మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
కర్ణాటక సంగీతంలో వీణది విశిష్టమైన స్థానం. పాతకాలపు గొప్ప విద్వాంసులలో కన్నడిగులైన శేషణ్ణ, సుబ్బణ్ణ, దొరెస్వామి అయ్యంగార్, తమిళులైన కారైక్కుడి సాంబశివ అయ్యర్, ధనమ్మాళ్, కుప్పయ్యర్, తెలుగువారిలో తూమరాడ సంగమేశ్వరశాస్త్రి, వెంకటరమణదాసు, ఈమని అచ్యుతరామశాస్త్రి, అయ్యగారి సోమేశ్వరరావు తదితరులుండేవారు. తరవాతి తరంలో ఈమని శంకరశాస్త్రి, వాసా కృష్ణమూర్తి, చిట్టిబాబు, పప్పు సోమేశ్వరరావు, అయ్యగారి శ్యామసుందరం మొదలైనవారు వీణలో విశేషమైన కృషి చేశారు. ఇప్పటి తరం వినగలిగిన వీణ విద్వాంసులలో అగ్రస్థానం నిస్సందేహంగా ఈమని శంకరశాస్త్రిగారిదే.

దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే. పబ్లిసిటీ దృష్య్టా రవిశంకర్ వంటివారిని మించిన కళాకారు లెవరూ లేరని సామాన్యులకు అనిపించడం సహజమేమో కాని వాద్య సంగీతంలో శంకరశాస్త్రిగారితో పోల్చదగిన వ్యక్తులు ఆనాడూ, ఈనాడూ కూడా చాలా తక్కువమందే కనిపిస్తారు. గమక విన్యాసంలోనూ, రాగ ప్రస్తారంలోనూ ఆయనది అద్వితీయమైన ప్రతిభ. కారణాలేవైనప్పటికీ ఇంత గొప్ప కళాకారుడికి రావలసిన ఖ్యాతిలో వెయ్యోవంతు కూడా లభించలేదనడం అతిశయోక్తి మాత్రం కాదు.
ఈమని శంకరశాస్త్రి 1922లో సెప్టెంబర్ 23న ద్రాక్షారామంలో జన్మించారు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. (బాలమురళీకృష్ణ చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రిగారు తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.
ఆయన 1942-50 మధ్యలో మద్రాసులోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయాడు. 1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకుడుగా పరిచయం చేసినది శాస్త్రిగారే. చంద్రలేఖ, బాలనాగమ్మ వగైరా సినిమాల తరవాత తరవాత రాజేశ్వరరావు ఆ సంస్థనుంచి తప్పుకున్నారు. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. టైటిల్స్‌లో సంగీతదర్శకుడుగా ఆయన పేరు ఎక్కడైనా వేశారో లేదో కూడా అనుమానమే. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారంటే గిట్టని తమిళ గ్రూపు ఒకటి తయారైంది. జెమినీ స్టూడియోస్ అధినేత ఎస్.ఎస్.వాసన్ తదితరులు ప్రతిరంగంలోనూ తెలుగువారిని అణగదొక్కటానికి ప్రయత్నించేవారట. వాసన్ మాయలో పడవద్దని శంకరశాస్త్రిగారికి మిత్రులు సలహా ఇచ్చినా ఆయన మొదట్లో పట్టించుకోలేదు. ఆయనది సంగీత ప్రపంచమే తప్ప డొంక తిరుగుడు వ్యవహారం ఉండేది కాదు. అప్పటికే అద్భుతమైన పాండిత్యం ప్రదర్శిస్తున్న శంకరశాస్త్రిగారు కచేరీ లివ్వకుండా జెమినీలో ప్రతిరోజూ సాయంత్రాలు రికార్డింగ్ ఏర్పాటు చేసేవారట. సీతారామ కల్యాణం (రావణుడు వీణ వాయించే ఘట్టం), వెంకటేశ్వర మహత్యం (సరస్వతి “వాచస్పతి” రాగం వాయించే సీను) మొదలైన కొన్ని తెలుగు సినిమాల్లో శాస్త్రిగారి వీణ వినబడుతుంది. 1959లో శాస్త్రిగారు సినిమాల్లో మానుకుని మద్రాసు ఆలిండియా రేడియోలో చేరారు. అక్కడ కూడా ఆయన ప్రతిభ కొందరికి ఇబ్బంది కలిగించడంవల్లనేమో కాని ఆయనకు 1961లో ప్రమోషనిచ్చి ఢిల్లీకి బదిలీ చేసేశారు. దానితో దక్షిణాదిలో ఉన్న ఆయన అభిమానులకు వీణ కాస్తయినా వినే కాస్త అవకాశం తగ్గిపోయింది.
ఈమని శంకరశాస్త్రి గారి వీణ శైలి అద్భుతమైనది. ఆయన తన వీణకు ఎలక్ర్టానిక్ పికప్ వాడేవారు. అందువల్ల తీగలను ఎంత నాజూకుగా మీటినా అతి సున్నితమైన సంగతులు కూడా స్పష్టంగా వినబడేవి. ఆ కారణంగా ఆయన ప్రతిరాగాన్నీ చక్కని గమకాలతో ఎంతో అందంగా వాయించేవారు. ఉస్తాద్ విలాయత్‌ఖాన్ సితార్ మీద గాత్రంలో పలికించినట్టుగా గమకాలను వినిపించడంలో దిట్ట. ఆ విధంగా విలాయత్‌ఖాన్ ప్రవేశపెట్టిన సితార్ గాయకీ శైలికి ఎంతో ప్రత్యేకతా, ప్రాముఖ్యతా ఏర్పడింది. అందుకు ఏ మాత్రమూ తీసిపోని పద్ధతిలో ఈమని శంకరశాస్త్రిగారు వీణ వాయించేవారు. శాస్త్రిగారికి విలాయత్‌ఖాన్ లాగే తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ అవే సంగతులను వీణమీద పలికించే అలవాటుండేది. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు “ప్రజా”వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా డబుల్ మీటు వేసేవారు. ఇక కుడి చేత్తో ఆయన తీగలను మీటే పద్ధతి కూడా చాలా గొప్పగా ఉండేది. సందర్భాన్నీ, అవసరాన్నీ బట్టి ఆయన తన కుడి చేతి పొజిషన్‌నూ, తీగను మీటే స్థానాన్నీ నాలుగైదు రకాలుగా మార్చేవారు. ఆయన పలికించిన తానం అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో స్వరాలను అత్యద్భుతంగా వాయించేవారు. మామూలుగా ఉండే మూడు తాళం తీగలే కాక మరొక రెండు ఏర్పాటు చేసి, వాటిని రాగంలోని స్వరాలకు శ్రుతిచేసి మొత్తం మీద ఒక ఆర్కెస్ర్టావంటి ప్రభావాన్ని కలిగించేవారు. కేవలం ఒక్క వీణతోనే గానమూర్తి మొదలైన రాగాలను ఎంతో డ్రమటిక్‌గా, పెద్ద సింఫొనీ స్థాయిలో వాయించేవారు. ఈ టెక్నిక్‌ల మాట ఎలా ఉన్నా సంగీతకారుడుగా ఆయనది ఎంతో పరిక్వత చెందిన మేధస్సు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా, ఎటువంటి వెకిలితనమూ లేకుండా వినిపించడం ఆయన ప్రత్యేకత. అలాగని ఆయన కచేరీలో నాటకీయత తక్కువయేది కాదు. ఎందుకంటే ఏ మాత్రమూ వేగాన్నీ, ఆర్భాటాన్నీ ప్రదర్శించకుండా స్వరకల్పనలో ఎంతో ఉద్వేగాన్నీ, ఆర్తినీ సునాయాసంగా సృష్టించేవారు. తాను పూర్తిగా రాగభావంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని సంగీతపు అలలలో ఓలలాడించేవారు. ఆయన కచేరీకి ఎన్నిసార్లు వెళ్ళినా అద్వితీయమైన ఆయన ప్రతిభ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఉండేది.
చిన్నప్పటినుంచీ కర్ణాటక, హిందూస్తానీ శైలుల ప్రభావం ఉండడంతో ఆయన సంగీతం అన్ని అందాలనూ పుణికిపుచ్చుకున్నట్టుగా కొనసాగింది. అందుకేనేమో తరవాతి కాలంలో రవిశంకర్, హలీమ్ జాఫర్‌ఖాన్ వంటి సితార్ విద్వాంసులతోనూ, గోపాల్‌కృష్ణవంటి విచిత్రవీణ కళాకారులతోనూ జుగల్‌బందీ కచేరీలు చెయ్యడం ఆయనకు సులువుగా సాధ్యమైంది. సూర్‌దాస్ భజనలకూ, ఇతర గీతాలకూ ఆయన పహాడీ మొదలైన హిందూస్తానీ రాగాల్లో మంచి స్వరరచనచేశారు. ఆయన రేడియోలో అనేక గీతాలకు లలిత సంగీతం సమకూర్చారు. అందులో “న జానే క్యా లాచారీ హై” అనే హిందీ పాటను బాలమురళీకృష్ణ గుజరీతోడీ రాగంలో పాడారు. అలాగే దేవులపల్లివారి రచన “ఒదిగిన మనసున పొదిగిన భావము” అనే పాటకు శాస్త్రిగారు మిశ్ర కాఫీ రాగంలో ట్యూన్ చేశారు. ఢిల్లీలో రేడియోకి చీఫ్ ప్రొడ్యూసర్‌గానూ, నేషనల్ ఆర్కెస్ర్టా కంపోజర్ కండక్టర్‌గానూ ఆయన ఎన్నో అద్భుతమైన సంగీత రచనలు చేసి వాద్యబృందాన్ని నిర్వహించారు. వాటిలో శిఖరారోహణం, భ్రమర విన్యాసం, సౌమ్య పురుష మొదలైనవి పేరు పొందాయి.
శాస్త్రిగారు తన కచేరీలలో వీణ బుర్రమీద చేత్తో దరువు వేస్తూచిన్న జాజ్ పద్ధతి స్వర రచనలనూ వాయించేవారు. మంద్రస్థాయిలో వీణ అచ్చు గిటార్‌లాగే వినబడేది. కదనకుతూహలం రాగంలో రఘువంశ కృతిని ద్వారంవారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్ విశేషాలను ప్రదర్శిస్తూ వాయించేవారు. వీణమీదా, వాయిస్తున్న సంగీతం మీదా ఆయనకున్న పూర్తి అధికారం స్పష్టంగా తెలుస్తూ ఉండేది. సంప్రదాయ సంగీతాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోవడమే కాక వీణ మీద దాన్ని ఏ మాత్రమూ తేడా రాకుండా వినిపించడంలో విజయం సాధించారు. అంతేకాక వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు పలికించవచ్చునో రిసెర్చ్ చేసి నిరూపించిన అసామాన్య కళాకారుడాయన. ఆయనకు పాత పద్ధతిలో కొన్ని భేషజాలుండేవి. “ఘనంగా ఉంటుందని” కొన్ని కచేరీలలో లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్‌వంటి వయొలిన్ కళాకారులచేత పక్క వాద్యం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు వినికిడి తక్కువగా ఉండేది. చిన్నపాటి సర్జరీ అన్నా ఆయనకు భయమేనని పరిచయస్థులు అనేవారు. అందుకని చెవిలో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం, తనకు కనబడేట్టుగా స్టేజి మీద ఎవరిచేతనైనా తాళం వేయించడం వంటివి చేసేవారు. ఆయనకు ఏరోప్లేన్ ఎక్కడమంటే భయంగా ఉండేదట. అందుకని విదేశాల నుంచి ఎన్ని ఆహ్వానాలు వచ్చినా చాలా ఏళ్ళపాటు వెళ్ళలేదు. చివరికి 70లలో ఫ్రాన్స్‌కు వెళ్ళి కచేరీలు చేశాక అక్కడివారు తబ్బిబ్బయిపోయి “కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ” అని పత్రికల్లో మెచ్చుకున్నారట. ఆ తరవాత ఆయనయూ.ఎన్. హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌లో అద్భుతమైన కచేరీ చేశారు.
ఆయన పాత 3 నిముషాల రికార్డ్ ఒకదాన్లో కురంజి రాగంలోని జావళీ శివ దీక్షా పరురాలనురా, ఖమాచ్‌లో మరుబారి తాళలేనురా అనే జావళీ వాయించారు. ఆ తరవాత విడుదలైన ఈ.పీ.లో తోడి రాగంలో చేసినదెల్ల మరచితివో అనే కీర్తన వాయించారు. చాలా ఏళ్ళ వరకూ ఆయన లాంగ్ ప్లే రికార్డు రాలేదు. అందులో గానమూర్తి రాగం అద్భుతంగా వాయించారు. తరవాత కేసెట్లలో తన కుమార్తె కల్యాణితో కలిసి కొన్ని కీర్తనలూ, ఫ్రాన్స్‌లో రిలీజయిన సీ.డీ.లో మరికొన్నీ వాయించారు. ఆయన తెలుగు జానపదగీతాలను వాయించే పద్ధతి చాలా బావుండేది. వాటిలో కొన్ని కేసెట్‌లో విడుదల కూడా అయాయి. ఆయన వీణ మీద పలికించలేని శబ్దం ఉండదేమో అనిపించేది. వీణ నేర్చుకునే ప్రతి విద్యార్థీ ఆయన రికార్డింగ్‌లు విని తీరాలి.
వ్యక్తిగతంగా ఆయనకు “రాజకీయాలు” తెలియవు. ఆయన శిష్యవర్గంలోనివారూ, ఆయనకు సాటిరాని ఇతర తక్కువరకం వైణికులూ కలిసి ఆయన లాంగ్‌ప్లే రికార్డులు త్వరగా రిలీజ్ కాకుండా చెయ్యడం మొదలైన పనులు చేశారు. చివరకు రికార్డ్ కవర్ల మీద అందమైన బొమ్మలు కూడా వెయ్యనివ్వకుండా అడ్డుతగులుకున్నారట. ఆయనది మంచి ప్రభుత్వోద్యోగం కనక ఆయన డబ్బుకూ, పేరు ప్రతిష్ఠలకూ పాకులాడేవారుకాదు. ఈ రచయిత ఆయనను మద్రాసు రేడియో కేంద్రంలో కలుసుకుని బొంబాయికి ఆహ్వానించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన డబ్బు విషయంలో రాజీ పడలేదు. అందుకు అసలు కారణం వేరు. చాలా ఏళ్ళ క్రితం బొంబాయి ఆంధ్రమహాసభలో ఆయన కచేరీకి ఎక్కువమంది హాజరు కాలేదట. అంతకు ముందు రోజే షణ్ముఖానంద హాలులో జనం నిండిపోయి టికెట్లు దొరకని కొందరు నిరాశ పడ్డారట కూడా. అప్పటి నుంచీ ఆయనకు ప్రవాసాంధ్ర సంఘాలంటే నమ్మకం పోయింది. ఉద్యోగ విరమణ చేశాక కూడా ఆయన ఎమెరిటస్ కంపోజర్‌గా కొనసాగారు. 1987 డిసెంబర్ 23న గుంటూరు కచేరీ రైలు ప్రయాణంలో కన్నుమూశారు.
ఈమని శంకరశాస్త్రి గారి శిష్యుల్లో ముఖ్యుడు చిట్టిబాబు. చిట్టిబాబు గురువుగారు వాయించే శైలిని చాలావరకూ అభివృద్ధి చేశారు. తమిళులూ, కన్నడిగులతో పోలిస్తే ఈ శైలిలో కుడి చేతి మీటు చాలా వేగంగానూ, స్పష్టంగానూ వినబడుతుంది. “పులుముడు” సంగీతం ఉండదు. చిట్టిబాబు తన పెళ్ళి కచేరీకి మద్రాసులో గురువుగారినే ఆహ్వానించారు. శాస్త్రిగారి మరొక శిష్యుడు ఆయన మేనల్లుడైన కామశాస్త్రి. మరొక మేనల్లుడు రామశాస్త్రి ఎం.ఎస్.శ్రీరాం అనే పేరుతో సినిమాలకు సంగీతం అందించాడు. శంకరశాస్త్రి గారి చెల్లెలు సరస్వతి రేడియోలో మంచి వీణ ఆర్టిస్టు. ఆయన కుమారుడొకడు మృదంగం నేర్చుకున్నారు. కనీసం ఇద్దరు కుమార్తెలు వీణ చక్కగా నేర్చుకున్నారు. చివరి అమ్మాయి దేవి గజల్ సంగీతం పాడుతుంది. శాస్త్రీయ సంగీతానికే ఆదరణ లేని ఈ రోజుల్లో శంకరశాస్త్రి గారి శైలికి ఎక్కువమంది వారసులు లేరని వాపోవడం అర్థం లేనిదిగా అనిపించవచ్చు. మనకు దక్కిన ఆయన రికార్డింగ్‌లనైనా విని, ఆనందిస్తే చాలు. మనలో సంగీతం నేర్చుకుంటున్నవారు ఆయన నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాన్ని కొనసాగించలేకపోతే అది సామూహిక వైఫల్యమే అవుతుంది.

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ... పూర్తిగా »
baabjeelu అభిప్రాయం:
July 19, 2008 3:48 pm
దీని ముందే హిందుస్తానీ సంగీతం గురించి మీరు రాసిన వ్యాసం చదివేను. అందులో కుమార్ గాంధర్వ రాగంసంగతి తెలీడానికి అరగంట అక్కర్లేదని ఒకే ఎల్ పీ లో ఆరేడు రాగాలు పాడేడని రాసేరు, అది ఈ వ్యాసం చదివేక ఇంకా బాగా అర్ధవయింది.
ఈమని వారి రికార్డింగ్స్ ఎఐఆర్ ఆర్ఖైవ్స్ లో లేవు. నాయుడుగారిది ఒకటి దొరికింది. బహుశా విజయవాడ లోనో వైజాగ్ లోనో దొరుకుతాయేమో?
Rohiniprasad అభిప్రాయం:
July 19, 2008 10:22 pm
ఈమనివారి సంగీతం (మరెన్నో దుర్లభమైన రికార్డింగులూ) వినడానికి లింకులు:
http://surasa.net/music/karnatak/
http://surasa.net/music/karnatak/contrib/
http://www.sangeethapriya.org/Downloads/dress/waynepa/dresswaynepa.html
http://www.sangeethapriya.org/Downloads/Emani/index.html
Rohiniprasad అభిప్రాయం:
December 23, 2008 9:15 am
ఈమని శంకరశాస్త్రిగారి గురించి మంచి వ్యాసం “ వైణిక సశాస్త్రీయం - శంకర నాద తరంగం“
పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:
December 23, 2008 1:12 pm
ఈ వ్యాసం ఎలానో మిస్ అయినట్లున్నాను. ఈమని గురించి రాయడం బాగుంది. కాకుంటే మీ మిగిలిన వ్యాసాలతో పోలిస్తే యెందుకో కొంచెం ‘చప్పగా’ వున్నట్లనిపించింది. మీరు మద్రాసులో ఆయన్ను బాగా యెరిగుంటారు, ఆ పైన చాలా కచేరీలు హాజరయివుంటారు కాబట్టి కాసింత anecdotal stuff అందిస్తారనుకున్నాను. ఆయన్ను నేను live విన్నది వొక్కసారే. కానీ తర్వాత ఒక ఉద్యమంలా అప్పట్లో మార్కెట్లో దొరుకుతున్న రికార్డులు, టేపులు కొనుక్కున్నాను. ఒక టేపులో కేవలం భజన్లు, లాలిపాటలు, తత్త్వాలు లాంటివుంటాయి. ఆ టేపంటే పిచ్చి యిష్టం. ఇప్పటికీ…. మొన్నమొన్నటి వరకు తెలిసినవాళ్ళకు తరచుగా కోరిన పాటలు సరఫరా చేస్తుండే కార్యక్రమంలో టేపుల చివర్లో మిగిలే ఖాళీని నింపడానికి యెప్పుడూ ఆ టేపులో ట్రాకులే వాడేవాణ్ణి :). ఆయన ప్రతి కచేరీలోను లత పాడిన “ధీరేసే ఆజారే అఖియన్…” (అల్బేలా, 1951, రాంచంద్ర “అన్నా” చితల్కర్) పాట వాయించేవారని పి.బి. శ్రీనివాస్ గారొకసారి చెప్పారు. [నాయుడు గారు “అప్పనా తనామనా” వాయించినట్లు …] తర్వాత్తర్వాత కాసిన్ని live’ కచేరీలు పోగుచేసుకున్న తర్వాత అభిమానం మరింత పెరిగింది. నాకు ఓలేటి, ఈమని కచేరీల్లో నచ్చే వొక విషయమేమంటే దాదాపు 25-30% (so called!) ‘light stuff’ వుంటుందని :-).
ఆయన రేడియో లో చేసిన పని గురించి మీరుగానీ, మరెవరైనాగానీ వివరంగా రాస్తే బాగుణ్ణు. క్లుప్తంగా ఆయన ఢిల్లీ రోజుల్లో చేసిన వాద్యబృంద-గోష్టుల గురించే చెప్తారు అందరూ. అలాగే ఆయన జెమినీ స్టూడియో రోజుల్లో ఖచ్చితంగా ఏమి చేసేవారో కూడా. ముఖ్యంగా సాలూరి జెమినీ ని వదిలేసిన తర్వాత! 1941/42 (బాలనాగమ్మ-1942 తో మొదలు) నుండి 1949 వరకు సాలూరి జెమినీ వారి కాంట్రాక్టు మీద పనిచేసాడు. ఆయన ట్యూన్లు కడితే ఈమని, M.D పార్థసారథి (ఈయన కూడా కర్నాటక శాస్త్రీయంలో తర్ఫీదు పొందిన మనిషే) “మిగిలిన విషయాలు” (ఆర్కెస్ట్రేషన్, వగైరా) చూసుకునేవారని చెప్తారు. అప్పట్లో AVM, Gemini వాళ్ళు గాయనీ, గాయకుల, సంగీత దర్శకుల వివరాలు రికార్డులపై యిచ్చేవాళ్ళు కారు. కాకుంటే కొన్ని సినిమా టైటిల్స్ లో (1951 తర్వాత), ముఖ్యంగా జెమినీ వారి హిందీ సినిమాల్లో ఈమని, MDP ల పేర్లు (హిందీలో అయితే కల్లా అనే మరో పేరు కూడా) కనిపిస్తాయి.
మరోసారి శంకరశాస్త్రిగారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలతో …
– శ్రీనివాస్
P.S. “ఒదిగిన మనసున” (చిత్తరంజన్, కనకవల్లీ నాగేందర్) పాట ప్రస్తావించడం కూడా బాగుంది. అద్భుతమైన పాట! (తప్పకుండా ఏదో ఒకరోజు డిజిటైజ్ చేసి ఈమాటలో పెడతాను.)
Rohiniprasad అభిప్రాయం:
December 23, 2008 7:47 pm
నేను పెద్దయేటప్పటికి శాస్త్రిగారు మద్రాసు వదిలివెళ్ళారు. 1966లో మేము సకుటుంబంగా ఢిల్లీలో ఆయనింటికి వెళ్ళాము. ఆ తరవాత శాస్త్రిగారిని నేను కలుసుకోవడం, మాట్లాడడం కొన్ని సందర్భాల్లో జరిగింది. ఆయన కాస్త అమాయకుడు. ఆయన సంగీతపు మహోన్నత వ్యక్తిత్వంతో పోలిస్తే అటువంటి చిన్న విషయాలను పేర్కొనడం అన్యాయం అనిపించడం వల్ల నేను వాటిని ప్రస్తావించలేదు. ఆయన వీణ ఎప్పుడు విన్నా నా అభిమాన వాయిద్యం సితార్ కన్నా వీణ కాస్త గొప్పదని ఆయన ‘నిరూపించాడని’ నా కనిపిస్తుంది. (అయిష్టంగానైనా నేనా సంగతి ఒప్పుకోవాలి). నా లెక్కన ఆయన Vilayat Khan of Veena.
జెమినీ చిత్రం అవ్వయార్ లో ఆయన సుందరాంబాళ్ చేత మంచి సంగీతం పాడించాడని విన్నాను కాని ఆ సినిమా పూర్తిగా చూడలేదు.
ఆయన కచేరీలు చాలాసార్లు విన్నాను. కర్నాటక సంగీతంలోని సంప్రదాయపు ‘పట్టు’లోని అందాలు ఆయన చూపినట్టుగా మరెవ్వరూ చూపించలేదని నేననుకుంటాను.
rama అభిప్రాయం:
December 24, 2008 3:26 am
రోహిణీప్రసాదు గారికి, కళాకారులగురించి రాసేటప్పుడు..మనకి అలవాటు అయిన కొలమానాలలోంచి వారి స్వభావాన్ని అర్ధం చేసుకోకూడదనుకుంటాను. కవులవీ.. గాయకులవీ. .వైణికులవీ… చిత్రకారులవీ… స్వభావాలు.. భిన్నంగా వుండే అవకాశం లేకపోలేదు. ఆ భిన్నత్వం వారిని..ప్రత్యేకంగా ఆలోచించేలా చేస్తుంది. అది లోకం దృష్టిలో “అమాయకం”గా వుండొచ్చు. నేను 1975 లో శంకరశాస్త్రి గారి కచేరీలు బాగా విన్నాను. ఆయన్ని గురుతు చేసుకుందికి మీ వ్యాసం మరోసారి వీలు కలిగించింది.అందుకు నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను ..రమ.
సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
December 24, 2008 2:11 pm
నా చిన్న తనంలో ఈమని శంకరశాస్త్రి గారు మాయింటికి చాలా సార్లే వచ్చే వారు. మా అమ్మతరపు బంధువాయన. కచేరీ ఉంటే ముందు ద్రాక్షారామం వెళ్ళి, అక్కడనుండి కోటిపల్లి రేవు దాటి అమలాపురం వచ్చేవారు. ప్రతీ ఏటా అమలాపురం త్యాగరాజ గాన సభ ఉత్సవాలకి తప్పని సరిగా ఈమని వారిది కానీ చిట్టి బాబుది కానీ కచేరీ ఉండేది. మా నాన్న ఆ సభకి కార్యదర్శి. ఈ వ్యవహారాలన్నీ మా నాన్నే చూసేవారు. కచేరీకొచ్చినప్పుడల్లా శంకరశాస్త్రి గారు మా ఇంట్లోనే దిగేవారు. ప్రతీ రోజు తెల్లవారు ఝామున నాలుగు నుండి ఉదయం ఏడు వరకూ కచేరీకొచ్చినప్పుడల్లా వీణా సాధన చేసేవారు. మా ఇంట్లో అవుట్ హౌస్ గదిలో ఈ సాధన చేసేవారు. నన్ను ఆయనకి సాయంగా ( ఏమైనా కావల్సి వస్తే ) ఉండమనే వారు. నాకు అప్పట్లో వీణంటే ఇష్టమున్నా సంగీతం గురించి ఏమీ తెలీదు. ఆయన కాఫీ త్రాగి సాధన మొదలెట్టేవారు. సాధన సమయంలో ఎవర్నీ రానివ్వద్దనీ మరీ మరీ చెప్పేవారు. ఓ సారి కచేరీకి సాధనకని కూర్చున్నారు. పక్కింట్లో పెళ్ళి వారు చెవులు దద్దరిల్లేలా బ్యాండు వాయి స్తుంటే సాధన చెడిపోయిందనీ ఆయన చికాకు పడడం నా కింకా గుర్తుంది. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇవ్వలేదని ఆయన చాలా సార్లే చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూసాను.
అమలాపురం కోనసీమా బ్యాంక్ ఆవరణలో చిట్టి బాబూ, ఈమని వారు కలిసి ఓ గంట సేపు ఒకసారి చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేద్దామని పిలిచారన్న గుర్తు. ఇది జరిగి చాలా ఏళ్ళయ్యింది. 1978 లో అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఎక్కడా వీణ వాయించడం నాకు తెలీదు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎంత సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా సాధన చాలా అవసరమని ఆయన నమ్మి, పాటించేవారు. అందుకే ఆ కచేరీల్లో అంత నాణ్యతా కనిపిస్తుంది. ఈమని, చిట్టి బాబుల తరువాత వీణా వాయిద్యంలో తెలుగు వారి పేరే అంతగా వినిపించలేదు. ఈ మధ్యనే డి. శ్రీనివాస్ అనే ఆయన పేరు వినిపిస్తోంది. ఆయన కచేరీలు బావుంటాయనీ విన్నాను.
mOhana అభిప్రాయం:
December 26, 2008 8:09 am
ఒకప్పుడు (1968 ప్రాంతం అనుకొంటా) ఈమనిగారు భారతీయ విజ్ఞాన సంస్థలో వీణ కచేరీ చేశారు. హైవోల్టేజ్ ఇంజనీరింగ్ హాలులో ఏర్పాటు చేశారు కచేరీని. కచేరి ఆరంభం కావడానికి రెండు గంటలకు ముందే హాలు నిండింది. పక్క ఇంకొక హాలులో వినడానికి అవకాశాలు కల్పించారు. నాకు ఈ కచేరీలో ఇంకా జ్ఞాపకం ఉండేది ఏమంటే వారు వీణపై స్వరాలను పల్కించే విధానాన్ని ప్రదర్శించారు వివరాలతో. ఒకే సమయంలో రెండు లేక మూడు తంత్రులను వాయించడం ఇత్యాదులు. తరువాత వారు దర్శకత్వం చేసిన మంగళా వంటి చిత్రాలనుండి కొన్ని పాటలను కూడా వినిపించారు. రెండు మూడు గంటల కార్యక్రమం ఇంకా నా స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. విధేయుడు - మోహన
Rohiniprasad అభిప్రాయం:
December 26, 2008 1:46 pm
వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.
తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.
నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!
lyla yerneni అభిప్రాయం:
December 26, 2008 4:11 pm
“కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది.” -Rohiniprasad.
వీణ తీగలను లెక్కించటం పద్ధతి - వీణ దండం మీద, వైణికుడికి అన్నిటికన్నా దూరంగా ఉన్న ( ఇత్తడి)తీగె మొదటిది, అన్నిటికన్నా దగ్గరగా ఉన్న (ఉక్కు) తీగె నాలుగవది కాదా రోహిణీ ప్రసాద్ ?
” అనుమంద్ర పంచమానికి మొదటి తీగె, మంద్ర షడ్జమానికి రెండవ తీగె, పంచమానికి మూడవ తీగె, మధ్య షడ్జమానికి నాల్గవ తీగెను ఈ కాలంలో శృతి చేసున్నాం.” - ముదిగొండ వీరభద్రయ్య రచించిన వీణ -వీణాపాణులు అన్న పుస్తకము నుండి.
సరస్వతి, నారదుడు ఏమిటండీ, :-) ఈమని శంకరశాస్త్రి వీణ ఈశ్వరుడే ఇష్టంగా వింటాడు. మన అదృష్టం బాగుంది. మనమూ విన్నాం. :-)
లైలా.
Rohiniprasad అభిప్రాయం:
December 26, 2008 5:59 pm
లైలాగారూ,
నా దగ్గర వీణ పుస్తకం లేదు. కుడిచేతికి దగ్గరి తీగను మొదటిది అన్నాను.
సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
December 31, 2008 12:54 am
వీణ తీగలకీ పేర్లున్నాయి.
అనుమంద్ర - మొదటి తీగ,
మంద్ర - రెండవ తీగ,
అనుసారణి - మూడవ తీగ,
సారణి - నాల్గవ తీగ
ఈ పేర్లకి ప్రస్తుతం వాడుక తగ్గింది. సంఖ్యా పరంగానే చెబుతున్నారు.