ఈమాట » మంచులో తడిసిన ఉదయం

Expand to right
Expand to left

మంచులో తడిసిన ఉదయం

సవ్వడి లేని రవ్వల మువ్వలు ధరించి రాత్రంతా
తోటలో తిరుగాడిందేమో హిమసుందరి
ఉదయానికల్లా రవ్వలు రవ్వలుగా రాలిన మంచుతో
తోటంతా తళతళ లాడుతుంది.

మరీ మక్కువగా హేమంతుడు ఆమె సిగలో ముడిచిన
సన్నజాజులు రెక్కలు రెక్కలుగా రాలాయేమో
రెమ్మరెమ్మకీ కొమ్మకొమ్మకీ పూచిన హిమపుష్పాల భారంతో
పెరట్లో చెట్లన్నీ తెల్లని ఇంద్రధనస్సుల్లా వంగుతాయి.

ఆదమరచి నిద్రించిన హిమసుందరి ధవళచేలాంచలం
విశ్రమించిన వేయిపడగల శ్వేతనాగై తోటను కప్పేసింది.

రాత్రంతా అవిశ్రాంతంగా రాట్నం వడికిందేమో
చంద్రునిలో అవ్వ,
దూదిపింజలుగా రాలే మంచుతో తోటంతా
మెత్తని పట్టుపరుపులా వత్తిగిల్లుతుంది.

ఏనాడో విజయనగర సామ్రాజ్య రాజవీధులలో
రాసులు పోసిన ముత్యాలు కొల్లగొట్టి
మాపచ్చిక మీద పరిచారా అన్నట్లు
నీరెండలో మా ఇంటి ప్రాంగణం మిలమిల లాడుతూ మెరుస్తుంది.

ఆకు రాల్చిన చెట్లతోనూ పువ్వులు లేని కొమ్మల తోనూ
ఉదాసీనంగా ఉన్న భూదేవికి ఉల్లాసం కలగాలనేమో
ఆకాశరాజు సాదరంగా పంపిన తెల్లకలువ పూవుల దండలా
మంచు మా తోటని అలంకరించింది.

మంచులో తడిసిన ఈ ప్రభాత సౌందర్య వైభవాన్ని
తనివితీరా కన్నులలో నింపుకోవాలని
ఉత్సాహంగా
తలుపు తీస్తే
ఉదాసీన ప్రేయసి కఠిన వీక్షణంలా
కరడు కట్టిన మంచుకత్తై చలిగాలి గుండెల్ని వణికిస్తుంది.

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...

 

(4 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    August 11, 2008 10:57 am

    వైదేహిగారూ,
    అద్భుతవయిన చమత్కారం చూపించేరు. వుదాసీన ప్రేయసి చూడ్డానికి ఎంత బాగున్నా, వుత్సాహంగా మది తలుపు తీస్తే, కరడు కత్తి లాటి కఠిన వీక్షణం తో గుండెల్ని వణికిస్తుంది.

    సవ్వడి లేని రవ్వలు ధరించి మీ తోటలో తిరుగాడిన హేమసుందరికీ, మిక్కిలి మక్కువగా ఆవిడని సన్నజాజులతో అలంకరించిన హేమంతుడికీ, రాత్రంతా అవిశ్రాంతంగా కష్టపడ్డ అవ్వకీ, మిగిలిన వాటికీ ఇదే మా ఆహ్వానం, మా పెరట్లో కూడా తిరగొచ్చుకదా? తిరిగినా మాబోంట్లు పట్టించుకోవనేమో?

    మామూలు కవులయితే, వుత్సాహంగా తలుపుతీసిన తరవాత కూడా “ఆహా, వోహో” అని రాస్తారు. మీరు కాబట్టి, తలుపు తీసేక కరడు కత్తి లాటి కఠిన వీక్షణాన్ని చూడగలిగేరు.

  2. jayaprabha అభిప్రాయం:

    August 12, 2008 10:11 am

    వైదేహి, చాలా బాగుంది మీ కవిత. చాలా రోజుల తరువాత originality వున్న images చూస్తున్నాను. మంచి హేమంతం, చంద్రునిలో అవ్వ రాట్నం వడకడం (వహ్!), అదంతా మంచులా రాలిపడటం!! గొప్ప ఊహా చిత్రం సుమా.

    మీరు మీ కవితలతో కవ్విస్తున్నారు నన్ను. మరీ చెలరేగి వస్తున్నాయి మీ వూహలు. వాటిని రానివ్వండి అలా. కానీ తలుపు తీయను నేను. మంచు గాలి వణుకుకి జడిసి. మరి మీ హేమంత సుందరి తో చేయి కలపటం ఎలా? మీరే ఏదైనా వుపాయం చెప్పాలి.

    జయప్రభ.

  3. Vaidehi Sasidhar అభిప్రాయం:

    August 30, 2008 5:42 pm

    బాబ్జీలు గారూ, జయప్రభ గారూ,
    నా కవితపై మీ స్పందన కి , ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
    గత కొద్ది వారాలుగా ఇండియా లో Whirlwind tour లో ఉండటం వల్ల ఈమాట చూడలేకపోయాను.

    జయప్రభ గారూ,
    “జలపాత(స్నాన)పు ఖడ్గచాలనానికి” వెరవని వాళ్ళు , మంచు గాలి వణుకు కి జడుస్తారంటారా?! :)

  4. "Vidyavachaspati" Prof Dr N N Murthy అభిప్రాయం:

    September 7, 2008 2:27 am

    వైదేహి శశిధర్ గారు,
    I have gone through the site and happened to see your Telugu poems. I want to wrtie in Telugu. But I found it is very difficult and writing in English. I am happy that you are from our town Narasaraopet and staying in New Jersey.

    I stay in Nagpur and also Kuwait. I am also poet and we have started Environment movement in Telugu poetry along with a magazine Malle Teega from Vijayawada. We have announced a poems competation. You can also participate in that.

    You can see our website http://haritakavita.tripod.com/

    Give your email address, we can send you details in pdf.

    Regards
    “Vidyavachaspati” Prof Dr N N Murthy

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a