ఈమాట » నూలు చీర

Expand to right
Expand to left

నూలు చీర

ఎప్పుడో తన రోజుల్లో వొక వెలుగు వెలిగిందే
అప్పుడప్పుడూ తన మెరిసే జిలుగుల్ని ప్రదర్సించిందే
పాముకుబుసం కాక పోయినా, పట్టు వస్త్రం కాక పోయినా
ఇనుప బీరువా సొరుగుల్లో వాటి చెంత వున్నదే
ఏ జన్మలో, ఏ లోకాన ఏ అదృష్టం చేసుకుందో కాని
మా అమ్మ చుట్టూ మెత్తగా చుట్టుకునేది రంగు పోతేనేం
మా అమ్మ ఎద మీద వెచ్చగా పరుచుకునేది
తడి తగిలిన అమ్మ చేతుల్ని మురిపెంగా తుడుచుకునేది
చిన్నప్పుడెప్పుడో వేడి ఇస్త్రీ పెట్టెతో ఆడుకున్నా
తర్వాత దాని సెగతో తెగతెంపులు చేసుకొని
ఒక తాపసి లా వొక చెట్టులా ప్రాపంచిక మెరుగుల్ని
వదిలేసి మా అమ్మ అనంత సౌందర్యంలో వొకటై పోయింది
అమ్మకీ చీరకీ మధ్య భేదం కరిగి పోయింది
మెత్తటి ఆ నూలు చీర మా మనసుల్లో
రంగూ రూపం లేని భావంలా మిగిలిపోయింది

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    August 4, 2008 11:05 am

    సాయి గారూ,
    అభిప్రాయాలు రాసేవాళ్ళు, కవి/రచయిత కి తెలియని విషయాలు చెప్పాలి, తప్పులు ఎత్తి చూపాలి, విపులంగా రాయాలి అని మీరు “నొక్కి వక్కాణించ” డానికి ఇదో ప్రయోగం.
    “ఈ మాట” ని నేను “రవికిరణు” కవిత్వం తో మొదలెట్టేను. “నూలు చీర” ఎలా “మిస్ కొట్టీసేనో?” ఈ కవితకి అభిప్రాయం రాస్తూ, “రవికిరణు గారూ మీరు ఈ కవితని ఇలా రాయాలి. చిత్తగించండి.” అని రాస్తే “సృష్టికర్తలు” “సృజనాత్మక శక్తి” వుందని మేం నమ్ముతున్నవాళ్ళు వూరుకుంటారా?
    (రవికిరణు గారూ, క్షమించాలి. దీనికి మీరు స్పందించకండి)
    *************
    {”నూలు చీర”
    కొత్తలో
    వెలుగు, జిలుగుల్ని ప్రదర్శించిందే,
    పాముకుబుసం కాకపోయినా
    పట్టు వస్త్రం కాకపోయినా
    వాటి సావాసగత్తె.
    మా అమ్మకి అమ్మేమో
    అమ్మని చుట్టుకునుండేది, కనిపెట్టుకునుండేది.
    అమ్మ కన్నీళ్ళకీ, వేణ్ణీళ్ళకీ, చన్నీళ్ళకీ
    అమ్మ కష్టాలకీ, సుఖాలకీ,దుఃఖాలకీ
    మమ్మల్ని మించిన తోడు.
    కుంకుమ తప్ప పౌడరు వాసన మర్చిపోయిన అమ్మలా
    తడి పిడిచి ఆరెయ్యడం తప్పఇస్త్రీ పెట్టె సావాసం అడగలా.
    ఒక చెట్టులా, తాపసిలా
    ప్రాపంచిక సౌందర్యం వదిలేసి
    మా అమ్మ అనంత సౌందర్యంలో కలిసిపోయింది.
    అమ్మకీ, చీరకీ తేడా తొలగిపోయింది.
    ఆ ముతక నూలు చీర
    మా మనసుల్లో రంగూ, రూపం లేని భావంలా
    మా అమ్మలా మిగిలిపోయింది.}

    సాయి గారూ, మీరంతా “ఫలించిన వృక్షాలు.” “రాతి దెబ్బలకి” చలిస్తారేం?

    {రవికిరణు గారూ, ఈ నూలు చీర అమ్మకి తలదిండుగా కూడా పనిచేసేది, ఇంటికి చుట్టాలొచ్చినపుడు. ఉన్న తలగడలు ముఖ్యవైనవాళ్ళకిచ్చీసి, మిగిలినవాళ్ళకి బొంతలూ, దుప్పట్లూ మడతపెట్టిచ్చేక, “అమ్మా నీకో” అన్నపుడు, “దా, పడుకో” అని పిలిచి అమ్మ తలకింద ఈ “నూలుచీరే” “ఆదిశేషుళ్ళా” నుమ్మలు చుట్టుకుని.}

    సాయిగారూ,
    బతుకు తెలిసిన మీలాటివాళ్ళు, అనుభవాన్నిభావంగా పట్టుకోగలిగిన మీలాటివాళ్ళు, భాష తెలిసిన మీలాటివాళ్ళు, “టుమ్రీ” గాళ్ళ “అజ్ఞానపు విజ్ఞానపు” అభిప్రాయాల్ని పట్టించుకోకుండా, రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి. అప్పుడే కదా “ఈ మాట” ఏడాదికే నాలుగేళ్ళెదిగినప్పటికీ ఎప్పటికి ముఫ్ఫైలోపే వుంటుంది. “భారతి” లా కాకుండా.

  2. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 5, 2008 11:55 am

    బాబ్జీలు గారూ,

    సరదాగా రాసింది “దిల్” మీదకి తీసుకున్నట్లున్నారు.
    తప్పులు దొర్లితే చూపించడమూ, అచ్చయిన దాన్ని “ఇలా రాయాలి సుమా” అని చెప్పడమూ రెండూ ఒకటి కాదని నా అభిప్రాయం. రెంటికీ తేడా ఉంది.
    మీ స్పందన కంటే,
    “రోజుకి మూడు కవితలూ ఆరు వ్యాసాలుగా, “చింతబొట్టలు దులిపినట్టు” దులిపేయాలి.” అన్న సలహా బాగా నచ్చింది. ఇది నాకు మాత్రమేనా? లేక “చెయ్యి” చేసుకునే అందరికీనా?

    మీకు పలవరింతలెలాగో, నాకు ఈ పేలాపన్లలాగ!
    బతుకు మాట దేవుడెరుగు, “అబద్ధం నిజంలా మాట్లాడ్డం మాత్రం నాకు తెలీదు.”
    నమ్మినా, నమ్మక పోయినా మీ వాక్యం మాత్రం నాకు నచ్చింది.
    ఇహ ఈ చర్చకి దారీ, తెన్నూ లేనట్లు అనిపిస్తోంది.

    శలవ్,
    సాయి బ్రహ్మానందం

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a