కప్పల నిశ్శబ్దం

తెల్లారు ఝాము రైలు
తూర్పు దిగంతాన్ని చీలుస్తుంది.
అప్పుడు బైటపడతాడు సూర్యుడు.

రైల్లో తిరిగొస్తుంటే
టెలిగ్రాఫ్‌ తీగలతో ఊగి ఊగి
కళ్ళు నిద్దరజోగాయి.

కోవెల గోపురం
కోనేట్లో
కుబుసం విడిచింది.

దారి పొడుగుతా
రైలు చక్రాలు
నీ పేరే  ఉచ్చరించాయి.

వాన జల్లుకి
వంద గొడుగులు
వెంటనే వికసించాయి.

కబుర్లాడుతూ కూచున్నాం సాయంత్రం వేళ.
క్రమంగా చీకటి పడింది.
నీ మొహమొక్కటే మెరుస్తూ చీకట్లో.

పక్షులెగిరిపోయాక రాత్రి
నక్షత్రాల్ని చేరదీస్తుంది
చెట్టు.

తాచుపాములా మెలికలు తిరుగుతూ
రైలుబండిని తరుముకుంటూ వచ్చి
కాలవలో దుమికింది బాట.

తెల్లారకట్ట
చీకటి నోరు తెరిచింది.
కాకి పిల్ల.

అర్ధరాత్రి వరకు వేచి
చంద్రవీర్యం పడగానే
పులకరించి పోయింది బావి.

టెలిగ్రాఫు తీగల మీద పిట్టలు.
కొన్ని ఎడమొహం, కొన్ని పెడమొహం.
చివరికి తీగలు మిగిలాయి.

ఎర్ర పిర్రల కోతులు గెంతుతున్నాయి.
నీ పిర్రలు ఎర్రబడితే
నువ్వూ గెంతుతావు.

బట్టల్ని ఉతికి ఆరేశారు.
ఎంత ఉజ్వ్జలంగా ఉందో ప్రపంచం !
నా మనస్సు కూడా ఉతుక్కుపడినట్టుంది.

కొబ్బరాకుల కొనలు
గాలి తలని దువ్వుతుంటే
నా కళ్ళు నిద్రజోగాయి.

పదునుబెట్టిన అంచుతో
తహతహలాడుతున్నాడు చంద్రుడు.
ఒక్క మబ్బుతునకా కనిపించదేం?

వేసవి వచ్చింది కాని
కోయిల రాలేదు;
ఎండలకి విరుగుడేమిటి?

ఆకాశం నిండా మబ్బు నురగలు.
అరిగిపోయిన సబ్బు బిళ్ళ
అడుగున చంద్రుడు.

కాంతి పూర్తిగా ఎండిపోయినా
పశ్చిమాకాశాన్ని వదలని
సూర్యుడి అవశేషం.

కొబ్బరాకుల్లో చిక్కుకున్న చంద్రబింబం.
ప్రియురాలి తలపోతలో ప్రియుడు.
ఎవరు ఎవర్ని వెలిగిస్తారు?

మెట్ల పెదిమలపై
మెల్లగా విస్తరిస్తూ
వెన్నెల చిరునవ్వు

కాకినాడ ఆకాశంలో
విరిసింది సంజగులాబీ.
నగరవాసులే దీనికి ముళ్ళు.

మామిళ్ళు పూచాయి.
తోపునిండా, కాపు తల నిండా
తుమ్మెద ఝంకారం.