కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?
4
“పంచకళ్యాణి” నవల అయిదుగురు చదువుకున్న అమ్మాయిల వివాహ సమస్య గురించి. ఈ అయిదుగురూ ఎలా ఘర్షణ పడేదీ చివరకి వివాహజీవితంలో పొందవలసిన ఆనందం పొందలేకపోవటం చిత్రించాడు. వీళ్ళతోపాటు వాళ్ళ కుటుంబాలలో వున్న సంఘర్షణ గూడా ఉంది.సుశీల తండ్రి, సవతితల్లి సుందరమ్మలతో ఉంటుంది. పెద్ద కట్నాలిచ్చి చేసే స్తోమతు లేదు. సుశీలకి సుందరమ్మ గానుగెద్దు జీవితం చూస్తే జాలి - జీవితంలో ఏ చిన్న ఆనందమూ లేదు. తన జీవితం గూడా అలాగే అవుతుందేమోనని భయం. తెలివిగలది, చదువుకున్నది. కానీ, పై చదువుల చదవడం కన్నా పెళ్ళిచేసుకుని సుఖపడాలని కోరిక.నీతికీ ధర్మానికీ కట్టుబడి వున్న పిన్ని గొడ్డులా జీవిస్తుంటే, అన్నింటికీ తెగబడిన ఎదురింట్లో ఇంజనీరుగారు ఉంచుకున్న దుర్గాంబ అందలాలెక్కి ఊరేగుతుండటం చూసి చాతనయితే దుర్గాంబలాగా బతుకుతాను కాని చచ్చినా పిన్నిలాగా కాదని తీర్మానించుకుంటుంది.తండ్రి స్నేహితుడూ, వివాహితుడూ, పొగాకు వ్యాపారీ, ధనవంతుడూ అయిన రామకృష్ణరావుతో ప్రేమ సాగించి, గర్భవతవడంతో పెళ్ళిచేసుకోమని రామకృష్ణ ఊరు చేరి రెండో కాపురం పెట్టిస్తుంది. డబ్బుకు లోపం లేకపోయినా, భద్రత లేదు. రామకృష్ణ ఒక్కడే ఏదన్నా ఊరు వెళ్తే తన లాంటి సంబంధం మరొకటి పెట్టుకుంటాడేమోనని భయం.
లలిత అందమైనదీ, స్వతంత్రంగా బతకగలదీ. కాని, చిన్నప్పటినుండీ పెంచుకున్న పురుషద్వేషం వలన ప్రేమ అణగారిపోయింది. “ఆడదాన్ని కాళ్ళూ చేతులూ కట్టేసి, చావచితక కొట్టి, చీకటి కొట్లో వేసి పరిగెత్తమంటే ఏం పరిగెత్తుతుంది?” అంటుంది. జానకి, “నీదంతా చోద్యం పోనిద్దూ! నువు ఏకాలపు ఆడవాళ్ళను గురించి మాట్లాడుతున్నావ్?” మనం డిగ్రీలు తెచ్చుకున్నా మగాళ్ళకూ మనకూ తేడా తగ్గదంటుంది లలిత. రామారావుతో పరిచయం అవుతుంది. అతను ప్రేమను అనేకవిధాల వ్యక్తం చేస్తాడు; ఆమె సులభ సాధ్యురాలు కాదనుకుంటాడేగాని లలితలో ప్రేమించే గుణంలేదని తెలుసుకోలేడు — పెళ్ళయిందాకా! “పెళ్ళయినాక మగవాళ్ళంతా మీలాగే మారుతారు” అని లలిత ఎప్పుడూ సాధిస్తూంటుంది.
లక్ష్మి పెద్దన్న భాస్కరం, వదిన సావిత్రి, చిన్నన్న శీతారాం లతో ఉంటుంది. సినిమా తార కావాలని ఆశ. అలాగయితే డబ్బూ, కీర్తీ వస్తుందని పెద్దన్నకీ, అవినీతీ, అపఖ్యాతీ వస్తాయనీ చిన్నన్నకి వేర్వేరు అభిప్రాయాలు. సీతారాం మాత్రం సినిమాస్టార్లతో స్నేహం చేస్తాడు. లక్ష్మి స్నేహితురాలయిన ఇందిర అక్క సినీ తార; వాళ్ళింట్లో సంసార బంధాలన్నీ తారుమారు. ఇందిర అక్క భర్త, ఇంట్లో జరిగే వ్యభిచారానికి అనవసరంగా రభస చెయ్యకుండా డబ్బు చూసుకుని “సుఖంగా” బతుకుతుంటాడు. కష్టమైతే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళమని భార్య సూచన. లక్ష్మి తన ఇంట్లో అన్నయ్య వదినని హీనంగా చూడటంతో పోల్చి, ఒకే సంఘంలో రెండు రకాల సమాజాలున్నాయని ఆశ్చర్యపోతుంది. కాని పోషించే వాళ్ళు అధికారం చెలాయించడమే రెండు ఇళ్ళలోనూ జరుగుతుంది.
“మేడలూ, మిద్దెలూ అక్కర్లేదు. ఒక చిన్న కుటీరంలో సంసారపక్షంగా” కాలం వెళ్ళబుచ్చడం ఒక కలగా ఎందుకుండాలనుకుంటుంది. చివరకి జానకి వదిలేసిన మొగుడు పెళ్ళిచూపులకొస్తే, ఛీ అనుకుని, అప్పటిదాకా తను చాలా తేలిగ్గా చూసిన జానకి అన్న కమలాకరాన్ని చేసుకుంటుంది.
తాయారు విశ్వనాథం గారి కూతురు. ఆమెకు పిల్లలంటే భయం. తన వదిన పార్వతి మెడకి పిల్లలు ఎలా గుదిబండలయారో చూసి, పెళ్ళయి పదేళ్ళదాకా పిల్లలు కలగకుండా హాయిగా బతకాలనీ, అత్తగారూ ఆడబిడ్డలూ చేరి నెల నెలా వేధిస్తారేమోననుకుంటుంది. లలిత అన్న నారాయణని చేసుకున్న రెండు నెలలకే నెల తప్పుతుంది!
జానకి అత్తగారూ, ఆడబిడ్డలూ లేకుండా చూసి మొగుణ్ణి కట్టుకోవాలని, ఒక వేళ వున్నా, వేరే కాపురం పెట్టాలనీ కోరుకుంటుంది. బంధువుల ప్రయత్నంతో ఒడ్దు, పొడుగూ, ఆస్తిపాస్తులూ వున్న లెక్చరర్ సుధాకర్ “స్మార్ట్ గానే కనిపిస్తున్నాడు,” ఏ వంకా లేదని పెళ్ళికి ఒప్పుకుంటుంది. కాపురానికి వెళ్ళి విచిత్రమైన ప్రపంచంలో అడుగుపెడుతుంది. సుధాకర్ పిన తల్లులూ, అక్క చెల్లెళ్ళు చాలా మంది కలిసి జీవిస్తుంటారు. వాళ్ళకి ఇతరులని ప్రతిదానికీ విమర్శించటం హాబీ.
జానకి వాళ్ళ అనాగరిక ప్రవర్తనని ప్రశ్నించడం, దానికి సుధాకర్ ఓ యజమానిలా కోపగించి, జానకికి sense of humor లేదని తిట్టడం తో భార్యా భర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఆ ఇంట్లో సంస్కారం గల ఒకే ఒక మనిషి చలపతితో ఆవిడకి అక్రమ సంబంధం కట్టపెట్టడంతో జానకి పుట్టింటికొచ్చి వుద్యోగం చూసుకొంటుంది. జీవితంలో ఇంతకుముందులేని స్వేచ్ఛ, ఆనందం కనబడతాయి.
ప్రతి వాళ్ళకీ వివాహం ఒక సమస్య కావడం, అంతా చదువుకున్న వాళ్ళే అయినా ఎవరికీ వివాహ జీవితం గురించి సరయిన అవగాహన లేకపోవడం, అనేక మధ్యతరగతి కుటుంబాలలో ప్రేమ కొరవడటం కుటుంబరావు ఈ నవలలో చిత్రీకరించాడు. కుటుంబరావుకి సామాజిక చిత్రణ ముఖ్యం. మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో స్త్రీలకున్న తక్కువ స్థానాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించాడు:
“పార్వతి వెర్రెత్తిపోయి అంటుంది: “పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా పిల్లలకు చచ్చే చాకిరి చెయ్యటానికి తప్ప మరి దేనికీ పనికిరాను. ఆయనా, ఆ పిల్లలూ ఇంటి యజమానులు, నేను దాసీదాన్ని. ఛీ ఛీ!” తాయారు యింకొకందుకు కూడా పార్వతిని చూసి జాలి పడేది. ఒక చెంప పిల్లలకూ, మొగుడికీ మధ్య నలిగి తిట్లు తింటూ మొగుడు పక్కలోకి రమ్మంటే రావాలి. అది ఏం సుఖం? ఏ మాత్రం కుళ్ళు కనిపించినా కూరలూ, పళ్ళూ అవతల పారేస్తాం గదా, సంసారంలో కుళ్ళు మాట ఏమిటి?”
“ఒకనాడు సావిత్రి కాలిమీద మరచెంబు పడి రెండు వేళ్ళు చితికి రక్తం వరదలు కట్టి పారింది. ఆ సాయంకాలం ఇంటికి వచ్చి శంకరం ఆ విషయమే విచారించలేదు. పైపెచ్చు ఆమె కుంటుతూండటం చూసి, “ఈ భాగ్యానికేనా కుంటుతున్నావు?” అని అడిగాడు. నన్ను ప్రేమగా చూడు, నన్ను దయగా చూడు! నా మనస్సు నిష్కారణంగా నొప్పించకు, అని ఆడది మొగుణ్ణీ ఎట్లా అడుగుతుంది?”
ఒకప్పడు సంఘ సంస్కరణలో పాల్గొన్న విశ్వనాథం గారు, జానకి భర్తనొదిలేసి వస్తే, “ఈ కాలపు ఆడపిల్లలు ఇలా ఎందుకై పోతున్నారో నాకు బోధ పడదు. వీళ్ళు అతి చిన్న కష్టాలను కూడా కొండంత చేసుకుంటారు. కాస్తయినా సహనం లేదు. అందరూ బతికినట్టు బతకటం నామోషీ అనుకుంటారులాగుంది! బతుకులన్నీ మల్లెపూల పాంపులాగా వుండాలంటే అది సాధ్యమా? కష్టాలుంటే భరించొద్దూ? వెనకటి వాళ్ళిలాగే వుండేవాళ్ళా? మిన్ను విరిగి మీదపడ్డా చలించేవాళ్ళు కారు!”
కుటుంబరావొకచోట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారితో మాట్లాడాక, తన రచనాధోరణి మారిపోయిందన్నాడు. “ఆడవాళ్ళు మాట్లాడుకునేవి వినవోయ్, అసలైన తెలుగు వస్తుంది” అన్నారట శ్రీపాద. మచ్చుకొకటి:
“ఆ ఆడమనిషి ఒక వాక్యం ఆశ్చర్యార్థకంగా మాట్లాడితే, ఇంకోటి ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది — “అదే నయమవుతుంది! నయం కాదూ? డాక్టరు రోజూ వచ్చి చూస్తున్నాడు గదా! చూడడూ మరీ. అద్దె నూరు రూపాయలా? అంతేనమ్మా, చౌకగా కొంపలు దొరకవు!”