ఈమాట » నెత్తుటి కల

Expand to right
Expand to left

నెత్తుటి కల

కొన్ని ఉదయాలు అంతే

తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే

కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే

దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే

కొన్ని ఉదయాలు అంతే

నీకూ నాకూ నడుమ చీకట్లు మరింత చిక్కబడతాయి

నీకూ నాకూ నడుమ ఎల్లలు మరింత ఎర్రబడతాయి

నీకూ నాకూ నడుమ నువ్వూ నేనూ కూడా మిగలం

కొన్ని మరణాలు అంతే

మరణించిన తీరు కాక మనిషిని తలవనీయవు

బతుకు ముగిసిన తేడా కూడా తెలియనీయవు

ఆనవాలుకు ఒక మాంసఖండమైనా దొరకదు

కొన్ని ఉదయాలు అంతే

నెత్తుటి సముద్రంలో మునిగి తల తుడుచుకోనట్లే ఉంటాయి

మంటల్లో మాడుతూ సజీవంగా తగలబడుతున్నట్లే ఉంటాయి

బతుకు మూలాల్ని భయం చెదలై తొలుస్తున్నట్లే ఉంటాయి

కొన్ని ఉదయాలు అంతే

ఉబ్బి వొడ్డున పడ్డ తేల కళ్ళ చేపలే

గుండెలపై తొలగని తొణకని శిలలే

మెలకువ రాని పీడకలలకు కొనసాగింపులే

మానుపడక మాటిమాటికి సలపరించే కురుపులే


చంద్ర కన్నెగంటి

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. పదమూడేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ...

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a