కప్పల నిశ్శబ్దం

నా ఫోటో
నా కన్యాయం చేస్తుందని
నా కనుమానం.

రోడ్డు మీద ఆంబోతు తిష్టవేసింది .
పక్కనే ట్రాఫిక్‌ నడుపుతూ
ట్రాఫిక్‌ పోలీసు.

పెందలాడే నిద్దరోయి
పొద్దెక్కి లేస్తారు.
పిల్లల్ని చూస్తే నా కసూయ.

పిల్లి
రాత్రంతా రాసక్రీడ లాడి వచ్చి
తలుపు తెరవమని గీరుతుంది.

చిలక్కి
మా ఆవిడ మాటలు నేర్పుతోంది.
ఇప్పుడు మా ఇంట్లో రెండు చిలకలు.

ఒంటరి బాటపై
ఒంటరి చంద్రుడు
ఒకరి ఒంటరితనాన్ని ఒకరు హెచ్చవేస్తూ.

పాప నన్ను చూసి సిగ్గుపడి
అడ్డున్న గౌను కాస్తా ఎత్తి
మొహం కప్పుకుంది.

గోడెక్కి పిలుస్తోంది.
పొరుగు చెట్టుక్కాసిన పువ్వు
కోస్తే ఎవరి తప్పు?

ఈ చెట్టు కింద రోజూ నిలబడతాను.
చెట్టుకి నా పేరు తెలుసా?
నేను దాని పేరడిగానా?

చిలకని పంజరంలో బంధిస్తే
అడివిని తన కూడా తెచ్చుకుంది.
ఇల్లంతా జామకాయల వాసన.

బాజాలు బాత్తున్నారు.
తన గతీ అంతేనని తెలీని పెళ్ళికొడుకు
సంబరంగా తాళి కడుతున్నాడు.

టేబిల్‌ మీదుంచిన కొత్త ఫ్లవర్‌వాజ్‌
గదిని శాసిస్తోంది.
ఇది నా గదేనా?

రాబోయే వాని కన్న
గడిచిపోయినవి నాకిష్టం.
అందుకే, రైల్లో వెనక్కి తిరిగి కూచుంటాను .

కరెంటు పోయిందని
కొవ్వొత్తి వెలిగించిందీవిడ.
కొవ్వొత్తి వెలుతురులో కొత్తందాలు.

అర్ధరాత్రి వేళ
కప్పల నిశ్శబ్దానికి
హటాత్తుగా మెలకువొచ్చింది.


ఇస్మాయిల్

రచయిత ఇస్మాయిల్ గురించి:

కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశారు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశారు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.1976 సంవత్సరానికి మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.

 ...