తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు

అశోకం కథ టూకీగా ఇది సీతకు రాముడితో వివాహానికి ముందే రావణుడు ఆమెను కలిసి ఆమెపై తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు. ఆమె తన వివాహనిర్ణయాన్ని విధికి, తన తండ్రికి వదిలేశానని చెప్తుంది. అప్పుడు రాముడు వచ్చి ఆమెకు తన ప్రేమను వెల్లడిస్తాడు. అతనిక్కూడా అదే సమాధానం ఇస్తుంది కాని అతన్ని ప్రేమిస్తుంది. రాముడు రావణుణ్ణి కలుస్తాడు. సీత మీద అతని ప్రేమ కూడ తన ప్రేమంత పవిత్రమైనదే అని అంగీకరించి ఇద్దరిలో ఎవరు కావాలో సీతనే తేల్చుకోమంటాడు.

తర్వాత మనం సీతను అరణ్యంలో చూస్తాం. అరణ్యవాసానికి రాముడు కష్టపడుతుంటాడు, కాని తన వెంట వచ్చినందుకు సీతకు కృతజ్ఞుడౌతాడు. అప్పుడు రావణుడు వచ్చి వాళ్ళిద్దర్నీ లంకలో తన భవనానికి ఆహ్వానిస్తాడు. సీత మీద అతని ప్రేమ ఎంత బలమైనదంటే, సీత కోసం, ఆమె భర్త కోసం తన సామ్రాజ్యాన్ని వదిలేసి దూరంగా వెళ్తానంటాడు. మళ్ళీ మనం సీతను అశోకవనంలో చూస్తాం. తనని అక్కడికి తెచ్చినందుకు రావణుణ్ణి మందలిస్తుందామె. తనది తప్పేనని ఒప్పుకుంటాడు రావణుడు. ఐతే తన ప్రేమతీవ్రత వల్ల ఆమెను చూడకుండా ఉండలేనంటాడు. సీత అతని ఆరాధనని పూర్తిగా అర్థం చేసుకున్నానని, కాని తనను అతనికి ఇచ్చుకోలేనని అంటుంది. చివరగా మనం రాముణ్ణి చూస్తాం. రావణుడు ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించాడని, మరణ సమయంలో కూడ ఆమె గురించే మాట్లాడాడనీ రాముడు చెప్తాడు. రాముడు, సీత ఇద్దరూ రావణుడి హృదయ పవిత్రతని తలుచుకుంటారు. అతనో భగ్న ప్రేమికుడు. చివరికి జన సామాన్యాన్ని తృప్తి పరచటానికి సీత అగ్నిప్రవేశం చేస్తుంది.

ఈ కథ ఇప్పుడు వినటానికి హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కాని ఆరోజుల్లో భావకవితా సంరంభంలో పవిత్రప్రేమ మీద పుంఖానుపుంఖాలుగా కవులు పద్యాలు రాశారు. శారీరక వాంఛలన్నవి లేకుండా ప్రేమ కోసం జీవితాల్ని త్యాగం చెయ్యటం గురించి రాశారు. ఈ నాటికలో రావణుడిది అలాటి పవిత్రప్రేమ. రాముణ్ణి తక్కువగా చిత్రించే ప్రయత్నం జరగలేదు కాని అతను ముఖ్యపాత్ర కూడ కాడు.

అప్పటి రచయితల్లో ముద్దుకృష్ణ గారు అంత చెప్పుకోదగిన వాడు కాడు. భావకవితా సంకలనం “వైతాళికులు”కి సంకలనకర్తగానే అతను ఎక్కువమందికి తెలుసు. ఐతే ఈ కవిత్వోద్యమంలో పాల్గొన్న కొద్దిమంది అబ్రాహ్మణుల్లో అతనొకడు. ఈ ఆధునికత ముందు కులపు గోడలు అడ్డునిలవలేదు. ఎందరో బ్రాహ్మణ కవులు బ్రాహ్మణ వ్యతిరేక కవిత్వం రాశారు.

ఈ బ్రాహ్మణ తిరుగుబాటు దారుల్లో గుడిపాటి వెంకట చలం (1894-1979) తో “మహిళా సంస్కరణ” పూర్వకమైన రామాయణ వ్యతిరేక రచనలు మొదలయ్యాయి. స్త్రీలకు వైవాహిక కామబంధాల నుంచి స్వేచ్ఛ కావాలని నమ్మాడు చలం. తన కథల్లో నవలల్లో స్త్రీల స్వేచ్ఛాశృంగారం గురించి రాశాడు. ఇప్పటి ప్రమాణాల ముందు ఈ రచనలు మామూలుగానే అనిపించొచ్చు గాని అతని కాలంలో అవి విప్లవాత్మకాలు. అతను ప్రతిభావంతమూ, శక్తిపూరితమూ ఐన తెలుగు వచనాన్ని రాశాడు. స్త్రీల శృంగార భావాల్ని గురించి లోతైన, సున్నితమైన గ్రహింపుతో స్త్రీ ప్రణయానుభూతిని మానవజీవన విజయంగా అభివర్ణించాడు. బ్రాహ్మణ ధర్మప్రమాణాల్ని తిరస్కరించి అప్పటి సంప్రదాయవాదుల్ని విభ్రాంతుల్ని చెయ్యటంలో ఆనందం పొందాడతను. మైదానం అనే నవలలో సంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చిన ఒక వైవాహిత స్త్రీ ఇద్దరు ముస్లిమ్‌ ప్రేమికుల్తో జరిపిన ప్రణయాన్ని పదేపదే వర్ణిస్తాడు. పురాణ సంఘటనల్ని కొత్త దృష్టితో చూస్తూ ఎన్నో నాటకాలు రాశాడు. వీటిలో ఇక్కడ మనకు కావలసింది సీత అగ్నిప్రవేశం (1935?) అనేది. విశృంఖల ప్రణయ చిత్రణలో ఎంతో ఉత్సుకత చూపినా, అప్పటి సాహిత్యమంతటా ఉన్న స్వచ్ఛ ప్రేమ భావాలు చలంలోనూ ఉన్నాయి.

రామాయణంలోని అగ్నిప్రవేశ ఘట్టాన్ని కొత్తగా చెప్తుందీ నాటకం. అది రామ రావణ యుద్ధానంతరం ప్రారంభమౌతుంది. తన విరహాన్ని, ప్రేమని అతని ముందు పరిచి తనని కౌగిలించుకొమ్మని సీత రాముణ్ణి అడుగుతుంది. ఐతే తన శీలాన్ని అతను శంకిస్తున్నట్టు గ్రహిస్తుంది. రావణుడామెను ప్రేమించాడు. ఐతే, “అది నా తప్పా?” అని ప్రశ్నిస్తుందామె. కాని రాముడి దృష్టిలో తనొక వస్తువునని, దానివల్ల తనకు గౌరవం వస్తున్నంత కాలమే ఏ వస్తువునైనా అతను కోరుకుంటాడని, దానికి కల్మషం అంటినట్టు అనుమానం వస్తే త్యజించటానికి వెనకాడడని గ్రహిస్తుంది. రావణుడికి తన మీది ప్రేమ పవిత్రతను వివరంగా చెప్పి సీత రావణుడి చితిలో దూకేస్తుంది[23]!

ఒకవంక ఇలా భావ కవిత్వ ఉద్యమంతో పుంజుకున్న ఆధునికతా ధోరణి బ్రాహ్మణ వ్యతిరేక భావాల్ని ఇంకా ప్రబలం చేసి మధ్య తరగతి సమాజంలో విస్తరింప జేస్తూండగా మరో వంక అనూహ్య రీతిలో మరో రామాయణం సాహిత్య ప్రపంచాన్ని ఊపేసింది. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం. తొలిభాగం ముద్రణ లోకి రావటం తోనే దాని శక్తి సౌందర్యాల్ని సాహితీలోకం గుర్తించింది[24]! ఐతే, ఇక్కడో సమస్య వచ్చి పడింది. సత్యనారాయణ గారు ఛాందస సంప్రదాయ మార్గాన్ని అనుసరించటమే కాకుండా బ్రాహ్మణ విధానాల్ని మనస్ఫూర్తిగా సమర్థించాడు. ఆరోజుల్లో మధ్య తరగతి విద్యావంతుల్లో సంప్రదాయ వ్యతిరేకత, తద్వారా బ్రాహ్మణ వ్యతిరేకతల మోజు ఎక్కువగా వుండేది. చివరికి బ్రాహ్మణులు కూడ సంప్రదాయ వ్యతిరేకులయ్యారు. వేదాలు, పురాణాలు, మిగిలిన పూర్వ గ్రంధాలు దేశాన్ని అజ్ఞానంలో ఉంచాయని ఇంగ్లీష్‌ చదివిన ఆధునికులు ఒప్పేసుకున్నారు. కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, ఇంకా ఇలాటి స్వచ్ఛతకు సంబంధించిన అనేక ఆచారాలు వెనకబడ్డ తనానికి చిహ్నాలని నమ్మారు. భారతదేశం మారాలి. అంతకుముందున్న ఆచారాల్ని తుంగలో తొక్కేసి వాటి స్థానంలో అధునాతన, పాశ్చాత్య సంప్రదాయాల్ని తీసుకోవాలి. ఇలాటి సందర్భంలో సత్యనారాయణ గారు సంప్రదాయ ఆచారాల్ని, విలువల్ని సమర్థించాడు కుల వ్యవస్థ, బాల్య వివాహాలతో సహా! మను ధర్మశాస్త్రం మీద నిలిచే సమాజానికి పిలుపునిచ్చాడు.

సత్యనారాయణ గారు అద్భుతమైన కవి కాకపోతే ఏ గొడవా లేకపోవును. ఎంతో మంది పాతతరం పండితులు కూడ ఇవే మాటలన్నారు. ఐతే వాళ్ళని ఛాందసులని కొట్టి పారేసి ఎప్పుడన్నా పాత పుస్తకాల్తో అవసరం పడ్డప్పుడు సంప్రదించే వరకే వాళ్ళ పరిధిని పరిమితం చేశారు ఆధునికులు. కాని సత్యనారాయణ గారు అలాటి వాడు కాడు. ఉజ్వ్జలమైన ధిషణ, ఇంగ్లీషులో కూడ మంచి సామర్య్థం, వీటన్నిటికీ మించి అద్భుత కవితా ప్రతిభ వున్నాయాయనలో. ఆయన తన రామాయణ పద్యాల్ని సభల్లో చదివినప్పుడు వందలమంది ముగ్ధులై విన్నారు. ఆయన సాహితీ స్వరూపం, పాండిత్య, కవిత్వ మేధ జనం మళ్ళీ సాంప్రదాయిక రామాయణం మీదికి దృష్టి సారించేట్టు చేశాయి. ఆయన రామాయణం భక్తి మార్గంలోదే ఐనా, ఆయన పాత్ర చిత్రణ, కథా కథనం ఉన్నతమైనవి. నీరసపు రామకథల్ని మళ్ళీ మళ్ళీ చదివి విసుగెత్తిన పాఠకులకు ఉత్తేజకరమైన మరో దారి చూపించాడు విశ్వనాథ.

ఆరు భాగాల ఈ బృహత్‌గ్రంధానికి తను రామాయణాంశాన్ని ఎన్నుకున్న కారణాల్ని ముందుగానే వివరించాడు[25].

బలమైన బ్రాహ్మణ ధోరణితో వచ్చిన ఈ రామాయణానికి అబ్రాహ్మణుల నుంచి అంతే బలమైన ప్రతిస్పందన వచ్చింది. ఆధునికులు, మతరహిత వాదులు, మార్క్సిస్టులకు సత్యనారాయణ గారు కంటకం అయ్యాడు. ఆయన సంప్రదాయక వాదం వాళ్ళని విముఖుల్ని చేసింది. ఒక శతాబ్దపు కృషితో జ్ఞాన, హేతువాద, వైజ్ఞానిక రంగాల్లో సాధించిన పురోగతిని కాదని వెనక్కు తిరగమని ఆయన అంటున్నట్టు వాళ్ళకు తోచింది. సత్యనారాయణ గారి మీద బహిరంగ విమర్శలు తీవ్రంగా, నిరంతరాయంగా వచ్చాయి. పాతను గుడ్డిగా సమర్థించే వాడని, రాయటం చేతకాదని, ఎవరికీ అర్థం కాకుండా రాస్తాడని తిట్టిపోశారు. ఇంగ్లీషు చదువుల వల్ల భారతీయుల బుద్ధి నశించి తమ ఉన్నత ధర్మ సంప్రదాయాల్ని వదులుకుని పాశ్చాత్య అలవాట్ల వెంట పడుతున్నారంటూ సత్యనారాయణ గారు తీవ్రమైన బ్రిటీష్‌ వ్యతిరేక వాదం చేశాడు. రామాయణ కల్పవృక్షమే కాక ఆయన ఇతర రచనలు కూడ గత యాభై యేళ్ళుగా రామాయణ వ్యతిరేక ధోరణులకి ఆజ్యం పోశాయి. ఈ కొత్తతరం రామాయణ వ్యతిరేక ధోరణిలో ఇద్దరు వ్యక్తులు ముందుగా కనపడతారు వీరు నార్ల వెంకటేశ్వర రావు గారు (1908-85), ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు.