కప్పల నిశ్శబ్దం

ఎర్రగా మండే ఎండాకాలంలో
ఈ గుల్‌మొహర్‌ మంటలేమిటి !
మంటకి మంటే మందు.

పటిక బెల్లం తింటుంటే
పాప చూసి, ఆగింది.
దానికి పెట్టాక ఇంకా తీపెక్కింది బెల్లం.

అర్ధరాత్రి రైలు కిటికీలో
అకస్మాత్తుగా
చంద్రోదయం.

ఒక రాత్రి వేళ
సెలయేరు గలగలమంది.
ఎక్కడో కొండల్లో కురిసిన వర్షం.

సీతాకోక చిలకలా
ఎగరటం నేర్చుకుంటాను ;
అన్ని దిక్కులకీ ఒకేసారి.

కోనేట్లో దేవాలయ గోపురం.
కలచకండి నీళ్ళని, జాగ్రత్త;
గోపురం కూలిపోగలదు.

ఊరు నిద్దరోయాక
చెరువు మేల్కొంది.
తరవాత ఎవరికీ నిద్ర లేదు.

కోడిపుంజుల్ని
కోసుకు తినేసారు మా ఊరివాళ్ళు.
ఇక తెల్లారకట్ట రైలు మిగిలింది.

కాళ్ళకి కాళ్ళు తొడుక్కొని
నీళ్ళల్లో నించున్నాడు కుర్రాడు.
రెండు మొహాల్లోనూ ఆశ్చర్యం.

వీధి పొడుగునా
పిల్లంగోవి కిటికీలు,
ఒక కిటికీలో అమ్మాయి మొహం.

తెల్లారుఝాము నిద్దట్లో
రైలో, గేదో అరుస్తుంది.
లేస్తూనే పాలు సిద్ధం.

పౌర్ణమి చంద్రుడు,
ఊరంతా వెన్నెల.
నిండు కుండ తొణకదంటారేమిటి ?

నువ్వెళ్ళి పోయాక
అన్నీ అలాగే ఉన్నాయి, ఏమీ మారలేదు.
అదే నా బాధ.

పిల్లి తోకకీ
పిల్లలకీ ఏమిటీ ఆకర్షణ?
పిల్లి తోకాడిస్తోంది.

రోము నగరాన్నించి
బొమ్మ పోస్టుకార్డు పంపించాడు మిత్రుడు.
ఈ వీధుల్లో ఎక్కడో తప్పిపోయినట్టున్నాడు.

ఇద్దరు చంద్రులతో
ఇంటికి తిరిగొచ్చా నివాళ సాయంత్రం.
ఆకాశంలో ఒకడు, కాలవలో ఒకడు.

ముందు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరించింది చీకటి.

కిలకిలమంటూ బడిలో పిల్లలు.
పిట్టలన్నిటికీ ఒకే పాట నేర్పాలని
పట్టు పట్టిన మేష్టారు.

చెరువు.
చెరువులో ప్రతిబింబాలు.
వాటిని అనుకరిస్తూ గట్టుపై చెట్లు.

తలకి మబ్బూ
కాళ్ళకి సరస్సూ తొడుక్కోకపోతే
కొండ కొండే కాదు.

చెరువు లేకపోతే
చెట్ల నీడల్ని
ఎవరు చేరదీస్తారు?