కప్పల నిశ్శబ్దం

సముద్రం ఆవేశపడుతుంటే
నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది :
సాగర సంగమం.

కొత్త కోక కట్టుకొచ్చింది.
సీతాకోక చిలక.
శ్రావణ మాసం కదా.

బుల్లోడికి బుల్లికాయ
బుల్లి చంద్రుడు.
రాత్రి దుప్పటి సరిగా తడవలేదు.

పొగ చూరిన చిమ్నీలో
చిక్కుపడిన దీపశిఖ.
పంజరంలో పక్షి.

పొద్దున లేస్తూనే
ఫర్నీచరునీ నన్నూ కలిపి
పాలిష్‌ చేస్తోంది మా ఆవిడ!

సూర్యుడు అస్తమిస్తుంటే
గుళ్ళో గంటలు
మేల్కొన్నాయి.

అలల చేత తాపులు తింటోంది
సముద్రపొడ్డున ఒకే బండ.
తోటి బండలేమయాయి?

ఆకాశంలో మునకవేసి
మరింత నీలంగా వాలింది.
పాలపిట్ట.

అల్లరి చేసి, ఆపి,
తోచక తిరిగి అల్లరి చేస్తున్నాడు
ఒంటరి పిల్లవాడు.

పిల్లి నా పక్క మీద
గాఢ నిద్ర పోతోంది.
దీన్నెలా లేపను!

ఈ బాట మీద
ఎవ్వరూ నడవగా చూడలేదు.
ఇదిక్కడికి ఎలా వచ్చింది?

ఈ ఊళ్ళో
తాటిచెట్లు కూడా
వంకరే!

పిల్లి నిశ్చింతగా పడుకుంది.
దానికి తెలుసు
లేవగానే ఆహారం పంపిస్తాడని
పిల్లుల దేవుడు!

గొడుగులా ముడుచుకుని
ఎండాకాల మంతా
నిద్దరోగలిగితే బాగుణ్ణు.

ఈ దేశంలో
నా కర్ధమయేది
పక్షుల భాష ఒక్కటే.

దుమ్ముతో చెట్లూ,
టీ కొట్టూ ఎర్రబడ్డాయి.
టీ కూడా అదే రంగు.

నీలాకాశమంతా ఈది
ఇంకా తెల్లగానే వున్నాయి.
తెల్ల కొంగలు.

బోటుని
దాని నీడకి కట్టేసి
పడవ సరంగు ఎటో పోయాడు.

పిట్టలు ఎగిరాక గాని
కళ్ళంలో
పిట్టలు వాలినట్లు తెలీదు.

పౌర్ణమి చంద్రుణ్ణి
ఒక్కొక్కచెట్టుకు వేలాడదీస్తూ
తోటంతా తిరిగాను.

మనల్నింతగా అలరించే పక్షులు
పక్షులుగా నటించటానికి
ఎంత కిరాయి తీసుకుంటున్నాయి?

దుప్పటి కప్పుకోకపోతే
దోమల బాధ
కప్పుకుంటే ఉక్క.