ఈమాట » ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

Expand to right
Expand to left

ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక

[ఇది వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా ఈమాట ప్రత్యేక సంచిక. ఈ నెలలో ప్రతి సోమవారమూ వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను, వాటికి అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ప్రచురించబోతున్నాము. జూన్ 19 న ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి ఎనభయ్యవ జన్మదిన సందర్భంగా ఈ ప్రత్యేక సంచికను పూర్తిగా విడుదల చేయాలని మా సంకల్పం. — సంపాదకులు]

వంద సంవత్సరాల క్రితం …

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, 1908 లో ఆస్ట్రియా బాస్నియాను తమ దేశంలో భాగంగా కలిపేసుకుంటున్నట్టు ప్రకటించడంతో చెలరేగిన సంక్షోభం తరువాతి దశాబ్దంలో (1914-1918) మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. సరిగ్గా 1908లోనే, విశాఖపట్నంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారు, ఉత్తరకోస్తాజిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా ఉన్న జె. ఏ. యేట్సు అనే ఇంగ్లీషుదొర తో కలిసి, స్థాపించిన Telugu Teaching Reform Society, ఆ తరువాతి దశాబ్దంలో (1911-19) తెలుగు భాషా పండితుల మధ్య ఒక మహా సంగ్రామమే చెలరేగడానికి కారణభూతమయ్యింది.

ఈ మహా సంగ్రామంలో అరవం మాతృభాషగా గల పి.టి. శ్రీనివాస అయ్యంగారు, ఆంగ్లేయుడైన జె. ఏ. యేట్సు దొర గారు, హుణ విద్యాభ్యాస మొనర్చి ఆంగ్ల భాషాభిమానులైన గిడుగు, గురజాడలు ఒకవైపు; సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులైన జయంతి రామయ్య పంతులు, వావిలకొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి , కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి పండితలోకమంతా మరోవైపు. మద్రాసు విశ్వవిద్యాలయం సెనేటులో సభ్యత్వం ఉన్న గిడుగు, గురజాడల కారణంగా స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలుఫైనల్‌ బోర్డు జీవో విడుదల చేయడంతో తెలుగు భాషకు మహాపకారం జరుగుతున్నదని పండితుల్లో అలజడి బయలుదేరింది. తెలుగు దేశం అంతటా సభలుపెట్టి స్కూలు పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు. జయంతి రామయ్య పంతులుగారి అధ్యక్షతన కాకినాడలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు ‘ స్థాపించారు. తమ ఆశయాలను ప్రచారం చెయ్యడానికి ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక ‘ అనే పత్రికను కూడా ఆరంభించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 1911 నవంబరు 24న కందుకూరి వీరేశలింగంగారి అధ్యక్షతన పెద్ద ఎత్తున ‘గ్రామ్యాదేశ నిరసన సభ ‘ జరిగింది. ఆ సభలో జయంతి రామయ్య పంతులుగారు చేసిన ప్రసంగం, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన ప్రసంగం, ఈ సభలో చేసిన తీర్మానాలను దొరతనము వారికి తెలియజేయుటకు మద్రాసు గవర్నర్ గారికి ఆనాడు సమర్పించిన వినతి పత్రాన్ని ఈ ప్రత్యేక సంచిక మొదటి విడతగా మీకు అందజేస్తున్నాము. ఈ వ్యాసాలు ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక: సంపుటి -1 సంచిక- 2 నుండితీసుకున్నాము. ఆ సంచికను PDF రూపంలో చదవవచ్చు.

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:

    June 7, 2008 1:16 am

    ఈమాట చదవటమే ఓ ఎడ్యుకేషన్!!

    బహుశా నా తరమంతా వ్యావహారికమే అభ్యుదయమని నమ్ముతూ పెరిగామంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడీ నాలుగు వ్యాసాలు చదివి ఆ నమ్మకాలన్నీ మార్చేసుకున్నానని చెప్పను కానీ, ఓపెన్ మైండ్ తో చదివితే వీరి వాదంలో కూడా వ్యావహారిక భాషావాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అని పిస్తుంది. ఇంత చదువూ చదివి కనీసం పోతన భాగవతం కూడా సొంతగా చదువుకోలేక పోవటం అంతకంటే షేక్స్పియర్ నాటకాలనే సులభంగా చదువుకోగలగటం చూస్తుంటే వీరి వాదాలు మరింత అర్థవంతంగా తోస్తున్నాయి.

    అదే సమయంలో సాహిత్యాన్ని జన బాహుళ్యానికి దగ్గరగా తెచ్చి, ఇన్ని వేల సంవత్సరాల్లో జరగని సామాన్యుల జీవన చిత్రణ గత వందేళ్ళలోనే జరగటానికి వ్యావహారిక భాషని ఆశ్రయించటం వల్లనే సాధ్యమయుంటుందనే నా అమాయక మయిన నమ్మకానికి ఏమన్నా ఆధారం ఉందోలేదో పెద్దవాళ్ళే చెప్పాలి.

    ఇలా రెంటినీ బాలెన్స్ చేసే మార్గం చెప్పే మోడరేట్ గ్రూప్ ఎందుకు ఏర్పడ లేదు? ఏర్పడినా అది నా బోంట్లకు తెలీదా?

    ఏమయినా ఈ వ్యాసాలకి ఆనాటి వ్యావహారిక వాదులు ఏం సమాధానం చెప్పారో, ఆ తర్వాతి కాలంలో ఏంజరిగిందో చెప్పాలి.

    అలాగే ఈ ఉత్తరాలనీ, వ్యాసాలనీ ఈమాట ఎక్కణ్ణించి సేకరించిందో చెపితే బావుంటుంది.

    అక్కిరాజు భట్టిప్రోలు

  2. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    June 9, 2008 12:38 pm

    @అక్కిరాజు - చరిత్రకారులెప్పుడూ తమ, తమ వర్తమాన పరిస్థితులు, అవసరాలు, ఆసక్తులనుగుణంగా పూర్వ చరిత్రను పాక్షికంగానే చిత్రిస్తారని కొంతమంది చారిత్రక తత్వవేత్తల సిద్ధాంతం[1]. అంటే, ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి కొత్త తరం వారు వారి వారి దృక్పథాలకనుగుణంగా పాత చరిత్రను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట. ఉదాహరణకు, బూదరాజు రాసిన వ్యావహారికోద్యమ చరిత్ర వ్యాసం, 1910-20ల నాటి వ్యవహారికోద్యమం గురించి ఎంత చెబుతుందో, ఆ వ్యాసం రాసిన 1970 కాలం నాటి అవసరాలు, ఆసక్తులగురించి, ఆ రోజుల్లో బూదరాజు గారిని ఉత్తేజపరిచిన, ఉద్రేకపరిచిన ఆలోచనల గురించి కూడా చెప్పకనే చెబుతుంది (And Būdarāju is such a colorful writer!).

    వాడుక భాష, మాండలిక భాష, రచనా భాష, ప్రామాణిక భాష అన్న అంశాలపై ఈ మధ్య కాలంలో కొంత చర్చ జరుగుతున్నది. ఈ చర్చల నేపథ్యంలో వ్యవహారిక-గ్రాంధిక వాదాలను పునఃసమీక్షిస్తూ, ఈనాటి భాషాసమస్యలకు, కొంత శాస్త్ర విశ్లేషణతో, పరిష్కారాల కోసం అన్వేషించే వ్యాసాలను రాబట్టగలిగితే ఈ ప్రత్యేక సంచికకు సాఫల్యత సిద్ధించినట్టే.

    గ్రాంథిక వాదులు లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవహారిక వాదుల సమాధానాలు కొన్నింటిని ఈ వారం అందిస్తున్నాము. వచ్చే సోమవారం మరికొన్ని ప్రముఖుల వ్యాసాలు అందజేస్తాము. గ్రాంథిక-వ్యవహారిక భాషా వాదాలకు సంబంధించిన రచనలను వివరించే ఒక వ్యాఖ్యాన సహిత గ్రంథసూచిక (annotated bibliography) ను శ్రీనివాస్ పరుచూరి గారు తయారుచేస్తున్నారు (అక్కిరాజు రమాపతిరాజు గారి గ్రాంథిక-వ్యవహారిక వాద సూచిక ఆధారంగా). ఇవేకాక, ఈ సంచిక కోసం ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను కూడా వచ్చే వారం అందిస్తాము. వ్యవధి తక్కువైనా, వాసి తగ్గని వ్యాసాలు రాసి పంపిన రచయితలకు మా అభివందనాలు.

    రిగార్డులతో,
    సురేశ్.

    [1]The philosophy of history: A Re-examination By William Sweet
    some have argued that what we identify as ‘past’ is determined by present interests - that the past is largely a reflection of the present [p. 15] historical testimony doesn’t stand as a fact on its own, but must be evaluated from the perspective of a historian [p. 9].

  3. Kameswara Rao అభిప్రాయం:

    June 12, 2008 9:49 am

    అసలీ ఉద్యమం మొదలయ్యింది పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమై. మన అదృష్టమో, దురదృష్టమో అది దారితప్పి చిలికిచిలికి గాలివానయ్యింది! ఏది గ్రాంధికభాష, ఏది గ్రామ్యము అన్న వాదాలే పెరిగిపోయాయి. చిన్నయ్యసూరి వ్యాకరించినది తప్ప తక్కినదంతా గ్రామ్యమే అని కొందరు వాదిస్తే, నన్నయాదులు కూడా వాళ్ళకాలంలోని శిష్టవ్యావహారికాన్నే వాడేరని కొందరు నిరూపించడానికి ప్రయత్నించారు. బాలవ్యాకరణమే శిరోధార్యమని కొందరంటే, అసలు వ్యాకరణమే అక్కరలేదని కొందరన్నారు! పులిమీద పుట్రలా గ్రాంధికభాష కృతకభాష అని మరో వాదన. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి.

    ఇవేవీ ఎవరూ సంయమనంతో శాస్త్రదృష్టితో చేసిన వాదనలు కావని యిప్పుడు మనం చదివితే అనిపిస్తుంది. అసలు వ్యావహారిక భాషా స్వరూపం ఏమిటి, అది యేయే సందర్భాలలో, యేవిధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించిన సందర్భాలు చాలా తక్కువ.

    మధ్యే మార్గంలో కనిపించేది ప్రథానంగా కందుకూరి వారే. తర్వాతి కాలంలో పాతకొత్తల మేలికలయిక అన్నమార్గం ఎక్కువగా భావకవులలో కనిపిస్తుంది. తిరుపతి వేంకటకవులు కూడా వీరగ్రాంథిక వాదాన్ని తిరస్కరించి అప్పటికున్న శిష్టవ్యావహారికంలో కవిత్వం రాసినవారే. వ్యాకరణాన్ని తిరస్కరించకుండా, తెలుగుకి ఉన్న వ్యాకరణదీపం చిన్నదని, దాన్ని విస్తృతపరచాలనీ అన్నది ఆ కాలంలో నాకు తెలిసీ ఒక్క చెళ్ళపిళ్ళవారే!

    వచ్చిన చిక్కల్లా ఇలాటి మధ్యేమార్గస్తులు ఇరుపక్షాలవారికీ విరోధులయ్యారు!

    ఇంతకీ ఇప్పటి మన ప్రస్తుతకర్తవ్యం, ఈ కిందవాటి గురించి ఆలోచించడం:

    1. మనకి ప్రామాణిక భాష అవసరమా, సాధ్యమా? అయితే దాని స్వరూపం ఏమిటి? ఏ సందర్భాలలో అది వాడాలి? ఏ సందర్భాలలో అవసరం లేదు?
    2. మన ప్రాచీన కావ్యభాష ఎవరికి, ఎందుకు, ఎంతవరకూ రావాలి?

  4. Lyla yerneni అభిప్రాయం:

    June 12, 2008 9:55 am

    ఈనాటి భాషాసమస్యలకు, కొంత శాస్త్ర విశ్లేషణతో, పరిష్కారాల కోసం అన్వేషించే వ్యాసాలను రాబట్టగలిగితే ఈ ప్రత్యేక సంచికకు సాఫల్యత సిద్ధించినట్టే.

    ఈ నాటి భాషా సమస్యలేమిటో గుర్తించబడ్డాయని అర్థం చేసుకోవాలా?
    గుర్తించబడితే ఆ జాబితా ఇస్తారా?
    ఇస్తే,

    1. ఇవి సమస్యలే కావు. ఇవీ మా ఉద్దేశంలో అసలైన సమస్యలు - అని కొన్ని వ్యాసాలు రావచ్చు.
    2. సమస్యలు గుర్తించి చెబితే, వాటికి పరిష్కారం సూచించే వ్యాసాలు భాషా శాస్త్రంతో మాత్రమే పరిచయం కాకుండా, ఇతర రంగాలలో పని చేసిన , చేస్తున్న వారినుండి కూడా రావచ్చు.
    3. చరిత్రతో సంబంధంలేకుండా, అంటే బూదరాజు ఎవరో, గిడుగు రామ్మూర్తి ఎవరో ఏమాత్రం తెలియకుండానే, వారి పాత ఆలోచనలు తమ ప్రస్తుత మేధాశక్తిని మబ్బుకమ్మించడం ఇష్టపడని వాళ్ళు -అప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, వాళ్ళూ రాయవచ్చు.
    4. మనకున్న పరికరాలూ అవకాశాలు ఎంతో మారిపోయాయి. మన మేథ, మన ఇష్టమైన గురువుగారి మేథస్సును ఎప్పుడో దాటిపోయిందని గుర్తిస్తే, అప్పుడు, రోజూ రెండడుగులు వెనక్కు వేసి, మూడడుగులు ముందుకు వేసే బదులు, ఆ వేసే అడుగులు ముందుకే వేస్తే, మంచి ఫలితాలు మనమే త్వరితంగా సాధించగలం; ఇప్పటి మహోన్నతులు, మహారాజశ్రీలు - ఇంకొకరికి అర్జీ పెట్టే పనిలేదు.

    అని
    గమనిస్తారేమోనని
    ఈ మనవి.

    లైలా.

  5. పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    June 17, 2008 9:33 pm

    కామేశ్వరరావు గారు:

    ఇది మీరు 06/12/2008 నాడు రాసిన వ్యాఖ్యకు followup.

    పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.

    కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.

    అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:

    “నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)

    ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.

    సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.

    #[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #

    నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.

    చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.

    – శ్రీనివాస్

    * V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.

  6. Kameswara Rao అభిప్రాయం:

    June 21, 2008 1:42 am

    శ్రీనివాస్ గారు,

    మంచి విషయాలని ప్రస్తావించారు. నేనన్న వాటికి కాస్త వివరణ అవసరమే.

    1. వ్యావహారిక భాషోద్యమ మూలాలు: నిజమే, మీరన్నట్టు బోధనాభాష విషయం ఒక ముఖ్య చోదకమే కాని మూలాలు ఇంకా ముందే కనిపిస్తాయి. తూమాటి దోణప్పగారు “వ్యావహారిక భాషోద్యమ నేపథ్యం, గిడుగువారి సారథ్యం” అన్న వ్యాసంలో దీన్ని కొంత ప్రస్తావించారు. ముందుగా ఆంగ్లేయుల హయాంలో పరిపాలనాభాషగా వ్యావహారిక భాష ప్రవేశించించడం, ఆ తర్వాత ముద్రణా యంత్ర ప్రభావం వల్ల పుస్తకాలూ, పత్రికలూ సామాన్యజనులకి దగ్గరవ్వడం మొదలైన అంశాలని అతను పేర్కొన్నారు.

    2. పాఠ్యపుస్తకాలలో శృంగార ప్రధానమైన కావ్యభాగాల గురించి: వ్యావహారికభాషా వాదుల వ్యాసాలలో కూడా యీ విషయ ప్రస్తావన చదివినట్టుగా గుర్తు. కానీ మీరన్న తర్వాత తిరిగి వెతికితే ఎక్కడా కనపడలేదు. కాబట్టి నేనీ విషయంలో పొరబడినట్టే ఉన్నాను.

    3. కందుకూరి మధ్యేమార్గం: “గ్రామ్యదేశ నిరసన సభ”లో జయంతి, కందుకూరి ఉపన్యాసాలని గమనిస్తే ఈ విషయం కొంత స్పష్టమవుతుంది. చిన్నయ్యసూరి రాసిన వ్యాకరణం ముఖ్యంగా పద్యకావ్యాల ఆధారంగా రాయబడిందనీ, దానిననుసరించి రాసే గద్యశైలి చాలా కఠినమైనదనీ అతను ఆనాడే గుర్తించారు. నన్నయ్య కాలమునుండీ గ్రాంధిక భాష మారలేదన్న దురభిప్రాయమూ అతనికి లేదు. అతను వ్యావహారికవాదంతో (మొదట్లో) విభేదించినది, నియమ రాహిత్యం గురించే. వ్యాకరణం లేని వాడుకభాషని రచనకి వాడకూడదని అతని అభిప్రాయం. గ్రాంధికవాదం నుంచి, వ్యావహారికవాదం వైపు అడుగువేసిన తర్వాత కూడా, రచనలో వ్యావహారికభాష వాడినా, అది వ్యాకరణ బద్ధమై ఉండాలనే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వ్యావహారికభాషకి వ్యాకరణం రాయడానికి పూనుకున్నారు కూడా. వ్యావహారికభాషా వాదుల్లో, ఇది కనిపించదు. గిడుగువారికికూడా వ్యావహారిక రచనా భాషకి వ్యాకరణం ఉండాలా లేదా అన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు.

    4. గురజాడ “పాతకొత్తల మేలికలయిక”: “పాతకొత్తల మేలికలయిక” అంటే ఆశు, లిఖిత సంప్రదాయాలన్నది వేల్చేరువారి interpretation. అది సమంజసమైనదే కావొచ్చు. కాని, గురజాడ ఉద్దేశం కూడా అదే అనడం సరికాదేమో. గురజాడకి ఆ స్పృహే కనక ఉండి ఉంటే, ముత్యాలసరాల గురించి, రగడలూ లేదా మన జానపద పాటల వరసుంచి తీసుకున్నానని అనకుండా పారశీ గజల్ ప్రేరణ అని ఎందుకంటాడు? “ప్రక్రియ”, “భాష”కి సంబంధించే గురజాడ ఆ మాట అన్నాడని నే ఉద్దేశం. గురజాడ కవిత్వంలో, శ్రవ్య కథాకావ్యం, దృశ్య కావ్యం, జానపద గేయం వంటి పాత ప్రక్రియలూ కనిపిస్తాయి; కొత్తవైన భావగీతాలూ, ఇతర పాశ్చాత్య ప్రక్రియలూ కనిపిస్తాయి. అలాగే అతను వచనరచనలో పూర్తిగా వాడుకభాష వాడినా, కవిత్వంలో గ్రాంధిక పోకడలని గమనించవచ్చు.

    5.భావ కవుల “పాతకొత్తల మేలికలయిక”: ఇంతకీ నేను గురజాడని కోట్ చెయ్యడం, అతని పాతకొత్తల మేలికలయికే భావకవులది అని చెప్పడానికి కాదు. భావకవులు వ్యావహారికభాషా వాదాన్ని నెత్తిన పెట్టుకొన్నా, వారి కవిత్వంలో ఎక్కువగా కనిపించేది పూర్వ కావ్యాలలోని భాషే, వాడుకభాష కాదు. “ఎంకిపాటలు”లాంటివి అక్కడక్కడే కనిపిస్తాయి. నేనన్న పాతకొత్తల కలయిక, యీ ఉద్దేశంతో. వీళ్ళతో పోలిస్తే, గురజాడ ఇంకా ఆధునికుడుగా కనిపిస్తాడు. కవిత్వంకూడా వాడుకభాషలో రాయవచ్చని, కాకపోతే దానికి పద్యాలు పనికి రావని అతను గుర్తించాడు. పద్యాలు కూడా వాడుకభాషలో రాయడానికి గిడుగు సీతాపతిలాంటివారు విఫల ప్రయత్నం చేసారు.

    6. తిరుపతివేంకటకవులు: వ్యావహారికభాషా వాదానికి వీరు అనుకూలురు కాకపోయినా, వ్యతిరేకులు మాత్రం కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా భాష మార్పు చెందే విషయమై, వ్యాకరణాల పరిమితి విషయమై, వ్యావహారికభాషా వాదులతో వీరు ఏకీభవించారు. “కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వమునెంచి దేశభాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మత”మని గుర్తించారు. వాళ్ళ పద్యాలలో లక్షణ విరుద్ధ ప్రయోగాలూ, అన్యభాషా పదాలూ వాడడం ప్రసిద్ధమే కదా. కొంత అధిక్షేపం ఉన్నా, “గిడుగా? పిడుగా?” అన్న వ్యాసంలో గిడుగు గురించి చెళ్ళపిళ్ళవారన్నదాంట్లో నిజాయితీ ఉందని నాకనిపించింది. అందులో, ఈ వాదాలగురించి వారు స్పష్టంగా చెప్పారు:

     నామతం గ్రాంథికభాషలో వ్రాసేవారు గ్రాంథికభాషలోనే వ్రాసుకోవచ్చుననిన్నీ వ్యావహారికభాషలో వ్రాసేవారు వ్యావహారికభాషలోనున్నూ వ్రాసుకోవచ్చుననిన్నీ వీరికీ వారికీ వివాదపడవలసిగాని తిట్టుకోవలసికాని లేశమున్నూ ప్రసక్తి వుండకూడదనియ్యేవే. అయితే గ్రాంథిక కవుల పుస్తకాల్లో యెన్నో వ్యావహారిక ప్రయోగాలు కనపడడంచేత యీ గ్రాంథిక కవులు గ్రాంథిక కవులు కారంటూ పంతులవారు తరచు ఆక్షేపించడం కలదు. దానికి నా సమాధానం యేమిటంటే, యెక్కడో వక్కటితప్ప ఆ వ్యావహారిక పదాలు చాలా వఱకు సాధ్యాలే అవుతవి. కానిదేదేనా వుంటే అది ప్రమాదపతితంగా భావించవలసిందేగాని అంతమాత్రంచేత ఆ గ్రంథకర్త వ్యావహారిక భాషా కవి కాడనియ్యేవే. 

    ఇక, గురజాడ మధ్యేమార్గస్థుడెలాగో వివిరించడం మీ వంతు :)

  7. mOhana అభిప్రాయం:

    June 23, 2008 10:32 am

    వ్యావహారిక భాషపై ప్రత్యేక సంచికలో నిఘంటువులో వెదుక్కోవలసిన పదాలలో అశీతి (80) ఒకటి! :-)
    - మోహన

  8. Rohiniprasad అభిప్రాయం:

    June 28, 2008 3:01 am

    భద్రిరాజువారి మీద ప్రముఖులు రాసిన వ్యాసాలు చాలా బావున్నాయి. ఆయన పుస్తకాలకు ఎవరైనా సులభపరిచయం రాస్తే బావుంటుంది. ఆయన తయారుచేసిన మాండలిక వృత్తి పదకోశాలను నేను తెప్పించుకున్నాను. అందులో మనం ఎన్నడూ ఉపయోగించని అచ్చతెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం కలిగింది. మత్స్యకార, తదితర వృత్తులలో లేనివారికి వాటిలో చాలామటుకు పనికిరావేమోగాని అవసరాన్ని బట్టి సంస్కృతం జోలికి పోకుండా తెలుగు పదాలు ఎలా తయారుచేసుకోవచ్చో కొంతవరకూ అర్థమౌతుంది. తమిళంలో ద్రావిడ రాజకీయపార్టీలు పూనుకోవడంతో లెక్కలేనన్ని అచ్చ తమిళ పదాలు వాడకంలోకి వచ్చాయి. తెలుగులో ఇటువంటి ప్రయత్నాన్ని ఎవరూ మొదలుపెట్టినట్టు కనబడదు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a