కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?
The good is oft interred with their bones,
So let it be with Caesar …
..
Bear with me;
My heart is in the coffin there with Caesar,
And I must pause till it come back to me.”
– Anthony in “Julius Caesar”.
నేను అమెరికా వచ్చి పాతికేళ్ళు కావస్తోంది. నన్నెరిగిన వాళ్ళంతా నేను బుద్ధిమంతుణ్ణనీ, ఏ తగాదాల్లోకీ తలదూర్చననీ అనుకుంటారు. కాని వాళ్ళలో తెలుగు వాళ్ళు బహు తక్కువ మంది; ఎవరితోనూ సాహిత్యమనేది చర్చలోకి రానే రాదు. నడి వయసు దగ్గరపడేకొలదీ నాలో కనుమరుగవుతున్న “తెలుగుదనం” కోసం తాపత్రయపడి, పోయినేడు తానా సభలకి వెళ్ళాను, రచ్చబండలో చర్చల్లోకి దిగాను. దానితో నా నిజస్వరూపం బయటపడింది. అందరికన్నా ముందు ఇది మా ఆవిడే కనిపెట్టింది - అయినదానికీ కానిదానికీ గొడవలు కొని తెచ్చుకోటం.
కొడవటిగంటి కుటుంబరావు మన తెలుగువాళ్ళ ఆలోచననే హత్యచేసిన వాళ్ళలో ఒకడు అని రచ్చబండ సభ్యులొకరు ఆరోపించారు. ఎంత విరసం ఉపాధ్యక్షుడైనా అంత ఘోరం చేశాడా అని నేను కాస్త కటువుగానే రుజువు చేయండన్నాను. కుటుంబరావు రాసిన కొన్ని వేల పేజీల నుంచి ఒక “వాక్యం” సాక్ష్యంగా చూపెట్టారు. హత్యా నేరానికి ఆధారం అంతేనా అన్నా. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చూస్తే చాలదా అన్నట్లు చూశారు. ఇంకేమన్నా ఉన్నాయా అని అమాయకంగా అడిగా. చుట్టూ చూడండి, మీకే తెలుస్తుంది అన్నారు. నా చుట్టూ చెట్లూ, చేమలూ, చెరువూ, రావణాసురిడి కాష్ఠంలా కాలే Mount Rainier అనే అగ్నిపర్వతశిఖరమూ కనిపించాయి. కళ్ళజోడు సరిచేసుకొని చూస్తే కుటుంబరావు సాహిత్య సంపుటాలు కూడా కనిపించాయి.
కుటుంబరావు సాహిత్యాన్ని విమర్శే గాదు, పరామార్శ గూడా చేసే అర్హత నాకు లేదు. అయినా ఇదెందుకు రాస్తున్నానంటే, శాంతం గారన్నట్లు మనసులో వున్నది కాగితం మీద పెడితే మనసు కుదుటపడుతుందని, కాస్త నా ఆలోచన పెరుగుతుందనీ.
సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలని పెద్దవాళ్ళు చెప్పారు. కాని వడ్డెర చండీదాస్ అన్నట్లు, “కేవలం అద్దప్పెంకు మాత్రమే ఐతే అక్షర చాయాగ్రహణ ఐ వూరుకుంటుంది. రవ్వంతకూడా ఆలోచన రేకెత్తించని రచన, శుద్ధదండుగ.” Hamlet పాత్రధారులకి తమతమ పాత్రలు ఎలా అభినయించాలో సలహా ఇస్తూ అన్నమాటలు గుర్తొస్తాయి: “The end of playing, both at the first and now, was and is, to hold as ’twere the mirror up to nature: to show virtue her feature, scorn her own image, and the very age and body of the time his form and pressure.” Mirroring and “holding up a mirror”, ఈ రెండిటికీ చాలా తేడా ఉందని, ఒకటి జడ పదార్థమైన అద్దం లక్షణం అయితే, మరొకటి దాని వెనక వున్న కదలికతో కూడిన హస్తాన్ని తెలుపుతున్నాయని ఎక్కడో చదివాను. ఈ ఉపమానాలతో తలనొప్పి వస్తోంది:
Would be a more restricted employment by authors of simile and metaphor.
Authors of all races, be they Greeks, Romans, Teutons or Celts,
Can’t seem just to say that anything is the thing it is but have to go
out of their way to say that it is like something else.
…
Then they always say things like that after a winter storm
The snow is a white blanket. Oh it is, is it, all right then, you sleep
under a six-inch blanket of snow and I’ll sleep under a half-inch
blanket of unpoetic blanket material and we’ll see which one
keeps warm.
And after that may be you’ll begin to comprehend dimly
What I mean by too much metaphor and simile.”
– Very Like a Whale, Ogden Nash.
వర్ణనలూ, ఉపమానాలూ లేకుండా సూటిగా చెప్పే శైలిలో రాసిన వాళ్ళలో ప్రముఖుడు కుటుంబరావు. సాహిత్య ప్రయోజనం గురించి ఆయన అన్న మాటలు ఇందుకు ఓ తార్కాణం: “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, సాహిత్యం చెయ్యగల ఉత్తమకార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం.” మరి జీవితం అనేది విస్తృతంగానూ రకరకాలుగానూ ఉంది. కుటుంబరావు దాన్నెంతవరకు స్పృశించాడో కొంతైనా చూపెట్టాలని ఈవ్యాసం ఉద్దేశం.