రామాయణ సంప్రదాయం, వాల్మీకి
మనం రామాయణం గురించి మాట్లాడేటప్పుడు వాల్మీకి కృతమని చెప్పబడే గ్రంధంతో ప్రారంభిస్తాం. పాశ్చాత్య ఇండాలజిస్టు లకు ఇది చిరపరిచితమే. ఒక శతాబ్ది పైగా విద్యాలయ పరిశోధకుల దృష్టిని రామాయణ గ్రంధం ఆకర్షించింది. రాబర్ట్ గోల్డ్‌మన్ ఆధ్వర్యంలో ఎందరో పాశ్చాత్య సంస్కృత విద్వాంసులు కలిసి ఇటీవల నిర్వర్తించిన రామాయణానువాద బృహత్కార్యం మరోమారు వాల్మీకి రామాయణానికి పెద్దరికం ఇచ్చింది. రామానంద్ సాగర్ టీవీ కార్యక్రమం పొందిన అనూహ్య ప్రాచుర్యంతో అందరి దృష్టి రామాయణం పైకి మళ్ళింది. తర్వాత కొద్దికాలానికే హిందూ తీవ్రవాదులు బాబ్రీమసీదును ధ్వంసం చేశారు. ఇటు దశాబ్దాల పాటు పాశ్చాత్య పండితులు చూపిన శ్రద్ధ, అటు భారతీయ దూరదర్శిని కలిసి ఒక సరళ, అక్లిష్ట రామాయణ భావనకి దారితీశాయి. ఐతే, మౌఖిక, జానపద గాధలకి యీ మధ్య కాలంలో వచ్చిన ప్రాధాన్యం, దరిమిలా అనేక రామాయణాలు (మెనీ రామాయణాస్ (1991)) అన్న గ్రంధ ప్రచురణ వీటితో రామాయణ పరిశోధన విస్తృతం అయింది. కాని రామాయణం వాల్మీకి దగ్గర్నుంచే మొదలైందన్న భావన మాత్రం ఇంకా మిగిలే వున్నది. షెల్డన్ పోలాక్ మాటల్లో
“రామాయణాన్ని ఒక స్థిరమైన గ్రంధంగా కాక వేర్వేరు కాల, ప్రాంత, మతసంప్రదాయ, రచనామార్గ, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ మళ్ళీ చెప్పుకున్న రామకథగా చూడటం మంచిదని ఒప్పుకోవచ్చు. ఐతే, ఈ రామకథలన్నీ అందరికీ తెలిసిన కథనే మళ్ళీ చెప్పేవి. .. క్రీ.శ. 1000-1400 ల్లో, అంతకు వెయ్యేళ్ళ ముందూ అందరికీ తెలిసిన రామకథ వాల్మీకమూ, దాని జన్యాలదే…”[5].
రామాయణ కథా మూలం వాల్మీకం అనటమే రామాయణాన్ని గురించిన అన్ని క్లిష్టతలకూ మూలం. సంప్రదాయ రామాయణ పాఠకులూ, రామాయణ వ్యతిరేక వాద నాయకులూ కూడ వాల్మీకినే రామాయణ కర్తగా చూస్తారు. ఐతే ఒక ముఖ్యమైన తేడా వున్నది. రామాయణ వ్యతిరేకులు దీన్ని నిర్ధారణీయ సత్యంగా ప్రకటిస్తారు. రచనాకర్తృత్వం గురించిన పందొమ్మిదో శతాబ్దపు పాశ్చాత్య భావనలు ఈ ప్రకటనకు ఆధారాలు. సంప్రదాయ పాఠకులకీ, శ్రోతలకీ వాల్మీకి కర్తృత్వం నిత్యసత్యం. వాళ్ళకు రచనా నిర్ధారణ అక్కరలేదు. వాళ్ళ దృష్టిలో అదీ ఇదీ అని లేకుండా అన్ని రామాయణాలు వాల్మీకి కృతాలే.
ఈ కారణా లన్నిటి వల్లా ముందుగా రామాయణంతో వాల్మీకికి ఉన్న సంబంధాన్ని స్పష్టీకరించటం అవసరం.
మొదటగా మనం గుర్తించ వలసిన విషయం వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అనుసరించే రామాయణ పాఠం మరొకటి లేదనేది. ఐనా కాని విశేషం ఏమంటే, వాల్మీకి చెప్పిన రామాయణాన్నే తను మళ్ళీ చెప్తున్నానని అనని రామాయణ కర్తలు చాలా అరుదు. అంటే, వాల్మీకి పేరు, కర్తృత్వం ఆరాధ్యాలు ఆయన పాఠం కాదు. వాల్మీకిని, అతని పాఠాన్ని విడదియ్యటం ద్వారా ఈ ఆభాసని పరిహరించవచ్చు. మనం వాల్మీకిని, అతని పేర వున్న పాఠాన్ని విడదియ్యలేక పోవటానికి బహుశా కారణం ప్రతి రచనకు ముందు దాని కర్త ఒకరు ఉండి తీరాలని మనం విధించుకున్న ఆంక్షే. అంతేకాక, ప్రతి కథకు ఒకే ఒక మాతృక ఉంటుందనీ, మిగిలినవన్నీ దాని పుత్రికలనీ మనం నమ్మటం వల్లనే వాల్మీకి పాఠాన్ని మాతృకగా ఎంచవలసి వస్తున్నది.
అలా కాకుండా, విస్తృత ప్రాచుర్యం ఉన్న ఒక మౌఖిక కథ నుంచి ఎన్నో రామాయణ రచనలు వచ్చాయని, వాటిలో ఒక పాఠానికి వాల్మీకి పేరుతో సంబంధం కలిగిందని అనుకుంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సంబంధం వల్ల ఆ పాఠానికి ఒక ఉన్నతస్థాయి వస్తుందన్న మాట. సంస్కృత రచనలో ఉన్న వాల్మీకి కథ, క్రౌంచ వధాఘట్టం, ఆ తర్వాతి అద్భుత వృత్తాంతాల ద్వారా తేలేది వాల్మీకి కి నారదుడు, బ్రహ్మ, ఇతర దేవతలతో సాన్నిహిత్యం వున్నదని. ఇవన్నీ కలిసి ఆదికవిగా వాల్మీకికి ఔన్నత్యాన్ని ఆపాదిస్తాయి. అంత గొప్ప కవిని కర్తను చెయ్యటం వల్ల ఆ రచనకు కూడ ఔన్నత్యం వస్తుంది. కనుక నా దృష్టిలో వాల్మీకి ఒకానొక రామాయణ రచనకి కర్త కాడు. తన సాంగత్యంతో ఒక రామాయణ పాఠానికి ప్రతిష్ఠ సంపాదించి పెట్టేవాడు మాత్రమే.
ఈ దృష్టితో చూస్తే ఎందరో వాల్మీకులు ఎందుకున్నారో కూడ అర్థం చేసుకోవచ్చు. తొలిగా, నిషాదుడు బాణం వేసిన క్రౌంచాల మీద కరుణ చూపి తొలి కవిత పలికిన ఆదికవి ఉన్నాడు. రామాయణ కావ్యం లో వున్న వాల్మీకి ఇతను. బందిపోటుగా వుండి రామనామ ధ్యానంతో భక్తుడైన మరో వాల్మీకి గురించి మనం విన్నాం. అతను “రామ” శబ్దాన్ని నేరుగా పొందటానికి అనర్హుడు గనుక బ్రాహ్మణులు దాన్ని “మరా”గా అతనికి ఇస్తారు. దాన్ని మంత్రంగా పదే పదే పునశ్చరణ చేసి అతను పవిత్రమైన రామ శబ్దాన్ని సాధిస్తాడు. ఋషిగా మారి తపోనిష్టలో ఉండగా అతని చుట్టూ వల్మీకం పెరుగుతుంది. రాముడు తన చరిత్రని పాడమని అడగటానికి అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వల్మీకం నుంచి వెలువడి వాల్మీకి ఔతాడు. భక్తి రామాయణాల్లో కనిపించే వాల్మీకి ఇతను[6]. స్త్రీల రామాయణాల్లో మనక్కనిపించే వాల్మీకి సీత పాత్రకు సముచిత స్థానాన్ని ఇవ్వకుండా అన్యాయం చేసే రామ పక్షపాతి. ఈ వ్యాసంలో ముందు ముందు మరొక వాల్మీకి కనిపిస్తాడు ఇతను తొలి రామాయణాన్ని రాసిన వాడు; దాని పరిమాణం చాలా చిన్నది. ఈ రామాయణాన్ని బ్రాహ్మణులు వాళ్ళకు అనుకూలంగా తరవాత మార్చి, పెంచిరాశారు. ఇంకొక వాల్మీకి తక్కువ కులాల వారి మీద ఉన్నత కులాల పురుషుల ఆధిక్యతని ప్రచారం చేసిన వాడు. చివరగా ఇంకో వాల్మీకి ఇతను అసలు కవి కూడ కాడు. రామాయణంలో కేవలం ఒక పాత్ర. ఇలా, మొత్తం మీద ఒక కర్తతో అవసరం కలిగిన ప్రతీ రామాయణమూ తన అవసరాలకు అనుగుణంగా ఒక వాల్మీకిని సృష్టించుకుంది; కర్త అవసరం లేకపోతే అతన్ని వదిలేసింది.
రామాయణ సంప్రదాయంలో రచయితల కల్పనకు బాగా జాగా వుంది. కంబన్, తులసీదాసు వంటి గొప్ప కవుల రామాయణాలు సాహిత్యపరంగా కూడ ప్రఖ్యాతాలు. కాని పదమూడు పందొమ్మిది శతాబ్దాల మధ్య తెలుగులో వచ్చిన లాటి వాటికి మరికొన్నిటికి అంత గుర్తింపు రాలేదు. ఇంకొన్ని రామాయణాల కర్తలెవరో తెలియదు. ఐనా వాటినీ రామాయణాలుగానే అంగీకరిస్తారు. బహుశ మూల రామకథ నుంచి కవులు వాళ్ళ దేశకాలాలకు అనుగుణంగా రామాయణాల్ని తయారుచేసుకున్నారని ఈ బాహుళ్యత సూచిస్తుంది. వాల్మీకంగా చెప్పబడే రామాయణానికి కర్తలూ అలాటి వారే. రామాయణం ఒక భాష లాంటిదని, ఆ భాషలో వ్యక్తులు ఎన్నో విషయాలు చెప్పవచ్చునని మరో చోట అన్నాను[7].
ఇతిహాస రామాయణం, భక్తిమార్గం
వాల్మీకి పేర వున్న రామాయణం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే నా ఉద్దేశ్యం కొత్త విలువల్ని, వాటికి కావలసిన సాంఘిక సంస్థల్ని, ఉత్తమ ప్రవర్తనకి కొత్త దిశానిర్దేశాన్ని చెయ్యగలిగిన ఒక చారిత్రక గాధ అని. వాల్మీకి ఇతిహాసం ఆనాటి సమాజానికి నిర్దేశించిన కొత్త ప్రమాణాల్ని పోలాక్ “అయోధ్యకాండ” కు తన అనువాదం తొలిమాటల్లో స్పష్టీకరించాడు. పోలాక్ ఆలోచన ప్రకారం రామాయణం పరిష్కరించ జూసే అంతర్గత సమస్య రాచరికమే! అంటే, రాచరికం, రాజ్య పాలన, అధికార వినియోగం, వంశ పారంపర్యత, ఒక కుటుంబంలో అది సంక్రమించటంలో ఉన్న సాధక బాధకాలు వీటి స్వరూప స్వభావాలు. భారతీయ ఇతిహాసాల్లో రాచరికానికి ఇంత ప్రాధాన్యత ఎందుకనేది సహజంగానే కలిగే సందేహం. ఈ రాచరిక సమస్యలు ఆనాటికి కొత్తవి, కాలయాపన లేకుండా పరిష్కరించ వలసినవి అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవచ్చు[8].
ఇక ప్రాంతీయ భాషా రామాయణాల విషయానికి వస్తే, అవి వాల్మీకి రామాయణం లాటి ఇతిహాసాలు కావు. కథన గుణం లో వీటికీ వాల్మీకానికి చాలా తేడా వుంది. ముఖ్యంగా ఇవి భక్తి రచనలు. ఇక్కడ నేను భక్తి అనే పదాన్ని ఈ కవులు రాముడు దేవుడనే భక్తితో వీటిని రాశారని చెప్పటానికి వాడుతున్నాను.
భక్తి రామాయణాల దృష్టి రాచరికం, రాజ్య సంక్రమణాల మీద కాదు. పాఠకుడు లేదా శ్రోతకీ రాముడికీ ఉండే వైయక్తిక సంబంధం మీద. ఇక్కడ రాముడు జగన్నాథుడు. పాఠక శ్రోతలు రామకథని పదే పదే చదివి విని ఆనంద పారవశ్యం పొందుతారు. భక్తి రామాయణాల ధ్యేయం కథను చెప్పటం కాదు. కొద్దిగా కొత్త రీతిలో శ్రోత మళ్ళీ రామానుభవాన్ని పొందటమే. ఈ కథ శ్రోతలకు ముందుగానే తెలుసు. ఎన్నో సార్లు అదివరకే విన్నారు. భగవల్లీలలో మళ్ళీ మళ్ళీ పాలుపంచుకునే అవకాశం కావాలి వాళ్ళకి. కథావ్యాప్తి నుంచి సామూహికానుభవ ప్రాప్తి గా ఈ పరివర్తనని నేను మరొక చోట పేర్కొన్నాను[9].