అత్తిపట్ కృష్ణస్వామి రామానుజన్ (A. K. Ramanujan, 1929-93) మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉంటూ దక్షిణ భారత భాషల సాహిత్య స్వరూప పరిణామాలని నిశితంగా పరిశీలించిన విద్యాధికుడు. “భారతీయ చింతన అంటూ ఒకటున్నదా?” అనే ఒక ప్రముఖ వ్యాసం ద్వారా భారతీయ చింతనలో సందర్భ గ్రాహ్యత (Context sensitivity) గురించి విశ్లేషించాడు. భారతీయ సాహిత్యంలో మౌఖిక, లిఖిత పార్శ్వాల అనుబంధంపై విశేషమైన పరిశోధనలు చేశాడు.
చర్చ, విమర్శ, తర్క మీమాంసలకు దోహదం చేస్తూ విద్యార్థుల వివేచనకు పదును పెట్టవలసిన విశ్వవిద్యాలయాలే అతివాదశక్తుల ఒత్తిడికి లోనై తమ గురుతర బాధ్యతను, భావ స్వతంత్రతను విస్మరించి పుస్తకాలని, వ్యాసాలని నిషేధించడం గర్హణీయం. ఈమధ్యనే ముంబయి విశ్వవిద్యాలయం రోహింటన్ మిస్త్రీ వ్రాసిన పుస్తకాన్ని పాఠ్యక్రమం నుండి తొలగించింది. ఇప్పుడు రామాయణాన్ని దూషిస్తున్నదన్న అకారణంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎ. కె. రామానుజన్ వ్రాసిన మూడువందల రామాయణాలు అన్న వ్యాసాన్ని చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించింది. నిజానిజాలు మనం తెలుసుకోవడం కోసం ఆ తొలగించిన వ్యాసాన్ని సురేశ్ కొలిచాల తెలుగులోకి అనువాదం చేసి ఈ సంచికలో అందిస్తున్నాడు.
ఈ సంచికలో: దేవులపల్లి కృష్ణశాస్త్రి నాటికలనుంచి ఆనాటి పాటలు; మెలికముగ్గులపై కృష్ణ మోహనరావు శాస్త్రవ్యాసం; రోహిణీప్రసాద్, సాయి బ్రహ్మానందం, కనకప్రసాద్ వ్యాసాలు. కొత్త రచయిత చంద్రశేఖర్ కథ అనుభవం, ఇతర కథలు; భగవంతం, నారాయణ, రవిశంకర్ తదితరుల కవితలు; పద్యం, పలుకు, పాట, కథ ఇతరత్రా శీర్షికలు, మీకోసం.
పూర్తిగా » 3 అభిప్రాయాలు