పాఠకులకి వాల్మీకంలో ఇంత ఉత్సుకత కలగటానికి మరో కారణం అచ్చుయంత్రం. అంతకుముందు విద్యాధికులకు సైతం రామాయణ ప్రవచనానికి పౌరాణికుల అవసరం వుంటే, ముద్రణ మూలాన ఎవరికి వారు ఒక ప్రతి కొనుక్కొని సొంతంగా చదువుకునే అవకాశం కలిగింది. పూజార్హమైన తెలుగు రామాయణం లేనందువల్ల వాల్మీకమే పవిత్రస్థానంలో నిల్చింది. సంస్కృత శ్లోకం కింద తెలుగు తాత్పర్యాన్ని కూడ జతచేసి ప్రచురించేవారు. దీనర్థం పాఠకులు వాల్మీకి ఇతిహాసాన్ని, భక్తిరామాయణాల్ని పోల్చి చూడటానికి సిద్ధపడ్డారని కాదు. ఇలా సిద్ధపడక పోవటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది భక్తిరామాయణాల లోతైన ప్రభావం. దీనివల్ల రామాయణాన్ని పవిత్రగ్రంథంగా అందరూ అంగీకరించేశారు. అచ్చొత్తిన రామాయణ పుస్తకాన్ని సైతం భక్తితో పూజించేవారు. రెండో కారణం సంప్రదాయ సాహిత్యం ప్రచురణలో ప్రచురణ సంస్థల పాత్ర. తెలుగు, సంస్కృత సంప్రదాయ గ్రంధాల ప్రచురణ సంస్థలు బ్రాహ్మణ పండితుల అధీనంలో ఉండేవి. వావిళ్ళ రామస్వామి శాస్త్రుల ప్రచురణ సంస్థ స్వల్ప కాలంలోనే పూర్వగ్రంధ ప్రచురణలో అగ్రగామిగా నిలిచింది. రామాయణ ప్రచురణలో ఈ సంస్థ పాత్రను అర్థం చేసుకోవటానికి ఒక సంఘటన గొప్ప ఉదాహరణ. మద్రాసు వావిళ్ళ ప్రెస్‌లో రామాయణాన్ని అచ్చొత్తేటప్పుడు 1856లో ఇది జరిగిందంటారు. మామూలుగా అన్ని పుస్తకాలకు టైప్ సెట్ చేసే అబ్రాహ్మణ టైప్‌సెట్టర్ల చేత రామాయణాన్ని సెట్ చేయించటానికి బ్రాహ్మణ యజమానులు ఒప్పుకోలేదు. (అవి చేత్తో టైప్ సెట్ చేసే రోజులు.) అందువల్ల ప్రత్యేకంగా రామాయణాన్ని టైప్ సెట్ చేయటానికి బ్రాహ్మణ యువకులకు తర్ఫీదు ఇచ్చి చేయించారు. టైప్ సెట్ చేసేప్పుడు కూడ అబ్రాహ్మణులకు అస్పృశ్యమైన అతిపవిత్ర గ్రంధమది!
అబ్రాహ్మణుల స్థాయీ పరివర్తనలు
ఈలోగా ఆంధ్రలో కర్షక కులాల పాత్ర కూడ పరివర్తన చెందుతున్నది. ఇంతకు ముందు చెప్పినట్లు అధునాతనపూర్వ కాలంలో శూద్ర రాజులు బ్రాహ్మణకవుల మద్దతుతో క్షత్రియత్వాన్ని సాధించేవారు. బ్రిటీష్ వాళ్ళు రాజులు కావటంతో అబ్రాహ్మణులకి క్షత్రియులయే అవకాశం పోయింది. అదీగాక భక్తిరామాయణాల భావ ప్రచారం వల్ల వాళ్ళు రానురాను బ్రాహ్మణులకు సేవకులుగా మారారు.
ఐతే, కమ్మ, రెడ్డి, కాపు వంటి కర్షక కులాల యువకులు బ్రాహ్మణుల్లాగానే పాశ్చాత్య పాఠశాలలకు వెళ్ళారు. బ్రిటీష్ పాలనాంగంలో ఉద్యోగాలకు అవసరమయ్యే చదువులు వాళ్ళూ చదివారు. ఆ ఉద్యోగాల వేటలో వాళ్ళు అప్పటి వరకు తమకు గురువులుగా, అంతకుముందు క్షత్రియత్వం సిద్ధించటానికి అండదండలుగా వున్న బ్రాహ్మణులతో పోటీ పడ వలసి వచ్చింది. ఆంధ్రదేశ చరిత్రలో తొలిసారిగా వృద్ధిలోకి వస్తున్న అబ్రాహ్మణులు బ్రాహ్మణుల్ని తమకు శత్రువులుగా చూడసాగారు. కొత్తగా విద్యాధికులైన అబ్రాహ్మణ యువకుల్లో కమ్మ కులంవాడైన త్రిపురనేని రామస్వామి చౌదరి గారు (ఈయన్ని ఇంతకు ముందే పరిచయం చేశాను), రెడ్డి కులం నుంచి కట్టమంచి రామలింగా రెడ్డి గారు ( 1880-1951) ప్రముఖులు. రామస్వామి చౌదరి గారు ఐర్లెండ్ నుంచి న్యాయవాద పట్టభద్రుడు. అతను మహాభారత ఇతిహాస కథకుడూ అబ్రాహ్మణుడూ ఐన సూతుని పేర తెనాలిలో తన అనుయాయుల కోసం సూతాశ్రమం అనే సంస్థను నెలకొల్పాడు. పురాణాలు శూద్రుల్ని బ్రాహ్మణులకు సేవకుల్ని చేసే బ్రాహ్మణ కల్పితాలుగా ప్రతిపాదిస్తూ వాటన్నిటినీ తిరగరాసే పనికి పూనుకున్నాడు. ఐతే రామాయణ వ్యతిరేక ధోరణికి అతను ఊపిరి పోసింది ఇదివరకు చెప్పిన శంబుకవధ నాటకం తోనే.
ఇదే సమయంలో పఠన పద్ధతులు కూడ విప్లవాత్మక పరివర్తనలకు లోనవుతున్నాయి. అప్పటివరకు చదవటం అంటే పైకి చదవటం, విమర్శ అంటే అందరిముందూ మౌఖికంగా వివరించటం. ముద్రణ వల్ల నిశ్శబ్ద పఠనం సాధ్యమైంది. తాటాకుల నుంచి అచ్చుపుస్తకాల్లోకి మార్చటం కేవలం తేలిగ్గా అనేక ప్రతులు తయారుచేసే మార్గమే కాదు. అచ్చుపుస్తకం రాకముందు పౌరాణికుడు రాతప్రతిని మూలపాఠంగా ఉంచుకుని దాన్నుంచి పురాణం చెప్పేటప్పుడల్లా తనో కొత్త పాఠాన్ని తయారుచేసుకునే వాడు. ఇదీ శ్రోతల మనసుల్లోకి ప్రవేశించే పాఠం. తాటాకు గ్రంథాల్ని చదవటానికి, పురాణంగా చెప్పటానికి ప్రత్యేక శిక్షణ అవసరమయ్యేది. అలాటివాటిని ముద్రించి ఎలాటి ప్రత్యేక శిక్షణ లేనివారికి అందుబాటులోకి తేవటం వల్ల అనిదంపూర్వమైన పఠనా విధానాలు జనించాయి. పాశ్చాత్య విద్యలు అచ్చు పుస్తకాన్ని అవిభాజ్యమైన, సర్వ స్వతంత్రమైన వస్తువుగా భావించే మనస్థితిని అప్పటికే కలిగించాయి. అందువల్ల అచ్చు పుస్తకం అంటే దాన్లో వున్న ప్రతి పుట, ప్రతి పదము ఒక ఏకైక రచయిత మనః పూర్వకంగా చేసిన సృష్టిగా భావించ సాగారు.
పుస్తకం అవిభాజ్యం అన్న భావన నుంచి లేనివి కల్పించి ప్రక్షిప్తం చెయ్యటం, ఉన్న విషయాన్ని మార్చటం, లాటి భావాలు వచ్చాయి. ఇంగ్లీష్ విద్యావంతులైన తెలుగు మేధావుల మీద “రామాయణంలో తొలి, చివరి భాగాలు మూల గ్రంధానికి తరువాతి చేర్పు”లన్నజాకోబి లాటి పాశ్చాత్యుల గ్రంధ సిద్ధాంతాలు బలంగా ప్రభావం చూపించాయి. వాల్మీకానికి మక్కికి మక్కి అనువాదాలు ముద్రిత రూపంలో తేలిగ్గా దొరకటంతో దానికీ ప్రాంతీయ భాషా రామాయణాలకీ మధ్య ఉన్న వైవిధ్యాల మీద విద్వాంసులు దృష్టి సారించారు. ఈ విద్వాంసులు వాల్మీకాన్ని ముద్రణ రాక మునుపు ఎన్నడూ చదవని విధంగా చదవసాగారు. ఈ కొత్త పఠన విధానంతో దాన్లో ఎన్నో అంతర్గత పరస్పర వైరుధ్యాలు (ఇంటర్నల్ ఇన్‌కన్‌స్టిస్టెన్‌సీస్), సమస్యాత్మకాలైన పునశ్చరణలు కనిపించ సాగాయి. ఇవి ఐతే, కవి చేసిన దోషాలు గాని, లేకపోతే, ఆ తరువాత ఎవరో బయటివాళ్ళు దురుద్దేశంతో చేసిన ప్రక్షిప్తాలు కాని కావాలని భావించారు.
ఆ కాలపు అధునాతన రామాయణ విద్వాంసులు ఒక వంక వాల్మీకమే మూల రామాయణంగా నిర్ధారిస్తూ దాన్ని ప్రశ్నించ సాగారు. వాళ్ళే మరో వంక శతాబ్దాలుగా రామాయణ కర్తలకు అందుబాటులో వున్న సదుపాయాన్ని వాడుకుని రామాయణాన్ని తమ చిత్తానికి వచ్చిన విధంగా చెప్ప సాగారు. ఐతే వాళ్ళు తమ రచనలకి ముందుమాటలు రాసి అందులో విధిగా ఈ తరానికి పరంపరగా అందివచ్చిన వాల్మీకి రామాయణ గ్రంధపు నిర్దుష్టతని ప్రశ్నించారు. దాదాపుగా ప్రతి రచయితా పాశ్చాత్య విద్వాంసుల గ్రంధ పరిశీలన సిద్ధాంతాల్ని అంగీకరించారు. వాల్మీకి విరచితమైన “అసలు రామాయణా”న్ని పట్టుకోవటానికి చాలా శ్రమించారు. ఆయన పాఠం లో అనంగీకార యోగ్యాలు, లేదా పరస్పర విరుద్ధాలు, ఐన భాగాల్ని బ్రాహ్మణుల చేర్పుల కిందో లేకుంటే వాల్మీకి బ్రాహ్మణ పక్షపాత వైఖరి గానో చూశారు.
భరత ఖండంలో ఆర్య, ద్రావిడ జాతులు ఉన్నాయన్న పాశ్చాత్య పురాజీవ శాస్త్రజ్ఞుల (యాంత్రొపాలజిస్ట్‌స్) జాతి సిద్ధాంతాల ఆధారంగా ఈ పనిని చాలా ఆత్మ విశ్వాసంతో సాగించాడు రామస్వామి చౌదరి గారు. ఆయన దృష్టిలో బ్రాహ్మణులంతా ఎక్కడినుంచో వచ్చిన ఆర్యులే. ప్రాంతీయ కర్షక కులాలైన కమ్మ, రెడ్డి వంటి వారు ద్రావిడులు. సూతపురాణం (1924) అనే తన ప్రఖ్యాత రచనలో ఆయన రామ కథని తను ఎలా జరగాలని కోరుకున్నాడో అలా రాశాడు. దాని ప్రకారం రావణుడు ద్రావిడ, కోయ జాతి వాడు[18]. సింహాసనానికి వచ్చాక జంతుబలుల్ని నిషేధించిన శాంతి ప్రియుడు. వేదాధ్యయన శీలుడు, వ్యాకరణ పండితుడు, మోహనాకారుడు, ధర్మ పాలకుడు.
అప్పుడు ఉత్తరాన్నుంచి బ్రాహ్మణులు వచ్చి గోవధల్తో యజ్ఞాలు మొదలు పెడతారు. విశ్వామిత్రుడనే బ్రాహ్మణ ఋషి యాగం తలపెట్టినప్పుడు గోబలి ఆ రాజ్యంలో నిషేధం కనుక ఆ ప్రయత్నాన్ని విరమించమని అతనికి సౌమ్యంగా చెప్పటానికి రావణుడు తాటకను పంపుతాడు. ఋషి వినడు. దాంతో తాటక అనుచరులు ఋషిని శిక్షించటానికి గోవుల్ని విడిచిపెట్టి, హోమాగ్నుల్ని ఆర్పేస్తారు. ద్రావిడుల మతం మార్చటానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ బ్రాహ్మణ ఋషి వాపోతాడు[19].
అప్పుడతను సాకేత రాజు దశరథుని వద్దకు వెళ్ళి అతని కొడుకులు రామ లక్ష్మణుల్ని తీసుకు వస్తాడు.
చౌదరి గారి కథనంలో రావణుని సోదరి శూర్పణఖ వృద్ధురాలు. బ్రాహ్మణ మునుల ప్రేరణతో ఆమె కొడుకు జంబుకుమారుణ్ణి లక్ష్మణుడు వధిస్తాడు. పుత్రశోకంతో కారణం అడగటానికి రాముని వద్దకు వెళ్తుందామె. రాముడు బాధ్యతారహితంగా వాడు మునులకు శత్రువని సమాధానం ఇస్తాడు. దాంతో ఆమె కోపించి కత్తితో రాముడి మీదికి దాడిచేస్తుంది. రాముడు వీరావేశంతో ఆమెని ఒడిసిపట్టుకుని ముక్కూ చెవులూ కొయ్యమని తమ్ముణ్ణి ఆజ్ఞాపిస్తాడు. రాముడికి గుణపాఠం నేర్పటానికి సీతాపహరణమే మార్గమని భావిస్తాడు రావణుడు. కాని అతను సీతను గౌరవంగా చూస్తాడు. ముఖ్యంగా, ఆమె పట్ల ఎలాటి శృంగారభావనలు అతనికి లేవు.