ఈమాట » ఏకాకితనం

Expand to right
Expand to left

ఏకాకితనం

విజ్ఞాన వలయ పరిధులు
అవధులు దాటుతుంటే
హృదయ విస్తారం
కేంద్రం లోకే కుంచించుకుపోతోంది.
చోటు చాలని మనసులో
కుటుంబమే
ఇరుకుగా సర్దుకుంటోంది.

కరడు గట్టిన స్వార్థం
వేగం పెరిగిన అవసరాలు
లోతుగా చొచ్చుకుపోతే -
ఒక స్నేహం,
ఇంకొక బంధుత్వం
ఆత్మీయతల్ని
ఆప్యాయంగా
ఆహ్వానించ లేకపోతున్నాయి.

నాలుగు గోడలే నేస్తాలైతే
నట్టింట్లో చిత్రదర్శనమే
పలకరింపు చుట్టంగా మిగిలితే -
ఏకాకితనం దగ్గరై
నిర్వేదం ఆత్మబంధువై
ఒంటరికణం రక్తపోటులో
భాగమై పోతోంది !

పక్క వీధిలో ఓ చావునీ
పక్కింట్లో ఓ పెళ్ళినీ
కన్నెత్తి చూడలేక
సంతోషాలు, దుఖాలు
పరిమితికి అలవాటుపడ్డాయి.
నీకు నువ్వే అయిన ప్రపంచంలో
జనాభా
ఒంటరి సంఖ్యే !

అందుకే -
చిన్న కదలికతో
ప్రయత్నాన్ని చుట్టి
హృదయాన్ని
చుట్టూ ఉన్న
బావిగోడల్ని దాటించు
వైశాల్యం విస్తరించుకుంటుంది.
దానంతట అదే ఎదుగుతుంది
మరుగుజ్జు మనస్తత్వం!

చిన్న గీతల్ని సైతం
భూతాల్లా భ్రమించే మనసుకి
పెద్ద కష్టం కూడా
నలుసై
ఉనికిని కోల్పోతుంది.

ఏకాకి పంజరం తలుపులు తీయి
ఒంటరితనం
ప్రేమని చూస్తుంది.
ఆప్యాయతల్ని తడుముతుంది.
అందరినీ కలుపుకోవడం అలవాటుచేసుకుంటుంది
తెలియకుండానే
ఇంటిపేరు స్నేహంగా మార్చుకుంటుంది
జీవిత నిఘంటువులోంచి
ఒంటరి పదాన్ని తుడిచేస్తుంది.
గుప్పెడు గుండె కూడా
వసుధైక కుంటుంబాన్ని
అవలీలగా మోసేస్తుంది.

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    July 25, 2008 6:30 am

    సాయిగారూ,
    ఎంత చక్కని భావ వ్యక్తీకరణ. హ్రుదయ విస్తారం కేంద్రంలోకి కుచించుకు పోవడం, చోటూ(టు) చాలని మనసులో మనసులో కుటుంబం ఇరుకుగా సర్దుకోవడం, నీకు నువ్వే అయిన ప్రపంచంలో జనాభా ఒంటరి సంఖ్య, పరిమితులకలవాటయిపోయిన మనం నిజంగానే మరుగుజ్జులం. మీరు రాసినట్టు పక్కింట్లో చావూ, పెళ్ళీ ఒకటే.
    మహాప్రభో, మీకో దండం.

    బావి గోడల్ని దాటించెస్తే, మరుగుజ్జులు అమితాబ్ లయిపోతారని రాయడానికి చాలా దమ్ము కావాలి. వుంది కాబట్టే రాయ గలిగేరు.

    మహాప్రభో మీకు మళ్ళీ మరో దండం.

    స్పెల్లింగ్ మిస్టేకులెలా వచ్చేయి. జివిత నిఘంటువు వేవిటి? జాగ్రత్తగా చూసుకోండి. పాత సంచికల్లో కవితలేవేనా రాసేరా? నేను వెతుక్కుంటాను లెండి. మీ వచనం మీ కవితంత అందంగా వుండదెందుకని?

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a