కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?
5
Drives my green age; that blasts the roots of trees
Is my destroyer.
And I am dumb to tell the crooked rose
My youth is bent by the same wintry fever.”
– Dylan Thomas
కుటుంబరావు రచనల్లోకెల్లా పేరున్న నవల “చదువు”. కుటుంబ సంబంధాలని, సాంఘిక వాతావరణాన్ని గొప్పగా చిత్రీకరించాడు. “అనుభవం” నవలలో గూడ ఇవే ప్రధానంగా ఉన్నాయి. దీంట్లో ప్రధాన పాత్ర అయిన పార్వతి పుట్టుక నుండి చివరిదాకా సాగుతుంది. తెలుగు సమాజంలో జరిగిన మార్పులు, వాటితో మారిన మారకపోయిన పార్వతి జీవితం కేంద్రంగా, వివాహేతర సంబంధాలు, స్వతంత్రోద్యమంలో ప్రవేశించిన “పెద్ద మనుషులు”, ఉమ్మడి కుటుంబాలు చీలి వేరు పడటం, బిడ్డల పెంపకంలో మార్పులు, తరాల మధ్య జరిగే ఘర్షణ — ఇవన్నీ కళాత్మకంగా కలిపితే “అనుభవం”.
పార్వతి చిన్నతనం నుండీ జీవితం గురించి కాస్త ఆలోచన గలది. కుటుంబరావు చిన్నపిల్లల ఆలోచనలని వర్ణించడంలో సిద్ధహస్తుడు: ” చిన్న పిల్లలకు ఏమీ అర్థం కాదనుకుని పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఎవరో తన తల్లి గురించి మాట్లాడుతూ, “ఆవిడకేం? కుంతీదేవి” అనటం చిన్నతనంలో పార్వతి విన్నది.
నిజానికామాట ఆమెకు అప్పట్లో అర్థం కాలేదు. తరవాత కొంతకాలానికి, కుంతి అయిదుగురు కొడుకులను పెంచి పెద్దచేసిందని విని అందుకే తన తల్లిని వాళ్ళెవరో కుంతితో పోల్చారనుకున్నది. కానీ ఇంకా పెద్దయాక ఒకరోజున అకస్మాత్తుగా మరొక అర్థం స్ఫురించింది. తల్లిని గురించి ఆమె తలలో ఒక అనుమానం తలయెత్తి, రానురాను రూఢి అయింది. అయినా పార్వతి “షాక్” కాలేదు. నిర్వికారంగా వుండిపోయింది.”
పార్వతిని ఓ జమీందారు కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తారు. జమీందారు బస్తీలో ఎవర్నో ఉంచుకుని అక్కడే కాలం గడిపేస్తుంటాడు. కాంతయ్యకి కూడా తండ్రి బుద్ధులబ్బినయ్. కాని నిర్వికారంగా ఉండిపోయింది. ఎవరో బందువుల్లో మొగుడు పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవటం విడ్డూరంగా అనిపించి, ఆలోచిస్తే అదే బాగుందనిపిస్తుంది. “ఆమె చాలా దాంపత్యాలు చూసింది. కాపరానికి వచ్చిన కొత్తలో భార్య మొగుణ్ణి చూసినప్పుడల్లా చెప్పరానిదేదో జ్ఞాపకం వచ్చినట్టు ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక మొగుడు పిలిచినపుడల్లా మొహం రాయల్లే చేసుకుని, ముక్కుతూ, మూలుగుతూ, గొణుగుతూ లేచి వెళ్ళి ‘ఏమిటీ?’ అని దెప్పినట్టుగా అడుగుతుంది.” తనకో కూతురు పుడితే దాన్ని మొగుడు పేరు పెట్టి పిలిచేవాడికే ఇస్తాను అని నిర్ణయించుకుంటుంది.
అన్నల దగ్గరకి పురిటికోసం వచ్చిన పార్వతికి కొడుకు, నారాయణ, పుడతాడు. కాంతయ్య బస్తీలో మకాం వేసి విలాస జీవితం గడుపుతుంటాడు. ఉన్న ఆస్తి అంతా భర్త కాంతయ్య తగలబెడుతున్నాడనీ, కొడుకు జీవితం దుర్భరమవుతుందని పార్వతి కలత చెందుతుంది గాని, కోర్టుకెళ్ళాలంటే భయపడుతుంది. ఆమె తమ్ముడు లాయరు వెంకటేశ్వర్లు ప్రోద్బలంతో దావా వేస్తుంది. కాంతయ్య రాజీ కొస్తాడు; రావలసిన ఆస్తి రాయించుకుని పార్వతి పిల్లవాణ్ణి పెంచుతుంది.
అన్నల ఉమ్మడి కుటుంబం, దంపతులకు వేరే గదులు లేకపోవడం, తన వదినెలకి పరిశుభ్రత తెలియదని, తన కొడుకు అలాంటి వాతావరణంలో పెరగగూడదని వేరే ఇంటికి మారుతుంది. ఈ స్వేచ్చ పార్వతికి ఎంతో సుఖంగా ఆనందంగా గడిచిపోతుంది. తన కొడుకుని తీర్చిదిద్దాలని, వాడి నాన్న, తాతల బుద్ధులు ఎంత మాత్రమూ రాగూడదనీ, వాడి జీవితంలో తనకి చాలా పెద్ద స్థానం ఉండాలనీ ఆవిడ దృక్పథం.
కాని కొడుకు నానా కులాల స్నేహితులని ఇంటికి తీసుకురావడం ఆమెకు నచ్చదు. వాడి గురించి అనవసరమైన భయాలన్నీ పెంచుకునేది. ఇంతలో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చి, తన తమ్ముడు వెంకటేశ్వర్లు వాళ్ళ మామ నిక్షేపంలాంటి లా ప్రాక్టీసు మానేసి ఉద్యమంలో చేరతాడు. ఆయన వేంకటేశ్వర్లుని మాత్రం ఉద్యమంలోకి అప్పుడే దిగవద్దనీ, కాస్తా “ముందూ వెనకా” చూసుకోమనీ సలహా ఇస్తాడు. ఇది “చదువు” లో సంఘటనని గుర్తు తెప్పిస్తుంది. విచిత్రమైన విషయమేమిటంటే, పార్వతి భర్త కాంతయ్య గూడా ఖద్దరు కట్టి గాంధీ ఉద్యమంలో చేరతాడు.
కోడళ్ళని రంపపుకోతకి గురిచేసే అత్తలనీ, భర్తలు చావగొట్టినా పడి ఉండే భార్యలనూ చూస్తే పార్వతికి ఆశ్చర్యంగా ఉండేది. తన బ్రతుకు అలా కాకపోవడానికి కొంతవరకైనా తనకి ఆస్తిపై ఉన్న అధికారం అని ఆమెకు తోచదు.
పార్వతి భర్త కాంతయ్య చనిపోతాడు. తన అత్తగారిలాగే పార్వతికూడా ముండనం చేయించుకోదు. అందానికి లోటవుతందని కాదు; కొడుకు నారాయణ ప్రాణం విలవిలలాడుతుందని. కాని భర్తకు శాస్త్రోక్తంగా మాసికాలూ, తద్దినాలూ పెడుతూ వస్తుంది.
నారాయణ తల్లిని ద్వేషించకపోయినా, వాడు పెద్దయేకొలదీ కొంత సొంత ఆలోచన పెరిగి, తల్లి చెప్పినవాటిని ఖాతరు చెయ్యడు. తద్దినం నాడు వాడు మస్తుగా కాఫీ హోటల్లో తిని వస్తే, ఏం పనిరా యిదీ అంటే, తద్దినం పెట్టే ఆయన కూడా ఆ కాఫీ హోటల్లోనే తిన్నాడని చెప్తాడు. శ్రాద్ధం! అంటే శ్రద్ధగా పెట్టాలి, ఇంత అశ్రద్ధగా పెట్టకపోతేనేం? అంటుంది. వాడు “పోనీ. మానేద్దాం” అంటే చాచి చెంప పగలగొట్టింది. వాడు తన చెయి దాటిపోతున్నాడని, తను ఇచ్చిన శిక్షణ వృధా అని కుమిలిపోతుంది.
నారాయణకి సావిత్రితో పెళ్ళవుతుంది. వాడు పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవడం, నిన్నటిదాకా తనని అడిగినవన్నీ ఇప్పుడు పెళ్ళాన్ని అడిగి చేయించుకోవడం చూసి, ఇరవై ఏళ్ళ పాటు పెంచి పెద్దచేసిన తన కంటె, ఇరవై నిముషాలన్నా కాకుండా వచ్చిన ఈ బొట్టికాయ తన గద్దె మీద ఎక్కి కూర్చుందని, తనకి అన్యాయం జరిగిందని బాధ పడుతుంది. ఒకప్పుడు అలాంటి దాంపత్య జీవితాన్నే ఆదర్శంగా భావించిన పార్వతి ఆ విషయం మరచిపోతుంది.
వాళ్ళిద్దరూ మద్రాసులో కాపురం పెట్టి, “బుల్లి పార్వతి” పుట్టింతర్వాత, అక్కడకోసారి వెళ్తుంది. తను పిల్లని పెంచే తీరు వాళ్ళకి నచ్చదు. వాళ్ళు మరి అచ్చమాంబ పుస్తకాలు చదివి పెంచే వాళ్ళాయె. తన ఇంటికి తిరిగి వచ్చి “క్రిష్ణా! రామా!” అనుకుంటూ వేదాంతం ఆధారంగా ఆఖరి దశ గడుపుతుంది. చివరకి కొడుకుతో అన్న మాటలు: “నాకు ఒక్కటే విచారం నాయనా! నిన్ను ఎట్లా పెంచాలో చాతకాక దూరం చేసుకున్నా … మన అద్దెకున్న వాళ్ళబ్బాయి - ఆ తల్లీ కొడుకులు ఎంత ప్రేమగా ఉంటారు! వాళ్ళను చూస్తే ముచ్చటేస్తుంది.”
నవల మధ్యలో వున్న ఓ జీవిత సత్యం: “పై తరం వాళ్ళు కింద తరం వాళ్ళను అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తారు గానీ ఆ ప్రయత్నం ఫలించదు. కిందితరం వాళ్ళు పైతరాలను అర్థం చేసుకునేందుకు చెప్పుకోదగిన ప్రయత్నం చెయ్యరు. అది వాళ్ళకి చాలా అనవసరంగా తోస్తుంది. కాలం ఎప్పుడూ ముందుకే పోవటం అందుకు కారణం కావచ్చు. అయినా చిన్నవాళ్ళు కాలానికి ఎదురీదవలసిన అవసరం ఉన్నది. పార్వతి మనస్సు ఎట్లా పనిచేసేదీ అర్థం చేసుకుని నారాయణ విసుక్కునే వాడేగాని, తను దూరమయాక ఆవిడ జీవితంలొ ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నదో అర్థం చేసుకోలేదు.”