకపోతారా అనుకుంటూనూ. ఇక ఈ సంకలనంలో సీటు దొరికిన కథలూ, కథకుల విషయానికొస్తే…

ఈ కథ సాదాసీదాగా ఏ ఇంటలెక్చువల్‌ ప్రిటెన్షన్సూ లేకుండా మామూలుగా పోయొచ్చిన ఓ నాస్టాల్జిక్‌ ట్రిప్పు. ఏ ఎత్తుపల్లాల గతుకులూ (కథనంలో) లేకుండా సాఫీగా సాగే ఓ చిన్నప్పటి యాది.

వయసు మళ్ళింతర్వాత పట్నంలోనో వేరే ఊళ్ళోనో ఉన్న పిల్లల గూడు చేరిన తలిదండ్రులూ, వారికి ఠంచన్‌గా టైముకి చూపబడే నిరాదరణా జరపబడే అవమానాలూ, ముసలి ప్రాణం ఉసూరుమని మళ్ళీ పల్లె ఒళ్ళో తలబెట్టుకుని మూసిన కన్ను తెరవక పోవడాలూ…మంచి బిడ్డలూ వారినర్ధం చేసుకోలేని తలిదండ్రులూ మనకెక్కడా కనపడరు. ఎందుకంటే అది కథకుల టైమ్‌ టెస్టెడ్‌ అండ్‌ వెల్‌ ప్రూవెన్‌, అండర్‌డాగ్‌ క్రియేషనూ-సపోర్టూ-ఫర్‌ ది డౌన్‌ట్రాడెన్‌-ఫ్రేమ్‌వర్క్‌ని ఆబ్వియస్‌గా దెబ్బ తీస్తుంది కదా. రోజుకో వేరే చొక్కా లాగూ వారమంతా వేసి నాకేడుగురు పిల్లలని బుకాయించినట్టుంటుంది ఈ మూస కథలు చదివినప్పుడల్లా. మీరిప్పటికెన్ని కథలిలాంటివి చదివుంటారు? కానీ, కులాన్ని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారని పిల్లల్నొదిలెళ్ళిపోవటం ఇప్పటిదాకా మీరు చూసుండరు. ఈ మధ్య శతదినోత్సవాలు జరుపుకుంటున్న సూపర్‌హిట్‌ క్యాస్ట్‌ ఐడెంటిటీ పాలిటిక్స్‌ కిచ్చిన మొమెంటో కాబోలు మనల్ని ‘పరవె’త్తించే ఈ మస్తాన్‌ గారి కథ. సెల్‌ఫోన్లకి వాడే రిప్లేసబుల్‌ ఫేస్‌ ప్లేట్లలా కులం పేరు మార్చుకుని ఈ కథని ఎవరైనా వారి వారి కులపు కథలా చెప్పుకోవచ్చు. ఇదేనేమో ఈ కథకున్న ప్రత్యేకత. అంతగా పరిచయం లేని చాకలివాళ్ళ వ్యథాభరిత జీవితాల్ని అలవోకగా చిత్రీకరించిన కథ అంటూ సంపాదకుల మెచ్చుకోలు! కొత్తగా మనకు చాకలివాళ్ళ జీవితం గురించి ఈ కథతో ఏం తెలిసిందీ అని ఏ చెరువుగట్టునో ఇంకా బండగా పడున్న ఓ చాకలిబండ కేసి మీ తల బాదుకోండి. పాపమని జాలిపడి కనీసం అదైనా ఒకటో రెండో కొత్త సంగతుల్చెప్తుందేమో చూద్దాం.

ఏవేవో కారణాలెతుకుతూ ఉన్నట్టుండి పిచికలేవబ్బా అని చుట్టూ చూసి అవి అంతరించిపోతున్నై అని హఠాత్తుగా ఎవరైనా అనుకుంటే పెద్ద ప్రమాదమేమీలేదు గానీ, అట్లా అనుకోడాల్ని ఇలా మనమీదికి అచ్చేస్తేనే తల్నొప్పంతా! నేనుండనే ఉన్నాను, చెప్పిందింకెవరో కాదూ శ్రీ పాపినేని కదాన్చెప్పి బోల్డంత కంగారడిపోయి వెంటనే వెబ్బంతా వెతికేశి, ఆర్నిథాలజిస్టు ఫ్రెండ్లను అర్ధరాత్రి కాల్చేశి ‘ఏఁవర్రా, మన పిచికేఁవైనా ఎన్డేన్జరైన్దా’ననంటూ తిట్లూ చీవాట్లూ తినేశిన్నూ. ఎన్విరాన్మెంటూ, బయోడైవర్సిటీ, ఒక్క క్షణంపాటు మనల్ని ఆలోచింపజేసేందుకు ఇంకేదో ఒక చిన్న విషయం చెప్తారేమో రచయిత అనుకుంటాం. అటువంటివేమీ జరగవు. ఈ కథ పిల్లల కోసం రాశారా లేక పెద్దల కోసమా? బహుశా సమాజం కోసమయుండవచ్చు, పిచికలంతరిస్తున్నై అంటూ, మాడిపోండని మానవాళికి శాపాలు పెడుతూ. రచయిత ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ కథాంశం కొత్తదీ కాదు, కొత్తగా మనకు చెప్పిందేమీ లేదు. మోతాదుకు మించి మెలోడ్రామా, అస్తవ్యస్తపు ఆంత్రపోమార్ఫయిజేషనూ, మాండలికమూ గ్రాంధికమూ కలగాపులగమైన భాష, అనవసరమైన వర్ణనలూ చిత్రణలతో తన కథను తానే ఇంతలా బలహీనపర్చుకోడంలో ఏ ప్రయోజనం ఉంది? ఈ కథను కనీసం ఒక్కసారైనా ఎడిట్‌ చేశారా లేక పొరపాటున చిత్తుప్రతిని సంకలించారా? ఇలా అర్ధంలేని భావావేశపు అయోమయాస్పష్టతలలో ఏదేదో చెప్పబోయి ఏమీ చెప్పలేక పోయిన కథ ఈ సంకలనంలో ఇదొక్కటే కాదు. శ్రీ వెంకట కృష్ణ కథలో ఇంకొకాయనకి వాళ్ళ నాయన భిక్షావృత్తి నచ్చదు. కరువు సేద్యానికి దిగి దెబ్బ తింటాడు. చివర్లో తండ్రి దారే పట్టి చీకటి వీధుల్లో ఊరు ఊరంతా ఉలిక్కిపడి నిద్దర్లేచేలా గాఠ్ఠిగా గంట మోగిస్తాడు. ఈ రచయిత ప్రత్యేకత మన ఇంకొకాయన నష్టపోయింది ప్రెసిడెంటు రెడ్డి మోసం వల్ల, మీరనుకుంటున్నట్టు సేద్యం వల్ల కాదు అని మనకు చెంప పగిలేట్టు చెప్పడంలో తెలుస్తుంది. ఈ కథ ద్వారా రచయిత మనకేం చెప్పదల్చుకున్నారు? కులవృత్తిని ఒదులుకోవద్దనా? కరువు సేద్యం చేసుకుంటూ బతుకు గడపడం ఎంత కష్టమో అనా? ఏది సేద్యపు గండం ఏది సాటిమనుషుల మోసం? వృత్తీ, సేద్యం, మోసం, వీటికి చెప్పే కథలో పొంతన ఏమిటి? అంతుబట్టని ప్రశ్నలివి. పొరపాటున, కరువు సేద్యంలో ఉండే కష్టనష్టాల గురించో, తత్వాలు పాడుతూ తిరిగే భిక్షువుల గురించో ఏదో తెలుస్తుందనుకునేరు. అలాంటి భయమేమీ అక్కర్లేదు.

ఇలా చూస్కుంటూ పోతే, అసలెందుకు చోటుచేస్కున్నయ్యో అస్సలర్ధం కాని కథలు ఈ సంకలనంలో కాసినున్నై. మిగతావన్నీ మాగొప్పవని కాదు కానీ కొన్నిటికి ఏరకమైన కనీస ప్రచురణార్హత లేదని. పోనీ, ఆ మాటనడం పరుషమే అనుకుందాం. ఇంతకు మునుపెక్కడో అచ్చయినై కాబట్టి వాటికా అర్హత ఉందనే అనుకుందాం. కానీ ఇలా వార్షిక సంకలనాల్లో చేరేంత గొప్పదనం ఈ కథల్లో ఏమిటి? వినూత్నమైన కథావస్తువా, కనీసం ఒక్క కొత్త దృక్కోణమా? కథన శైలి, కథాశిల్పం, సంఘటనలూ పాత్రల చిత్రణా, వేటి ఆధారంగా ఈ కథలు ఎన్నుకోబడ్డాయి? ఈ సంకలనం ఇన్ని పేజీలకు తగ్గరాదన్న నియమం ఏమైనా ఉందేమో తెలియదు. షరా మామూలుగా రాసేసిన శ్రీ సుంకోజీ, శ్రీ ప్రతిమ, శ్రీ సలీం, శ్రీ జాతశ్రీ తదితరుల ఫ్రేమువర్కు కథలు షరా మామూలుగానే, ప్రతీదీ పేరుబెట్టి నే చెప్పలేను గానీ, మీరే చదూకొని నిర్ణయించేసుకోండి. బుట్టదఖలు చేయాల్సిన కథలని అనను కానీ, ఏ రకంగా చూసినా మంచి కథలు మాత్రం కాదని చెప్పగలను. చెప్పదలచుకున్న విషయం ఏమిటి? అనాదిగా ఉన్న ఆచారాలా, కొత్తగా చోటు చేసుకుంటున్న మార్పులా? వాటికి మూలాలెక్కడ, కారణాలేమిటి? వాటి స్థాయి వైయక్తికమా వ్యవస్థాగతమా, సామాజికమా సంస్థాగతమా? వాటి ప్రభావాల్ని ఎలా విశ్లేషించడం? ఎటువంటి పాత్రలూ సన్నివేశాల నిర్మాణం చెప్పదలచుకున్న విషయానికి తోడ్పడతై? ఎక్కడ క్లుప్తత, ఎంత వర్ణన అవసరం? ఏ రకమైన భాష వాడాలి? ఏ ఎమోషన్‌ ఇంప్లిసిట్‌గా అందించాలి, ఇంకేది ఎక్స్‌ప్లిసిట్‌గా చెప్పాలి? ఇటువంటి తర్జన భర్జనలేమీ పడకుండా రాసిన కథలని మాత్రం చెప్పగలను. ఒఖ్ఖ అక్షరం ఛస్తే కదలనని కన్ను మొరాయిస్తుంటే ఇంతలో కాసిని తెలిసిన పేర్లు కనపడ్తాయి, తెలివైనవాళ్ళని పేరుబడ్డ తాలుకు రచయితలవి.

ఇప్పుడు మీకు అర్జెంటుగా కొంచెం విశ్రాంతి అవసరం. కాస్త సేద తీరండి. నిదానంగా శ్రీ జాజుల గౌరి నీళ్ళబాయి చదవండి. కొంచెం పొడుగెక్కువ, ఐనా పర్లేదు, అదేమంత పెద్ద విషయం కాదు. ఈ కథ సాదాసీదాగా ఏ ఇంటలెక్చువల్‌ ప్రిటెన్షన్సూ లేకుండా మామూలుగా పోయొచ్చిన ఓ నాస్టాల్జిక్‌ ట్రిప్పు. ఏ ఎత్తుపల్లాల గతుకులూ (కథనంలో) లేకుండా సాఫీగా సాగే ఓ చిన్నప్పటి యాది. జ్ఞాపకాలు పాతవయ్యేకొద్దీ మనసుపై వాటి తాలూకు గాట్లు మానుతూ ఉంటై. కొత్త అనుభవాలల్లే అవి మనల్ని పట్టి ఊపేయవు. చిన్నగా పలకరించెళ్ళిపోతుంటై. అప్పుడప్పుడూ తట్టి పిలిచే వాటి తాకిడి తగ్గడం వల్లో ఆ బాధ కలవాటు పడ్డం వల్లో, అవి పంచుకునే గొంతులో సాధారణంగా వినిపించే ఒక నిర్విచారపు జీర ఈ కథలో వినండి. హోమ్‌సిక్‌నెస్సూ ఎక్యూట్‌ మెలాంఖలీల్లేని ప్యూరిఫైడ్‌ నాస్టాల్జియా. ఉన్నట్టుండి ఏదో తెచ్చిపెట్టుకున్న తపనతో, బావి పూడిపోడానికేవేవో కారణాలెతకదు, అలవాటుగా ఏ ప్రపంచీకరణనో నిందించదు, మనకింకేమో చెప్దామని తాపత్రయ పడదు. లేని గొప్పతనం ఆపాదించుకోదు, గిల్టునగలు తొడుక్కోదు. ఈ ఊసు కది అనవసరమని తెలుసేమో. ఈ నీళ్ళబాయి ప్రస్తుతం మనకున్న సోల్‌ వాటరు సోర్సు. ఓ గుక్క తాగి నాతోపాటుగా మళ్ళీ పదండి.

ఒక ఆలోచనొస్తుంది ఓ చిన్న ఊహనెంబడెట్టుకుని. దానికి జీవాన్నివ్వడం, పెంచి పెద్ద చేయడం, అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించి మనసుకో మేధకో మరి రెంటికీనో నప్పేటట్టు నిర్దిష్టమైన రూపాన్నీ గుణాన్నీ ఇవ్వడం లాంటి అందరు కథకులూ రొటీనుగా చెయ్యాల్సిన పనులేవో చేసేసుంటారన్న అపనమ్మకంతో శ్రీ ఆజాద్‌ కథలో బందీలైపోతాం. వచ్చిన ఊహను వచ్చినట్టు ప్రిమెచ్యూర్‌ డెలివరీ చేస్తే ఇలానే ఉంటుంది. సగటు రచయితలు చేయాల్సిన పనులు చేయడం చాతకాక కాదు, అలక్షంతో చేసుండరని నా నమ్మకం. కాస్త మంచి రచయిత అని మనమనుకుంటాం కదా అప్పుడప్పుడూ, అందుకని. ఈ కథ చెప్తున్న పాత్ర తన గురించి అంతలా చెప్పుకోవాల్సిన అవసరం కథకు ఏమిటి? ఉన్నట్టుండి చూపించిన ముగింపు అప్పటిదాకా చెప్పిన కథకు అతికిందా? కథావస్తువును పాత్రల సంభాషణలు లేదా ప్రవర్తనల ద్వారా విశదంగా చర్చించగలిగారా? పాఠకుని మదిలో ఆలోచనలు రేకెత్తించేలా కథ పదును పెట్టబడిందా? ఈ కథకు ఇంత నిడివి అవసరమా? ఈ కథలో ఏ పాత్ర ఎంత అవసరం, ఏది కాదు? ఈ కథ కాని కథ చాలా విషయాలనే చర్చకు లేవనెత్తుతుంది సంపాదకుల్చెప్పినట్టే. కాపోతే చర్చాంశాల్లో వారిచ్చిన లిస్టుకీ మన లిస్టుకీ సాపత్యమేమీ ఉండదు. అదీ వచ్చిన చిక్కల్లానూ.

ఇక, జెర్రీ వెంబడి పడే తొందర్లో ముందూ వెనుకా చూసుకోకుండా టైక్‌ చేతిలో చిక్కిపోయి, మొట్టికాయలూ పిడిగుద్దులూ తినేసే టామ్‌ గుర్తొస్తుంటాడు నాకు ఈ మధ్య వీ. చంద్రశేఖర్రావు గారి రచనల్చదివినప్పుడల్లా. అవసరం కోసం కన్న ఓ చిన్న పిల్లి తర్వాతో పెద్దపులిగా మారి మొదటికే మోసం తెచ్చినట్టు వీరి టెక్నిక్‌ ఓ భూతంలా పెరిగిపోయి, టైక్‌ టామ్‌ని ఆడించేసినట్లు, ఆయన్ని పెట్టే చిత్రహింసలు మనకీ తాకుతుంటై. ఇప్పుడిక్కడంత ప్రమాదం లేదు కానీ, అసలేం రాస్తున్నారో మనకర్థం అయ్యీ కాకముందే (తెలివైన రచయిత అని మనకో అభిప్రాయం ఉండడంతో ప్రయత్నిస్తాం గదా) ఈ కథలో ఉ.కొండయ్య ఉత్త పాత్రేనా? అంటూ మనకు సంపాదకుల ములుగర్ర పోటు, ఏదో హార్రరు సినిమా ప్రివ్యూ లాగా. సదరు ఉ.కొండయ్య గారు ఎవరైననూ పాఠకులకేమియునూ తేడా పడదని కలెక్టరుగారు గ్రామ ప్రజల కోసం వేయిస్తున్న చాటింపహో. (అయితే ఇదో సాకుగా తీసేస్కుని, ఏ టెక్నిక్‌ ఐనా సరే వాడ్డమే పెద్ద బ్యాడ్‌ అనీ, అలా రాయడం ఏ కొద్దిమంది విమర్శకుల మెప్పు కోసమో చేసే పని అనీ, అది ప్రజలకూ సమాజానికీ దూరం ఐపోడమేననీ కథాప్రయోజనాల గురించి ఊక దంచే విప్లవ ప్లావిత ప్లవంగాలను దూరంగా తరిమేయండి, యమర్జెంటుగా ఇప్పుడే).

పోతే, రామాయణం హరికథ రాత్రంతా చెప్పిన భాగవతారు కమ్యూనిజం వర్ధిల్లాలంటూ మంగళహారతందుకుంటే ఎంత అసంబద్ధంగా ఉంటుందో శ్రీ రమణజీవి కథ చదివితేగానీ తెలీదు. నలుగురు పాండవులు చదివి కొత్త గొంతూ కొత్త భావనలూ అని ముచ్చటపడి అభిమానం పెంచుకున్న మనకు కాస్త బుద్ధొస్తుంది. చాలా పొడూగ్గా ఏదో ఇంటర్‌ప్లానెటరీ యుద్ధంలో గ్లోబల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ లా సాగీ సాగీ ఈ కథ, చివరికి “అయితే.. దయాపూరిత మానవజాతి ఉద్భవిస్తుందని ఆశిద్దాం” అంటూ ముగించి మనల్నికూడా నిర్వీర్యుల్ని చేసేస్తుంది. అరాకొరా ఏమైనా మిగిలుంటే వెంటనే కథ ఏ ప్రేరణతో రాశారో శెలవిచ్చిమరీ నూటికి నూరు పాళ్ళ కల్తీలేని వంధ్యత్వం ప్రసాదిస్తుంది. అంత పెద్ద కథ రాసికూడా చివర్లో అదెందుకో చెప్పాల్సొచ్చిందంటే, ఇది రచయితకు మన మీదున్న నమ్మకమా, లేకపోతే తనపైనున్న గౌరవమా? ఏమైనా సరే ఇది విచారపడాల్సిన విషయం, మీకింకా ఓపిక మిగిలుంటేనే, సుమా! తప్పటడుగులేసే పిల్లలు తూలిపడ్డంలో తప్పు లేదు, చేయూతనిచ్చి లేపబుద్ధౌతుంది కూడానూ. మరి మద్దిమానుల్లా పెరిగినవాళ్ళు కూడా తూల్తుంటే? ఈ రచయితల బలమైన ఊహాశక్తినీ, ప్రతీకాత్మకతనూ మెచ్చుకుంటూ సంపాదకుల ముందుమాట చూస్తే ఉన్నట్టుండి ఏ బోడిచెట్టు కిందా కూచోకుండానే నాకొచ్చేసింది, ఎన్‌లైటెన్‌మెంటు! శ్రీ పాపినేని కథలో పిచికలు నిజం పిచికలు కావు. అవి సాహిత్య ప్రతీకలకి ప్రతీకలు. అంటే, మనం రక్షించుకోవాల్సింది పిచికల్ని కాదన్న మాట! ఎండేంజర్డ్‌ స్టేటస్‌ కావాల్సిందీ రావాల్సిందీ ప్రతీకలకి!! నౌ, ఐ ఫీల్‌ వెరీమచ్‌ లిబరేటెడ్‌!!

మోతాదుకు మించి మెలోడ్రామా, అస్తవ్యస్తపు ఆంత్రపోమార్ఫయిజేషనూ, మాండలికమూ గ్రాంధికమూ కలగాపులగమైన భాష, అనవసరమైన వర్ణనలూ చిత్రణలతో తన కథను తానే ఇంతలా బలహీనపర్చుకోడంలో ఏ ప్రయోజనం ఉంది?

ఈ కథామైదానం లో ఉన్న ఒక ఆముదపు చెట్టు శ్రీ అక్కిరాజు కథ అంటుకొమ్మ. సామెత కోసం అన్నమాట తప్పితే సదరు ప్రావెర్బియల్‌ చెట్టుకంటే ఓ జానెడో మూరెడో పొడుగెక్కువే ఉన్న కథ. కాసేపు ఆలోచింపచేసే కథ. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చే కథ. చెప్పదలచుకున్న విషయం పై గొప్ప నమ్మకమూ, చెప్పేయాలన్న తొందరపాటూ, చెప్పే తీరులో చూపించే అశ్రద్ధా శ్రీ అక్కిరాజు కథల్లో మామూలుగా కనిపిస్తుంటై. రచయిత ఉద్దేశం గొప్పది కాబట్టీ రచన కూడా గొప్పదే అనుకుంటున్నాడేమో అనిపించేటట్టన్నమాట (మొన్నెప్పుడో గుర్తు చేసుకున్నాం, వల్లంపాటి ఈ సమీకరణం తప్పు అని కథాశిల్పం లో అంటాడు గదా, అని). చెప్పదలచుకున్న విషయంపై అవగాహనే కాక చెప్పిన తీరులో కనపడే నిజాయితీ వల్ల ఈ కథలో అదంతగా కనిపించదు. మన ఎదురుగానే ఉండీ మనం గమనించని, గమనించినా గ్రహించని ఓ చిన్న విషయాన్ని తీసుకుని (కానీ దాని ఇంపాక్ట్‌ చాలా పెద్దది) దానికో మంచి పోలిక నివ్వడం, ఊహించలేని ముగింపుతో పాఠకుల్ని అబ్బురపరచడం, తద్వారా రాబోయే తరంలో చెరిగిపోబోయే ఇంకొక్క అసమానతని మనసుకంటేలా సరళంగా సూచించడం, పాత్రలతో పెద్ద పెద్ద ఉపన్యాసాలూ గట్రా ఇప్పించకపోవడం, సహజమైన సంభాషణలూ సన్నివేశాలూ, ఇలా మంచి లక్షణాలు చాలా ఉన్న కథే ఇది. వచనంలో కనిపించే మొనాటనీ, అక్కడక్కడా కొంచెం పక్కదారి పట్టడమూ చిన్న వీక్‌పాయింట్స్‌. ఈ కథలో పాత్రలు చాలా విషయాలే చర్చిస్తాయి తమ ప్రయాణంలో భాగంగా. అయితే, వాటిద్వారా తన అభిప్రాయాల్ని మనమీద రుద్దకపోవడంలో కథ పట్ల రచయితకున్న నిజాయితీ తెలుస్తుంది. రచయిత ఏ మాత్రం నిగ్రహం కోల్పోయి కథకు ఇంకేవో రంగులద్ద ప్రయత్నించినా ఈ అంటుకొమ్మ బతికేది కాదు (మళ్ళీ ఓసారి గొంతెత్తి అరుస్తాను, సాహిత్యంలో చెప్పే విషయమే కాదూ, చెప్పే తీరు కూడా ముఖ్యమే!). అంటే, ఈ రచయిత కథల్లో కనబడే లోపాలు క్రియేటివిటీ లేక కాదు, సాహిత్యపు మౌలిక లక్షణాలూ, రచనపై వాటి ప్రభావమూ అంటే ఉన్న నిర్లక్షం వల్లనే అన్న నా అనుమానం నిజమేనేమో. ఏమైతేనేం, కథనంలో కూడా తగినంత శ్రద్ధ చూపించి శిల్ప నిర్మాణంలో కృషి చేస్తే, మనం నమ్మకం పెట్టుకో(పెంచుకో)దగిన కథకుడు.

చివరిగా నేన్చదివిన ఆ మొదటి కథ శ్రీ డా. బోయ జంగయ్య గారి ఇప్ప పూలు. ఈ పూలు నమిలిన ప్రతివారికీ గన్నేరు పప్పుల ప్యాకెట్టు ఉచితం. ఈ సంకలనంలో కథలు చదివి ఎలా రాయకూడదో చాలావరకూ నేర్చుకోవచ్చు. ఈ కథల నెన్నుకున్నది కేవలం కథాసాహితి సంపాదకులేనా? కథల్లో ఇంత వ్యత్యాసం కనపడుతుంటే వీటన్నిటికీ ఒకే బైండింగ్‌ ఎలా ఇచ్చారు? ఇవ్వగలిగారు? నీళ్ళబాయికో అంటుకొమ్మకో కూసింత రెస్పెక్టిచ్చి కాసిన్ని కథలు తీసేయాల్సింది. కేవలం సానుభూతి కోసం పుట్టించిన పాత్రలూ, ఎబ్బెట్టుగా అతికీ అతకని పదాలూ భావాలూ, ఏ మాత్రమూ కుదింపూ సవరింపూ లేని రచనలూ. వస్తువును లోతుగా పరిశీలించి, చక్కటి భాషతో సజీవంగా మలచగల్గిన రచయితలు కూడా ఇలాంటి కథలు ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నారో వారికే తెలియాలి. ఇవా, చివరికి ఈ సంవత్సరం వచ్చినవాటిలో గొప్ప కథలు అన్న అనుమానం మనల్ని పీడిస్తుంది. మీకో సంగతి చెప్పనా? మనం చూస్తున్నది రోగ లక్షణాల్ని, కారణాన్ని కాదు. ఈ కథలకు బదులుగా ఇంకో పన్నెండు కథలేవో సంకలించినా పెద్ద తేడా ఉండేదనుకోను. ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా* కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.

* స్మగ్వినయము = A state of being smug about one’s apparent వినయము. (As usual, the word and the meaning are supplied by న్యూ సెంచురీ ఇంగ్లీష్‌టెల్గూ బైలింగ్యువల్‌ కాలేజియేట్‌ ఎడిషన్‌ ఆఫ్‌ సోకాల్డిక్షనరీ touted as a singularly unique dictionary with its title written exclusively and only in telugu).

ఇంకా ఉంది. పేజీలు: 1 2