రెండో పాత్ర
పాపను పడుకోబెట్టినపుడు
తనపై పరుచుకున్న నిద్రని
దుప్పటిలా తొలగించివచ్చి
ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది.
కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని
కాసిని చన్నీళ్ళతో కడిగింది.
పాపచేతినుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని
తిరిగి నడుముకు చుట్టుకుంది.
పాప ఇల్లంతా పరచిన దాని ప్రపంచాన్ని
ఒద్దికగా ఒకచోట సర్దింది.
ముడిపెట్టిన శిరోజాల్లాంటి తన ఆలోచనల్ని
సున్నితంగా విడిపించి పరుచుకుంది.
పాపచుట్టూ పరిభ్రమించిన
తన సర్వ శక్తుల్నీ
తిరిగి తనవైపుకు తిప్పుకుంది.
పాప ఆకర్షణలో కరిగిపోయిన
తన ఆకర్షణల్ని
ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది.
పగలంతా పాల వాసనవెంట
పరుగులెత్తిన ఈమె
సగంరాత్రివేళ పారిజాతమై పరిమళిస్తుంది.