ఈమాట » కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

Expand to right
Expand to left

కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

8

Hippolyta: This is the silliest stuff that ever I heard.
Theseus: The best in this kind are but shadows; and the worst are no worse if imagination amend them.
– In “A Midsummer Night’s Dream”Auden అంటాడు: “I find Shakespeare particularly appealing in his attitude towards his work. There’s something a little irritating in the determination of the very greatest artists, like Dante, Joyce, Milton, to create masterpieces and to think themselves important. To be able to devote one’s life to art without forgetting that art is frivolous is a tremendous achievement of personal character. Shakespeare never takes himself too seriously.”జీవితంలో చివరి క్షణం వరకూ సాహితీకృషిలో నిమగ్నమైనా కుటుంబరావు సాహిత్యమే జీవిత పరమార్థంగా భావించలేదు: ” మానవ జీవితంలో అనేక విషయాలకు అనేకరకాల ప్రాముఖ్యత ఉంది. అటువంటి వాటిల్లో సాహిత్యం ఒకటి. … సాహిత్యానికి పరిమితమైన ప్రాముఖ్యత ఉందని గుర్తించిన మీదట, దానివల్ల సాధించగలిగిన ప్రయోజనమేమిటో తేల్చుకుని, ఆ తరువాత … నిజమైన సాహిత్య లక్షణాన్ని అందరూ గుర్తించి తీరాలి. దానికి చిరత్వం లేదు. … సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది.”"నాకు ఒకటే ఆశయం — నా రచనలవల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండితీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనలమీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసిన వాణ్ణవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”

వితంతు వివాహాలు జరుగుతున్నాయి, బాల్య వివాహాలు ఆగిపోయాయి, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కుటుంబరావు రచనలు మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏమిటి?

స్త్రీ పురుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య, తరాల మధ్య, మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి. వీటికి మూలం మన కర్మలోనో, మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి. అవి వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది. ఆ గోడలు కూలినపుడు, వాటితోపాటు ఆయన రచనలూ కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పుడు కుటుంబరావు కన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు.

తెలుగు వాళ్ళ ఆలోచననే హత్య చేశాడని కుటుంబరావుని దోషిగా బోనులో నిలబెట్టారు. తీర్పు చెప్పాల్సింది పాఠకులు. ముద్దాయి ఎవరి దయా దాక్షిణ్యాలు కోరే వ్యక్తి కాదు. తీర్పు ఇచ్చేముందర, అతను పాఠకులని కోరేది ఒక్కటే - ఆలోచించమని.

పనికొచ్చిన పుస్తకాలు:

1. కుటుంబరావు సాహిత్యం, సంపుటాలు 2-6.
2. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యవ్యాసాలు.
3. నవీన్ సాహిత్యవ్యాసాలు.

ముందరి పేజీ(లు) 1 2 3 4 5 6 7 8


కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 14, 2008 1:46 pm

    “కొకు రచనా ప్రపంచం”

    సాహిత్యం గురించీ, దాని ప్రయోజనం గురించీ, నిర్దుష్టమైన అభిప్రాయాలుండి, జీవితంలో సాహిత్యానికున్న ప్రాముఖ్యత పరిమితమైనదని గుర్తిస్తూనే, దానికో ఉత్కృష్టమైన స్థానాన్నిచ్చిన వాళ్ళలో అగ్రగణ్యుడు కొడవటిగంటి కుటుంబరావు.

    కొకు శతజయంతి సందర్భంగా, విరసం ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని నిర్ణయించిందనీ, జనవరిలో మొదటి దఫాగా నాలుగు సంపుటాలూ, 2009 చివరికల్లా మిగిలిన పన్నెండూ వచ్చేస్తాయనీ, ఈ మధ్యనే ఓ ప్రకటనలో చదివాను. “చదువు” లాంటివి ఒకటీ అరా రచనలు తప్ప కుటుంబరావువి మిగిలినవి దొరకడం కష్టంగా ఉంది కనుక ఇది పుస్తక ప్రియులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

    దీంట్లో నాకు కొంత ఐరనీ కూడా కనిపిస్తుంది. నిజమైన సాహిత్యానికి చిరత్వం లేదని నొక్కి వక్కాణించినవాడు కుటుంబరావు. తన రచనల వలన పాఠకులలో కొంత సంస్కారం కలగాలనీ, సమాజంలో అలాంటి సంస్కారం పెరిగే కొలదీ తన రచనల అవసరం ఉండకూడదనీ, తన సాహిత్యం ఎంత త్వరగా మరుగునపడితే అంత మంచిదనీ గాఢంగా ఆకాంక్షించాడు. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కొకు రచనల అవసరం మనం గుర్తిస్తున్నామంటే, మన సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లా? లేక కొకు రచనల లోని సాహిత్యేతర లక్షణాలకోసం వాటిని చదువుతున్నామా? అదీకాకపోతే అసలు కొకు సాహిత్య ప్రయోజనం గురించిన ఆలోచనలో లోపముందా? అన్న సందేహాలొస్తాయి నాకు.

    శతజయంతి అంటే మరొకటి కూడా గుర్తొస్తుంది. తన షష్టిపూర్తి సందర్భంగా కొకు ఓ వ్యాసం రాశాడు - అయితే ఏమిటీ అని! పుట్టినరోజు ఉత్సవాలూ, ఊరేగింపులూ చాలా కృత్రిమమైన వేడుకలనీ, మల్లినాధసూరి కాళిదాసుకి శతజయంతులు జరపలేదు - వ్యాఖ్య రాశాడనీ, ప్రముఖ రచయితల గురించి కావాల్సింది అర్థంలేని పొగడ్తలు కాదు, విమర్శలు, అంటూ తన సహజ ధోరణిలో చాలా రాశాడు. అవన్నీ మనం ఆయన శత జయంతి సందర్భంగా చర్చించుకోడానికి ఈ “కొకు రచనా ప్రపంచం” చేతికొస్తుంది. చాలా చవక గూడాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    September 14, 2008 5:57 pm

    [ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. — పద్మ]

    హనుమ గారూ:

    మిమ్మల్ని అలాగే పిలవాలనిపిస్తుంది.

    కొకు రచనల పునః ప్రచురణల గురించి తెలియ చేసినందుకు సంతోషం!

    తన రచనల గురించి కొకు తన మాటల్లో: (’కారుణ్యం’ 1937, ముందు మాట)

    నాకు ఒకటే ఆశయం - నా రచనల వల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండి తీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసినవాణ్ణి అవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది, నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏ కోశానా లేదు.

    ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం రాస్తున్నానన్న అహంకారం కూడా నాకు లేదు. నేను ఆకాశం నుంచి ఊడి పడలేదు. నాకు పూర్వం కథలు రాసిన వారు ఎక్కడ విడిచి పెట్టారో నేను కథా రచనను అక్కడే అందుకోగలను కాని, అంతకు పైన ఎట్లా అందుకోగలను?

    తమ కథలు చదివి, ‘బాగున్నాయని’ విమర్శించమనే కథకులున్న ఈ రోజుల్లో, పైన చెప్పిన మాటలు ఆలోచించ తగ్గవి.

    సమాజంలో (ఏ సమాజమైనా) సాహిత్యానికి ఉన్న స్థానం సరిగ్గా గమనించిన వారిలో కొకు ఒకరు. సాహిత్య ప్రయోజనాలు గురించి కొకు అవగాహన అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికైనా సరేనని నాకు అనిపిస్తుంది.

    నేను TIFRలో Ph.D చేస్తున్న రొజుల్లో, J.R.D.Tata అధ్యక్షతన MGK Menon 60వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చెయ్యబడ్డ సభలో, అప్పటికి “భారతరత్న” రాని J.R.D. Tata మాట్లాడుతూ, “60వ పుట్టిన రోజుకే ఇంత హడావిడా! ఇలాంటి పుట్టిన రోజు నాకు 20 ఏళ్ళ క్రితం వచ్చింది. ఈ సభ అయిన వెంటనే మనం వెళ్ళి ఎవరి పని వారు చేసుకోవాలి” అన్నాడు

    కొడవళ్ల వారికి నమస్సులతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. baabjeelu అభిప్రాయం:

    September 24, 2008 8:59 am

    కొడవళ్ళ వారికి,
    కుటుంబరావుగారి రచనా ప్రపంచం వస్తుందన్న ఆనందం, నిజంగా ఆనందవేఁ.
    మాకందరికీ, ఇవాల్టికికూడా, మమ్మల్ని వుధ్ధరించడానికి, ఆలోచన రేకెత్తించే అక్షరం వస్తోందంటే, ” దేవ దేవ రమ్ము, కావుమయ్య మమ్ము” అని చిన్నప్పుడు చదువుకున్న పెద్దబాలశిక్ష మళ్ళీ చదువుకుంటున్నాం.
    “ఆయన” పుస్తకాలు, outdated అయిపోలేదు. అందుకు కారణం మేవేఁ. మేం మారం గాక మారం. అది మా దగుల్బాజీతనవేఁనని నా నమ్మకం. ఈసారైనా “ఆయన” అక్షరాలు, మాలో కొంతమందినైనా వుధ్ధరించాలని ఆశిస్తున్నాను.
    అయితే, “ఆయన” పేర సభలకీ మిగతావాటికీ తగలెట్టే ధనాన్ని, ఆయొక్క సభలకీ గట్రాలకీ తగలెట్టకుండా, “బోల్డు” పుస్తకాలూ అచ్చేసి, “ప్రెపెంచెం” మీదకొదిలేస్తే, “అ, ఆ” లు నేర్చుకొనేవాళ్ళు, ఆలోచింపచేసే “అ, ఆ” లని నేర్చుకుంటారు.
    అదేకదా “ఆయనకి” కావల్సింది. అదేకదా కాళిదాసుకి మల్లినాధసూరి చేసింది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a