పద్యం అంటే సుముఖత ఎందుకు?
పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!
సాధారణంగా పద్యాభిమానులందరూ పద్య ప్రత్యేకత గురించి ప్రస్తావించే అంశాలు కొన్ని ఉన్నాయి.
ఒకటి, “ధార, ఊపు, లయ, పదాల పొందిక”. వీటిలో పదాల పొందిక వచన కవితకైనా ఉండాల్సిన లక్షణమే. పద్యానికున్న ప్రత్యేకత కాదు. ఇక మిగిలినవి ధార, ఊపు, లయ. ఇవి మూడూ పద్యం తాలూకు నడకకు సంబంధించిన లక్షణాలు. కాబట్టి పద్యానికుండే విలక్షణమైన నడక దానికుండే ఒకానొక విశిష్టత అని భావించ వచ్చు. అయితే, ఈ ప్రత్యేక లక్షణానికున్న ప్రయోజనం ఏమిటి, అది ఈ కాలానికికూడా వర్తిస్తుందా అని ప్రశ్నించుకోవడం అవసరం. ఎందుకంటే, “పద్యానికున్న ధార, ఊపు, లయ మూలంగా నాకు అదంటే ఇష్టం. మీరు దాన్ని ఆస్వాదించలేకపోతే అది మీ ఖర్మం” అని ఊరుకుంటే, పద్య విముఖులకూ ద్వేషులకూ సరైన సమాధానం చెప్పినట్టు అవ్వదు. ఆ వాదం తర్కానికి లొంగదు. పద్యానికున్న ప్రత్యేకమైన నడక ఒక అవ్యక్తమైన శబ్దసౌందర్యాన్ని కలిగి ఉంటుందన్నది వాస్తవం. కానీ, కవిత్వానికి శబ్దంకన్నా అర్థం, అర్థం కన్నా భావం ప్రధానమైనదనే ఆధునికులు ఈ శబ్దసౌందర్యాన్ని పట్టించుకోనక్కరలేదంటారు. పైగా శబ్దాలంకారాలకన్నా, అర్థాలంకారాలే ఉత్తమమైనవని చాటిచెప్పిన ఆలంకారికుల మాటలను వెదికి తెచ్చి, ఆ శబ్దసౌందర్యాన్ని గర్హిస్తారు కూడా! దీనికి సమాధానం?
పద్యప్రియులు ధీమాగా చెప్పుకునే మరో మాట, “సామాన్య ప్రజల్లో ఇంకా పద్యానికి ఆదరణ ఉంది”. ఏ ధైర్యంతో, ఆధారంతో ఈ మాట అంటారో నాకైతే తెలీదు. ఇప్పుడు వస్తున్న పత్రికలన్నీ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నవని వీరు ఒప్పుకుంటారనే అనుకుంటాను. అలాంటి పత్రికలు పద్యాన్ని చిన్నచూపు చూస్తున్నాయని వీళ్ళే వాపోతారు. ప్రజాదరణ ఉన్న ప్రక్రియను పత్రికలు (అందునా సర్క్యులేషనే ప్రధానమైన ఈ రోజుల్లో) నిరాదరించడమా! ఆశ్చర్యంగా లేదూ! కాబట్టి సామాన్య ప్రజల్లో పద్యానికి ఆదరణ ఉందన్న విషయం అంత నమ్మశక్యంగా లేదు. ఏ కొద్దిమంది సామాన్య ప్రజల్లోనో ఆదరణ ఉంది అనుకున్నా, దాని వెనుకనున్న కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. మా ఆఫీసులో ఒక తమిళ మిత్రుడున్నాడు. అతనికి తెలుగు తెలీదు. తెలుగు ఛందస్సుగూర్చి అసలే తెలీదు. ఐతే తమిళంలో కూడా వాళ్ళకి ఛందస్సు ఉంది. దానిగూర్చి చూచాయగా తెలుసు, దానికి బోలెడన్ని నియమాలుంటాయనీ, అందులో పద్యాలు రాయడం చాలా కష్టం అనిన్నీ. నేను తెలుగులో పద్యాలు రాస్తానని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏవో ఒకటి రెండు వినిపించమన్నాడు. నీకు తెలుగు తెలీదు కదా అంటే, ఇంగ్లీషులో దాని అర్థం చెప్పు చాలన్నాడు. తెలుగు పద్యాలని వినలేదు. అర్థం తెలుసుకుని, ఒహో ఇంత చక్కని భావాన్ని అంత కష్టమైన పద్యాలలో రాయగలిగావా అని మెచ్చుకున్నాడు, ఆనందించాడు. పద్యమంటే కాస్తో కూస్తో అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలు కూడా, చాలమంది ఈ కోవకి చెందిన వాళ్ళే. మా పల్లెటూళ్ళో మరొక వ్యక్తి ఉన్నాడు. కృష్ణరాయబారం పద్యాలు గొంతెత్తి పరవశించి పాడతాడు. “ఎల్లి రణంబె గూర్చెదవొ” అంటే అర్థమేమిటో తెలుసా అని అడిగాను. “ఏవుంది. ఎళ్ళి, అంటే వెళ్ళి, యుద్ధం చేస్తావా అని” అని టక్కున జవాబిచ్చాడు. పద్యమంటే అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలలో వీరు మరో రకం. సరే పద్యాన్ని ఒక పురావస్తు విశేషంగా, సాలార్జంగు మ్యూజియంలోని గడియారాన్ని చూసినంత ఆసక్తితో చూసేవారూ, లేదా మోడువోయిన మన ప్రాచీనసంప్రదాయ వృక్షానికి ఇంకా అతుక్కు వేళ్ళాడుతున్న ఒక పండుటాకులా ఆదరించే వారూ చాలా మందే ఉన్నారు. పద్యం రాయడం వచ్చిన వాళ్ళ గురించి కానీ, సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళగురించి కానీ ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. నేను వాళ్ళను “సామాన్య ప్రజ”ల కోవలోకి చేర్చను. ఇంతకీ చెప్పొచ్చే విషయమేమిటంటే, నాకున్న ఎరికలో, పద్యమంటే ఆసక్తి ఆదరణ ఉన్న సామాన్య ప్రజలలో కవిత్వ వాహికగా దానికి గుర్తింపులేదు.
పద్య కవిత్వానికి ఆదరణ తగ్గిందనేది కాదనలేని నిజం. అసలు కవిత్వానికే ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో పద్య కవిత్వానికి ఆదరణ తగ్గడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఐతే, పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి గల కారణాలు సహేతుకంగా పరిశీలిస్తే, పద్యానికీ, పద్యకవిత్వానికీ ఉన్న ప్రత్యేకత కొంత తెలుసుకోవచ్చు. పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి ప్రధానంగా నాలుగు కారణాలు నాకు కనిపిస్తున్నాయి.
- ఒకటి, శ్రవ్యప్రధానంగా ఉండిన కవిత్వం, కాలప్రభావాన, పాఠ్యప్రధానంగా మారడం. ఆంధ్రసారస్వతపు తొలినాళ్ళనుండీ మొన్న మొన్నటి బ్రిటిష్ పాలనా కాలం వరకూ, కవిత్వ ప్రచారం ఎక్కువగా “ముఖే ముఖే” అన్న రీతిలోనే సాగిందన్నది చారిత్రక సత్యం. బ్రిటిషువారి వద్దనుండి అచ్చుయంత్రం దిగుమతి అయిన తరువాతే ప్రచురణమార్గంలో కవిత్వ ప్రచారం మొదలయ్యింది. పద్య విముఖత సరిగ్గా అప్పుడే మొదలయ్యింది. పద్యం గొంతెత్తి హాయిగా పాడుకోవలసింది. నేటి ఆధునిక వచన కవిత మౌనంగా మనసులో చదువుకోవలసింది. పద్యానికి ఉండే ప్రత్యేకమైన నడకవల్ల, వినసొంపుగా ఉండడమే కాకుండా సుళువుగా జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు కలుగుతుంది. ఈ రెండు ప్రత్యేకతలూ పద్య ప్రాచుర్యానికి ఎంతో దోహదపడ్డాయి. ఎప్పుడైతే కవిత్వం పాఠ్యప్రధానమైందో, ఈ గుణాలు తమ ఆవశ్యకతని కోల్పోయాయి. అందువల్ల పద్యం తాలూకు అవసరం తగ్గిపోయింది.
-
ఇక రెండవ కారణం-సమకాలీన సామాజిక స్పృహ ఉన్నప్పుడే అది కవిత్వం అనీ, అది ఉంటే చాలు కవిత్వమే అనీ ఒక విచిత్ర సిద్ధాంతం బయలుదేరి సాహిత్యప్రపంచమంతటా వ్యాపించడం. “కష్టజీవికి అటూ, ఇటూ ఉన్నవాడు కవి” అన్న ఒక గొప్ప కవి చేసిన ఉక్తివైచిత్రిని పట్టుకొని వేదోక్తిగా భావించిన మామూలు కవులూ, ఇతరులూ సృష్టించిన పరిస్థితి ఇది. ఎప్పుడైతే ఈ వాదం ప్రబలిపోయిందో ప్రాచీన కవిత్వమంతా (ఒక వేమన, మరొక బద్దెన రాసింది తప్పించి) కవిత్వం కాకుండా పోయింది. ఆ కవిత్వమంతా ప్రధానంగా పద్య కవిత్వమాయె, అంచేత ఆ దెబ్బ పద్యానికి కూడా తగిలింది. ఈ వాదం వల్లనే వచ్చిన మరో ప్రమాదం, కవిత్వానికి వస్తువే సర్వస్వం అన్న అర్థంలేని సిద్ధాంతం. పద్యానికి ఒక నిర్దిష్టమైన రూపముంది. వచన కవితకి ఇది అవసరం లేదు (అని ఈ సైద్ధాంతికుల నమ్మకం). ఇది కూడా పద్య విముఖతకి రాచబాట వేసింది.
-
పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి మూడవ కారణం వ్యావహారిక భాషావాదం. కవిత్వమంతా సామాన్య ప్రజలు మాట్లాడుకొనే భాషలోనే ఉండాలి, నిరక్షరకుక్షికి సైతం అర్థం కావాలి అన్న వాదం. నిజానికి ఈ వ్యావహారికభాషా వాదం మొదలయ్యింది కవిత్వేతర సాహిత్య ప్రక్రియల (కథ, వ్యాసం మొదలైనవి) గురించి. ఎప్పుడు వచ్చిందోకానీ, చాపకింద నీరులా వచ్చి అది కవిత్వాన్ని కూడా ఆక్రమించింది. కవిత్వేతర ప్రక్రియలకు సంబంధించి ఇది కొంతవరకు సమంజసమైన వాదమే. వచ్చిన చిక్కల్లా దాన్ని కవిత్వానికి కూడా వర్తింపచెయ్యడమే! పోనీ ఆ రాసే పద్యాలేవో వ్యావహారిక భాషలోనే రాస్తే పోలే అని కొందరంటారు. పద్యానికి అవసరమైన ధార, నడక కావాలంటే, సంధులు సమాసాలూ అవసరం. వ్యావహారిక భాష కొంత ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అసలు సంధులూ సమాసాల ముఖ్యోద్దేశం, వాక్యాలకు ఒక పారే గుణాన్ని కల్పించడమే. అందువల్ల అవి పద్యానికి ఎంతైనా అవసరం. వ్యావహారిక భాషలో అవి అంతగా ఉండవాయె! మరి వ్యావహారిక భాషలో పద్యం రాయడం ఎలా కుదురుతుంది? కుదిరితే దానికున్న సహజసౌందర్యం ఎక్కడనుండి వస్తుంది? కరుణశ్రీ, జాషువా మొదలైన ఆధునిక పద్య కవులు కూడా, పూర్తి వ్యావహారిక భాషలో పద్యాలు రాయలేదు. వారి పద్యాలలో విరివిగా సంధులూ సమాసాలూ కనబడతాయి. అలాగే పర్యాయపదాలు కూడా. అంచేత పూర్తి వ్యావహారిక భాషలో (అవసరమైతే వ్యాకరణాన్ని కూడా కాలదన్ని) పద్యాలు రాయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.
-
ఇక నాల్గవ కారణం కావ్య ప్రక్రియకి ఆదరణ తగ్గి కవితలకీ, మినీ కవితలకీ ఆదరణ పెరగడం. బహుశా జీవనగమనంలో పెరిగిన వేగం కారణంగా కావ్యాన్ని రాయడానికి కానీ చదవడానికి కానీ తీరిక దొరక్క ఆ ప్రక్రియకి ఆదరణ తగ్గింది. కావ్యానికి కథాగమనం, పాత్ర పోషణ, వివిధ వర్ణనలు, రస పోషణ వంటివి చాలా అవసరం. దీనికి పద్యాలు అనువైనవి. కవితలకి, మినీ కవితలకి ఇంత అవసరంలేదు. కావలసిందల్లా ఒక భావాన్ని సూటిగా పాఠకుడి గుండెల్లో నాటుకునేలా చెయ్యడం. వచనం చెఅసినంతగా ఈ పని పద్యం చెయ్యలేదు. కాబట్టి సహజంగా పద్య కవిత్వానికి ఆదరణ తగ్గింది.
పైన చెప్పిన కారణాలలో ఒకటీ నాలుగూ కాలానుగుణంగా వచ్చిన సహజ పరిణామాలు. వీటిని కాదనలేం, అనకూడదు కూడా. వచ్చిన చిక్కల్లా రెండు, మూడు కారణాల వల్లనే. ఇవి సృష్టించిన గందరగోళ పరిస్థితి నుండి సాహిత్యం, అందునా కవిత్వం, ఎప్పుడు బయట పడుతుందో అప్పుడు మళ్ళీ పద్యమంటే సుముఖత ఏర్పడడానికి అవకాశం వస్తుంది. మరి పద్య కవులు ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదా అంటే, ఉంది. వస్తువుతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషా కాదా అన్న తేడా లేకుండా, చక్కని చిక్కని కవిత్వాన్ని, పద్య రూపంలో, దాని సహజసౌందర్యం చెడకుండా అందించగలిగితే, రావలసిన మార్పుకి దోహదం చేసిన వాళ్ళవుతారు. పద్య కవులమనుకొనేవారు తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త - పద్యానికీ, పద్య కవిత్వానికి ఉన్న తేడా తెలిసికొని, తాము రాస్తున్నది ఏ కోవకి చెందుతుందో నిగ్గుతేల్చుకోవడం.
jayaprabha అభిప్రాయం:
August 20, 2008 2:49 am
కామేశ్వర రావు గారు,
మీ పద్యం అంటే వున్న “సుముఖత” గురించిన విచికిత్స చదివాను. అన్ని రకాల కారణాలని గురించి సుహృద్బావంగా విశ్లేషణ చెయ్యాలన్న ఒక తపన కనిపించింది. కానీ అసలు విషయం ఏమిటంటే మా కాళోజీ చెప్పిన జవాబే నేనూ చెబుతాను వినండి (ఈ మాట మీద కాపీరైట్ కాళోజీదీ సుమా!).
ఒకసారి ఆయన్ని నేను అడిగాను పద్యాలు ఎందుకు రాయలేదు మీరు అని. ఆయన అన్నాడు కదా “నాకు పద్యం రాయడం రాదు, అందుచేత రాయలేదు” అని. అది మా కాలోజీ సూటితనం. మరి నేను చెప్పేది కూడా అంతే. “పద్యవిద్య” అని అనేవారు కదా — అంటే అది ఒక skill అన్నమాట. దానిలో శిక్షణ పొందాలి. ఛందస్సు క్షుణ్ణంగా చదువుకుని వుండాలి. ముక్కున పట్టిన నాలుగు అవసరార్థపు “గణ” పరిజ్ఞానంతోనే ఈ కాలం వాళ్ళు పద్యాలు ఎట్లా రాసేయగలరండీ? అత్యాశ అలా ఎవరైనా ఆశిస్తే, అవునా?
ఇంకా వచన పద్యం (ఇక్కడ పద్యాన్ని కవిత్వానికి పర్యాయంగా అంటున్నాను) రాయటం కూడా సుళువేమీ కాదు. వచనంలో నిట్ట నిలువుగా రాసేదంతా కవిత్వం అని ఎవరూ అనలేరు. మంచి పద్యానికి వుండే లక్షణం మంచి prose poem కి కూడా వర్తిస్తుంది. ఒక లయ, తూగు అంతర్లీనంగా వుండాలి. “కంఠగత లక్షణం” మంచి పోయెమ్ కి వుండాల్సిన లక్షణం కూడా, వచన కవిత్వం అయినా సరే. బాగున్న పద్యం, అది యే రూపంలో వున్నా, కాళిదాసు చెప్పినట్టుగా, “రసనగర నర్తకి” గా వుండాల్సిందే. దీనికి తిరుగు లేదు. వచన కవిత్వం లో కూడా మంచి పద్యం కోట్ చెయ్యగలిగినది నోటిమీద వుండగలిగినదై వుండటం దాని ప్రభావానికి గుర్తే.
అయితే, అలాగే ఛందోబద్ధమైన పద్యాలన్నీ కూడా గొప్పవి కావు. మీరు వుదాహరించిన తిక్కన గారి పద్యం, రామాభ్యుదయంలోని తిక్కన గారి పద్యాన్ని అనుకరిస్తూ రాసిన పద్యం — వీటిని వుదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాగున్న poem ఎందుకు బాగుందో చెప్పటం తేలిక. బాగాలేనిది ఎందుకు బాగాలేదో చెప్పటం — ముఖ్యంగా సమకాలంలో — చాలా కష్టం. అంచేత మాట్లాడకుండా వూరుకుంటారు (లేదా బాబ్జీలు గారి లాంటి అవతారం ఎత్తవలసి వుంటుంది మరి నిజాలు చెప్పడానికి).
ఇంకా మళ్ళీ వెనక్కి అంటే ఛందోబద్ధమైన పద్యం రాయటం దగ్గరికి వస్తాను. మంచి లయతో, ధారాశుద్ధితో చక్కని ఉపమానంతో, పుష్టిగా వున్న భాషతో (భాషాడంబరం కాకుండా) ఎవరైనా రాస్తే, పద్యం అయినా చెలామణీ అవుతుందనే నేననుకుంటాను, ఇవ్వాళకూడా!
విషయం ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఛందస్సును స్వాధీన పరుచుకొని పరిపుష్టిగా పద్యాలు చెప్పేవాళ్ళ సంఖ్య తగ్గటం వల్ల పద్యం వెనకబడింది తప్ప, వచన కవిత్వం వల్ల కాదు. ఔననిపించుకునే పద్యాలు రాసేవారి సంఖ్య పద్యంలోనూ, వచన పద్యంలోనూ కూడా ఇవ్వాళ తక్కువే సుమా.
“వస్తువు” ముఖ్యమే ఎప్పుడైనా కవిత్వంలో. కానీ దాని వ్యక్తీకరణ ఎట్లా వున్నదన్నదాని మీదనే ఒక మామూలు కవికి, ఒక మహాకవికి మధ్యనుండే భేదం బోధపడుతుంది.
కవి నామధేయులు ఉంటారు అన్ని కళల్లోనూ. కవులు కొందరే వుంటారు అన్ని కలాల్లోనూ. రూపం ఏది అన్నదానికన్నా సారం ఎంత అన్నది చూడవలసిన విషయం కవిత్వంలో. ఎందులోనైనా బాగున్నవి నిలబడగలిగినవీ నిలబడతాయి. మిగితాయి పోతాయి. అది కాల మహిమ. అదంతే. మంచి కవిత్వానికి, మంచి సంగీతానికి సూర్య చంద్రులు కాపలా వుంటారు. నిశ్చింతగా వుండండి. అస్తు!
జయప్రభ.
baabjeelu అభిప్రాయం:
August 20, 2008 9:16 am
మా ముత్తేలు తెగ్గొట్టీసినట్టు, తెగ్గొట్టీసేరు జయప్రభగారూ.
(ముత్తేలంటే చదువూ సంధ్యా లేని మధురవాణని తెలుసున్న వాళ్ళు చెప్పేరు)
సారం వుంటే “ఆళ్ళిద్దరూ” పొద్దుగూకులూ నిలబడరా? నిలబడతారు.
సారం ఏదన్న ప్రశ్నకే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
Kameswara Rao అభిప్రాయం:
August 20, 2008 9:46 am
జయప్రభగారూ,
మీరు చెప్పింది కాళోజీకి, ఈనాటి వాళ్ళకీ వర్తిస్తుందేమో కానీ, మొదట్లో కవిత్వాన్ని పద్యానికి దూరంగా నడిపించిన అతిరథ మహారథులకి ( గురజాడ, శ్రీశ్రీ, నారాయణబాబు, తిలక్, ఆరుద్ర) వర్తించదనుకుంటాను. (మిగతావాళ్ళు మహారథులు కారని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి పద్యం రాయడం వచ్చో రాదో నాకు తెలీదు!)
jayaprabha అభిప్రాయం:
August 20, 2008 10:07 am
అయ్యా బాబ్జీలు గారూ! మీరెవరండీ బాబు!!
మాకేసి ముత్తేలమ్మని మధురవాణిని నాకు చెప్తున్నారు. vaaLLu maa APPAle kaaraa?”chatri baabu” ikaTaalu meevannee!!
కృష్ణ దేశికాచారి గారి వ్యాసం మీద మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. చాన్నాళ్ళకి మంచి సరదా కలిగింది నాలో. కానీ మీతో పోటీపడి respond కాగల సత్తువ నాకు లేదు గనుక విరమించుకుంటున్నాను. కవులకి కవిత్వంతో పాటు వుండవలసిన మిగితా నేర్పుల తాలూకు లిస్టు ఇంకా నాకు నవ్వుతెప్పిస్తూనే వుంది.
ముత్తాలమ్మో, మధురవాణో, ఎవరైతేనేం గానీ, వున్నవిషయమే అన్నది కదా? సారం అన్నది అనిర్వచనీయం సామీ. వుప్పు ఎక్కువో, తక్కువో తిని చెప్పాల్సిందే, విని కాదు!
మీ “ఇజీనగరంలో” లేదా “ఇస్సపట్నంలో” మరోపాలి బొంకులదిబ్బ కాడినించి అయ్యకోనేరు దాటి వెతకండి. పైడి తల్లి, నూకాలమ్మ వరం ఇస్తే సారం మీకు తెలుస్తుంది. అనిర్వవచనీయం గనక చర్చతో పనిలేదు. ఎవరెవరి రూప సారాల సంతోషాలు వారివే.
anyway, చాలా enjoy చేస్తున్నాను మీ అభిప్రాయాలని. “ఒగ్గీకండి. రాస్తూండండి. బెగి తొంగోవాలి. శానా పొద్దోయింది”
సెలవ్..
జయప్రభ.
a_jayaprabha@yahoo.co.in