ఇలాటి సరళీకృత కథనంతో నాటకీయత కాని ఘర్షణలు గాని లేక కథ నీరసం కావటం సహజమే. కాని ప్రఖ్యాతాలైన భక్తిరామాయణాలు సంక్లిష్టత లేమిని శబ్ద సౌందర్యంతో, భాషా పాటవంతో అధిగమిస్తాయి. భజనల సంగీత మాధుర్యం, త్యాగరాజ రామదాసుల మధుర కీర్తనలు, వ్యక్తుల్ని సమష్టిలో ముంచెత్తి ఆనందాతిరేకతని కలిగిస్తాయి. ఈ కాలంలో ప్రచారంలో వున్న రామాయణ ప్రదర్శన విధానం శ్రుతపేయమైన జంత్రవాద్యాల్తో ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు చెయ్యటం (అన్నట్లు ఇది తులసీదాసు రామచరిత మానస్ కి అనుసరణ). మునిపల్లె సుబ్రహ్మణ్య కవి గారు (1760-1820) రాసిన ఈ చక్కటి గీతాల్ని విద్వాంసులైన ప్రదర్శకులు మధ్యమధ్యలో వ్యాఖ్యానాలు చేస్తూ వినిపించేవారు. వందల కొద్ది శ్రోతల్ని పరవశుల్ని చేసేవారు.
తెలుగునాట భక్తిరామాయణ ప్రచారానికి ఉపయోగించిన మరో సాధనం హరికథ. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు (1864-1945) అనే అద్భుత గాయకుడు దీన్ని ప్రవేశపెట్టి ప్రాచుర్యం తెచ్చిపెట్టాడు. ఆంధ్రదేశంలో ఊరూరా ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగేవి. రామ జన్మదినం, సీతారామ కళ్యాణదినం కూడ చైత్రనవమి అని నమ్మకం. ఆ రోజుతో ఉత్సవాలు ముగిసేవి. ప్రతి పల్లెలో రామమందిరాలు, రామభజన బృందాలు వెల్లివిరిశాయి. తెలుగు దైనందిన జీవితంలోకి ప్రవేశించిన పాటలు, గీతాలు, వీధి నాటకాలు, పద్యాలు కోకొల్లలు. ఏది రాయటానికైనా ముందు శ్రీరామ రాయటం ఆచారం ఐంది చివరికి చాకలిపద్దులకు కూడ!
ముఖ్యంగా చెప్పుకోవలసింది రామకోటి సంప్రదాయం. కోటి సార్లు రామనామం రాయటం వల్ల ముక్తి కలుగుతుందనే విశ్వాసం దీనికి మూలం. ఈ ప్రదర్శనలు, అలవాట్లు రాముణ్ణి తొలివేలుపుగా చేశాయి; అతని కైంకర్యాన్ని ప్రోత్సహించాయి. రాముడు తెలుగువారి ఆరాధ్యదైవం అయ్యాడు. ఈ భక్తిప్రవాహం ఎంత విపరీతమైందంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి సంప్రదాయవాది కూడ దాన్ని సున్నితంగా వేళాకోళం చేశాడు[12].
బ్రాహ్మణుల రాజకీయ బలం ఎంతగా తగ్గిందో రాముడికి అంతగా దాసులయ్యారు వాళ్ళు. అలా వాళ్ళ శక్తిహీనతే సర్వశక్తివంతుడైన భగవంతుడి మీద భక్తునికున్న శక్తిగా పరిణమించింది. ఒక వింత రీతిలో, భక్తుడి భక్తి ముందు భగవంతుడు నిర్వీర్యుడయ్యాడు ఆయన మీది భక్తి ఆయన కన్నా కూడ శక్తివంతమైంది కనుక! రామాంజనేయ యుద్ధం అనే విపుల ప్రచారం పొందిన నాటకం ఈ భావనకి ఒక మంచి ఉదాహరణ. దీన్లో రాముని పట్ల ఉన్న అచంచల భక్తి వల్ల ఆంజనేయుడే రాముని కన్నా శక్తివంతుడు(రామబాణం కంటే రామనామం శక్తివంతమైంది!)[13].
పందొమ్మిదో శతాబ్దం చివరికి భక్తిరామాయణాలు ఆంధ్రుల జీవితాన్ని ఎంతగా నిండాయంటే, మరే రకమైన రామాయణానికీ తావులేకుండా పోయింది. రామాయణ కథని కొత్త భక్తి కవులు వాడిన తీరు, అంతకు ముందున్న వారు వాడిన తీరు పోలిస్తే ఈ పరివర్తన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సంప్రదాయ రామాయణ కవులు ఆ కథని అన్ని రకాల సాహితీ మార్గాల్లోనూ వాడారు. ఇంకా ముఖ్యంగా, వాళ్ళు వాళ్ళ రచనలకి ఊపిరి పీల్చుకునే వీలిచ్చారు. వాళ్ళు రాముడితో పరాచకాలాడారు, అతన్ని నిందించారు. కాసుల పురుషోత్తమ కవి (పద్దెనిమిదో శతాబ్ది) ది ఒక పద్యం
జనకు వాక్యమున రాజ్య విసర్జనమె కాని
యడరు శౌర్య మొకింత విడిచినావె?
దీక్ష నాభరణముల్ దివుయు మాత్రమె కాని
వర ధనుర్బాణముల్ వదలినావె?
వ్రతమని కాంచనాంబరము కట్టవు గాని
బిగువు వజ్రాంగి మై విడిచినావె?
ప్రతిన పదార్థ మే మితర మొల్లవు గాని
యభిమాన ధనముపై నలిగినావె?
నిఖిల రక్షో విదారణ నిర్భయైక
వేషధారివి నీ మునివృత్తి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ!
హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ!![14]
రామాయణ భక్తీకరణకు సమాంతరంగా సాగింది రామాయణ మూర్తీకరణం. వాల్మీకి గొప్పకవిగా పేరుపొందినా అతని పేరున ఉన్న సంస్కృత రామాయణానికి మాత్రం పెద్ద ప్రచారం లేదని ఇదివరకే చెప్పాను. బ్రాహ్మణ సంస్కృతపండితులు ఏ కొద్ది మంది దగ్గరో తప్ప వాల్మీకి రామాయణం ప్రతులు కూడ దొరికేవి కాదు. ఐతే, ఇరవైయో శతాబ్ది మొదలు నాటికి వాల్మీకి రామాయణానికి విపరీతమైన ప్రచారం వచ్చేసింది. దీనికి కారణాలు అనేకం. రామాయణం అతి పవిత్ర గ్రంథంగా భావించ బడ్డా, ఏ తెలుగు రామాయణమూ ఆ పవిత్రతని అందుకోలేదు. తెలుగు రామాయణ కర్తలెవరూ ఋషులుగా భావించబడలేదు. అలాటి స్థాయిని అందుకున్న పూర్వకవులు పోతన లాటి వాళ్ళు లేకపోలేదు. కాని దురదృష్టవశాత్తు ఆ స్థాయివారెవరూ రామాయణం రాయలేదు.
ఈ లోపాన్ని పూరించటానికి వాల్మీకి రామాయణానికి ప్రతిపద అనువాదాలు రాసాగాయి. పదిహేడో శతాబ్ది చివరి భాగంలోనే గద్వాల జమీందారు పోషణలో అలాటి తొలిప్రయత్నం జరిగింది”[15]. ఆంధ్ర వాల్మీకి గా పేరు పడ్డ వావిలికొలను సుబ్బారావు గారు (1863-1939) చేసిన అలాటి ప్రయత్నం చెప్పుకోదగింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి నుంచి తెలుగు పండితుడిగా పదవీవిరమణ చేసి శేషజీవితాన్ని భక్తుడిగా గడిపాడాయన. వాల్మీకి రామాయణాన్ని ఏ శ్లోకాని కా శ్లోకాన్ని తెలుగులోకి అనువదించాడు. గద్వాల రామాయణం లాగే తనది కూడ యధా వాల్మీక రామాయణంగా భావిస్తాడాయన. వాల్మీకంలో బీజాక్షరాలున్నాయనే నమ్మకాన్ని అనుసరించి అలాటి అక్షరాలే తెలుగులో కూడ వాడే ప్రయత్నం చేశాడు. తన అనువాదానికి బృహత్తరమైన వ్యాఖ్యానాన్ని కూడ జోడించాడు. ఐతే, వాల్మీకాన్ని అనువాదనీయం కానిదిగా భావించిన పాఠకులకు ఇది కూడ చాలలేదు. ఈ భావాన్ని తత్వ సంగ్రహ రామాయణం (పద్దెనిమిదో శతాబ్ది చివరిభాగం) నిక్కచ్చిగా చెప్తుంది
సంస్కృతమ్ రామచరితమ్ పరిత్యాజ్య నరాధమాః
పఠన్ భాషాన్తరకృతమ్ మృగతృష్ణా జలమ్ పిబేత్
“సంస్కృత రామాయణాన్ని వదిలి మరో భాషలో రామాయణాన్ని చదివే శుంఠ ఎండమావిలో నీళ్ళు తాగాలనుకునే వాడు”[16].
సంస్కృత రామాయణంలో గాయత్రీమంత్రం అంతర్గతంగా ఉన్నదన్నారు మతవేత్తలు. కనుక దాని శక్తి అనువాదాల్లోకి రాదు. అందువల్ల సంస్కృత రామాయణ పారాయణాన్ని ప్రోత్సహించారు. అందులోనూ సుందరకాండ మరీ శక్తివంతమైందని, కష్టాలు తొలగటానికి, సత్ఫలితాలు కలగటానికి దాన్ని పఠించమని చెప్పారు. ప్రచురణకర్తలు సుందరకాండని విడిగా ప్రచురించి ఉచ్చారణకు ప్రత్యేక సూచనలు కూడ అందించారు. ఉద్యోగాలు దొరకటం దగ్గర్నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం వరకు ఏయే ఫలితాల కోసం సుందరకాండలో ఏయే శ్లోకాలు చదవాలో కూడ నిర్దేశించారు[17].