ఈమాట » తెలుగు సినిమాలు స్త్రీ

Expand to right
Expand to left

తెలుగు సినిమాలు స్త్రీ

తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసిన పాత్రలే. ప్రతి స్త్రీ పాత్ర కూడ స్త్రీల మీద మరింత బురద చల్లేందుకు, మరింత హాని చేసేందుకు ఉద్దేశింపబడినట్లే కనిపిస్తుంది. అడపా, దడపా కొద్దిగా వైవిధ్యం కనిపించినా అది చెప్పుకోదగినది కాదు. స్త్రీలందరూ ఒక్కటే కాదు అంటూ ఉద్యమాలు, వాదాలు గొంతెత్తి అరుస్తున్నా, తెలుగు సినిమా చెవికి అవి చేరడం లేదు. సాంఘికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాల స్త్రీలను ఎలా చూపిస్తున్నారన్న విషయాన్ని కాసేపు పక్కనపెట్టి (దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది) “స్టాండర్డ్‌” స్త్రీపాత్రలు అంటే అగ్రకుల, మధ్యతరగతి స్త్రీపాత్రల వైపు ఒక్కసారి చూద్దాం.

గృహహింస / సాంసారిక హింసను మగవాడి పౌరుషంగా, ఆడదాని సహనంగా చిత్రీకరించి ఆకాశానికెత్తేయడం తెలుగు సినిమాకు మొదట్నుంచీ ఉన్న గుణమే. నాటి “లక్ష్మమ్మ కథ” నుండి ఈనాడు విడుదలవుతున్న సినిమాల వరకు అన్నీ ఒకే విషయాన్ని రకరకాలుగా చెబుతున్నాయి, చూపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలు ఈ విషయాన్ని చెప్పడంలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దీనికి ఓ ఉదాహరణ 2000 సంవత్సరంలో విడుదలయిన ఓ శతదినోత్సవ సినిమా. ఇప్పటిదాకా కేవలం కన్నీళ్ళు, త్యాగాలు, పశ్చాత్తాపాలతో నిండిపోయిన గృహహింస ఈ సినిమాలో “జనరంజకమైన” హాస్యంగా మారిపోయింది. ఇంత గొప్ప భావవిప్లవం బహుశా ఏ ఉద్యమమూ సాధించలేదేమో! తాగుబోతు భర్త భార్యని మాటిమాటికీ చెంప ఛెల్లుమనిపిస్తోంటే అది హాస్యం! విసిగి పోయిన భార్య ఎదురుతిరిగి కసాయిభర్తను చావబాదితే అదీహాస్యమే! తరతరాలుగా శిరోధార్యంగా భావిస్తూ ఊరేగిస్తున్న దిక్కుమాలిన బానిసత్వాన్నే ఇక్కడ వినూత్నరీతిలో ప్రదర్శించారు / బోధించారు.

తోటి మనిషిని చితకబాదడాన్ని కూడా నవ్వు పుట్టించేలా చిత్రీకరించిన సినిమా మేకర్స్‌ది సెన్సాఫ్‌ హ్యూమరా? సినిసిజమా? సినిమాను చాలా శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవచ్చని, ప్రేక్షకుల దృష్టికోణంలో విపరీతమైన మార్పును తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చని ఈ సినిమా మరోసారి ఋజువు చేస్తుంది. ఇంతకాలం కన్నీళ్ళు తెప్పించి, కాసులవర్షం కురిపించడానికి ఉపయోగపడిన హింస ఈ సినిమాలో నవ్వులు పుట్టించి, విజయం సాధించడానికి దోహదపడింది. నాలుగు కుటుంబాల కథలో మూడు కుటుంబాలు దాదాపు ఒకేలాగా ఉంటాయి. దిగువ మధ్యతరగతి, చాలీ చాలని జీతాలు, మగవారి వ్యసనాలు, అహంభావాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, చివరకు భార్య నోరు మూసుకోవడం / మూయించడం. నాలుగో కుటుంబంలో మాత్రమే ఉద్యోగం చేసే భార్య, భర్త, సహజీవనం, పొదుపు వగైరా, వగైరా. కానీ, కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ మూడు కుటుంబాలకూ, ఈ నాలుగో కుటుంబానికీ పెద్దగా తేడా ఏమీ కనిపించదు.

ఈ మూడు కుటుంబాల్లో ఏ భర్తకూ భార్య పట్ల గౌరవం లేదు, ఆపేక్షా లేదు. కాకపోతే వాళ్ళు ఆ “లేనితనాన్ని” వెలిబుచ్చే విధానం లోనే తేడా అంతా. తాగుబోతు పాత్ర భార్యను బూతులు తిడుతూ, కొడుతుంది. మరో పాత్ర భార్యను ఏమేవ్‌, ఒసేవ్‌, అది, ఇది అని సంబోధిస్తూ వుంటుంది. ఇంకో పాత్రేమో భార్యను తిట్టకుండా, కొట్టకుండానే మానసిక హింసకు గురిచేస్తుంది. స్త్రీ ఉద్యోగం చేయడం నేరమో, ఘోరమో అన్నట్లు సాగుతుందీ సినిమా అంతా. ఆ అభిప్రాయం సమాజంలో లేదని కాదు కానీ అలాటి అభిప్రాయాలున్న వాళ్ళు ప్రధానపాత్రలయితే, వాళ్ళ అభిప్రాయాలను ఖండించే ప్రయత్నం సినిమాలో లేకపోతే, ఆ అభిప్రాయాలను బలపరిచినట్లే. భార్యను పురుగు కంటే హీనంగా చీదరించుకుని, తానో సింహంలా పొంగిపోయేవాళ్ళు, తనను ప్రేమించి గౌరవించే భార్యను చితకబాది మోర విరుచుకుని తిరిగే వాళ్ళు ఈ సినిమాలో హీరోలు. పోనీ చివర్లో వీళ్ళలో మార్పేదయినా వచ్చిందా అంటే అదీ లేదు. రెండున్నర గంటలు నానా తిట్లు తిట్టి, దౌర్జన్యం చేసి, కించపరిచి, సినిమా చివర్లో లాంఛనప్రాయంగా భార్యలతో సర్దుకుపోయే పాత్రలు, అప్పుడు కూడా తప్పు ఆడవాళ్ళ మీదే తోసేసి హాస్యాన్ని రేకెత్తిస్తే అది ఎంత ప్రమాదకరమైన ధోరణి! “లక్ష్మమ్మ కథ” లాంటి సినిమాలు ఎన్ని ప్రాణాలు బలితీసుకున్నాయో విన్నాము. అయితే అలాంటి సినిమాల కంటే కూడా ప్రమాదకరమైనది ఈ ధోరణి. ఇలాంటి సినిమాలు నేరుగా స్త్రీల హత్యలకు, ఆత్మహత్యలకు దారితీయక పోవచ్చు కానీ ఆలోచనాధోరణిలో, ప్రవర్తనలో చాపకింద నీరులా మార్పులు తీసుకువచ్చి స్త్రీల పట్ల హింసను పెంచగలవిలాటి సినిమాలు. హాస్యం ముసుగులో హింసని అందంగా జీవితంలో భాగంగా చేయగల సినిమా. చిట్టచివరకు స్త్రీ కూడా ఉద్యోగం చెయ్యాలనుకోవడం తప్పేనని, ఇంట్లోనే స్వర్గం ఉందని, ఉద్యోగం చేయడం ్‌ చేయాలనుకోవడం భర్తను కించపరచడమేనని, అతని శక్తిసామర్య్థాలను శంకించడమేనని అర్థం చేసుకుని భార్య అనే పాత్రలో అందంగా ఇమిడిపోయి ఆనందంగా బానిసత్వం నెరపమనే సందేశం ఇవ్వడమే ఇలాటి సినిమాల పరమార్థం.

మగవాళ్ళను ఉత్సాహపరచి, వాళ్ళ ప్రతిచర్యనూ ప్రోత్సహించి, ఆడవాళ్ళం సర్దుకుపోదాం రమ్మని హితబోధ చేస్తుంది మరో చిత్రరాజం. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకునే(?) భార్యాభర్తలు, పిల్లలు పుట్టాక భార్య పట్ల భర్త అనాసక్తత, మరో అమ్మాయి ప్రవేశం, ప్రియురాలికి గుణపాఠం, భార్యకు మందలింపు, భర్తకు బుజ్జగింపు ఇదీ ఈ సినిమా వ్యవహారం!

భార్య ఎప్పుడూ చక్కగా అలంకరించుకొని, భర్తకు సకలసేవలు అందిస్తూ, అతని చుట్టూ తిరుగుతూ, అతనికి తన పట్ల ఆకర్షణ తగ్గిపోకుండా జాగ్రత్తపడాలని ఈ సినిమా సందేశం. ఇవన్నీ చేయని భార్య బ్రతుకు అన్యాయమైపోతుందని, భర్త చేజారిపోతాడని నొక్కి వక్కాణిస్తుందీ సినిమా. పెళ్ళయిన తర్వాత, వయసు మీద పడ్డాక, మగవాడిలో కూడ మార్పులొస్తాయని, పెరుగుతున్న బాధ్యతలు, తరుగుతున్న ఆరోగ్యం కారణంగా జీవనశైలిలో మార్పులు జరుగుతాయని మచ్చుకైనా ఆలోచించని సినిమా ఇది. ఏ పరిస్థితిలో భర్త మరో స్త్రీ వైపు ఆకర్షింపబడినా స్త్రీలదే (భార్య, ప్రియురాలు) తప్పని నిరూపించే ప్రయత్నమే ఈ సినిమా. మగవాడిది పసివాడి మనస్తత్వమని ప్రతిపాదిస్తూ, అతని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత జాగ్రత్తగా అతన్ని కాపాడుకోవాలో భార్యలకు తెలియజెప్పే వింత ఆలోచనే ఈ సినిమా. ఈ సంఘటనల్లో మగవాడి తప్పేమీ లేదా అంటే లేదనే అంటుందీ సినిమా. నిర్లక్ష్యం చేయడం భార్య తప్పు; ప్రలోభపెట్టి దగ్గరవడం మరోస్త్రీ తప్పు. అక్కడక్కడా భార్యకూ, “నేనూ మీలాగా చేస్తే!” లాటి డైలాగులున్నా, మొత్తం మీద తప్పులన్నీ ఆడవాళ్లమీద వేసేసి కాలరెత్తుకు తిరిగే కథానాయకుడిని నెత్తికెక్కించుకునే సినిమా ఇది. హీరోయిన్‌ మరోస్త్రీ దగ్గరకు వెళ్ళి బ్రతిమాలటాలు, భర్తను సంస్కరించుకునే ప్రయత్నాలు ఇంతకు ముందు సినిమాల్లో కూడ ఎన్నో కనిపించాయి. అయితే ఈ సినిమాలో మరో మలుపు కనిపిస్తుంది.

భాషను ఎంతగా గాయపరిచేలా వాడుకోవచ్చో కూడ నిరూపిస్తుందీ సినిమా. మరోస్త్రీకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ముగ్గురు మగవాళ్ళు ఒకరి తరవాత ఒకరు ఆమె భర్తలుగా ప్రవేశిస్తారు. ఇదంతా భార్య సుగుణాలను ఋజువు చేసి, మరోస్త్రీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగం. స్త్రీపురుష సంబంధాలలో, ఆ సంబంధాలకు సంబంధించిన అభిప్రాయాలలో ఎన్నో వాదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్న రోజుల్లో కూడ ఒక స్త్రీని ఆమె పూర్వసంబంధాల ఆధారంగా కించపరచడం ఎంత అన్యాయం! అందుకు వాడబడ్డ భాష కుంచించుకుపోయేలా చేసే పదాలు. “ఒకటో మొగుడు, రెండో మొగుడు, మాజీ మొగుడు, కాబోయే నాలుగో మొగుడు” అంటూ ఒక స్త్రీ మనసును, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కుళ్ళబొడిచేలా అవహేళనగా వాడబడిన ఆ పదాలు కేవలం పదాలు కాదు, మనస్తత్వాలకు అద్దాలు.

ఈ సినిమాలో కూడ హాస్యం పేరిట జుగుప్సాకరమైన సంభాషణలే. “సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌”ను దురదగా అనువాదం చేసి దానికి కారణాలు, ఫలితాలు అన్నీ ఎగతాళిగా వివరించే ప్రయత్నం చేస్తుందీ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఇలాటి సినిమాలేమీ కొత్త కాదు, అరుదూ కాదు. అయితే సమాజంలో లోతుగా పాతుకుపోయిన దురభిప్రాయాలను రూపుమాపే ఉత్సాహం, ఉద్దేశ్యం లేకపోగా వాటిని మళ్ళీ మళ్ళీ మనసుకు హత్తుకునేలా ఉపయోగించడం దారుణం.

వివాహవ్యవస్థను ఆకాశానికెత్తే ప్రయత్నం ఒక ఎత్తయితే, అనుక్షణం స్త్రీ ఆ బంధాన్ని వెయ్యికళ్ళతో ఎలా కాపాడుకోవాలో హెచ్చరించే ప్రయత్నం మరో ఎత్తు. వివాహబంధంలో అభద్రత ఉందన్న విషయాన్ని నిర్వ్దంద్వంగా చెప్పే ప్రయత్నం లేకపోగా ఆ అభద్రతకు స్త్రీనే బాధ్యురాలిగా చెయ్యటమే ఇలాటి సినిమాలను తీర్చిదిద్దుతోంది. సమాజం స్త్రీపై రుద్దిన బాధ్యతలను ఇంకా ఇంకా బలవత్తరం చేసి, స్త్రీని మానసికంగా బంధిస్తాయి ఇలాటి సినిమాలు. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాం అని గప్పాలు కొట్టే దర్శకనిర్మాతలు ప్రతిబింబించేది ఏ సమాజమో అర్థం కాదు.

తెలుగులో చూడదగిన సినిమాలు వస్తున్నాయా, వాటి గురించి ఇంత చర్చ అవసరమా అని కొట్టిపారెయ్యవచ్చు. స్పష్టమయిన ఆలోచనలు, స్థిరమయిన అభిప్రాయాలు, బలమయిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి సినిమాల ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. అయితే సినిమాయే ప్రధాన కాలక్షేపంగా, సినిమా వలన ఎంతో ప్రభావితమయ్యే వాళ్ళే మన సమాజంలో ఎక్కువ. ఇలాంటి సినిమాలు అలాంటి ప్రేక్షకులలో తమ అభిప్రాయాలను నాటుతున్నాయి, బలంగా వేళ్ళూనుకునేలా చేస్తున్నాయి. ఇదీ రాజకీయమే. ప్రేక్షకులే ఓటర్లయిన ఈ ఎన్నికలలో సినిమా విజయమే నిర్మాత, దర్శక, రచయితలకు అధికారాన్నిచ్చి అలాంటివో, ఇంకాస్త “ప్రగతి” సాధించినవో సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసేలా చేస్తుంది.

***
ఇలాంటి సినిమాలు ఓ వైపుంటే, భరించలేనంత సెంటిమెంటలిజమ్‌ను రుద్దుతున్న సినిమాలు మరోవైపు. అశ్లీలత, హింస కంటె ఈ సెంటిమెంటలిజమ్‌ మరీ భయంకరమైనది. మంగళసూత్రం, మట్టెలు, నల్లపూసలు, పసుపు, కుంకుమ లాంటి సింబల్స్‌ను ఎంతవరకు వాడుకోవచ్చో అంతవరకూ వాడుకుంటున్నారు. ఈ సింబల్స్‌ వివాహబంధానికి మారుపేరన్న ప్రచారం తెలుగుసినిమాల్లో ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య వస్తున్న సినిమాలలో ఈ ధోరణి మరింత ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. భర్తను, వివాహబంధాన్ని పోగొట్టుకోవడమో లేదా కాపాడుకోవడమో ఇతివృత్తంగా ఎన్నో సినిమాలను తీసిన ఓ దర్శకుడు ఈ విషయంలో కొత్తపుంతలు తొక్కాడు. స్త్రీ అంటే తనకు ఎంతో గౌరవమని, స్త్రీని చులకనగా చూపించలేనని చెప్పే ఈ దర్శకుడు ఇంతకు ముందు చర్చించిన సినిమాలోని “మరోస్త్రీ” పాత్రను అంత అవహేళనగా ఎలా సృజించాడో అర్థం కాదు. ఈయనే దర్శకత్వం వహించిన మరో సినిమాలో కథానాయిక విడాకుల తంతు కూడ వివాహం లాగానే జరగాలంటుంది, ఆహ్వానపత్రాలతో సహా. ఇందులో ఉచితానుచితాల విషయం ఎలా వున్నా, ఆమె మెడలోని మంగళసూత్రం తీసేయాలని బయలుదేరిన హీరోకు ఆమెలో దైవత్వం కనిపించడం సెంటిమెంటలిజమ్‌కు పరాకాష్ట. డబ్బు పట్ల దురాశతో భార్యను, మరోస్త్రీని మోసగించడానికి, ముంచేయడానికి కూడ వెనుకాడని వ్యక్తిని మంగళసూత్రం మార్చేస్తుందా? వ్యక్తుల కంటె, బంధాల కంటె చిహ్నాలకే విలువనిస్తూ గ్లోరిఫై చేస్తున్న పద్ధతి ఖచ్చితంగా మారాలి. ఒకవేళ పైన చెప్పిన సంఘటనను ఒప్పుకున్నా, తన మీద ప్రేమతో కాదు తన మెడ లోని నగ మీద భయంతోనో గౌరవం తోనో వివాహబంధాన్ని తెంచుకోలేదన్న నిజం ఏ స్త్రీకైనా ఎంత బాధాకరం!

ఇలాంటి సినిమాలన్నీ కూడ స్త్రీలకు ఒకటే ఉద్బోధిస్తాయి అణగదొక్కే సంప్రదాయానికి కట్టుబడమని, అణగదొక్కబడమని. వ్యక్తిత్వం గురించి, స్వాతంత్య్రం గురించి మాట్లాడే స్త్రీపాత్రలను నెగెటివ్‌గా చూపించడం సమకాలీనతను, సమాజాన్ని ప్రతిబింబించడమా? స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులు, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు, మారుతున్న జీవనశైలి వీటన్నిటినీ ఏ మాత్రం చూపిస్తున్నాయి? పెరుగుతున్న బాధ్యతలతో సతమతమవుతూ ఓ వైపు, నింగినందుకోవాలన్న ఆశయాలతో ఉప్పొంగిపోతూ మరోవైపు వెలిగిపోతున్న 21వ శతాబ్దపు స్త్రీమనోభావాలకు అద్దం పట్టే ప్రయత్నం నిజంగా జరుగుతోందా?

మహిళాసంఘాలను కించపరచడం, స్వేచ్ఛ అన్న పేరెత్తితే విచ్చలవిడితనం అన్న ముద్ర వేయడం, వ్రతాలు నోములను భారతీయస్త్రీ ప్రథమకర్తవ్యంగా మనముందు నిలపడం ఇవీ తెలుగుసినిమా సాధించిన విజయాలు. సమాజం నుండి పాత్రలను తీసుకోవడం కన్నా సమాజానికి ప్రమాదకరమైన సిద్ధాంతాలను సరఫరా చేస్తోంది తెలుగుసినిమా.

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. murali అభిప్రాయం:

    September 24, 2008 9:03 pm

    సినిమాలపై మీ అభిప్రాయం చాలా బాగుంది. మనది హిపోక్రసీ సమాజం. వాస్తవాల టోన్ సినిమాలు తీస్తే చూసేది యెవరు? మీ ఆవేదనాపూరితమైన అభిప్రాయం బాగుంది. - మురళి.

  2. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 26, 2008 9:00 pm

    సినిమాల గురించి రాయడానికి నాకు కనీస అర్హత గూడా లేదు. అయినా దీంట్లో ఇతరులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉంటుందనే ఆశ. ఇది మంచి వ్యాసం. అయిటే దీంట్లో ఉన్న పెద్ద లోపం - విమర్శించిన సినిమాల పేర్లు మన ఊహకి వదిలెయ్యడం!

    చలసాని ప్రసాద్ “సాహిత్య వ్యాసాలు” కి చేరా ఇచ్చిన కితాబు మొన్ననే చదివాను. చివర్లో చేరా అన్న మాటలు గుర్తొచ్చాయి:
    “కొందరు తెలుగు రచయితల కున్న ఒక జబ్బు ప్రసాదులో కూడా నాకు నచ్చలేదు. విరసం చరిత్ర అనే వ్యాసంలో మొదటి పేరాలో ఒక పత్రిక రాసింది అంటాడు. ఆ పత్రిక పేరు ఎందుకు చెప్పకూడదు? తెరవెనుక కన్యాశుల్కం అనే వ్యాసంలో మొదటే ఒక పారశీక కవి అంటాడు. ఎవరా పారశీక కవి? ఒక వ్యాసంలో పేరు చెప్పకుండా ఒక వార పత్రిక అంటాడు. అదే వ్యాసం చివర కొన్ని ఎలుకలూ, పిల్లులూ అంటాడు. ఎవరీ పిల్లులు, ఎలుకలూ?”

    అర్థంలేని మర్యాదలకీ, ముసుగులో గుద్దులాటలకీ తెలుగు రచయితలు స్వస్తి చెప్పాలి.

    పోయినేడు రచ్చబండలో ఒకరు అడిగారు - దాశరథి రంగాచార్య నవల “చిల్లర దేవుళ్ళు” కి ముందుమాట రాసిన “రహి” ఎవరు? అని. హరిగా “ప్రసిద్ధి” గాంచిన సూరపనేని హరిపురుషోత్తమరావు అన్నారు నవోదయ రామమోహనరావు. ఆపేరు వినడం నాకదే మొదటిసారి. ఆయన రచనల కోసం వెతికితే ఏమీ కనబడలేదు.. ఇంతలో “హరి” చనిపోయారు. “విభిన్న” పేరిట ఆయన రచనలని కొన్నిటిని ఇటివలే పర్స్పెక్టివ్ వాళ్ళు ప్రచురించారు.

    సినిమా, సాహిత్యం ఆయనకి ఇష్టమైన రంగాలు. నాటి రఘుపతి వెంకయ్య మొదలు నేటి రామానాయుడు దాకా, మన సినిమాలలో కథానాయిక పాత్రలో పెద్ద మార్పేమీ లేదు. ఏమిటా పాత్ర అంటే పతివ్రత పాత్ర! “పొందిగ్గా చీరకట్టుకుని, సూర్యబింబం లాంటి బొట్టుపెట్టుకుని, భర్తగారి సేవకూ, అత్తమామల ఊడిగానికీ అంకితమైన ఆదర్శ భారతనారి” కి మించి స్త్రీ కి వేరే వ్యక్తిత్వం ఉన్న పాత్రలు దాదాపు శూన్యం అంటారాయన.

    చివరగా, పోయిన ఆదివారం డెట్రాయిట్ లో జరిగిన సాహితీ సభలో, “నడిచే విజ్ఞానసర్వస్వం” గా పేరున్న పరుచూరి శ్రీనివాస్ మన సినిమా చరిత్ర మీద సాధికారికమైన ప్రసంగమిచ్చారు. కొన్ని PhD లకి సరిపడా ముడిసరుకు పరుచూరి దగ్గరుంది - వాడుకునే వాళ్ళుంటే. 1987 తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవీ చూడలేదన్నారాయన. ఎందుకో మన ఊహకి వదిలేద్దాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    September 27, 2008 10:34 am

    చేరా అలా అన్నారా? అచ్చో చ్చొ చ్చొ చ్చొ!

    ఈయనే, ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక చేరాతలో, “కధలూ, నవలలూ రాయటం మీద చాలా అనుభవం ఉన్న ఒక రచయిత్రి వాడుక భాష రాసే పద్ధతి గురించి వ్యాస పరంపర ప్రకటిస్తున్నారు.” అంటూ డొంక తిరుగుడుగా ఒక వ్యాసం రాశారు. అందులో ఆ రచయిత్రి ఎవరో, పేరు ఏమిటో ఎక్కడా లేదు.

    మరిప్పుడు ఇలా అంటున్నారు ఆయన.

    గురివింద గింజ సామెత గుర్తొస్తూ వుంటుంది ఇలాంటివి చదివి నప్పుడు.

    ఇది ఎలా వుంటుందంటే, “రాయాయణం కధ ఏ సామాజిక విషయాల్నీ తెలుగుకోవడానికి పనికి రాదు” అని అన్న కొడవగంటి కుటుంబరావు, “అశోక వనం” అన్న కధ రాసి, ఆ కధ ద్వారా “ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం” చెప్పి, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ అనే జాతి భేదాలు వున్నట్టు”గా తన వ్యాసాల్లో రాసి, “రామాయణ కధ ఏ సమాజాన్నీ చూపించడానికి పనికి రాదు” అని అనడం లాగా.

    ఇలాంటి విషయాలు ఇక పాఠకుల చైతన్యానికి వదిలెయ్యడమే సరైన పద్ధతి.

    జె. యు. బి. వి. ప్రసాద్

  4. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 28, 2008 2:24 pm

    గురివింద గింజ, చక్కెర గుళిక

    జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.

    “ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.

    విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు - ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.

    కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి - ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.

    లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. ravikiran timmireddy అభిప్రాయం:

    September 29, 2008 1:33 pm

    చాలా బాగ వ్రాశారండీ హనుమంత రావు గారు.

    బహుశా హేతువాదులుగా మారిన తర్వాత బతుకులో అధ్యాయనాన్ని, మార్పుని సహించరేవో. ఈ నెల కౌముదిలో హేతువాదం మీద ప్రసాదు గారి వ్యాసం చదవండి, పిడివాదవంటే ఏవిటో తెలుస్తుంది.

    [ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]

  6. జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    September 29, 2008 7:18 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారి “చక్కెర గుళిక” చదివాను. “ఆర్టిఫిషియల్ స్వీట్ నర్” అనే అనిపించింది. ఒక విమర్శకి ఎంత డొంక తిరుగుడుగా జవాబు రాయొచ్చో కూడా తెలిసింది.
    మొదటగా చేరాకీ, కుటుంబరావుకీ నా విమర్శలో వున్న లంకె ఏమిటీ అని చూద్దాం.
    హనుమంతరావు గారి దృష్టిలో అది, “ఆ రచయితలిద్దరూ రంగనాయకమ్మని విమర్శించడం!”. సరే! వదిలేద్దాం! ఎవరి తెలివి తేటలని బట్టి వారికి అర్థమవుతుంది మరి. నిజానికి అసలు లంకె ఏమిటీ? ఆ ఇద్దరు రచయితలూ తాము ఒకలా రాసి, కొంత కాలం పోయాక దాని ప్రసక్తి లేకుండా వేరేలా రాశారు. అప్పుడు అది పరిణామ క్రమం అవదు. వెనుక చేసిన తప్పులను దిద్దుకుంటూ, వాటి గురించి ప్రస్తావిస్తూ, కొత్త విషయాల గురించి రాస్తే, అందులో వున్న అభివృద్ధి అర్థం అవుతుంది. కానీ అలా రాయడం రచయితలకెంత మింగుడు పడని విషయమో, వారి సమర్థకులకూ అంతే మింగుడు పడని విషయం. కాబట్టి ఆ రచయితలు గురివింద గింజల్లా, తాము రాసిన నలుపుని పట్టించుకోకుండా, గొప్పగా రాస్తారు. వారి సమర్థకులు ఆ గురివింద గింజల్ని చక్కెర గుళికల్లా భావించి సేవిస్తారు. మనల్ని కూడా సేవించ మంటారు. ఎవరి చైతన్యం వారిది మరి!
    ఒకే విషయంలో ఒకేలా ప్రవర్తించిన ఇద్దరు రచయితల గురించి ప్రస్తావిస్తే, వాటికి లంకేమిటీ అని అడుగుతున్న హనుమంతరావు గారి అమాయక ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
    “రంగనాయకమ్మ చేరాని ఎప్పుడు, ఏమని విమర్శించారూ” అన్న విషయం ఇక్కడ అసందర్భం. చేరా కూడా ఎటువంటి విమర్శలతో జవాబిచ్చారూ అన్నది కూడా వేరే విషయం.
    హనుమంతరావు గారు చెప్పినట్టే, కాలాను క్రమణ చూడండి.
    1. 1989 లో చేరా “వెటకారం వాద పద్ధతి కాదు” అనే వ్యాసం రాశారు. అందులో నేను చెప్పినట్టుగా, రచయిత్రి పేరు లేకుండా వ్యాసం అంతా రాశారు.
    2. రంగనాయకమ్మ గారు చేరాని విమర్శించారు అని అన్నది 1991 లో. అంటే రెండేళ్ళు జవాబివ్వకుండా రంగనాయకమ్మ వూరుకున్నారా? “వాడుక భాషే రాస్తున్నామా?” అనే పుస్తకం 1990 లోనే బయటికి వచ్చేసింది. అందులోనే చేరాకి కావల్సిన సమాధానాలున్నాయి.
    3. “చేరాత మీద ఓ విమర్శ” అనే పేరుతో 1989 లోనే నేను ఆంధ్రజ్యోతి లో ఒక వ్యాసం కూడా రాశాను.

    ఈ వివరాల్ని బట్టి చూస్తే, ఏం తెలుస్తోందీ? హనుమంతరావు గారి కాలాను క్రమణ సరిగా లేదనీ, అర్థం పర్థం లేకుండా వుందనీ!
    ఈ విషయంలో నా విమర్శ ఏమిటీ? చేరా ఒకసారి తప్పుగా రాశారు కాబట్టి, ఇక ఆయనకి “నిష్కృతి” లేదనా? మరి హనుమంతరావు గారికి అలాగే అర్థం అయింది మరి.
    నిజానికి అది నా విమర్శ కానే కాదు. చేరా ఒకప్పుడు తాను ఆ తప్పు చేశాననీ, అది సరైనది కాదనీ, విపులంగా వ్యాసాలు రాసేటప్పుడు పేర్లతో స్పష్టంగా రాయడమే కరెక్టు పద్ధతి అనీ రాస్తే, ఒప్పుకోని దెవరు? అలా చెయ్యకుండా, గతంలో తాను రాసిన విషయాల్ని వదిలేసి, కొత్తగా వ్యతిరేక విషయం చెబితే, అదెంత గొప్ప విషయమైనా పాఠకులు ప్రశ్నలు అడుగుతారూ, విమర్శిస్తారూ. దబాయింపులు విమర్శని నొక్కెయ్య లేవు.
    ఇక్కడ ఓ ముఖ్య విషయం. “రచయితలు గతంలో తాము తప్పుగా చెప్పిన విషయాల్ని దిద్దుబాట్లతో చెప్పాలా కొత్తగా నేర్చుకున్న జ్ఞానంతో మంచి విషయాలు చెప్పేటప్పుడూ?” అని ఎవరన్నా అడగవచ్చు. మామూలు రచయితలకి ఇది అవసరం కాకపోవచ్చు. కానీ మార్కిస్టు దృక్పథంతో రాసే రచయితలకి ఇది చాలా ముఖ్యం.
    “జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరాని ఇప్పుడు తప్పుబడుతున్నారు” అని హనుమంతరావు గారి ఉవాచ. 1989 లోనే చేరాని విమర్శిస్తూ రాసిన నా వ్యాసం అంధ్రజ్యోతిలో వచ్చింది, చేరాతకి దగ్గర్లో. దీన్ని బట్టి అర్థమయ్యే దేమంటే, హనుమంతరావు గారికి చాలా విషయాలు తెలియవని. నిజానికి ఎవరికీ అన్నీ తెలియనక్కర్లేదు. అందరూ అన్ని వ్యాసాలూ చదివి వుండక్కర్లేదు. కానీ విమర్శించే వ్యక్తులు ఆ విషయానికి సంబంధించిన విషయాలను తెలుసుకోకుండా ఏమన్నా రాస్తే, అది దూషణగా వుంటుందే తప్ప, విజ్ఞాన పరంగా వుండదు.
    ఒకవేళ 1989 లోనే ఆ చేరాతని నేను విమర్శించలేదనుకోండి. నేను రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాలేదనుకోండి. అయితే ఏమిటి? ఆ చేరాతని విమర్శించడానికి ఏమన్నా కాల పరిమితి వుంటుందా? దాని కేమన్నా కాల దోషం పడుతుందా? అప్పుడు విమర్శించి వుండక పోయినా, ఇప్పుడు విమర్శించడంలో తప్పేమీ వుండదు. వందల యేళ్ళ కిందటి విషయాలను ఇప్పుడు కూడా విమర్శిస్తూ వుంటాము. ఎందుకని? అవి ఇప్పటి కాల మాన పరిస్థితులకి కూడా వర్తిస్తాయి కాబట్టి.
    “ఇన్నేళ్ళ తర్వాత కూడా చేరా తాను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు!” హనుమంతరావు గారి వెటకార ఉవాచ.
    అలా నేనన లేదు. హనుమంతరావు గారు ఊహించుకున్నారంతే! అయినా, తాను తప్పు చేశానని చేరా ఎప్పుడూ అనలేదు. హనుమంతరావు గారే అంటున్నారు. తన తప్పుని చెప్పుకుని, వొప్పుకుని, అప్పుడు మంచి విషయం చెప్పడం మాత్రమే సాహిత్య పరంగా సరైన విషయం. తప్పు గురించి ప్రస్తావన లేకుండా, ఓ గొప్ప విషయం చెప్తే, అడిగే వాళ్ళుండరూ? తప్పు గురించి చెప్పకపోతే, అది సాహిత్యపు టెత్తుగడ అవుతుంది మరి!

    ఇక కుటుంబరావు గారి విషయంలో కాలాను క్రమణ చూద్దాం:
    1. 1937 లో ఆయన “అశోక వనం” కధ రాశారు. అందులో ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం చెప్పారు.
    2. 1944 లో ఆయన, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” అనే వ్యాసం రాశారు. దాంట్లో, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ” గురించి రాశారు.
    3. 1945 లో “మార్క్సిజం చదివిం తర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు” అనీ అన్నారు.
    4. విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు, “సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాద”న్నారు.
    ఇప్పుడు ఈ విషయాల గురించి ప్రశ్నలు మొదలు పెడదాం.
    1. మార్క్సిజం తెలుసుకోక ముందు నేర్చుకున్న విషయాలన్నీ తప్పుగానే వుంటాయా? కొన్నైనా సమాజంలో మంచి విషయాలుగా వుండవా రచయితలకు? మార్క్సిజం చదవని రచయితలెవ్వరూ అభివృద్ధి కరంగా రచనలు చెయ్యలేదా ఎప్పుడూ?
    2. 1945 లో మార్క్సిజం చేర్చుకున్నాక, కుటుంబరావు 1937లో రాసిన తన “అశోక వనం” కధనీ, 1944 లో రాసిన తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాన్నీ వ్యతిరేకించారా ఎక్కడన్నా? అలా ఎక్కడా అననప్పుడు, అవి తప్పు విషయాలని ఆయన అనుకున్నారనీ, కాబట్టే 1974-75 లో “రామాయణం ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంధం కాదన్నారనీ” హనుమంతరావు గారు ఎలా నిర్ధారిస్తున్నారూ?
    3. “అశొక వనం” కధ తప్పుగా రాశానని దాన్ని ముద్రణ లోంచి తీసేశారా కుటుంబరావు? అలాగే, తన “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం” వ్యాసాల్ని కూడా ఉపసంహరించుకున్నారా, కనీసం దిద్దుకుని కొత్త ముందు మాట రాశారా? మరి అలాంటివేమీ జరగనప్పుడు, గురివింద గింజ సామెత ఎందుకు వర్తించదూ?
    నేను చేసిన విమర్శలో వున్న ఒకే ఒక్క ముఖ్య విషయం: ఒక రచయిత (రచయిత్రి) ఒకసారి తాను రాసిన దానికి వ్యతిరేకంగా ఇంకో సారి రాస్తే (అదీ తన తప్పును ప్రస్తావించకుండా, దాన్ని దిద్దుకోకుండా), పాఠకులు ప్రశ్నిస్తారనీ, విమర్శిస్తారనీ.
    రంగనాయకమ్మ రాసిన విషయాలు గానీ, కుటుంబరావు రాసిన విషయాలు గానీ, చేరా రాసిన విషయాలు గానీ ఇక్కడ చర్చకు తీసుకు రావడం లేదు. అవి అనవసరం ఇక్కడ. కాలాను క్రమంలో వారు తాము రాసిన వాటిని ఎలా, ఎంత స్పష్టంగా, ఎంత డైరెక్టుగా, ఎంత ఓపెన్ గా దిద్దుకున్నారూ, అభివృద్ధి కరంగా కొత్త జ్ఞానంతో కొత్త విషయాలు ఎలా చెప్పారన్నదే పాయింటు. అసలు పాయింటు వదిలేసి ఎంత రాసినా అది పిడకల వేటే అవుతుంది.
    గురివింద గింజ మింగినా చైతన్యం రాదు. చక్కెర గుళిక మింగినా చైతన్యం రాదు. నల్ల మందు మింగినా చైతన్యం రాదు. అభివృద్ధి కరమైన సాహిత్య ప్రక్రియల వల్లా, వాటి పఠనాల వల్లా మాత్రమే చైతన్యం వస్తుంది. ఏది మింగాలీ అన్నది ఎవరి కున్న చైతన్యాన్ని బట్టి వారే నిర్థారించు కోవాలి.

    - జె. యు. బి. వి. ప్రసాద్

    [ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a