ఈమాట » ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి

Expand to right
Expand to left

( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి

( గత మంగళవారం , అక్టోబర్‌ 26, 1999, ఉదయం కన్నుమూసిన సుస్వరాల రాజేశ్వర రావుకి నివాళిగా ” ఈ మాట ” కోసం ఈ వ్యాసం వ్రాయబడింది. ఇందుకు సంబంధించిన చాలా వివరాలు అందించిన పరుచూరి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు.)

తెలుగు సినీ రంగంలో ఎవరైనా “చైల్డ్‌ప్రొడిజీ”లు ఉన్నారంటే వాళ్ళలో అందరికన్నా ముందుండే వ్యక్తి సాలూరు రాజేశ్వర రావు. తెలుగు సినీ ప్రపంచంలో, నౌషాద్‌వంటి హిందీ సంగీత దర్శకులచే గుర్తించబడి, గౌరవింపబడ్డ ఒకే ఒక సంగీత దర్శకుడు మన ” సాలూరు రాజేశ్వర రావు”.

సాలూరు పుట్టింది 1922 లో ( విజయనగరం జిల్లా ). తండ్రి, సాలూరు సన్యాసి రాజు. ఆయన ఆ రోజుల్లో ఎన్నో మంచి పాటలు రాసిన లిరిసిస్ట్‌ ( ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, బాల సరస్వతి, 1948), ( తుమ్మెదా, ఒకసారి మోమెత్తి చూడమని …. బాల సరస్వతి, 1941) . రాజేశ్వర రావుకి సంగీత పరిచయం తండ్రి ద్వారా కలిగింది. సన్యాసి రాజు గారు ఆ రోజుల్లో మూకీ సినిమాలకు తెరముందు సంగీతం ఇచ్చేవారు. అటువంటి వాతావరణంలో పెరిగాడు రాజేశ్వర రావు. ఆయన తన 6 7 ఏళ్ళ వయస్సులోనే రికార్డింగ్‌ “భగవద్గీత” మీద ఇవ్వటం ఒక గొప్ప విశేషం. తండ్రి వల్ల వచ్చిన సంగీత పరిచయాల వల్లనే కాక, స్వయం ప్రతిభ వల్ల మొదటి సినిమాకి అతనికి పిలుపు వచ్చింది 1935 లో. సినిమా పేరు ” శ్రీ కృష్ణ లీలలు “. ఆ సినిమాలో కృష్ణుడుగా నటించి పాడిన పాటలు, పద్యాలలో, ముఖ్యంగా, కృష్ణకంస సంవాదంలో, 13 సంవత్సరాల సాలూరు చూపించిన అధికారం, వైవిధ్యం, వాటిలో ఉన్న గమకాలు గమనిస్తే, అప్పటికే తిరుగులేని గాయకుడుగా, సంగీత కారుడుగా ఎలా నిలబడ గలిగాడో అర్ధమవుతుంది.

” మీరు, సాలూరు రాజేశ్వర రావు గారూ కలిసి పాడిన యుగళ గీతాలు అంతగా సక్సెస్‌ అవడానికి కారణమేమిటి ?” అన్న ప్రశ్నకు సమాధానంగా, అలనాటి ప్రఖ్యాత గాయని రావు బాల సరస్వతీ దేవి ఇచ్చిన సమాధానం ఇది. “రాజేశ్వర రావు పాడే శ్రుతి గాయనికి అనుకూలంగా ఉంటుంది. మేమిద్దరం పాడేటప్పుడు ఒకే శ్రుతి వినిపిస్తుంది. రాజేశ్వర రావు కూడా నాలాగే పరిణతి ఆశించాడు. ఏదో ఒక శ్రుతికీ, ట్యూన్‌కీ రాజీ పడలేదు. అతని గొప్పదనం మరో ఆర్టిష్టుకి రాదు”.

” చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి ..”, ” హాయిగ పాడుదునా చెలీ ..”, ” ఓహో యాత్రికుడా ..” వంటి ప్రైవేటు రికార్డుల్లో అతని సంగీతంతో కలసిన గొంతును ఇప్పటికీ ఆ తరం వారు మర్చిపోలేరు. ఆ పాటల్లో ఒక రకమైన ప్రశాంతత, మనస్సుని మైమరపింపజేసే గుణాలు కనపడతాయి. రావు బాలసర్వతి, సాలూరు రాజేశ్వర రావుల జంట పాడిన పాటలు 1940 దశాబ్దంలో తెలుగునాట ఒక సెన్సేషన్‌. దాదాపు గ్రామ్‌ఫోన్‌సెట్టు ఉన్న ప్రతి ఇంట్లోనూ వీరి రికార్డులు ఉండేవి. ” తుమ్మెదా ఒకమారు మోమెత్తి చూపమని ..”, ” రావే రావే కోకిలా …” వంటి పాటలు ఆ రోజుల్లో యువతని ఒక ఊపు ఊపేసాయి.

సినిమా బాణీలలో కూడా రాజేశ్వర రావుది ఒక ప్రత్యేకమైన ఒరవడి. అంతో ఇంతో సంగీతం తెలిసిన మిత్రులు ఒక పాట విని ” ఇది రాజేశ్వర రావు కట్టిన పాట ” అని చెప్పగలిగే వారు. ( సాహిత్యంలో పరిచయం ఉన్న వారు, కధ కాని కవితని కాని చదివి ఆ రచయిత ఎవరో చెప్పగలినట్లు !) ఈ వైవిధ్యానికి కారణం పాటల్లో క్వాలిటి తీసుకురావాలన్న తపన. ” అయ్యయ్యో చేతులొ డబ్బులు పోయెనే …” (కులగోత్రాలు) వంటి పాటల్లో హాస్యరసం ఎంత పోషించాడో, సంగీతం క్వాలిటి కూడా అంత ఎక్కువలో ఉంచాడు. ” ఆరాధన ” సినిమా కోసం ఘంటసాల చేత పాడించిన ” నా హృదయంలో నిదురించే చెలీ .. ” పాట అదే బాణీతో మొదట వచ్చింది బెంగాలీలో ! ఈ పాట బాణీ కాపీ కొట్టినా, బెంగాలీ బాణీలో లేని జీవం మన తెలుగు బాణీలో కనపడుతుంది. కాపీ కొట్టినా స్వయం ప్రతిభ చూపటం అంటే ఇదేనేమో ! 1970 లో వచ్చిన ” చిట్టి చెల్లెలు ” సినిమా కోసం స్వరపరచిన ” ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది ..” బాణి ఒక పాశ్చాత్య బాణీకి కాపీ ! కాని, ఈ పాటలోని వైవిధ్యాన్ని గమనిస్తే, దీన్ని పూర్తిగా ఒక తెలుగు పాటగా మార్చిన రాజేశ్వర రావు ని అభినందించ కుండా ఉండలేము.

పాడ గలిగే వాళ్ళనుంచి పాట ” పిండటం “, ఆ సంగీత దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ( నటుడి నుంచి నటన రాబట్టటం మంచి దర్శకుడికి తెలిసినట్టు !) 1953 లో సినీ రంగంలోకి వచ్చిన గాయని సుశీల చేత ( రాజేశ్వర రావు సుశీలని ” అమ్మాయి గారు ” అని పిలిచుకునేవాడుట) చాలా మంచి పాటలు పాడించాడు రాజేశ్వర రావు. ” భక్త ప్రహ్లాద ” సినిమాలోని భాగవతం పద్యాలు ( చేతులారంగ…, కమలాక్షు…) అంత గొప్పగా పాడించడం ఇంకెవరి తరం? ” చెంచులక్ష్మి ” సినిమా కోసం పాడిన ” పాల కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా ..” పాట మన ఇళ్ళలో గృహిణులు పూజా సమయంలో పాడుకొనే భక్తి పాటగా మారి పోయింది. ఇలా ఎన్ని పాటలని గుర్తు పెట్టుకోగలం !

ఈ సందర్భంలో నా సొంతగోల ఒకటి మీకు చెప్పాలి. ” కులగోత్రాలు ” సినిమా కోసం స్వర కల్పన చేసిన పాట ” చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా సిగ్గు నీకేలా ..” అప్పటికే చాలా పాప్యులర్‌అయ్యింది. మా ఇంట్లో అందరం ఆ పాట హమ్‌చేసేవాళ్ళం. మా అమ్మగారు ఒకరోజు పూజ చేసుకొనేవేళ, కుర్రకారు మేం అంతా ” టింగ్‌.. టింగ్‌.. టింగ్‌.. టింగ్‌ ..” అంటూ ఆ పాటముందు వచ్చే స్వరాలను హమ్‌చేస్తున్నాము. పూజ చేసుకొంటున్న మా అమ్మగారు వెంటనే, మా స్వరాలను అందుకొని “చెలికాడు నిన్నే .. ” అని పాడటం ప్రారంభించి వెంటనే ” ఓరి వెధవల్లారా ! ” అంటూ నవ్వుకున్నారు. నా తెలిసినంతవరకు సినిమా పాట జన సామాన్యంలోకి ఎంత వెళ్ళిందో ఈ అనుభవం చెబుతుంది.

తెలుగు సినిమాల్లో జావళి పాటలలో రాజేశ్వర రావు తీసుకువచ్చిన సంగీతం మరెవ్వరూ తీసుకు వచ్చినట్టు కనపడదు ( దేవదాసు సినిమాలో ” ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా !” వంటి పాటలు కట్టిన సి. ఆర్‌ సుబ్బురామన్‌ని మినహాయిస్తే ). “మల్లీశ్వరి ” చిత్రం ద్వారా మరో చరిత్రను సృష్టించిన బి. ఎన్‌ రెడ్డి, ఘంటసాల, భానుమతి, దేవులపల్లి లాంటి మహామహులకు సమానంగా ప్రతిభ చూపించిన రాజేశ్వర రావును తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ” పిలచిన బిగువటరా ..” పాట కాపి రాగంలో కట్టిన ఒక జావళి. ఇదే కాపి రాగంలో స్వరం ఇచ్చిన ” అందాల బొమ్మతో ఆటాడవా ..” (అమరశిల్పి జక్కన్న) జావళికి మల్లీశ్వరి జావళికి తేడాలు గమనించండి. భైరవి రాగంలో స్వర కల్పన చేెసిన “నిను చేర మనసాయెరా …” (బొబ్బిలి యుద్ధం 1964) మరొక మంచి పాట .

సినిమాల్లో వీణ, సితార్‌వంటి వాయిద్యాలని పాటల ద్వారా పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది సాలూరే ! ” పాడ వేల రాధికా ..” (ఇద్దరు మిత్రులు, మోహనం), ” ఏమని పాడెదనో ఈ వేళా ..” ( భార్యా భర్తలు, సింధు భైరవి), ” నీవులేక వీణ పలుకలేనన్నది …” ( డాక్టర్‌చక్రవర్తి, పహాడి ), ” పాడెద నీ నామమే గోపాలా ” ( అమాయకురాలు, హంసధ్వని తరవాత నట భైరవి ) వంటి పాటల్లో చరణానికి, చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను పూర్తిగా ఎక్స్‌ప్లోయిట్‌చేసాడు. ” ఏమని పాడెదనో ..” పాటలో సుశీల పాటకన్న ముందు వినిపించే వీణను పలికించింది మరెవ్వరో కాదు ! అప్పటికే గొప్పపేరు తెచ్చుకొన్న ఈమని శంకర శాస్త్రి గారి శిష్యుడు ” చిట్టి బాబు “.

జైజవంతి రాగంలో స్వరకల్పన చేసిన ” మనసున మనసై ..” ( డాక్టర్‌ చక్రవర్తి) పాటలో వినిపించిన సితార్‌సంగీతానికి దీటైన సంగీతాన్ని సృష్టి చెయ్యడం మరో సంగీత దర్శకుడికి అసాధ్యం. అదే రాగంలో “భక్త జయదేవ” సినిమాలో జయదేవుడి గీతం మరొకటి స్వర కల్పన చేసాడు రాజేశ్వర రావు ( ” వదసి యది కించిదపి “). ” మాస్టారూ, మీరు పట్‌దీప్‌రాగంలో ఏమీ కంపోజ్‌ చెయ్యలేదేమిటీ ?” అన్న మా మిత్రుడి ప్రశ్నకి సమాధానంగా, ” అయ్యా, ఎందుకు చెయ్యలేదండీ ? నీ అడుగులోన అడుగు వేసి ..చేసాగా !” అన్నాట్ట (పూలరంగడు). పట్‌దీప్‌రాగంలో ఎక్కువ సినిమా పాటలు కనిపించవు. ఉన్నా, ఒకటి, రెండు ( ” ఎవరో రావాలీ … ప్రేమ నగర్‌” ) పాటలు విషాదభరితాలే. పూల రంగడు సినిమాలో పాట హుషారుగా ఉండటం గమనించండి!

సాధారణంగా, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి యొక్క క్రియేటివిటి చిన్న వయస్సులో కొంతకాలం ఉండి వయస్సు పెరుగుతూ వస్తున్నప్పుడు తగ్గటం సహజం. కాని, రాజేశ్వర రావుకి వయస్సు వచ్చినా అది ఏ మాత్రం తగ్గలేదు అనటానికి ఒక ఉదాహరణ, 1977 లో స్వర కల్పన చేసిన ” ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు …” ( ” ఈ నాటి బంధం ఏ నాటిదో “) ” బిలహరి ” రాగంలో కట్టి సుశీల చే పాడించిన పాట.

” భక్త జయదేవ ” సినిమాలో (1961) ” ప్రళయ పయోధిజలే ..” పాటను ఘంటసాలతో అద్భుతంగా పాడించిన ఘనత రాజేశ్వర రావు కి వచ్చినా, దానికి కారణం దశావతారాలను వర్ణించే ఈ పాటను పది రాగాల్లో స్వరబద్ధంచేయటం కాదు. అలాంటి ప్రయోగాలు ఆ నాటి సంగీత దర్శకులు అందరూ చేసేవారు ( “సీతారామ కల్యాణం” సినిమాలో గాలిపెంచల చేసిన ప్రయోగం ఇలాంటి కోవకి చెందిందే !) . ఒక్కొక్క అవతారానికి అతను ఎన్నుకొన్న రాగంలో కనపడుతుంది సాలూరు గొప్పతనం. బుద్ధుడికి (” భాగేశ్వరి “), రాముడికి ( ” కేదారగౌళ ” రాముడికి ఇష్టమైన రాగం)ఇలాగ ప్రతి అవతారానికి తగ్గట్టు రాగ నిర్ణయం చేయడం గొప్ప విషయం. నరశింహావతారానికి ” సింహేంద్ర మధ్యమం ” వాడటం రాజేశ్వర రావుసంగీత సాహిత్య పరిజ్ఞానాలకి మచ్చుతునక. ” రంగుల రాట్నం ” లో సుశీలచేత పాడించిన ఇంకో దశావతారం పాట ” చేపరూపమున ..”. ఇది రాగమాలిక కాదు. ” మాయాబజార్‌” చిత్రం టైటిల్స్‌లో సంగీతం ” ఘంటసాల ” అని ఉన్నా, నిస్సందేహంగా అందులో చాలా మంచిపాటలను స్వర కల్పన చేసింది రాజేశ్వర రావే ! ఆ పాటలు మళ్ళీ వినండి. ” లాహిరి లాహిరి ..” (మోహనం), ” నీ కోసమె నే జీవించునది …” ( ” భాగేశ్వరి “), ” చూపులు కలసిన శుభవేళా …” ( ” బృందావని సారంగ “), వంటి పాటల్లో సాలూరు “ముద్ర” స్పష్టంగానే వినపడుతుంది. ఒక నాటి ప్రముఖ గాయకుడు ఎ. ఎమ్‌ రాజా సినీ రంగంలో ఉన్నా, అతన్ని మరింత వెలుగులోకి తెచ్చింది రాజేశ్వర రావే ! ” మిస్సమ్మ ” చిత్ర నిర్మాణ సమయంలో విజయా సంస్ధకి, ఘంటసాలకి వచ్చిన వివాదం వల్ల సంగీత దర్శకత్వం ఘంటసాల చెయ్యలేదు ! ( ” అప్పుచేసి పప్పు కూడు “, ” మిస్సమ్మ “, ” మాయాబజార్‌ ” లో కొంత భాగం తప్పిస్తే, మిగిలిన చాలా విజయా వారి చిత్రాలకి బ్రతికినంత కాలం ఘంటసాలే దర్శకత్వం వహించాడు.) ” సంగీత దర్శకత్వం నేను చెయ్యక పోతే పాడను ” అన్న ఘంటసాలను పక్కకు నెట్టి, రాజాకి అవకాశం ఇచ్చింది రాజేశ్వర రావే ! అలాగే ” విప్రనారాయణ ” సినిమా కోసం రాజాతో ” రాజా ” లాంటి పాటలు పాడించిన ఘనత కూడా రాజేశ్వర రావుదే ! పెండ్యాల నాగేశ్వర రావుని ” సాలూరు రాజేశ్వర రావు గారి పై మీ అభిప్రాయం ఏమిటి ? ” అని ఎవరో ప్రశ్నిస్తే, ” ఆయనెక్కడండి బాబూ ! ఆయనలాంటి సంగీత దర్శకుడు మళ్ళీ పుట్టబోడు ! ” అన్నాట్ట. అది నిజంగా ఒక సర్టిఫికెట్టు. తెలుగువారు ఎప్పటికీ గుర్తు పెట్టుకో తగిన ” సాలూరు రాజేశ్వర రావు ” వంటి సంగీత దర్శకుడు మరొకడు మళ్ళీ ఉండబోడేమో ! తెలుగు పాట ఉన్నంత కాలం ” రాజేశ్వర రావు ” మనందరిలో సజీవుడే !

చల్లగాలిలో యమునాతటిపై
శ్యామ సుందరుని మురళిని మ్రోయించిన మోవి
మనసున మల్లెల మాలలూగించిన తావి
నిన్నలేని అందమేదో నిదురలేపిన రవి

వెన్నెలలోని వికాసమై నిలచిన సంగీత జీవి
పగలే వెన్నెలగా జగమే ఊయలగా
పవిత్ర యాత్ర సాగించిన మధుర నాద యాత్రికుడు
మన రసాలూరు స్వర రాజేశ్వరుడు

జీవన జీవం గానం ఉన్నంత కాలం
ఆయన మన పాటకు పల్లవి.


విష్ణుభొట్ల లక్ష్మన్న

రచయిత విష్ణుభొట్ల లక్ష్మన్న గురించి: పుట్టటం, పెరగటం ఆంధ్రాలో. హైదరాబాద్, విశాఖపట్టణంలో కాలేజీ చదువు, ముంబై ఐ. ఐ. టి ఇంజనీరింగ్ చదువు తరవాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో పి.హెచ్. డి. 1980 దశాబ్దంలో అమెరికా రాక. వృత్తి రీత్యా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పని చేసారు.

ఈమాట వెబ్ పత్రిక ప్రారంభకుల్లో ఒకరు. ముందుముందు తెలుగు సాహిత్యంలో ఇంటర్నెట్ కి ప్రధాన పాత్ర ఉందని గాఢంగా నమ్మే వాళ్ళలో ఒకరు. ...

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. rao అభిప్రాయం:

    May 10, 2008 6:16 pm

    అంతా బాగుంది, కాని ఫొటొ లేదు. … .. ఆర్టికిల్ చప్పగా ఉంది.

  2. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    May 11, 2008 7:03 am

    రావు గారికి:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.

    ఈ వ్యాసం ప్రచురించే కాలానికి “ఈమాట” వయస్సు ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ రోజుల్లో, “ఈమాట” గురించి తెలిసిన వారు ఇప్పటి కన్నా సంఖ్యలో తక్కువే! అప్పట్లో ఈమాట ప్రచురణార్ధం వచ్చిన కథలు, కవితలు, వ్యాసాలు కూడా తక్కువే. అందుకని, అప్పటి సంపాదకులం, మేమే, మాకు తెలిసిన విధంగా ఈమాట కోసం రాసేవాళ్ళం. ఇదంతా, దాదాపు పది ఏళ్ళ నాటి మాట.

    అప్పట్లో, ఎక్కువ ఫొటోలు కూడా అంతర్జాలంలో దొరికేవి కావు. సాలూరు రాజేశ్వరరావు పై ఈమాట లో మరో రెండు వ్యాసాలను మీరు పాత సంచికల్లో చదవచ్చు. నేను రాసిన ఈ వ్యాసం కన్నా మరిన్ని వివరాలు మీకు ఆ రెండు వ్యాసాల్లో దొరుకుతాయి.

    మీ అభిరుచికి తగ్గట్టు ఈ రెండు వ్యాసాలు ఉంటాయని ఆశిస్తూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. baabjeelu అభిప్రాయం:

    July 15, 2008 6:58 pm

    “పాట నువు పాడు, మురళి నేనూదెద” అని కృష్ణుడి చేత పక్క వాయిద్యం వాయింపించుకున్న ( బాపు ) సినిమా సంగీత కర్త రాజేశ్వర రావు.
    “ఈమాట” అదృష్టం ఏవిటంటే, మార్కెట్ బాధలు లేకపోవడం. అందుకే, ఇలాటి వ్యాసంలో, బెంగాలీ పాట, ఇంగ్లీషు పాట గురించి ప్రస్తావించగలిగేరు. ఇంకొక మంచి పాట, “హలోహలో ఓ అమ్మాయి.. “. ఒరిజినల్‌ను మించి అద్భుతంగా వుంటుంది. వే.ఆ.కృ. (V.A.K) రంగారావు గారి ఆలాపన లో రాజేశ్వర రావు గారి సేడిస్టిక్ వేషాలు గురించి ప్రస్తావన మనసుని కలుక్కుమనిపించినా, సాలూరు వారు గొప్ప పాటలు స్వరపరిచేరు, మహాత్ముడు కాదు అనుకోవాలి.
    “నీ చంచల చేలాంచల విభృత స్వప్న సీమలలో/ ఏలా భయచ్చాయ జాడ/ ఏలా స్వప్నరోచిర్నీడ..”

  4. gorusu jagadeeshwar reddy అభిప్రాయం:

    November 29, 2008 3:17 am

    శ్రీ లక్ష్మన్నగారికి నమస్కారాలు.
    మీరు సాలూరు రాజేశ్వరరావు మీద రాసిన వ్యాసం ఇప్పుడే చవివాను. అద్భుతం. నేను కూడా 2007 అక్టోబర్ 20 ఆంధ్రజ్యోతి ఆదివారంలో వారిపై నివాళి వ్యాసం రాశాను. అభినందనలతో - గొరుసు

  5. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    November 29, 2008 7:59 am

    [ఈ అభిప్రాయం కొద్దిగా రీఫార్మాట్ చేయబడింది. -సం]
    శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి:

    వ్యాసం నచ్చినందుకు సంతోషం. మీ వ్యాసం చదివాను. బాగుంది. అన్నట్టు, మీ వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” అక్టోబర్ 21 తేదీ, 2007 లో ఆంధ్రజ్యోతిలో, “ఇతరములు” అన్న శీర్షికలో వచ్చింది.
    రంగులరాట్నం సినిమాలో “కన్నుల దాగిన అనురాగం” అన్న పాటను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. పి. బి. శ్రీనివాస్ , సుశీలచే “పట్‌దీప్” రాగంలో బాణీ కట్టిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి

    ధన్యవాదాలతో,

    లక్ష్మన్న.

  6. gorusu jagadeeshwar reddy అభిప్రాయం:

    December 2, 2008 11:17 pm

    శ్రీ లక్ష్మన్నగార్కి నమస్కారాలు.

    మీ స్పందన ఇప్పుడే చదివాను - గొప్ప భావోద్వేగం కల్గింది. ఎంచేతంటే “కన్నుల దాగిన అనురాగం” పాటకి రావలసిన పేరు రాలేదని నేనెప్పుడూ బాధపడుతుంటాను. ఆ పాట మీకూ ఇష్టమని తెలిసి చాలా ఆనందించాను. ఆయన పాటల్లో ముఖ్యంగా “కాలంకాని కాలంలో” (అప్పు చేసి పప్పుకూడు), “సఖీ శకుంతలా” (కులగోత్రాలు) పాటలు కూడా నన్ను ఎంతో పరవశున్ని చేస్తాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా వ్యాసం “చల్లగాలిలో యమునాతటిపై” చదివిన సింగీతం శ్రీనివాసరావుగారు ఆ మర్రోజు సోమవారం ఉదయమే నా ఫోన్‌ నంబర్ దొరకబుచ్చుకుని నాతో మాట్లాడ్డం నా స్వీట్‌ మెమోరీస్‌లో ఒకటి. ఆయనే నన్ను గుర్తు పెట్టుకుని ఈ మధ్య అమీర్‌పేట్‌ గ్రీన్‌పార్క్‌లో జరిగిన సాలూరి వారి సిడీ విడుదలకు ఆహ్వానించారు. ఆయన సినిమాల మాదిరే ఆదీ ఓ ప్రయోగం. రాజేశ్వరరావు పాడిన పాటల పల్లవులతో మొదలెట్టి చరణాల్ని మార్చి రాయించి, బాలసరస్వతి, సుశీల, వాణీ, జానకి, బాలు, సింగీతం, కీరవాణిలతో పాడించారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని రావుబాలసరస్వతిగారికి గుంటూరులో అభో-విభో పురస్కారం సందర్భంలో చూశాను.

    సాలూరి రాజేశ్వరరావుపై ఇప్పటిదాకా సావనీరు రాకపోవడం వల్ల ఆయన సంగీతం నిర్వహించిన సినమాల లిస్టు దొరకటం లేదు. ఆయన “ఫోక్‌” మ్యూజిక్‌పై ఉదా: “బొంగారల బుగ్గలున్న” (డా.చక్రవర్తి), “చెట్టులెక్కగలవా” (చెంచు.లక్ష్మి), “సన్నజాజి సొగసుంది, జున్నులాంటి మనసుంది” (కాలంమారింది)లాంటి ఎన్నో పాటలపై ఎవరైనా రాస్తే బాగుండేది.

    ఒక్కటి చెప్పనా లక్ష్మణ్ణగారూ, మనిషిగా పుట్టినందుకు రాజేశ్వర్రావు పాటల్ని వినగలిగే అదృష్టం కల్గింది కదా అనుకుంటాను.

    ధన్యవాదాలతో - గొరుసు

  7. Dr.Tatiraju Venugopal అభిప్రాయం:

    January 3, 2009 6:43 am

    తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం
    చాలా బావుంది మీరు ఇటీవల స్వర్గీయ సాలూరు రాజేశ్వరరావు గురించి ప్రచురించిన అభిప్రాయ తోరణం. లోగడ 1984 ఆ ప్రాంతాల్లో నేను బెంగళూరులోఉన్నప్పుడు ‘మేలు కలయిక’ వారు రాజేశ్వరరావు గారిని సన్మానించారు. ఆయన్ని దగ్గర్లో చూసి మాట్లాడ గలిగాను. ‘పాట పాడుమా’, ‘ఓహో యాత్రికుడా’ పాడండి మాస్టారూ అంటే ‘రెండోది గుర్తు లేదు’ అని మొదటిది భీంపలాస్ లో ఏం ఆలపించారూ—-అంతే కాదు-మేఘమాల (మల్లీశ్వరి) పాట అందుకునే ముందు తబ్లా అబ్బాయిని “అలా కాదు ఇలా, ఇలా కాదు అలా'’ అంటూ దరువులు వేయించేసి మరీ ఎఫక్టు తెప్పించుకున్నారు. That is yes, raje ’swara’ rao—-. ఈయన ‘రాజీ’శ్వరుడు కూడా. పాశ్చాత్య పెను తుఫానులోంచి సంప్రదాయాన్ని రక్షించడంలో మేటి. ఆత్మగౌరవం చిత్రంలో ‘అందెను నేడె అందని జాబిల్లి’ వెనక ఆయన పడ్డ శ్రమని కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇప్ప టికీ గుర్తుచేస్తుంటారు.
    బహుశః ఆ పాట హరికాంభోజికి దగ్గర్లో ఉందనుకో వచ్చు. ఇది ఒక రష్యను ట్యూననుకుంటా. చిట్టిచెల్లెలు చిత్రంలోని ‘ ఈ రేయి తీయనిది’ పాటకి మూలం
    ఒక పియానో వరస. అయితే అందులో తెలుగుతనం ఉట్టిపడడమే గొప్ప విషయం. Ron Goodwin వరస ఒకటి ‘వేడుకొనడూ అబ్బాయి’ గా (ఇద్దరు మిత్రులు లో హలో హలో ఓ అమ్మాయి’ ) మారడం విడ్డూరం. వాయిద్యంతో వైవిధ్యం - సాలూరు వారి ప్రత్యేకత. మీరు చెప్పిన ‘చిగురులు వేసిన కలలన్నీ’ (పూల రంగడు) ఒకటయితే భీష్మ లోని ‘మనసు లోని కోరిక’, జై జవాన్ లోని ‘మధుర భావాల సుమ మాల’, పవిత్ర బంధం లోని ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం’ , ఇద్దరు మిత్రులు లోని ‘పాడవేల రాధికా’- మచ్చు తునకలు మరి కొన్ని.
    అంతగా వినిపించని చక్కని పాటలు— శీలము కలవారి చినవాడా (పల్నాటి యద్ధం),
    ఎంతైనా బరువు ఈ బ్రతుకు ( బంగారు తల్లి ), గొంతు పాడితే చాలునా (జీవితాశయం),
    అనురాగపు కన్నులలో ( జై జవాన్ ) —ఇవన్నీ ర’సాలూరు’ రాజే ‘స్వర’ మాధురులు.
    ఈ మధ్య ఒక ‘చిత్ర’ విచిత్రం గమనించాను- హిందీ చిత్రం ‘కోయి మిల్ గయా’ లో
    రాజేష్ రోషన్ ‘ఇన్ పంఛి(యోంకో దేఖ్ కర్ జాగే హై(’ పాటలో చరణాల్లో (కాకతాళీయం అనుకోవాలా? ) ‘ బహు దూరములో నున్నవి’ (అమర శిల్పి జక్కన - ఈ నల్లని రాలలో) ని బహు చక్కగా ఉపయోగించి నట్లు అనిపిస్తోంది. పోనీలెండి, ఇద్దరూ రాజులే !

  8. rajendra kumar devarapalli అభిప్రాయం:

    February 19, 2010 3:35 pm

    కొన్నాళ్ళ క్రితం యస్పీ బాలసుబ్రమణ్యం గారు ‘చల్లగాలిలోయమునా తటిపై శ్యామసుందరుని మురళి’ అంటూ పాడి ఎవరికో అర్ధం చెప్తున్నారు.చెప్పొద్దూ ఆయన పాట విన్నాక అహోరాత్రులు కష్టపడి రాజేశ్వరరావు గారి స్వంతగొంతులో ఆపాట విన్నదాకా స్వాంతన కలగలేదు నాకు.తెలుగుచలనచిత్ర సంగీతరంగంలోని మొదటి అయిదుస్థానాల్లో రాజేశ్వరరావుగారు ఒకరు,

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a