వేసవి రాత్రులు వచ్చాయి.
చుక్కలు లెక్కిస్తూ
నిద్రలోకి జారుకోవచ్చు
లక్ష నక్షత్రాలతో
గ్రీష్మ నిశీధాలు
నా పై ప్రవహించి పోనీ!
వేసవి రాత్రి.
ఆరుబైట ఎన్ని పక్కలు!
ఆకాశంలో ఎన్ని చుక్కలు!
వాన కురుస్తున్న చప్పుడికి
ఒళ్ళు పులకరించింది.
వాన కాదు, కొబ్బరాకుల్లో గాలి.
చీకటి స్టేషన్‌లో రైలాగింది.
రైలు వెళ్ళాక మళ్ళీ చీకటి.
స్టేషను పేరు తెలీదు.
రకరకాల శబ్దాలు
చేస్తోంది వాన.
ఏమంటుందో తెలీదు.
మూల పడి వుంది గొడుగు.
వానలొస్తే కాని
ఇది వికసించదు.
లాంతరు వెలుతుర్లో
పాప చదువుకుంటోంది.
ఎవరు ఎవర్ని వెలిగిస్తున్నారు?
కొండెక్కుతుంటే
తలకిందులుగా
కోయిలకూత.
వెన్నెట్లో మెరిసిన
కొబ్బరి ఈనెలు
ఇల్లు ఊడుస్తున్నాయిప్పుడు.
చెట్టు మీంచి పిట్టపాట.
చెట్టంతా వెతికాను.
పిట్ట కనిపించదు.
నీళ్ళ నిండా మబ్బు పింజెలు.
లంకల నిండా రెల్లు దుబ్బులు.
గోదావరంతా తెల్లబడింది.
పిట్టల్ని తోలమని
పాపని కాపలా పెడితే
కాకుల్తో స్నేహం చేస్తోంది.
కొబ్బరాకులకీ
పిల్లల ఆటలకీ
వెన్నెల మెరుగుపెట్టింది.
చీకట్లో పట్టాలు మెరుస్తున్నాయి
రైలొచ్చి, ఆగి వెళ్ళింది.
తిరిగి పట్టాలు మెరుస్తున్నాయి.
నిన్న రాత్రి
ఎంత వెన్నెల కాసింది!
కాకులు కూడా నిద్రపోలేదు.
పడుకునే ముందు పిల్లలు
దెయ్యాల కథలు చెప్పుకుని
ఒకర్నొకరు భయపెట్టుకుంటున్నారు.
కప్పలకీ కీచురాళ్ళకీ
సంగీత పోటీ!
వర్షా సంధ్య.
మా యింటికి
పేరంటానికొచ్చింది కప్పపిల్ల.
వానలొచ్చిన సంబరం.
గోడ కూలిపోయింది.
చంద్రోదయం
ఎంచక్కా చూడొచ్చు ఒక మీదట.
చెట్టు కింద
సగం కొరికిన జామి పిందెలు.
పైకి చూస్తే చెట్టు నిండా చిలకలు.
జ్ఞానముద్రలో కూచున్న
బుద్ధుడు.
బోదురు కప్ప.
ఇంత వెన్నెల కాస్తున్నా
కాకి
నల్లగా అరుస్తోంది.