ఈమాట » కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

Expand to right
Expand to left

కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

2

“But I do think it is their husbands’ faults
If wives do fall: say that they slack their duties,
And pour our treasures into foreign laps,
Or else break out in peevish jealousies,
Throwing restraint upon us; or say they strike us,
Or scant our former having in despite;
Why, we have galls, and though we have some grace,
Yet have we some revenge. Let husbands know
Their wives have sense like them: they see and smell
And have their palates both for sweet and sour,
As husbands have. What is it that they do
When they change us for others? Is it sport?
I think it is: and doth affection breed it?
I think it doth: is’t frailty that thus errs?
It is so too: and have not we affections,
Desires for sport, and frailty, as men have?
Then let them use us well: else let them know,
The ills we do, their ills instruct us so.”
– Emilia in “The Tragedy of Othello”

“మొగాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి” అంటూ రంగప్రవేశం చేసింది ఆధునిక తెలుగు సాహిత్యంలో కెల్లా అపూర్వసృష్టి అయిన, గురజాడ మనోనేత్రం నుండి ప్రభవించిన మధురవాణి. స్త్రీ స్వేచ్ఛ కోసం, వివాహవ్యవస్థని చీల్చి చెండాడుతూ ధ్వజమెత్తాడు చలం: “ఒక్క నిమిషం నాకు విశ్రాంతి నివ్వక మహాప్రణయమారుత వేగాలమీదనో, అగాథ వియోగభారం క్రిందనో చీల్చి నలిపి ఊపిరాడనీక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదికతం.” చలం విప్లవ భావాలను మెచ్చుకుని, ఆయనని “జీనియస్” గా పొగిడిన కుటుంబరావు, చలం తరవాత రమణాశ్రయం నుండి రాసిన musings లోని విషయాలను విమర్శించాడు.

“స్త్రీ మోహం కన్న వుత్తమమయింది, వాంఛనీయమయింది యీ లోకంలో ఏం వుంది? ఆత్మ సామ్రాజ్యం - అనేదేవుంటే అది. లేకపోతే స్త్రీ సామ్రాజ్యం. ఈ రెండే. ఇంకేవీ లేవు. వీటి ముందు తక్కినవి దుమ్ము…. ఈ దేశంలో అన్ని ఆనందాలూ నశించాయి. వున్న అందాలన్నీ చాలా త్వరగా వొదిలిపోతున్నాయి. “భోజనం, పాలిటిక్స్” రెండు మిగిలాయి. అందువల్లనే ప్రజలకి కూడూ గుడ్డా అని అల్లాడతారు నాయకులు.” అని చలం మ్యూజింగ్స్ లో రాస్తే, ఈ “రసమయ జీవులు” లేక elegant souls, ప్రణయానికి మించిన యదార్థ జీవిత సమస్యలు వీళ్ళని బాధించవంటూ కుటుంబరావు విమర్శించాడు. గాడిదకేం తెలుసు గంధప్పొడి వాసన అన్నట్లు, మార్క్సిస్టయిన కుటుంబరావుకేం తెలుసు భగవాన్ లీలలూ, రసమయ జీవన సౌందర్యాలూ అనొచ్చు కొందరు!

రసమయ జీవితం సంగతేమో కాని, ప్రతివారికీ ప్రేమ కావాలి. కాని ఈ ప్రేమలో అనేక రకాలూ, రూపాలూ ఉన్నాయని, శరీర ఆకర్షణేకాక, మమత, ఆపేక్ష, అనురాగం, సానుభూతి ఇవన్నీ ప్రేమలో భాగాలనీ, దీని వెనక ఆర్థిక, సామాజిక కారణాలుంటాయని, కుటుంబరావు అనేక రచనలలో చూపించాడు. ఆ విధంగా చలంతో విభేదించి విస్తృతంగా రాశాడు.

తెలుగు సాహిత్యం మీద చలం ప్రభావం అపారంగా ఉందని కీర్తించిన రారా, చలం రచనల్లో కనిపించే ప్రేమకూ, కుటుంబరావు రచనల్లోని ప్రేమకూ వున్న తేడాని విపులంగా చూపెట్టాడు.

కుటుంబరావు రాసిన “కురూపి” అనే గల్పికలో, కురూపి తన భర్త స్నేహితుణ్ణి ఆకర్షించే ప్రయత్నంలో అంటుంది: “ప్రేమలూ, గీమలూ చెప్పకండి. ఒకటే ప్రేమ ఉంది ప్రపంచంలో - పరమ కురూపికి నవమన్మధుడి మీదా, నవ మన్మధుడికి కురూపి మీదా కలిగే ప్రేమ! అది అంటుకుంటే చల్లారదు. ప్రపంచాన్ని భస్మం చేస్తుంది. మిగిలిన ప్రేమలన్నీ ఇస్తివాయినం. పుచ్చుకుంటి వాయినం!”

ఆ స్నేహితుడు తనని ఒంటరిగా ఉన్నపుడు దగ్గిరకు తీసుకుంటే, చిరునవ్వు నవ్వి, “చాలు, చాలు! నా అభిప్రాయం ఇదికాదు. మా వారికి నన్ను చూస్తే ఒక దురభిప్రాయం. నేనెవ్వరికీ అక్కర్లేదని. నన్ను వీధిలో పారేస్తే నల్ల కుక్కయినా ముట్టదని. ఈయన పొరపాటు పడ్డట్టు కనిపిస్తుంది… దేవుడల్లే వచ్చి నా అనుమానం తీర్చావు. నన్ను బాధించకు. నాకు మా వారిమీద తప్ప మరెవ్వరిమీదా భ్రమ లేదు.” అన్నది.

చలం చెప్పే ప్రేమ “అంటుకుంటే చల్లారదని”, అది కేవలం శరీరాకర్షణ కాకపోయినా, దానిని ప్రకృతి సిద్ధమనీ, అదొక దైవిక శక్తి అన్నట్లుగా చలం చిత్రిస్తే, కుటుంబరావు చెప్పే ప్రేమకి ఆపేక్షా, మమకారాలు ముఖ్యమనీ రారా అభిప్రాయపడ్డాడు.

అందవిహీనతని ముఖ్యాంశంగా తీసుకున్న నవల “కురూపి”. సరస్వతి తనని బస్సులో చూసి నవ్వినందుకు కనకం ఆమెను వెకిలిదనుకుంటాడు. తన స్టాపులోనే దిగితే, “ఇది నన్ను పట్టుకుందేమిటి?” అనుకున్నాడు. “మా ఇల్లు దగ్గిరే, రండి పోదాం” అంటే, ఆమె సాహసానికి నిర్ఘాంతపోయి, “ఆమె అభిప్రాయం ఏమిటి? ఏ ఆడ కుక్క చూపుడువేలు ఆడించినా తాను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనా?” అనుకుంటాడు.

కనకం వెటకారంతో “వద్దునుగాని నాకు మరో చోట ఎంగేజ్మెంటున్నది” అంటూ చేతిలో వున్న కాగితం ముక్క చూపిస్తే, ఆమె దానిని చూసి “ఇదే మా ఇల్లు” అంటుంది. దానితో గట్టి దెబ్బ తిన్న వాడై, “నేనెవరో తెలుసన్న మాట!” అంటాడు. “మీరెవరో తెలియకుండానే మా యింటికి ఆహ్వానించా ననుకున్నారన్న మాట” అని గొప్ప దెబ్బ తీస్తుంది.

ఆదెబ్బతో శిఖండి చాటునుంచి అర్జునుడు భీష్ముణ్ణి కాలసర్పంలాటి బాణం వేసి కొడుతూ ఆపేక్షగా నవ్వితే భీష్ముడికెట్లా ఉండి ఉండునొ కనకానికి అర్థమవుతుంది.

సరస్వతి ఎమ్మే చదివి లెక్చరరుగా పనిచేస్తున్నదని తెలిసి ఆమె మొహం చూస్తే ఇప్పుడామెలో ఎమ్మే జాడలూ, లెక్చరరు కవళికలూ కనకానికి కనిపించాయి. సరస్వతిని కలిసిన ప్రతి సారీ, ఆమెలోని అనాకారి తనం తగ్గిపోవడం, హృదయ సౌందర్యం పెరగడం అనుభవం లోకొస్తాయి — ఇల్లు చక్క పెట్టుకోవడం, అన్న వదినల పిల్లల్ని ఆపేక్షతో పెంచటం, వాళ్ళలో ఒక పిల్ల హఠాత్తుగా చనిపోవటంతో అందుకు తాను లేకపోవడమే కారణమని కుమిలిపోవడం, ఇవన్నీ ఆమె హృదయ సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని తెలుపుతాయి. కనకం ఆమెకి దగ్గరయి ప్రేమలో పడతాడు. చివరకి గాఢ నిద్రలో సరస్వతి అతని డొక్కలోకి దూరితే తాను సరస్వతికి తల్లి అయినట్లుగా తోచి కనకానికి నవ్వొస్తుంది.

ఈ నవలలో సరస్వతి కనకం ప్రేమకోసం చేసిందేమీ లేదు. తను అనాకారినని, తననెవరూ ప్రేమించరనే ఆత్మన్యూనతా భావంతో తనకెవరి ప్రేమా పొందే అవకాశం లేదనే నిర్లిప్తత అలవరచుకుంది. కాని ఆమే తన ప్రేమనంతా తన అన్న పిల్లలమీద చూపెట్టి ఆవిధంగా గాఢమైన ఆపేక్ష పెంచుకుంటుంది. ఇదే ముఖ్యంగా కనకాన్ని కట్టేస్తుంది.

మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటి మాత్రమే అని, స్త్రీ పురుషుల మధ్య గోడలు పడిపోతే అలాంటి అనుభూతులకి అవకాశాలు, విలువ పెరుగుతాయనీ, సరస్వతి పాత్రని కనకం పాలిటి అంతరాత్మలాంటిదిగా చిత్రించాననీ, అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలు చిన్నతనం నుండీ తనకు తెలుసనీ, మరి ఈ కాలపు యువకుల ఉద్దేశం మాత్రం తనకు తెలియదనీ కుటుంబరావే చెప్పాడు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8